క‌రోనా ఉగ్ర‌రూపం.. ఒక్కరోజులో 16 వేల కేసులు.. ఎమ్మెల్యే మృతి

భారత్ లో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటలలో15,968 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,56,183 కు చేరింది. గత 24 గంటలలో కరోనాతో 465 మంది మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 14,476కు చేరింది. ఇప్పటివరకు 2,58,685 మంది క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్ర‌స్తుతం 1,83,022 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీ ఎమ్మెల్యే తమోనాష్ ఘోష్ కరోనాతో బుధవారం ఉదయం మరణించారు. టీఎంసీ కోశాధికారి, మూడుసార్లు ఎమ్మెల్యే అయిన తమోనాష్ ఘోష్ తమను వీడి పోవడం తీవ్ర విషాదం నింపిందని పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ ట్వీట్ చేశారు. 35 ఏళ్లపాటు ప్రజల కోసం పనిచేసిన తమోనాష్ ఘోష్ తమను వీడిపోవడం తీవ్ర విచారం కలిగించిందని పేర్కొన్నారు.

కరోనా కు వ్యాక్సిన్ అవసరమే రాదు... ఇవిగో ప్రూఫ్స్

కరోనా తో ప్రపపంచం అతలాకుతలం అవుతోంది. భారత్ లో ఐతే కరోనా కేసులు రోజుకు 15 వేలు పైగా నమోదవుతున్నాయి. కరోనా బాధితులకు చికిత్స అందించే వైద్యులను, ఇటు పోలీస్ డిపార్ట్ మెంట్ ను కూడా కరోనా చుట్టేస్తోంది. ఇక సామాన్య జనం ఐతే వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇటలీ శాస్త్రవేత్తలు అందరికి ఊరటనిచ్చే చల్లని కబురు చెపుతున్నారు. స్వైన్ ఫ్లూ, ఎబోలా, సార్స్, మెర్స్ వైరస్‌లు మనపై దాడి చేసి కొంతకాలానికి వాటంతట అవే కనుమరుగయ్యాయి. ఆ వైరస్ ల దారిలోనే కరోనా కూడా చేరుతుందని వారు తెలిపారు. ప్రస్తుతానికి కరోనా వైరస్ పది ప్రధాన దేశాల్లో అత్యంత ప్రమాదకరంగా ఉంది. మిగిలిన దేశాల్లో మాత్రం కేసులు తగ్గుతున్నాయి. ఐతే భారత్, రష్యా, అమెరికా, బ్రెజిల్ వంటి దేశాలలో కరోనా తీవ్రంగా పెరుగుతున్నట్టు తాజా గా అందుతున్న లెక్కలను బట్టి తెలుస్తోంది. ఐతే దీని పై ఇండియా, ఇటలీలో శాస్త్రవేత్తలు లోతైన అధ్యయనం చేసినట్లుగా తెలుస్తోంది. ఆ శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం కరోనా వైరస్‌కి అసలు వ్యాక్సిన్ అవసరం రాకపోవచ్చని ఇటలీ కమ్యునికబుల్ డిసీజెస్ స్పెషలిస్ట్ మ్యాటియో బసెట్టి అంటున్నారు. అయన తెలిపిన వివరాల ప్రకారం ఫిబ్రవరి, మార్చి తో పోల్చితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ చాలా బలహీనపడిందని అంటున్నారు. వైరస్ వ్యాప్తి ఐతే జోరుగా ఉంది గానీ వైరస్ మాత్రం ఇదివరకటి అంత ప్రాణాంతకంగా లేదని చెప్తున్నారు. మార్చి, ఏప్రిల్ కాలంలో కరోనా బాధితుల నుండి సేకరించిన శాంపిల్స్‌లో కరోనా చాలా తీవ్రంగా ఉన్నట్లు తేలింది. ఐతే ఇపుడు మాత్రం 80 నుంచి 90 ఏళ్ల వారు కూడా వెంటిలేటర్ సాయం లేకుండానే చికిత్స పొంది కరోనాను జయిస్తున్నారని ఆయన చెబుతున్నారు. ఇక భారత్ విషయానికి వస్తే జులై లో కరోనా కేసులు గరిష్ఠానికి చేరతాయని అంచనా వేస్తున్నారు. తరువాత ఆగస్టు నుంచి కేసులు తగ్గడం మొదలవుతుందని.. సెప్టెంబర్ నాటికి ఇండియాలో కూడా కరోనా పూర్తిగా తగ్గిపోతుందని టైమ్స్ ఫ్యాక్ట్ ఇండియా ఔట్ బ్రేక్ రిపోర్ట్ చెపుతోంది. ఈ సంస్థ మన కేంద్ర ఆరోగ్య శాఖ ఇస్తున్న లెక్కలు, శాస్త్రవేత్తల అంచనాల్ని లెక్కలోకి తీసుకొని ఈ రిపోర్ట్ తయారుచేసినట్లు తెలుస్తోంది. జులై 25 నాటికి భారత్ లో కరోనా కేసులు అత్యధిక స్థాయికి చేరతాయని ఈ రిపోర్ట్ సారాంశం. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కొత్త కేసుల కంటే రికవరీ ఐన కేసులు బాగా పెరుగుతున్నాయి. భారత్ లో కూడా రికవరీ అవుతున్నవారి సంఖ్య రోజురోజుకూ మెల్లగా పెరుగుతోంది. ఏది ఏమైనా ప్రపంచ శాస్త్రవేత్తలు చెప్పినట్లు వ్యాక్సిన్ తో పని లేకుండానే వైరస్ తగ్గిపోతే మానవాళికి అంతకంటే కావలసిందేముంది.

