మియాపూర్‌ రోడ్డుపై 14 అడుగుల లోతులో భారీ గుంత!

హైదరాబాద్ లోని మియాపూర్-ప్రశాంత్‌నగర్ ప్రధాన రహదారి మధ్యలో అకస్మాత్తుగా భారీ గుంత ఏర్పడింది. వాహనదారుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ఈ గుంత పది అడుగుల వెడల్పు, 14 అడుగుల లోతు ఉంది. ఈ రోడ్డు సమీపంలోనే ఓ ప్రైవేట్‌ కార్పొరేట్‌ స్కూల్‌ ఉంది. ఈ రోడ్డు పై నుంచి 25 కాలనీలకు వాహన దారులు రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్డు ఒక్కసారిగా కుప్పకూలిపోయి పెద్దలోయ లాగా ఏర్పడటంతో వాహనదారులను భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు ఆ రోడ్డును బ్లాక్ చేసి ప్రమాదపు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. రోడ్డు ఒక్కసారిగా కూలడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. గతంలో ఇక్కడ భారీ పైపులైను నిర్మాణం జరిగిందని, ఆ ప్రభావంతోనే ఇప్పుడు రోడ్డు కుంగి గుంత ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. కాగా, ఈ గుంతకు సమీపంలోనే మరో చోట కూడా రోడ్డు కుప్పకూలడానికి సిద్ధంగా ఉన్నట్లు గుర్తించిన అధికారులు అక్కడ కూడా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. గుంత ఏర్పడిన ప్రాంతంలో మరమ్మతులు చేపట్టారు. 

భారత్ లో రోజుకి పదివేల కరోనా కేసులు!!

భారత్ లో మొదట్లో రోజుకి వంద కరోనా కేసులు నమోదైతేనే హడలిపోయాం. ఇప్పుడు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. రోజుకి పదివేల కేసులు నమోదయ్యే రోజులొచ్చాయి. తాజాగా ఒక్కరోజులోనే దాదాపు పదివేల కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో 9,851  మందికి కరోనా పాజిటివ్ గా తేలిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,26,770 కి చేరింది. గత 24 గంటల్లో 273 మంది కరోనాతో మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 6348 కి చేరుకుంది. ఇప్పటివరకు 1,09,462 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 1,10,960 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కేంద్రానికి బీజేపీ నేత ఫిర్యాదు.. చిక్కుల్లో ఏపీ సీఎంఓ అధికారి 

