ఇంకెన్నిసార్లు కోర్టుతో మొట్టికాయలు తింటారు?
posted on Jun 10, 2020 @ 4:32PM
నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో జగన్ సర్కార్ కి సుప్రీం కోర్టులో చుక్కెదురైన సంగతి తెలిసిందే. నిమ్మగడ్డ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. అంతేకాదు, జగన్ సర్కార్‌పై ధర్మాసనం తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగ సంస్థలతో ఆటలు తగదని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ పై పలువురు విమర్శలు గుప్పించారు. తప్పులు సరిచేసుకొని ఇకనైనా పద్దతిగా ఉండాలని హితవు పలికారు.
ట్విట్టర్ వేదికగా స్పందించిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.. ఒకే విషయంలో పదే పదే ఇంకెన్ని సార్లు కోర్టుతో మొట్టికాయలు తింటారు? అంటూ జగన్ సర్కార్ ని ప్రశ్నించారు. "నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ గారి కేసులో హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడాన్ని స్వాగతిస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా తప్పును సరిచేసుకుని రాజ్యాంగ వ్యవస్థలతో గౌరవంగా వ్యవహరించాలి." అని కన్నా పేర్కొన్నారు.
ఏపీ ఎలక్షన్ కమిషన్ విషయంలో ప్రభుత్వ వాదన నమ్మదగినదిగా లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం, రాజ్యాంగ సంస్థలతో ఆటలు వద్దని హెచ్చరించడం.. రాష్ట్ర ప్రభుత్వ మనుగడను ప్రశ్నార్థకంలోకి నెట్టిందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. సర్వోన్నత న్యాయస్థానం ఇంతటి తీవ్ర వ్యాఖ్యలు చేశాక... ఈ ప్రభుత్వం కొనసాగే నైతిక హక్కును కోల్పోయిందని సోమిరెడ్డి పేర్కొన్నారు.
రాజ్యాంగ సంస్థలతో ఆడుకోవద్దని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. ఆర్డినెన్స్ వెనుక దురుద్దేశాలు ఉన్నాయని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు మరో మొట్టికాయని అన్నారు. అధికారంలో కొనసాగే అర్హత ఈ ప్రభుత్వానికి లేదన్నారు. నైతిక విలువలుంటే వైఎస్ జగన్ సీఎం పదవికి రాజీనామా చేయాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.