తెలంగాణ ప్రభుత్వానికి కృష్ణా బోర్డు లేఖ.. ఏపీ ఫిర్యాదుపై మీ జవాబేంటి?
posted on May 20, 2020 @ 10:42AM
విభజన చట్టానికి వ్యతిరేకంగా ప్రాజెక్టులు చేపట్టారన్న ఏపీ ప్రభుత్వం ఫిర్యాదుపై సమాధానం చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కృష్ణా బోర్డు కోరింది. ఈ మేరకు బోర్డు సభ్యుడు హరికేశ్ మీనా తెలంగాణ ఇరిగేషన్ శాఖ ముఖ్యకార్యదర్శికి లేఖ రాశారు. కొత్తగా నిర్మిస్తున్నారని ఏపీ చెబుతున్న ప్రాజెక్టులతో పాటు మరింత నీటిని వినియోగించుకునేలా విస్తరించిన ప్రాజెక్టుల డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) ఇవ్వాలని సూచించింది.
బోర్డు, కేంద్ర జల సంఘం, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండానే.. తెలంగాణ చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి, భక్తరామదాసు, మిషన్ కాకతీయ, తుమ్మిళ్ల ఎత్తిపోతలు ప్రాజెక్టులు చేప్పట్టిందని ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. వీటితో పాటు సామర్థ్యాన్ని పెంచిన కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్‌ఎల్‌బీసీ వంటి ప్రాజెక్టులపై కూడా ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ ప్రాజెక్టుల కారణంగా తమ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతం, నెల్లూరు, ప్రకాశం వంటి జిల్లాలు తీవ్ర ప్రభావానికి గురికావాల్సి వస్తోందని తెలిపింది. తాము అభ్యంతరం చెబుతున్న ప్రాజెక్టులపై గతేడాది అక్టోబర్‌లో తెలంగాణ వివరణ కోరామని, ప్రాజెక్టుల డీపీఆర్ ఇవ్వాలని అడిగినా స్పందించలేదన్న విషయాన్ని ఏపీ బోర్డు దృష్టికి తీసుకెళ్లింది. ఇప్పటికైనా తెలంగాణ ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించాలని కోరింది. దీని పై స్పందించిన కృష్ణా బోర్డు.. ఆయా ప్రాజెక్టులపై అభిప్రాయాలు తెలపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది.
మరోవైపు ఏపీ జలవనరుల శాఖ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డికి కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి ఎ.పరమేశం లేఖ రాశారు. నాగార్జునసాగర్ కుడి కాల్వ, హంద్రీ-నీవా ఎత్తిపోతల, ముచ్చుమర్రి ఎత్తిపోతలకు కేటాయింపుల కంటే ఎక్కువగా నీటిని వాడుకున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయడాన్ని ఆపేయాలని కోరారు. నాగార్జునసాగర్ కుడి కాల్వకు 158.225 టీఎంసీలు కేటాయిస్తే 158.264 టీఎంసీలు వాడుకున్నారని, హంద్రీ-నీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతలకు 47.173 టీఎంసీలు కేటాయిస్తే 47.328 టీఎంసీలు వినియోగించుకున్నారని లేఖలో పేర్కొన్నారు. నీటి కేటాయింపు ఉత్తర్వులను విధిగా పాటించాలని సూచించారు.