ఏపీ ప్రభుత్వం లో సర్వం తానే అయి వ్యవహరిస్తున్న ప్రవీణ్ ప్రకాష్ చిక్కుల్లో పడ్డారు. అటు సీఎం పేషీ లో ముఖ్య అధికారిగా అలాగే అధికారుల బదిలీలు పోస్టింగులు చూసే జీఏడీ లోను ఆయనే ముఖ్య అధికారి గా కొనసాగుతూన్న విషయం తెలిసిందే. ఏపీ మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం ను ఆ పదవి నుండి తప్పించిన వ్యవహారం లోను అయన కీలకంగా వ్యవహరించారు. అసలు చంద్ర బాబు కొంత కాలం సైలెంట్ గా ఉంటే ప్రవీణ్ ఏపీ ప్రభుత్వాన్ని ఒక దరికి చేరుస్తారని ఏపీ సెక్రటేరియట్ లోనే ఒక సెక్షన్ కామెంట్లు చేసుకునే పరిస్థితి ఉంది. ప్రస్తుతం విషయానికి వస్తే కొద్దీ రోజుల క్రితం సీనియర్ ఐఏఎస్ అధికారి రమామణి కన్నుమూశారు. ఐతే తాజాగా ఆమె మరణానికి కారణం ప్రవీణ్ ప్రకాష్, మరియు వాణిజ్య పన్నుల శాఖలో ముఖ్య అధికారి కారణమని ఆమె సోదరుడు కృష్ణ మూర్తి ఆరోపించారు. రెండు నెలల క్రితం వాణిజ్య పన్నుల శాఖలో పని చేస్తున్న ఆమెను అక్కడి నుండి తప్పించి మళ్ళీ ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా వేధించారని అయన ఆరోపించారు. సిన్సియర్ ఐఏఎస్ అధికారి అయిన ఆమెను ఆ పోస్టు నుండి తప్పించే ముందు వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారి ఢిల్లీలో పని చేస్తున్న తన భార్య కారు బిల్లులు చెల్లించాలని అలాగే ఆ శాఖ పేషీ ఖర్చులు కూడా ఆమె భరించాలని ఒత్తిడి తెచ్చినట్లుగా ఆమె సోదరుడు ఆరోపించారు. రెండు నెలల నుండి ఆమెకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా మానసికంగా ప్రవీణ్ వేధించారని ఆమె సోదరుడు కృష్ణ మూర్తి ఆరోపించారు. ఇంట్లో ఖాళీగా ఉండి జీతం తీసుకోవడం ఇష్టం లేక పోస్టింగ్ కోసం ఆమె ప్రవీణ్ ప్రకాష్ ను కలవగా మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫేస్ బుక్ లో పోస్టులు పెడుతున్నారు అని ఫిర్యాదులు వచ్చాయని ప్రశ్నించినట్లు అయన తెలిపారు. తనకు వాట్స్ఆప్ తప్ప వేరే సోషల్ మీడియాలో అకౌంట్ లేదని ఆమె తెలపడం తో వాట్స్ఆప్ లోనే మీరు ప్రభుత్వానికి వ్యతిరేక పోస్టులు పెడుతున్నారట అని ఆమెకు ఎటువంటి పోస్టింగ్ ఇవ్వలేదు. ఇదంతా కేవలం తనకు ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా ఉండటానికి ఇవన్నీ చేస్తున్నారని ఆమె తీవ్ర మానసిక వేదనకు గరయ్యారని ఆమె సోదరుడు ఆరోపించారు. అయినా ఎక్కడి ఢిల్లీలో ఉన్న అధికారుల భార్యల ఖర్చులు ఆమె ఎందుకు భరించాలని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఆమెకు పోస్టింగ్ ఇవ్వకుండా వేధించిన ఇదే ప్రవీణ్ ప్రకాష్ తన సోదరి మరణించినపుడు హాస్పిటల్ కు రావడం తమను ఆశ్చర్యానికి, అనుమానానికి గురి చేసిందని అయన ఆవేదన వ్యక్తం చేసారు.  తాజా గా బీజేపీ అధికార ప్రతినిధి రఘు ఈ విషయంపై స్పందిస్తూ ప్రవీణ్ ప్రకాష్ పై చర్యలు తీసుకోవాలని ఢిల్లీలోని అఖిల భారత సర్వీసుల వ్యవహారాలు చూసే డీవోపీటీకి లేఖ రాశారు. ఒకపక్క సీఎంఓలో సీఎం ముఖ్య కార్యదర్శిగా ఆదేశాలిస్తూ, మరో పక్క ప్రభుత్వపరంగా జీఏడీ అధికారి హోదాలో వాటిని అమలుచేస్తున్న తీరు బిజినెస్ రూల్సుకు విరుద్ధమని రఘు స్పష్టం చేశారు. ఆయన అహంకారపూరిత స్వభావం వల్లనే, సిన్సియర్ ఐఏఎస్ అధికారిణి రమామణి మృతి చెందాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

ఆర్బీఐ తీరుపై సుప్రీంకోర్టు అసహనం.. ప్రజల ఆరోగ్యం కంటే ఆర్థికాంశాలు ముఖ్యమా?

కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ).. లోన్లు, ఈఎంఐలు లపై ఆరు నెలల మారటోరియం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మారటోరియం ఎంచుకున్నవారికి ఈ ఆరు నెలల కాలానికి ఔట్‌ స్టాండింగ్‌పై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో, మారిటోరియం విధించినా, రుణవాయిదాలపై వడ్డీ వసూలు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. దీనిపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఓ వైపు మారటోరియానికి అవకాశం ఇస్తూనే మరోవైపు వడ్డీ వసూలు చేస్తుండడంపై సుప్రీంకోర్టు ఆర్బీఐని తప్పుపట్టింది. ప్రజల ఆరోగ్యం కంటే ఆర్థికాంశాలు ముఖ్యం కాదని అభిప్రాయపడింది.  మారటోరియం కాలంలో వడ్డీ మాఫీ చేయాలంటూ దాఖలైన కేసులో సుప్రీంకోర్టులో ఆర్బీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. ఒకవేళ మారటోరియం కాలంలో వడ్డీని మాఫీ చేస్తే బ్యాంకులు రూ.2 లక్షల కోట్లు నష్టపోవాల్సి వస్తుందని ధర్మాసనానికి నివేదించింది. ఈ అంశంపై ఆర్బీఐ అఫిడవిట్ దాఖలు చేసేముందు మీడియా సంస్థలకు లీక్ చేయడం పట్ల సుప్రీంకోర్టు మండిపడినట్టు సమాచారం. ‘మీడియాకు లీకులు ఇస్తూ ఈ అంశాన్ని మరింత సంచలనం చేసేందుకు ఆర్బీఐ ప్రయత్నిస్తోంది.’అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఓ వైపు మారటోరియంకు అనుమతిస్తూనే మరోవైపు వడ్డీపై ఎలాంటి ఉపశమనం లేకుండా చేయడం మరింత ప్రమాదకరం అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఆర్ధిక పరిస్థితిని తాము అర్ధం చేసుకుంటాం.. కానీ, ప్రజల ఆరోగ్యం, ప్రాణాల కంటే ముఖ్యం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ అంశంపై కేంద్ర ఆర్ధిక శాఖ, ఆర్బీఐ వివరణ కోరుతూ.. తదుపరి విచారణను ఈనెల 12వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.

ఎపి సీఎస్‌తో సహా ఆరుగురు అధికారులకు హైకోర్టు నోటీసులు

ఏపీ ప్రభుత్వానికి న్యాయస్థానాలలో తరచుగా ఎదురు దెబ్బలు తగులుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఏపీ హైకోర్టులో స్పషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో ఏర్పాటు పై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్బంగా ఏపీ సీఎస్, స్పెషల్ సీఎస్, డీజీపీ తో సహా ఆరుగురు అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఏపీలో మద్యపాన నియంత్రణ లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం SEB (స్పషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో) ని ఏర్పాటు చేసింది. తాజాగా SEB కి చట్టబద్దత లేదని అందువల్ల SEB పెట్టె కేసులు న్యాయపరంగా చెల్లవని వాదిస్తూ ప్రకాశం జిల్లా వాసి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. ఈ పిటిషన్ విచారణ లో భాగంగా హైకోర్టు ఆరుగురు ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేస్తూ విచారణ ను రెండు వరాల పాటు వాయిదా వేసింది.

రక్షణ కిట్లు ఇస్తే.. మరి వైద్య సిబ్బందికి కరోనా ఎలా సోకింది.. హైకోర్టు సూటి ప్రశ్న

ప్రపంచం మొత్తం కరోనా వ్యాప్తి తో ఒకపక్క ఉలిక్కి పడుటోంది. మరో పక్క తమ ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వైద్యులను, వైద్య సిబ్బందిని అభినందిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి అసమాన సేవలకు గుర్తుగా వారి పై పూల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటె తాజాగా గాంధీ, నిమ్స్, ఉస్మానియా హాస్పిటల్స్‌లో పలువురు వైద్య విద్యార్థులతో పాటు వైద్యులు, వైద్య సిబ్బంది సైతం కరోనా మహమ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే. దీని పై స్పందించిన హైకోర్టు వైద్య సిబ్బందికి అసలు కరోనా ఏలా వచ్చింది? వారికి రక్షణ కోసం పిపియి కిట్లు ఇచ్చారా అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన పలు అంశాలపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో వైద్యులకు రక్షణ కిట్లు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినా.. ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందంటూ న్యాయవాది ప్రభాకర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. అసలు వైద్య సిబ్బందికి కరోనా ఎలా సోకిందో ఈనెల 8వ తేదీలోపు సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్నీ ఆదేశించింది.

ఎపి సీఎం కూడా బంకర్లు సిద్ధం చేసుకోవాలి.. టీడీపీ నేత సంచలన కామెంట్స్

నేర స్వభావం ఉన్న వ్యక్తి పరిపాలిస్తే రాష్ట్రం ఎలా ఉంటుందో సీఎం జగన్ ఏడాది పాలన అందుకు చక్కని ఉదాహరణ అని టీడీపీ నేత యరపతినేని వ్యాఖ్యానించారు. ప్రజావ్యతిరేక విధానాలతో జగన్ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారని అయన తీవ్రంగా విమర్శించారు. ప్రజలు కనుక తిరగబడితే అమెరికాలో ట్రాంప్ వెళ్లి బంకర్లో దాక్కున్నారని .. అలాగే ఏపీలో జగన్ కూడా బంకర్లు కట్టించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అయన అన్నారు. ఎపి ప్రభుత్వం తప్పిదాలను కోర్టులు తప్పుబడుతుంటే దిక్కు తోచక ప్రజల దృష్టి మళ్లించేందుకు వైసిపి నేతలు తెలుగుదేశాన్ని నిందిస్తున్నారని మండిపడ్డారు. ప్రతీదానికీ వైకాపా నేతలు చంద్రబాబు వయస్సు మీద విమర్శలు చేస్తున్నారని.. ఐతే వారికి వయస్సు పెరగదని ఆ నేతలు భావిస్తున్నారా అని యరపతినేని ప్రశ్నించారు. చంద్రబాబు వయస్సు గురించి మాట్లాడే అంబటి రాంబాబు ఆయనతో కలిసి తిరుమల కొండ ఎక్కగలరా అని సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీకి ఫ్యూచర్ లీడర్లు ఎందరో ఉన్నారని.. అలాగే వైకాపా నేతలు విమర్శిస్తున్నట్లుగా లోకేష్‌కి అవినీతిలో అనుభవం లేదని అన్నారు. వైసిపి నేతల మాదిరి సూట్ కేసు కంపెనీలు పెట్టడం, దొంగ సొమ్ము దోచుకోవటం, అక్రమార్జన చేయటంలో జగన్‌లా లోకేష్‌కి అనుభవం లేదని అయన విమర్శించారు. ప్రస్తుతం జగన్ చుట్టూ ఉన్నవారంతా అవకాశవాదులు కాదా అని అయన ప్రశ్నించారు. బొత్స, ధర్మాన మొదలైన వాళ్లంతా జగన్‌ని ఒకప్పుడు విమర్శించిన వారే అని.. వై.ఎస్ మరణం వెనుక కూడా జగన్ హస్తం ఉందని బొత్స విమర్శలు చేయలేదా అని అయన నిలదీశారు. చంద్రబాబు, లోకేష్‌ల మీద అనవసరంగా నోరు పారేసుకుంటే ఉతికి ఆరేస్తాం ఖబడ్దార్ అని యరపతినేని హెచ్చరించారు.

