అచ్చెన్నాయుడు బెయిల్ పిటీషన్.. విచారణ వాయిదా.. 

కొద్దిరోజుల క్రితం ఈఎస్ఐలో జరిగిన స్కాం కేసులో అరెస్టయిన టీడీపీ నేత మాజీమంత్రి అచ్చెన్నాయుడుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల వ్యవహారంలో రూ.150 కోట్ల అవినీతి జరిగిందని విజిలెన్స్ నివేదిక ఇవ్వడంతో ఏసీబీ ఆయనను అరెస్ట్ చేసింది. ఈ రోజు అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ కేసులో తమ వాదనలు వినాలని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తరపు లాయర్ న్యాయస్థానాన్ని అభ్యర్ధించారు. ఇదే సమయంలో బెయిల్ పిటిషన్, కస్టడీల ‌పై ఒకేసారి వాదనలు వినాలని ప్రభుత్వం తరపు లాయర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో ఏసీబీ కోర్టు ఈ కేసు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

ఒంగోలులో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌

ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోన్న నేపథ్యంలో నగరంలో పూర్తి స్థాయి  లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు కలెక్టర్‌ భాస్కర్‌ ప్రకటించారు. ఈ నెల 21 నుంచి 14 రోజులపాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని, ఎలాంటి సడలింపులు ఉండవని తెలిపారు.   ప్రకాశం జిల్లాలో ఇప్పటివరకు 267 కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రమైన ఒంగోలులో ఇటీవల కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిన్న కొత్తగా 8 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒంగోలులో ఒక్కసారిగా కరోనా పాజిటివ్‌ కేసులు రావడం, కరోనా అనుమానితులు వందల సంఖ్యలో ఉండటంతో పరిస్థితి చేయిదాటిపోయేలా ఉంది. దీంతో అప్రమత్తమైన జిల్లా అధికారులు నగరంలో కరోనా వ్యాప్తిని నిలువరించడానికి పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకటించారు.

అక్రమంగా నిర్భయ కేసు.. హైకోర్టుకు అయ్యన్నపాత్రుడు

విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై నిర్భయ చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయ్యన్నపాత్రుడు తాత, మాజీ ఎమ్మెల్సీ రుత్తల లచ్చాపాత్రుడు చిత్రపటం తొలగించారని మున్సిపల్ కమిషనర్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. అయితే, తాజాగా అయ్యన్నపాత్రుడు తనపై కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. అధికార పార్టీ విధానాలను ప్రశ్నిస్తున్నానన్న కక్షతో తనపై అక్రమంగా కేసులు పెడుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అందువల్ల ఈ కేసును కొట్టివేయడంతో పాటు తదుపరి చర్యలను నిలుపుదల చేయాలని, పోలీసులు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని అయ్యన్న హైకోర్టును కోరారు.

ఆగని పెట్రో మంట.. వరుసగా 13వ రోజు పెరిగిన ధరలు

దేశమంతా కరోనా, చైనా గోలలో ఉంటే.. చమురు సంస్థలు మాత్రం పెట్రోల్‌, డీజిల్ ధరలు పెంచే పనిలో ఉన్నాయి. వరుసగా 13వ రోజు కూడా దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. ఈరోజు లీటర్‌ పెట్రోల్‌ పై 56 పైసలు, లీటర్‌ డీజిల్‌ పై 63 పైసలను చమురు సంస్థలు పెంచేశాయి. 13 రోజుల్లో లీటర్‌ పెట్రోల్ ‌పై రూ.7.11, లీటర్‌ డీజిల్‌ పై రూ.7.67 పెరగడం గమనార్హం. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.78.37, లీటర్‌ డీజిల్‌ ధర రూ.77.06కు చేరింది. హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోలు ధర రూ.81.36, డీజిల్ ధ‌ర రూ.75.31 గా ఉన్నాయి. మార్చిలో పెట్రో ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం రూ. 10 చొప్పున ఎక్సైజ్‌ డ్యూటీ విధించింది. దీంతో చమురు సంస్థలు ఈ భారాన్ని వినియోగదారులపై మోపుతున్నాయి. లాక్ డౌన్ ఉన్నన్ని రోజులూ పైసా కూడా పెంచకుండా ఉన్న చమురు సంస్థలు.. ఇప్పుడు వరుసగా పెంచుకుంటూ పోతూ వినియోగ దారుల జేబులకి చిల్లు పెడుతున్నాయి. సాధారణ సమయంలో అయితే ఈ స్థాయిలో ధరలు పెరిగితే నిరసనలు వెల్లువెత్తుతాయి. కరోనా కాలం కావడంతో జనాలు సీరియస్ గా తీసుకోవడం లేదు. చమురు సంస్థలు కూడా ఇదే అదనుగా భావించి ధరలు పెంచుతున్నాయి.

జియోలో సౌదీ కంపెనీ భారీ పెట్టుబడి.. ప్రపంచ రికార్డు!

రిలయన్స్ జియోలోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (పీఐఎఫ్) తాజాగా జియో ప్లాట్‌ఫాంలో రూ. 11,367 కోట్లతో 2.32 శాతం షేర్లు కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. జియోలో గత 9 వారాల్లో ఇది 11వ పెట్టుబడి కావడం గమనార్హం. ఫేస్‌బుక్, సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్ (రెండు ఇన్వెస్టిమెంట్లు), విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్, ముబదాలా, ఏడీఐఏ, టీపీజీ, ఎల్ కేటర్టన్, పీఐఎఫ్ పెట్టుబడుల ద్వారా జియో ఇప్పటి వరకు రూ.1,15,693 కోట్లను సమీకరించింది. పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించ‌డంలో జియో సంస్థ రికార్డు సృష్టించింది. ఈ స్థాయిలో నిధులు సమకూర్చుకున్న కంపెనీ ప్రపంచంలో మరేదీ లేదనే చెప్పాలి. పీఐఎఫ్ తాజా పెట్టుబడితో జియో ఈక్విటీ విలువ రూ. 4.91 లక్షల కోట్లకు పెరగగా, ఎంటర్‌ప్రైజ్ విలువ రూ. 5.16 లక్షల కోట్లకు పెరిగినట్టు జియో తెలిపింది. తమ సాంకేతిక సామర్థ్యంపై విదేశీ కంపెనీలు నమ్మకాన్ని చాటినట్టు జియో ఓ ప్రకటనలో పేర్కొంది.

ఏపీలో 6 లక్షల కరోనా పరీక్షలు

దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చితే కరోనా పరీక్షల్లో ఏపీ ముందుంది. తాజాగా, కరోనా పరీక్షల్లో ఏపీ మరో మైలురాయిని దాటింది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు 13,923 శాంపిల్స్ పరీక్షించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 6,12,397కు చేరింది. ప్రతి పది లక్షల మందికి సగటున 11,468 పరీక్షలు నిర్వహించడం ద్వారా ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. ఏపీలో మరణాల రేటు కూడా తగ్గింది. దేశవ్యాప్తంగా మరణాల రేటు 3.33 శాతంగా ఉంటే, ఏపీలో మాత్రం 1.23 శాతంగా ఉంది. గురువారం, కృష్ణా జిల్లాలో కరోనాతో ఇద్దరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 92కి చేరింది. కొత్తగా 425 మందికి కరోనా పాజిటివ్ అని తేలడంతో.. మొత్తం‌ కేసుల సంఖ్య 7,496కు చేరింది. ఇందులో 5,854 కేసులు ఏపీవి కాగా.. 1,353 కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు, 289 కేసులు విదేశాల నుంచి వచ్చినవారివి ఉన్నాయి. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,632గా ఉంది.

