అధికారాన్ని వాడుకొని సీఎం జగన్ సొంత కంపెనీ కి ప్రయోజనాలు!!
posted on Jun 10, 2020 @ 10:42AM
ఏపీ సీఎం వైఎస్ జగన్ కి చెందిన కంపెనీకి ప్రభుత్వం నుంచి నజరానాలు అందుతూనే ఉన్నాయి. ఇటీవల, సరస్వతి పవర్స్ కు కృష్ణా నది నీళ్ళు, శాశ్వత నీటి కేటాయింపులు ఇచ్చిన ప్రభుత్వం, తాజాగా మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. సరస్వతి సిమెంట్స్ మైనింగ్ లీజ్ ను, ఏకంగా 50 ఏళ్ళుకు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. గుంటూరు జిల్లాలో 613.70 హెక్టార్లలో ఉన్న మైనింగ్ ను, 50 ఏళ్ళ పాటు సరస్వతీ సిమెంట్స్ కు కేటాయిస్తూ, జీవో నెంబర్ 30 విడుదల చేస్తూ, ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ కంపెనీలో జగన్ కు 26.4 కోట్లు విలువ చేసే షేర్లు వాటా ఉండగా, ఆయన సతీమణికి 13.8 కోట్ల విలువ చేసే షేర్లు వాటా ఉంది.
సీఎం జగన్ సొంత కంపెనీ కి ప్రయోజనం సమకూర్చుకోవడానికి తన అధికారాన్ని వాడుకోవడం సిగ్గుచేటని టీడీపీ విమర్శిస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబు తమ పార్టీ నేతలతో ఆన్‌లైన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు జగన్ సర్కార్ తీరుపై మండిపడ్డారు. సీఎం జగన్ తన కంపెనీకి సున్నపురాయి గనులను 50 ఏళ్లకు పొడిగించుకున్నారని.. కృష్ణా నీళ్లు కేటాయించుకున్నారని.. దేశంలో ఏ ముఖ్యమంత్రీ ఇలా సొంత కంపెనీ కోసం అధికారాన్ని వాడుకోలేదని విమర్శించారు. తనకు ఒక్క చాన్సు ఇవ్వాలని ప్రజలను కోరింది అన్నీ సొంతానికి చేసుకోవడానికేనా అని టీడీపీ నేతలు ప్రశ్నించారు.