ఆ కరోనా పేషంట్ ఏమయ్యాడో తేల్చి చెప్పండి.. తెలంగాణ హైకోర్టు

కరోనా ధాటికి తెలంగాణాలో ఫ్యామిలీలకు ఫ్యామిలీలే ఐతే అటు క్వారంటైన్ కు లేదంటే ప్రభుత్వ ఆసుపత్రులలో చేరుతున్నారు. ఇలాంటి వాటిలో ఒకటి మధుసూదన్ ఫ్యామిలీ. గత మీ నెలలో గాంధీ హాస్పిటల్ లో అడ్మిట్ ఐన మధుసూదన్ అనే వ్యక్తి మరణించారా లేదా అనే విషయాన్నీ స్పష్టంగా చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఈ రోజు ఆదేశించింది. ఒక వేళా మధుసూదన్ కరోనా తో మరణిస్తే ఆయన కుటుంబ సభ్యులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఈ సందర్బంగా కోర్టు ప్రశ్నించింది. గాంధీ ఆసుపత్రిలో కరోనా రోగి మధుసూధన్ మరణంపై అయన కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. గత మే నెల 21 న అయన భార్య మాధవి కేటీఆర్కు ట్విట్టర్ ద్వారా తన భర్త ఆచూకీ తెలియడం లేదని ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన తెలంగాణ హెల్త్ మినిష్టర్ ఈటెల రాజేందర్ మధుసూదన్ చనిపోయే సమయానికి అయన భార్య కూడా గాంధీ లోనే చికిత్స పొందుతూ కోలుకుంటున్న పరిస్థితుల్లో ఆమెకు భర్త చనిపోయిన విషయాన్ని చెప్పలేదని తెలిపారు. ఐతే ఆ కుటుంబం లో మొదటిగా మధుసూదన్ తండ్రి కరోనా తో గాంధీ హాస్పిటల్ లో చ్చికిత్స పొందుతూ మరణించారు. ఆతరువాత మధుసూదన్ అయన భార్య కూడా కరోనా తో అదే ఆసుపత్రి లో చేరారు. ఐతే మధుసూదన్ మే 1 న మరణించారు. కానీ అయన భార్యకు కానీ కుటుంబ సభ్యులకు ఆ విషయం తెలపక పోవడం తో ఈ పరిస్థితి ఏర్పడింది. ఐతే ఈ విషయమై అపుడే ఆమె న్యాయపోరాటం చేస్తానని ప్రకటిచింది. తాజాగా ద్దెని పై ఆమె హైకోర్టును ఆశ్రయించింది.

భారత్ కు సారీ చెప్పిన అమెరికా

 ప్రపంచం మొత్తం కరోనా ధాటికి విలవిల లుడుతోంది. ఐతే అమెరికాలో కరోనా తో పాటు నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యతో అట్టుడుకుతోంది. అమెరికాకు చెందిన ప్రధాన నగరాలలో అల్లర్ల కారణంగా కర్ఫ్యూ కూడా విధించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం వెలుపల ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పాక్షికంగా ధ్వంసం చేశారు. దీంతో అప్రమత్తమైన స్థానిక పోలీసులు విగ్రహం పై ముసుగు కప్పారు. ఈ ఘటన పై యుఎస్ పార్క్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐతే ఈ ఘటన పై అమెరికా రాయబారి కెన్ జస్టర్ భారత్ కు క్షమాపణలు చెప్పారు. ఇలా జరగడం పట్ల అమెరికా చింతిస్తోందని తమ క్షమాపణలను స్వీకరించాలని అయన భారత్‌ను కోరారు.

