గూగుల్‌లో మరో భారతీయుడికి కీలక పదవి
posted on Jun 9, 2020 @ 5:03PM
సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సీఈఓ గా భారత సంతతి వ్యక్తి సుందర్ పిచాయ్ బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, తాజాగా మరో భారత సంతతి వ్యక్తికి గూగుల్‌లో కీలక పదవి వరించింది. ఆ సంస్థ సెర్చ్ హెడ్‌గా భారత సంతతికి చెందిన ప్రభాకర్ రాఘవన్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న బెన్ గోమ్స్ కు గూగుల్ మరో కీలక పదవి కట్టబెట్టింది.
తమిళనాడుకు చెందిన ప్రభాకర్ రాఘవన్ 1960, సెప్టెంబర్ 25న జన్మించారు. ఐఐటీ మద్రాస్‌లో బీటెక్ పూర్తిచేసిన ప్రభాకర్.. బెర్క్‌లీ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పొందారు. 2012లో గూగుల్‌లో చేరిన ఆయన 2018లో గూగుల్ అడ్వర్టైజింగ్, కామర్స్ బిజినెస్ హెడ్‌గా ఎదిగారు. దీనిలో భాగంగా సూపర్ విజన్ సెర్చ్ డిస్ ప్లే పర్యవేక్షణతో పాటు వీడియో అడ్వర్టైజింగ్ అనలిటిక్స్, షాపింగ్, పేమెంట్స్ వంటి వ్యవహారాలను చూసుకున్నారు. అంతకుముందు, ఆయన గూగుల్ యాప్ప్ వైస్ ప్రెసిడెంట్ గాను, గూగుల్ క్లౌడ్ సర్వీసెస్‌లోనూ పనిచేశారు. గూగుల్‌లో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించడానికి ముందు.. ఐబీఎం, యాహూ సంస్థల్లోనూ వివిధ హోదాల్లో పనిచేశారు. కొత్త బాధ్యతల్లో ప్రభాకర్ రాఘవన్ అనుభవం ఎంతో ఉపకరిస్తుందని సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు.