కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ బోగస్.. నేను చాలా బాధపడుతున్న: కేసీఆర్
posted on May 19, 2020 @ 10:11AM
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ వందశాతం బోగస్ అని తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శించారు. ఘోర విపత్తు సంభవించి, ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసిన సందర్భంలో రాష్ట్రాల చేతికి నగదు రావాలని కోరాం. రాష్ట్రాలకు నగదు ఇవ్వాలని కోరితే.. రాష్ట్రాలను బిచ్చగాళ్లుగా చూసింది. ఇదేనా కేంద్రం చూసే పద్ధతి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దుర్మార్గమైన విధానాన్ని కేంద్రం అనుసరిస్తుందని మండిపడ్డారు. రాష్ట్రాల ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితిని పెంచారు. అంటే తెలంగాణ రాష్ట్రానికి రూ.20వేల కోట్ల అప్పులు అదనంగా వస్తాయి. కానీ, అందులో పెట్టిన షరతులు వింటే ఎవరైనా నవ్వుతారు. కరెంట్ సంస్కరణలు చేయి రూ.2,500 కోట్ల బిచ్చం వేస్తాం. మునిసిపల్ ట్యాక్సులు పెంచు రూ.2500 కోట్ల బిచ్చం వేస్తాం అనడం ప్యాకేజీగా పరిగణిస్తారా? అని కేసీఆర్ ప్రశ్నించారు.
కేంద్రం చిల్లి గవ్వకూడా ఇవ్వదు. కేవలం రుణ పరిమితి పెంచింది. అది మళ్లీ రాష్ట్రమే కట్టుకోవాలి. కేంద్రం తన పరువు తానే తీసుకుందని విరుచుకుపడ్డారు. రాష్ట్రాలపై కేంద్రం ఈ విధంగా పెత్తనం చేయడం దుర్మార్గం అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజం ప్యాకేజీ ఎలా ఉంటుందో, బోగస్ ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో తేలిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా నేను చాలా బాధపడుతున్న అని కేసీఆర్ పేర్కొన్నారు.