ఇది మనిషి వికృత చేష్టలకు పరాకాష్ట 

కేరళలోని మలప్పురం జిల్లా లో గర్భం తో ఉన్న ఏనుగు కు మందుగుండు కూరిన పైన్ ఆపిల్ ను ఆహారంగా అందించి దాని ప్రాణాలు తీసిన ఘటన పై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనకు బాధ్యులైన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ముక్త కంఠం తో కోరుతున్నారు. తాజాగా దీని పై కాంగ్రెస్ సీనియర్ నేత సినీ నటి విజయ శాంతి స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. మూగ జీవాల విషయం లో కొందరు వ్యక్తుల మానవత్వం మరిచి ప్రవర్తిస్తున్న తీరు ను ఆమె తప్పు పడుతూ పేస్ బుక్ ద్వారా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.   ఈ సృష్టిలో ఎంతో గొప్ప జీవి మనిషేనని గర్వంగా చెబుతారు. కానీ, దేవుడికి తన సృష్టిపై తనకే అసహ్యం వేసేలా ప్రవర్తిస్తున్నారు మనుషులు. ఈ ప్రకృతిపై మనిషికి మాత్రమే ఆధిపత్యం ఉన్నట్టు.... మిగిలిన జీవాల మనుగడ ఈ మనుషుల దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడి ఉన్నట్టు... కొందరు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే కడుపు రగిలిపోతోంది. కేరళలో గర్భంతో ఉన్న ఒక ఏనుగుకు బాణాసంచా మందు కూరిన అనాసపండు పెట్టి, ఆ మూగజీవి మరణవేదనను క్రూరంగా వినోదించిన ఈ మనుషుల వికృత చేష్టలకు ఏ శిక్ష వేస్తే సరిపోతుంది? ఈ సంఘటనకు ముందు టిక్‌టాక్ వీడియో కోసం ఒక కుక్కపిల్ల కాళ్ళూ చేతులు కట్టేసి మురికి కాలువలోకి విసిరేసి ప్రాణాలు తీసిన ఘోరాన్ని చూశాం. అంతకు ముందు ఒక వ్యక్తి మేడపై నుంచి కుక్కను దారుణంగా విసిరేశాడు. మూగజీవాలపై ఇలా ఎన్నెన్నో అకృత్యాలు... అసలేం జరుగుతోంది? ఇతర జీవులకు భూమ్మీద బతికే హక్కు లేదా? నేడు మన ప్రపంచం అనుభవిస్తున్న ఈ రోగాలు... దిగజారిన పరిస్థితులు... చూస్తుంటే మనిషి చేసే తప్పులకు ఆ ప్రకృతి విధిస్తున్న శిక్షలే ఇవని అనిపిస్తోంది. తప్పు చేసినవారే కాదు... చూస్తూ స్పందించనివారు... అడ్డుకునే శక్తి ఉన్నప్పటికీ ఆ పని చెయ్యనివారు కూడా శిక్షార్హులే. అందుకే ఇకనైనా మారదాం... నిండైన మానవత్వమున్న మనుషులుగా బతుకుదాం. ఆ పరమేశ్వరుని దృష్టిలో మనం కృతఘ్నులం కావద్దు’’ అంటూ విజయశాంతి తన ఆవేదన వ్యక్తం చేశారు.    

కరోనా కేసుల్లో పోటా పోటీగా రెండు తెలుగు రాష్ట్రాలు

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రెండు లక్షల మార్కు దాటి ప్రస్తుతం 2,07,000 వద్దకు చేరింది ఇదే సమయం లో వలస కూలీలు సొంత రాష్ట్రాలకు చేరుకోవటం తో పాటు రైలు విమానాల ద్వారా వస్తున్న వారి వల్ల రెండు తెలుగు రాష్ట్రాల లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. తెలంగాణాలో కేసుల సంఖ్య మూడు వేలు దాటి ప్రస్తుతం 3,020 కి చేరింది. ఇందులో నిన్న నమోదైన 129 కేసుల్లో తెలంగాణ వాసులలో 127 కేసులు నమోదు కాగా వలస కూలీలలో ఇద్దరికీ పాజిటివ్ తేలింది. ఇందులో జీ హెచ్ ఎం సి పరిధి లో నే 108 కేసులు బయట పడ్డాయి. ఇక ఏపీలో నిన్న 180 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఇందులో రాష్ట్రం లోనివి 79 కేసులు కాగా మిగిలినవి ఇతర రాష్ట్రాలు, విదేశాల నుండివచ్చినవి 101 కేసులు రికార్డ్ అయ్యాయి. దీంతో రాష్ట్రం లో మొత్తం కేసుల సంఖ్య 3.971 కి చేరుకుంది. తాజాగా వచ్చిన కేసులలో ఎక్కువగా పశ్చిమ గోదావరి, కర్నూల్, కడప జిల్లాలలో నమోదయ్యాయి.