చైనాకు షాక్ ఇవ్వడానికి సిద్దమైన భారత్ 

భారత్ చైనా సరిహద్దులోని గాల్వన్ లోయ ప్రాంతంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి మన సైనికులు 20 మందిని చైనా బాలి తీసుకున్న నేపథ్యంలో దేశంలో ఆగ్రహం పెల్లుబుకుతోంది. దీని పై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రజలు ముక్త కంఠంతో కోరుతున్నారు. చైనాకు అర్ధమయ్యే భాషలోనే మన దేశం జవాబివ్వాలని ప్రజలందరూ కోరుతున్నారు. తాజాగా "బాయ్ కాట్ చైనా" నినాదం అటు సోషల్ మీడియాలోనూ ఇటు పబ్లిక్ లోను జోరుగా వినిపిస్తోంది. చైనాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ఆ దేశ ఉత్పత్తులను పూర్తిగా బహిష్కరించాలన్న డిమాండ్ ప్రజల నుండి బలంగా వినిపిస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేయడం మొదలు పెట్టింది. చైనాను ఆర్ధికంగా దెబ్బ తీసేలా కేంద్రం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంట్లో భాగంగా చైనా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను భారీగా పెంచాలని కేంద్ర ఆర్థిక శాఖ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయమై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ శాఖల మంత్రులు, అధికారులతో చర్చలు జరిపినట్లుగా సమాచారం. ఈ సంప్రదింపుల పూర్తైన తర్వాత ఆర్థిక మంత్రి ఆ ప్రతిపాదనలను ప్రధాని నరేంద్ర మోదీ ముందుకు తీసుకు వెళ్లి ఈ విషయంలో ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేంద్ర ప్రభత్వ రంగం లోని అన్ని శాఖలు తమ పరిధిలో చైనా ఉత్పత్తుల వినియోగాన్ని వీలైనంతగా తగ్గించాలని ఒక నిర్ణయానికి వచ్చాయని సమాచారం. అదే సమయంలో దాదాపు 300 రకాల చైనా ఉత్పత్తులపై కస్టమ్స్, దిగుమతి సుంకాలను భారీగా పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో కరోనా సంక్షోభం నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దేశ పారిశ్రామిక రంగానికి చైనా ఉత్పత్తుల అవసరం కూడా ఉంది. వీటిపై ఇంపోర్ట్ డ్యూటీలను పెంచడం ద్వారా దాని ప్రభావం దేశ పారిశ్రామిక రంగంపై ఎంతవరకు ఉండొచ్చన్న అంశాన్ని కూడా అనలైజ్ చేస్తున్నారు. కొన్ని ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను పెంచితే మోడీ బ్రెయిన్ చైల్డ్ అయిన ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రోగ్రాం పై కూడా దెబ్బ పడొచ్చని కొంత మంది పారిశ్రామిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం.

కరోనా వ్యాక్సిన్ పై గుడ్ న్యూస్.. మనుషుల పై ట్రయల్స్ షురూ

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఐతే ఇప్పటివరకు ఒక మందు కానీ, వ్యాక్సిన్ కానీ రెడీ కాలేదు. ఐతే వీటిని తయారు చేయడానికి ఎన్నో దేశాలు, సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి కానీ ఇంతవరకు ఎవరు సక్సెస్ కాలేదు. తాజాగా ఇదే విషయమై రష్యా ఒక మంచి వార్త చెప్పింది. కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగ పరీక్షలను త్వరలో ప్రారంభించనున్నట్లు రష్యా ఆరోగ్య శాఖ ప్రకటించింది. మాస్కోకు చెందిన గమలేయ అనే పరిశోధన సంస్థ తాజాగా అభివృద్ధి చేసిన రెండు రకాల టీకాలును వాలంటీర్లను రెండు గ్రూపులుగా 38 మంది చొప్పున విభజించి వారి పై ప్రయోగించనున్నట్లు తెలిపింది. కరోనా వైరస్‌ వ్యాక్సిన్ యొక్క భద్రత, సామర్థ్యాన్ని పరీక్షించేందుకు కొంత మంది మిలటరీ సిబ్బంది, పౌరులను రష్యా ఎంపిక చేసింది. వీరికి గురు, శుక్రవారాలలో కరోనా లిక్విడ్‌ వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నట్లు రష్యా అధికారులు తెలిపారు. ఈ వ్యాక్సిన్‌ తీసుకున్న వారిని 21 రోజుల వరకు మాస్కోలోని కొన్ని ఎంపిక చేసిన ఐసోలేషన్‌ కేంద్రాల్లో ఉంచి ప‌రీక్ష‌లు చేస్తామ‌ని ఆ శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు.

ఏపీలో పరిస్థితుల పై మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు 

ఏపీలో వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో దళితులు, బీసీలపై జరుగుతున్న దాడులు, పౌరహక్కులకు భంగం కలిగిస్తున్న సంఘటనల పై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ రోజు గుంటూరు లో మీడియాతో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా తాము పోరాటం చేస్తామని అన్నారు. గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడును కలవడానికి అనుమతి లేకపోవడంతో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను కలిసి అచ్చెన్న ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నామని రామానాయుడు అన్నారు. ఆపరేషన్ జరిగి 24 గంటలు కూడా గడవకుండానే ఆయను కారులో కూర్చోబెట్టి 6 వందల కి.మీ. ప్రయాణం చేయించడంతో మళ్ళీ బ్లీడింగ్ అవుతోందని, కంట్రోల్ కావడంలేదని చెప్పారని, దానితో నిన్న మళ్లీ ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని డాక్టర్లు చెప్పారన్నారు. ప్రస్తుతం అచ్చెన్న ఆరోగ్యం నిలకడగానే ఉందని సూపరింటెండెంట్‌ చెప్పారని తెలిపారు. బీసీ నేత అయిన అచ్చెన్నను వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసిందని రామానాయుడు అన్నారు.

జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్ ‌రెడ్డిల‌ బెయిల్ పిటిషన్ తిరస్కరణ

జేసీ ట్రావెల్స్‌ ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసులో జూన్ 13న అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి ల బెయిల్‌ పిటిషన్‌ను గురువారం కోర్టు తిరస్కరించింది. ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌ రెడ్డిలను రెండు రోజులు పోలీస్‌ కస్టడీకి అనుమతించింది. వీరిపై మరో ఐదు కేసుల్లో పీటీ వారెంట్లు జారీ అయ్యాయి.  కాగా, బీఎస్ 3 వాహనాలను కొనుగోలు చేసి తప్పుడు ఇన్‌వాయిస్‌లతో ఆ వాహనాలను బీఎస్‌ 4 వాహనాలుగా రిజిస్ట్రేషన్‌ చేయించారన్న ఆరోపణలతో పాటు, 154 వాహనాలకు నకిలీ ఇన్సూరెన్స్‌ సర్టిఫికేట్లు సమర్పించినట్టు ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఫోర్జరీ కేసులో గత శనివారం వారిని హైదరాబాద్‌లో అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి అనంతపురం తరలించి, వైద్య పరీక్షలు నిర్వహించి జడ్జి ముందు హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు. మొదట అనంతపురం జైలుకు తరలించాలని భావించినప్పటికీ, అక్కడ కరోనా మహమ్మారి భయంతో సూపరింటెండెంట్ అనుమతి ఇవ్వకపోవడంతో కడప జైలుకు తరలించారు. ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి ఆన్‌లైన్‌లో బెయిల్ పిటిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ పిటిషన్ పై గురువారం న్యాయమూర్తి విచారించారు. అయితే బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో ఇద్దరికీ నిరాశ తప్పలేదు.

లోకేష్ ప్రోత్సాహంతోనే మంత్రులపై దాడి

ఏపీ శాసనమండలిలో అధికార విపక్షాల మధ్య యుద్ధం మాటలు దాటి ఒకరిపై ఒకరు చెయ్యి చేసుకునే స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. మండలిలో ఉద్రిక్తతలకు మీరు కారణమంటే, మీరు కారణమంటూ అధికార విపక్ష నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా, ఈ అంశంపై స్పందించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు.. మండలిలో ఘర్షణకు టీడీపీ నేత నారా లోకేష్ కారణమని ఆరోపించారు. లోకేష్ నిబంధనలకు విరుద్ధంగా సభలో ఫొటోలు తీశాడని, ఎవరు చెప్పినా వినిపించుకోలేదని మంత్రి తెలిపారు. మండలి చైర్మన్ కూడా చెప్పారని, అయినప్పటికీ లోకేష్ ఫొటోలు తీశారని ఆరోపించారు. దాంతో తాను జోక్యం చేసుకుని ఫొటోలు తీయొద్దంటూ లోకేష్ కి చెప్పానని అన్నారు. అయితే, టీడీపీ ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర, దీపక్ రెడ్డి తనపై దాడి చేశారని, అందుకు లోకేష్ ప్రోత్సాహం ఉందని మంత్రి వెల్లంపల్లి ఆరోపించారు. ఇతర మంత్రులు గౌతమ్ రెడ్డి, కన్నబాబులపై కూడా దాడి జరిగిందని పేర్కొన్నారు. లోకేష్ తీరు చూస్తుంటే సిగ్గేస్తోందని, తాము ప్రజల కోసమే పనిచేస్తున్నామని, అందుకే ఇలాంటి దాడులను భరిస్తున్నామని మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యానించారు.

