జగన్ సర్కార్‌కు సుప్రీంలోనూ ఎదురుదెబ్బ.. రాజ్యాంగ వ్యవస్థలతో ఆటలొద్దని హెచ్చరిక
posted on Jun 10, 2020 @ 1:18PM
నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులోనూ చుక్కెదురైంది. నిమ్మగడ్డ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. నిమ్మగడ్డ వ్యవహారంపై సుప్రీం కోర్టులో ఈరోజు విచారణ జరిగింది. నిమ్మగడ్డను కమిషనర్‌గా కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా జగన్ సర్కార్‌పై ధర్మాసనం తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగ సంస్థలతో ఆటలు తగదని హెచ్చరించింది. ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ వెనుక ఉన్న ఉద్దేశాలు సంతృప్తికరంగా లేవని వ్యాఖ్యానించింది. ఇలాంటి ఆర్డినెన్స్‌లు ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించింది. ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది.