కశ్మీర్ లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
posted on May 19, 2020 @ 4:54PM
జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో దాదాపు 10 గంటల పాటు సాగిన ఎన్‌కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్‌లోని నవకడల్ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ ప్రారంభించారు. నిన్న అర్థరాత్రి ప్రారంభమైన ఆపరేషన్ ఈరోజు మధ్యాహ్నం ముగిసింది. ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ జునైద్ అష్రఫ్ షహ్రాయ్ ను, అతడి సహచరుడిని హతమార్చారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్‌లో ఆపరేషన్ ఆల్ ఔట్ పేరుతో కొనసాతున్న ఆపరేషన్‌లో ఇండియన్ ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఇప్పటివరకూ 80 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చారు. ముఖ్యంగా రియాజ్ నైకూ, తాహిర్ అహ్మద్ భట్ వంటి కరడుగట్టిన ఉగ్రవాద నేతలను మట్టుబెట్టారు. మొత్తానికి, ఆపరేషన్ ఆల్ ఔట్ పేరుతో హిజ్బుల్ ముజాహిదీన్, లష్కర్ ఎ తొయిబా, జైష్ ఎ మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు చెమటలు పట్టిస్తున్నారు.