నిమ్మగడ్డ వ్యవహారం.. సుప్రీంకోర్టు మళ్లీ అదే మాట

ఏపీ ప్రభుత్వం ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఎటువంటి పరిస్థితుల్లోనూ బాధ్యతలు అప్పగించకుండా ఉండడానికి విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉంది. నిమ్మగడ్డకు తిరిగి బాధ్యతలు అప్పగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు పై స్టే కోసం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించగా కోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. ఐతే ఇదే విషయమై మరోసారి ఏపీ ఎలక్షన్ కమిషన్ కార్యదర్శి ద్వారా పిటిషన్ వేయించింది. తాజాగా దీని పై సిజెఐ తో కూడిన ధర్మాసనం సుప్రీం కోర్టు లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు పై స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ ప్రతి వాదులకు మాత్రం నోటీసులు జారీ చేసింది. ఆదే సమయంలో ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ తో కలిపి విచారణ చేపడతామని తెలిపింది. ఇప్పటికే హైకోర్టు తీర్పులో ఉన్న సాంకేతిక అంశాల ఆధారంగా గతంలో నిమ్మగడ్డ నియామకమే చెల్లదని సుప్రీం కోర్టులో ఏపీ సర్కార్ వాదించింది.

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం విడుదల చేశారు. మొత్తం 9,65,839 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈ పరీక్షల ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది.  ఫస్టియర్ లో 4,80,516 మంది విద్యార్థులు హాజరు కాగా, 60.01 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 75 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్ జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా,  71 శాతం ఉత్తీర్ణతతో రంగారెడ్డి, కుమ్రంభీం జిల్లాలు రెండో స్థానంలో నిలిచాయి. ఫస్టియర్ లో బాలికల ఉత్తీర్ణత శాతం 67.4 కాగా, బాలుర ఉత్తీర్ణత శాతం 52.30 గా నమోదైంది. సెకండియర్ లో 4,85,323 మంది విద్యార్థులు హాజరు కాగా, 68.86 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 76 శాతం ఉత్తీర్ణతతో కుమ్రంభీం ప్రథమ స్థానంలో నిలబడింది. 75 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్ జిల్లా రెండో స్థానం దక్కించుకుంది. సెకండియర్ లో బాలికల ఉత్తీర్ణత శాతం 75 కాగా, బాలుర ఉత్తీర్ణత శాతం 62 గా నమోదైంది.

భారత్ ని లెక్కచేయని నేపాల్.. కొత్త మ్యాప్‌కు ఏకగ్రీవ ఆమోదం

కొత్త మ్యాప్‌కు నేపాల్ పార్లమెంట్ ఎగువ సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. భారత భూభాగాలైన కాలాపానీ, లిపులేఖ్, లింపియాధూరా ప్రాంతాలు తమ దేశ సరిహద్దులోకి వస్తాయంటూ నేపాల్ వివాదం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాంతాలు భారత్ కు మిలిటరీ పరంగా ఎంతో కీలకమైనవి. ఈ భూభాగాలపై నేపాల్‌కు ఎటువంటి అధికారం లేదంటూ భారత్ స్పష్టం చేస్తున్నప్పటికీ నేపాల్ వెనక్కి తగ్గడం లేదు. ఈ ప్రాంతాలను కొత్త మ్యాప్ లో నేపాల్ చేర్చింది. భారత్ పెడుతున్న అభ్యంతరాలను సైతం లెక్కచేయకుండా ముందుకెళ్తోంది. గత శనివారం ఈ మ్యాప్ కు ఆ దేశ పార్లమెంటులోని దిగువసభ ఆమోదముద్ర వేసింది. ఇప్పుడు ఎగువసభ కూడా ఆమోదం తెలిపింది. ఎగువసభలో ఉన్న సభ్యులు 57 మంది ఏకగ్రీవంగా ఓటు వేయడంతో ఈ బిల్లు ఆమోదం పొందింది. దీంతో కొత్త మ్యాప్‌కు 90 శాతం చట్టబద్ధత లభించినట్లైంది. ఆమోదం పొందిన బిల్లును పార్లమెంట్ దేశాధ్యక్షుడికి పంపనుంది. ఆయన ఆమోదముద్ర వేస్తే అధికారికంగా ఇది అమల్లోకి వస్తుంది.