లక్ష కోట్లకు పైగా విలువజేసే భూములపై వైసీపీ పెద్దల కన్ను.. ఇదేనా కోతలరాయుని పాలన?

టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా అధికార పార్టీ వైసీపీ విమర్శలు గుప్పించారు. మాన్సాస్ ట్రస్టుకు సంబంధించిన భూములపై వైసీపీ ప్రభుత్వం కన్నేసిందని మండిపడ్డారు. "మాన్సాస్ ట్రస్ట్ అన్నది ఒక ఉన్నతమైన లక్ష్యాలతో పూసపాటి వంశీయులు స్థాపించిన సంస్థ. ఆ సంస్థ కింద 105 దేవాలయాలతో పాటు, ఎన్నో విద్యాలయాలు ఉన్నాయి. సంస్థకున్న పవిత్ర ఆశయాలను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశంతో సహా ఏ పార్టీ అధికారంలో ఉన్నా సంస్థ విషయాల్లో జోక్యం చేసుకోలేదు. అలాంటిది రూ.1 లక్షా 30 వేల కోట్లకు పైగా విలువజేసే ట్రస్ట్ భూముల మీద కన్నేసి, కాజేయడానికి వైసీపీ పెద్దలు అధికార దుర్వినియోగం చేస్తున్నారు. తండ్రి ఆశయాలను బతికించుకోవటానికి అశోక్ గజపతిరాజు తపన పడుతున్నారు. ఆయనకు అందరూ అండగా నిలవాలి. ఒక పవిత్ర సంకల్పాన్ని బతికించాలి." అని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇక, సీఎం వైస్ జగన్ ని కోతలరాయుడుతో పోలుస్తూ.. ఏడాది పాలనపై చంద్రబాబు విమర్శలు చేశారు. "వెనకటికి ఒక కోతలరాయుడు శుక్రవారం రోజున కొండను మోస్తానని జనాన్ని నమ్మించాడంట. నిజమే అనుకుని ఆరోజు కొండ దగ్గరికి ప్రజలంతా వెళ్తే, కోతలరాయుడు వచ్చి... 'మీరంతా కొండను ఎత్తి నా భుజాల మీద పెట్టండి. నేను మోస్తాను.' అన్నాడంట. ఏపీలో కోతలరాయుని పాలన కూడా అలాగే ఉంది. ముద్దులు పెట్టి, ఏది కావాలంటే అది ఇస్తానని ప్రజలను నమ్మించారు. తీరా అధికారంలోకి వచ్చాక, ఆదాయం కోసం జనాన్ని ధరల బరువు మోయమంటున్నారు. ఏడాది కాలంలో కోతలరాయుని ధరాఘాతాలకు ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. పాలనకు, హామీల అమలుకు అవసరమైన సంపదను ప్రభుత్వం సృష్టించుకోవాలి. అంతేకానీ ధరలు పెంచేసి ప్రజలను పీడించడం ఏంటి? ఇదేం చేతకాని పాలన?" అంటూ జగన్ సర్కార్ పై చంద్రబాబు విరుచుకుపడ్డారు.

ఆనం సంచలన వ్యాఖ్యలు.. సీఎం ఆదేశాలను సైతం అధికారులు పట్టించుకోవడం లేదు!

వైసీపీ సీనియర్ నేత, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లా ప్రభుత్వాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్య, వైద్యం, సంక్షేమ పథకాలపై అధికారులు నివేదికలు తయారుచేయలేదని తప్పుబట్టారు. ఈ ఏడాది పాలనలో తన నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారుల తీరు దారుణంగా ఉందని, వెంకటగిరి నియోజకవర్గాన్ని వారు మర్చిపోయినట్టున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గ ప్రజలకు నేరుగా అందే సంక్షేమ కార్యక్రమాలు తప్ప, ఇతర ఏ కార్యక్రమాలనూ తాను చేయలేకపోతున్నానని అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలను సైతం అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. జలవనరుల శాఖలో అధికారులు నీళ్లు అమ్ముకుంటున్నారని, ఎస్‌ఎస్‌ కెనాల్‌ను పరిశీలించాలని సీఎం జగన్ చెప్పినా అధికారులు వినడంలేదని చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగం ఇంత దారుణంగా పని చేయడాన్ని తన 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు. ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా పని చేశానని, మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించానని చెప్పిన ఆయన.. ఎమ్మెల్యే పదవి తనకు అలంకారప్రాయం కాదని అన్నారు. ప్రజల కోసం ప్రభుత్వాన్ని, అధికారులను నిలదీయడానికి సిద్ధమని ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు.

