రంగనాయకమ్మ ఎవరు? ఆమె ఫేస్‌బుక్ పోస్టులో ఏముంది?
posted on May 20, 2020 @ 6:30PM
విశాఖ గ్యాస్‌లీక్ ఘటనపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టారంటూ.. గుంటూరుకి చెందిన పూంతోట రంగనాయకమ్మ(66)కు సీఐడీ అధికారులు నోటీసులిచ్చి, కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. రంగనాయకమ్మపై కేసు నమోదు చేయడం పట్ల ప్రతిపక్ష టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యంగా టీడీపీ నేత నారా లోకేష్.. "అమ్మ వయస్సు ఉన్న వారిని కూడా కక్షగట్టి, వెంటాడి వేధిస్తున్నారు." అంటూ జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు.
కాగా, అసలు ఈ రంగనాయకమ్మ ఎవరు?.. కేసులు నమోదుచేసే అంతలా ఆమె పోస్ట్ లో ఏముంది?.. వంటి అంశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
గుంటూరు నగరంలో ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన రంగనాయకమ్మ ఫేస్‌బుక్‌లో యాక్టివ్‌గా ఉంటారు. నిత్యం తన అభిప్రాయాలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తుంటారు. గుంటూరులోని ప్రముఖ హోటల్ శంకర్ విలాస్‌కు ఆమె డైరక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఇటీవల విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, వందల మంది ఆసుపత్రుల పాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు కంపెనీ నిర్లక్ష్యమే కారణమని, అలాంటి కంపెనీని ప్రభుత్వం వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలో, 20 పాయింట్ల రూపంలో ప్రభుత్వ తీరుపై అనుమానాలను వ్యక్తం చేస్తూ మల్లాది రఘునాథ్ అనే వ్యక్తి రాసిన ఓ పోస్టును రంగనాయకమ్మ షేర్ చేశారు.
ఎల్జీ పాలిమర్స్ ప్రమాదానికి సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేశారని, కంపెనీని సీజ్ చేయలేదని, లిక్విడ్ ఎస్సెట్‌గా ఉన్న స్టైరీన్ గ్యాస్‌ను తెలివిగా తరలించారని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. వేలిముద్రల కోసం వచ్చే క్లూస్‌టీమ్‌కి ఆధారాలు లేకుండా చేశారని.. పోలీస్ బాస్ పర్యటన పేరుతో లోపల ఉద్యోగుల హాజరును కూడా మార్చేశారని పోస్టులో ఆరోపించారు.
ఆధారాలు ధ్వంసం చేస్తే ఐక్యరాజ్యసమితిగానీ, సుప్రీంకోర్టుగానీ, హైకోర్టుగానీ నిజాలు నిగ్గు తేల్చగలవా? అని ప్రశ్నించారు. వ్యూహాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుంటే రాజ్యాంగబద్ధ సంస్థలు, కోర్టులు ఏమీ చేయలేవని అన్నారు. ప్రమాద ఘటన తర్వాత పోలీస్ అధికారి అరెస్టులు మా పనికాదనడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఇక ఆ ఐదు గ్రామాల ప్రజలు ఆశలు వదిలేసుకోవడమే మంచిదంటూ వ్యాఖ్యానించారు. పోస్ట్ చివరలో సేకరణ రఘునాథ్ మల్లాది అని రంగనాయకమ్మ పేర్కొన్నారు.
ఈ పోస్ట్ ఇప్పుడు రంగనాయకమ్మని చిక్కుల్లోకి నెట్టింది. సీఆర్పీసీ సెక్షన్ 41-ఎ కింద ఆమెకు సీఐడీ అధికారులు నోటీసులు అందించారు.
కాగా, ఈ ఘటనపై రంగనాయకమ్మ స్పందిస్తూ.. తానేమీ నేరం చేయలేదు అన్నారు. నేషనల్ మీడియాలో వచ్చిందాన్ని తన ఫేస్ బుక్ మిత్రుడు తెలుగులోకి అనువదించి పెట్టారని, ఇది అందరికీ అర్థమవుతుందని తాను షేర్ చేశానని తెలిపారు. మనకు ఆ మాత్రం స్వేచ్ఛ కూడా లేకపోతే మనగురించి ఆలోచించే అవకాశం కూడా ఉండదని ఆమె అభిప్రాయపడ్డారు. తాను రాజకీయపార్టీలకు వ్యతిరేకంగా పెట్టలేదని, అంతమంది చనిపోయారనే బాధతో, కేవలం ప్రజలకు సమాచారం అందించేందుకే పోస్టు చేశానన్నారు.