చైనాకు బుద్ధి చెప్పే నాయకుడు ఈ ప్రపంచంలో లేడు: కేఏ పాల్

భారత్-చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై కేఏ పాల్ స్పందించారు. చైనా గురించి తాను ఫిబ్రవరిలోనే చెప్పానని, మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని ముందే చెప్పానని అన్నారు. కరోనా వైరస్‌ను వ్యూహన్ ల్యాబ్ నుంచి చైనా ఉద్దేశపూర్వకంగా పంపించిందని, ఈ విషయం ముందు చెప్పింది తానేనని అన్నారు. చైనా కరోనా వైరస్ ద్వారా ప్రపంచానికి తీవ్ర నష్టం కలిగించిందని పాల్ ఆరోపించారు. చైనాకు శాంతి అక్కర్లేదని, వాళ్లు యుద్ధాన్నే కోరుకుంటారని వ్యాఖ్యానించారు. ఇవాళ 20 మంది భారత సైనికులు చనిపోయారంటే కారణమేంటని ప్రశ్నించారు. చైనాకు బుద్ధి చెప్పే నాయకుడు ప్రపంచంలో లేకపోవడమే అనేక సమస్యలకు కారణమవుతోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి సరిగా లేదని, ఆయన చైనాతో తెరవెనుక వ్యాపారాలు చేస్తున్నారని పాల్ ఆరోపించారు. ట్రంప్ చైనా సహాయం కోరుతున్నారని తాను ఎప్పట్నించో చెబుతున్నానని, అలాగే రష్యా మద్దతు కూడా ఆయన తీసుకుంటున్నారని పాల్ వ్యాఖ్యానించారు.