ఏపీ సీఎస్‌ పదవీకాలం పొడిగింపు

ఏపీ‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) నీలం సాహ్ని పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. సీఎస్‌ పదవీకాలాన్ని పొడిగించాలంటూ ఏపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది. ఏపీ సీఎస్ గా నీలం సాహ్ని మరో మూడు నెలలు కొనసాగనున్నారు.  నీలం సాహ్ని పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. అయితే, కరోనా నేపథ్యంలో సీఎస్‌ విధులు కీలకమైనందున ఆమె పదవీ కాలం మరో 6 నెలలు పొడిగించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖకు సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 వరకూ నీలం సాహ్ని పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

మానవత్వం మరిచిపోయి గర్భంతో ఉన్న ఏనుగు చావుకు కారణమయ్యారు

కేరళ మలప్పురం దగ్గర్లోని ఓ గ్రామంలో కొందరు ఆకతాయిలు అత్యంత క్రూరమైన చర్యకు పాల్పడ్డారు. మానవత్వం మరిచిపోయి గర్భంతో ఉన్న ఓ ఏనుగు చావుకు కారణమయ్యారు. ఆకలితో ఉన్న ఓ జంతువుకు ఆహారం ఆశచూపి.. దాని ప్రాణాలు తీశారు. గర్భంతో ఉన్న ఓ ఏనుగుతో సైలెంట్‌ వ్యాలీ వద్ద ఓ గ్రామంలోని ప్రజలు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. ఆహారం వెతుక్కుంటూ ఓ ఆడ ఏనుగు గ్రామంలోకి వచ్చింది. కొందరు స్థానికులు దానికి ఒక పైనాపిల్‌ ఆశచూపారు. ఆ పైనాపిల్‌లో పేలుడు పదార్థాలు పెట్టారు. ఇది ఏమాత్రం తెలియని గజరాజు తినేసింది. దీంతో ఆ పండు భారీ చప్పుడుతో పేలింది. ఆ మూగజీవి నోటివెంట రక్తం ధారగా కారింది. ఇంత జరిగినా ఎవరికీ అపకారం చేయకుండా.. బాధతో విలవిల్లాడిపోతూ.. రక్తమోడుతున్న నోటితో గ్రామం వదిలి వెళ్లిపోయింది.  ఓ పక్క కడుపులో పెరుగుతున్న బిడ్డ ఉండటంతో ఆకలి.. మరోపక్క నరాలను మెలిపెట్టే బాధ.. దీనికి తోడు గాయంపై ఈగలు వాలుతుండటంతో.. ఏమి చేయాలో తెలియక ఆ మూగజీవం వెల్లియార్‌ నదిలోకి దిగి గొంతు తడుపుకుంది. విషయం తెలుసుకొన్న అటవీశాఖ సిబ్బంది మరో రెండు ఏనుగులను తీసుకొచ్చి దానిని బయటకు రప్పించేందుకు ప్రయత్నించారు. కానీ, గాయం బాధను తట్టుకోలేకపోతున్న ఆ ఏనుగు అక్కడే ఉండిపోయింది. చివరికి మే 27వ తేదీ సాయంత్రం 4గంటలకు తుదిశ్వాస విడిచింది. చనిపోయిన ఏనుగును బయటకు తీసుకొచ్చి దానిని పరీక్షించగా అది గర్భంతో ఉందని వైద్యులు తెలిపారు. చివరికి అటవీశాఖ సిబ్బంది దానికి అంత్యక్రియలు నిర్వహించారు. హృదయ విదారకమైన ఈ ఘటనను మల్లప్పురం అటవీశాఖ అధికారి మోహన్‌ కృష్ణన్‌ తన సోషల్‌ మీడియా ఖాతాలో వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఏనుగు మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, అచ్చు ఇలాంటి సంఘటనే కొల్లాంలో కూడా సంభవించిందని అటవీ అధికారులు తెలిపారు. ఏప్రిల్ నెలలో ఒక ఆడ ఏనుగును కూడా ఇలా పైనాపిల్ బాంబుతోనే చంపేశారని వారు వెల్లడించారు.

