డాక్టర్ సుధాకర్ ఉన్న ఆసుపత్రికి వెళ్లి వాంగ్మూలం తీసుకోండి: హైకోర్టు
posted on May 20, 2020 @ 12:41PM
డాక్టర్ సుధాకర్ పట్ల విశాఖ పోలీసులు దురుసుగా ప్రవర్తించి, అరెస్ట్ చేసిన విషయంపై ఏపీ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ప్రస్తుతం డాక్టర్ సుధాకర్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి ఆయన వాంగ్మూలం నమోదు చేయాలని విశాఖ సెషన్స్ జడ్జిని ఆదేశిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రేపు సాయంత్రంలోగా వాంగ్మూలాన్ని సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
మరోవైపు, డాక్టర్ సుధాకర్ పట్ల విశాఖ పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కూడా స్పందించింది. ఈ ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు లేఖ రాసింది.
"డాక్టర్ సుధాకర్ పై పోలీసులు ప్రవర్తించిన తీరు సరికాదు. ప్రభుత్వ వైద్యుడిపై పోలీసులు ఇలా ప్రవర్తించడం కలచివేస్తోంది. వారి తీరును ఐఎంఏ ఖండిస్తోంది. ఐఎంఏకు చెందిన ఓ నిజనిర్ధారణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీఎంకు ఈ లేఖ రాస్తున్నాం. సస్పెన్షన్ ప్రభావం సుధాకర్ మానసిక ఆరోగ్యంపై పడిందని ఆ కమిటీ గుర్తించింది. సుధాకర్‌పై పెట్టిన కేసులను ఉపసంహరించుకోని, ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. ఆయనపై దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి." అని కోరుతూ ఐఎంఏ లేఖ రాసింది.