నిన్ను నమ్మి 16 నెలలు చిప్పకూడు తిన్న జగన్ రెడ్డి తింగరి మాలోకం

ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటూ నిత్యం చంద్రబాబు, లోకేష్ లపై సెటైర్లు వేసే ఎంపీ విజయసాయి రెడ్డి తాజాగా లోకేష్ ను టార్గెట్ చేసారు. పోలీసులు అరెస్ట్ చేసిన జెసి ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి సంఘీభావాన్ని తెలిపేందుకు లోకేష్ తాడిపత్రి వెళ్లిన విషయం తెలిసిందే. ఐతే ఇదే విషయమై ఎంపీ విజయ్ సాయి రెడ్డి లోకేష్ ను టార్గెట్ చేస్తూ తనదైన స్టైల్ లో లోకేష్ పై పంచులు వేశారు. నారా లోకేష్ తిండి ప్రియుడంటూ తెలుగు తమ్ముళ్లే చెవులు కొరుక్కుంటున్నారంటూ ఆయన ట్వీట్ చేసారు. "తాడిపత్రి వచ్చి ఏం ఇరగదీశాడని ఆ పార్టీ కార్యకర్తలే విసుక్కుంటున్నారంట. 16 రకాల వంటకాలు చేయించుకుని సుష్టుగా భోంచేసి చెక్కేశాడని తెలుగు తమ్ముళ్లు తిట్టుకుంటున్నారు. పేరుకే పరామర్శలు, పలకరింపులు. టేస్టీ ఫుడ్ దొరుకుతుందంటే ఎంత దూరమైనా వెళ్లొస్తాడు మాలోకం" అంటూ ట్వీట్ చేసారు. తాజాగా దీని పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అంతే ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఎంపీ విజయసాయి రెడ్డికి బుద్ధా వెంకన్న స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కార్యకర్తల కోసం లోకేష్ ఎంత దూరం అయినా వెళ్లడం చూసి వణుకుతున్నావ్ ఏంటి ఎంపీ విజయసాయి రెడ్డి గారు. తాడిపత్రి లో లోకేష్ తనతో పాటు తెచ్చుకున్న క్యారేజ్, అది కూడా డైటింగ్ లో భాగమైన ఆకుకూరల భోజనం చేశారు. దీనిని కూడా రాజకీయం చెయ్యాలి అని చూస్తున్నారు చూడు అది మీ తింగరి మాలోకం వైఎస్ జగన్ రేంజ్ అని లోకేష్ జరిపిన తాడిపత్రి పర్యటనపై వివరణ ఇచ్చారు. "మీ తింగరి మాలోకం అవినీతి సొమ్ము బొక్కడానికి తండ్రి శవాన్ని తాకట్టు పెట్టి సీఎం అవ్వాలి అనుకున్నాడు. ఓదార్పు అంటూ శోకాలు పెట్టి, పాదయాత్ర అంటూ మైన్స్, ల్యాండ్స్ పై కన్నేసాడు. అవినీతి సొమ్ము మేసి జైలుకైనా పోవడానికి సిద్ధం అనేది గన్నేరు పప్పే'' అంటూ మరో ట్వీట్ ద్వారా బుద్దా మండిపడ్డారు. ''43 వేల కోట్ల దోపిడీ కేసులో ఏ1, ఏ2ల‌ బెయిల్ కోసం నువ్వూ, గ‌నుల కేసులో గాల‌న్న‌య్య జ‌డ్జిల‌నే కొనాల‌నుకుని అడ్డంగా బుక్కైన విషయం మ‌రిచిపోయారా విజయసాయి రెడ్డి.. తాజాగా ఒక లాయర్ కి 5 కోట్లిచ్చిన సంగ‌టేంటి.. మీరు ఎంత పెద్ద లాయర్ కి అడ్వాన్స్ ఇచ్చినా శుక్రవారం నుండి ఉపశమనం దక్కడం లేదు పాపం'' అంటూ ఎద్దేవా చేశారు. అడ్డదారులు తొక్కి, అడ్డమైన రాతలు రాసి జగన్ ని జైలు కి పంపిన మీరు మాలోకం అనే విషయం గుర్తించకపోవడం శోచనీయం విజయసాయి రెడ్డి. నిన్ను నమ్మి క్విడ్ ప్రో కో, సూట్ కేసు కంపెనీలు, మనీ లాండరింగ్ కి పాల్పడి 16 నెలలు చిప్పకూడు తిన్న జగన్ రెడ్డి తింగరి మాలోకం, గన్నేరు పప్పు అని ప్రపంచమంతా వినికిడి మీ చెవికి చేరలేదా లేక అది కూడా మీ స్కెచ్ లో భాగమేనా'' అని జగన్, విజయసాయి రెడ్డిలపై విరుచుకుపడుతూ వెంకన్న ట్వీట్ చేశారు.

ఏడాది పాటు ఘనంగా పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు: సీఎం కేసీఆర్

మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించారు. పీవీ పుట్టిన రోజైన జూన్ 28 నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. దేశ ప్రధానిగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా, విద్యావేత్తగా, సాహితీ వేత్తగా పీవీ నరసింహారావు బహువిధాలుగా సేవలు అందించారని సీఎం అన్నారు. అంత గొప్ప వ్యక్తి తెలంగాణ వాడు కావడం రాష్ట్ర ప్రజలకు గర్వకారణమని సీఎం అన్నారు. ఆయన సేవలను ఘనంగా స్మరించుకోవడానికి శతజయంతి వేడుకలను గొప్పగా నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. పీవీ మన ఠీవీ అని గొప్పగా చెప్పుకునే విధంగా ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల నిర్వహణ కోసం ఎంపీ కె. కేశవరావు ఆధ్వర్యంలో కమిటీని సీఎం నియమించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, పీవీ కుమారుడు పీవీ ప్రభాకర్ రావు, కుమార్తె శ్రీమతి వాణీదేవి, మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. పీవీతో కలిసి పనిచేసిన వారు, ఆయనతో అనుబంధం కలిగిన వారు, ఆయన అభిమానులను సంప్రదించి, ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన కార్యక్రమాల రూపకల్పన జరగాలని సీఎం కమిటీని కోరారు.