సీఎం ఇంటిపై బాంబులతో దాడి చేస్తామంటూ ఫోన్ కాల్

తమిళనాడు సీఎం పళనిస్వామి నివాసం, సచివాలయంపై బాంబులతో దాడి చేస్తామంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. ఈ బెదిరింపు కాల్ తో అప్రమత్తమైన పోలీసులు.. బాంబ్, డాగ్ స్క్వాడ్ టీములను వెంటనే రంగంలోకి దించారు. సీఎం పళనిస్వామి నివాసం, సచివాలయం సమీపంలో తనిఖీలు చేపట్టారు. సచివాలయంలోని అన్ని మార్గాల్ని తమ ఆదీనంలోకి తీసుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. సీఎం ఇంటి పరిసరాల్లోనూ భద్రతను పెంచారు. ప్రవేశ మార్గంలో మెటల్‌ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. మరోవైపు, బెదిరింపు కాల్ చేసి పోలీసులను పరుగులు పెట్టించిన వ్యక్తి కోసం సైబర్ క్రైమ్ పోలీసులు వెతుకుతున్నారు. కాగా, ఇటీవల పళనిస్వామి నివాసం, సచివాలయంకి ఇలాంటి బెదిరింపులు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో ముందు జాగ్రత్తగా.. చెన్నైలోని గ్రీమ్స్ రోడ్డులో ఉన్న పళనిస్వామి నివాసం, మెరీనా తీరంలోని కామరాజర్ సాలైలో ఉన్న సచివాలయం వద్ద భద్రతను పెంచారు.

రాప్తాడులో ఉద్రిక్తత.. పరిటాల రవి పేరుతో ఉన్న శిలాఫలకాలు ధ్వంసం

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పేరూరు డ్యామ్ దగ్గర మాజీ సీఎం చంద్రబాబు, దివంగత మాజీ మంత్రి పరిటాల రవి పేరుతో వేసిన శిలాఫలకాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పరిటాల సునీత, శ్రీరామ్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పెరూరికి టీడీపీ శ్రేణులు భారీగా తరలిరావడంతో ఉద్రిక్తత నెలకొంది. అధికారపార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. శిలా ఫలకాలను ధ్వంసం చేయడంపై సునీత, శ్రీరామ్‌లు మండిపడ్డారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేకే శిలాఫలకాలు ధ్వంసం చేస్తున్నారని సునీత మండిపడ్డారు. కక్షపూరితంగా గ్రామాల్లో ఇలాంటి చర్యలకు దిగుతున్నారని సునీత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కఠిన చర్యలు తీసుకోకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆమె మండిపడ్డారు. రాప్తాడు నియోజకవర్గానికి నీళ్లు ఇస్తే సంతోషించే మొదటి వ్యక్తిని తానేనన్నారు. గతంలో పేరూరు డ్యామ్ కు రూ. 804 కోట్లు కేటాయించామని సునీత చెప్పారు.

బాబుగారికి భయం... జగన్ సార్ కి స్వార్ధం

ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మి నారాయణ సంచలనం కామెంట్స్ చేసారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు ఆ భయం తోనే ఏపీకి చెందిన వేల కోట్ల ఆస్తులను తెలంగాణ కు వదిలి పెట్టి కరకట్టకు వచ్చి చేరారని విమర్శించారు. అదే సమయం లో సీఎం జగన్ కూడా తన స్వార్ధ ప్రయోజనాల కోసం తెలంగాణ లోని ఏపీ ఆస్తుల పై నోరు మెదపకుండా కూర్చున్నారని విమర్శించారు. అసలు చట్టబద్దంగా తెలంగాణ నుండి ఏపీకి చెందాల్సిన ఆస్తుల పూర్తి వివరాలు ప్రకటించాలని కన్నా డిమాండ్ చేసారు. నిన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న సందర్బంగా ఆయన ఈ ట్వీట్ చేస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఫోటోలని పోస్ట్ చేసారు.

సీబీఐ కొత్త ట్విస్ట్.. డాక్టర్ సుధాకర్‌పై కేసు నమోదు

డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో ఏపీ హైకోర్టు ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సీబీఐ పోలీసులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. వీటిలో కుట్ర కోణం, కావాలని తిట్టడం, అక్రమ నిర్బంధం, చోరీ, బెదిరింపులు వంటి సెక్షన్లు ఉన్నాయి. అయితే, తాజాగా డాక్టర్ సుధాకర్ పై కూడా కేసు నమోదు చేసింది. ఓ ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి నడిరోడ్డు మీద ప్రజాప్రతినిధులను దూషించడం, విధి నిర్వహణలో ఉన్న పోలీసులపైన మాట తూలడం, న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ స్థానికులను భయబ్రాంతులకు గురిచేయడం, లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించడం తదితర ఆరోపణలతో కేసు నమోదు చేసింది. 23 మంది సాక్షుల సమాచారంతో పాటు 130 పేజీలతో కూడిన సీడీ ఫైల్‌ను పోలీసులు సీబీఐకి అప్పగించారు. దీంతో వాటిని పరిశీలించి డాక్టర్ సుధాకర్ పై సీబీఐ కేసు నమోదు చేసింది.