ప్రధాని వద్దకు వెళ్లి భారతరత్న ఇవ్వాలని విన్నవిస్తా: సీఎం కేసీఆర్

బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశానికి విభిన్న రంగాల్లో అందించిన విశిష్ట సేవలను గొప్పగా తలుచుకునే విధంగా, చిరస్మరణీయంగా నిలిచే విధంగా శత జయంతి ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఏడాది పొడవునా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ప్రగతి భవన్ లో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్ కె. కేశవరావు, మంత్రి ఈటల రాజెందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల నిర్వహణ సందర్భంగా ఏఏ కార్యక్రమాలు నిర్వహించాలనే విషయంలో సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం ఉత్సవాల నిర్వహణ సందర్భంగా చేయాల్సిన కార్యక్రమాలను నిర్దేశించారు. పీవీ జన్మదినమైన జూన్ 28న హైదరాబాద్ లోని పీవీ జ్ఞానభూమిలో ప్రధాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే రోజు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 దేశాల్లో పీవీ జయంతి వేడుకలు నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు. శత జయంతి ఉత్సవాల నిర్వహణకు తక్షణం రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. రాష్ట్ర అసెంబ్లీలో పీవీ చిత్ర పటాన్ని పెట్టాలని నిర్ణయించినట్టు సీఎం తెలిపారు. అలాగే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, వంగరతో పాటు ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో పీవీ విగ్రహాలు నెలకొల్పాలని, విగ్రహాల కోసం వెంటనే ఆర్డర్ ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. భారత పార్లమెంటులో కూడా పీవీ చిత్రపటం పెట్టాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోరతామన్నారు. ‘పీవీ నరసింహారావు దేశం గర్వించదగ్గ నాయకుడు. దేశ గతిని మార్చిన గొప్పవారు. భారతరత్న పురస్కారానికి సంపూర్ణ అర్హుడు. పీవీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంత్రివర్గం, అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంది. ప్రధాని వద్దకు నేనే స్వయంగా వెళ్లి భారతరత్న ఇవ్వాలని విన్నవిస్తా.’ అని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.  

నిమ్మగడ్డను కలిస్తే తప్పేంటి.. కామినేని సూటి ప్రశ్న

హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హోటల్ లో బీజేపీ నాయకులు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, తన పదవి కోసం కోర్టులో పోరాటం చేస్తున్న ఎన్నికల అధికారి రమేష్ కుమార్ రహస్య భేటీ ఎపి రాజకీయాలలో పెను తుఫాన్ సృష్టిస్తోంది. ఈ ముగ్గురు అంత రహస్యంగా కలవవలసిన అవసరం ఏంటి.. అసలు దీనికి సూత్రధరి చంద్రబాబు అంటూ వైసిపి నేతలు విరుచుకు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆ భేటీలో పాల్గొన్న మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు. తాను ఎన్నికల కమిషనర్ డాక్టర్ రమేష్ కుమార్ ను కలిస్తే తప్పేంటని ఈ సందర్బంగా అయన ప్రశ్నించారు. నిమ్మగడ్డ పదవి కాలాన్ని కుదించి ఆ పదవి నుండి ఆయనను కుట్రపూరితంగా తప్పించిందని దీనికి వ్యతిరేకంగా హైకోర్టులోను. సుప్రీం కోర్టులోనూ తాను పిటిషన్ వేశానని కామినేని గుర్తు చేసారు. బీజేపీ అధిష్టానం అనుమతితోనే తాను రాష్ట్ర ఎన్నికల సంఘం అంశం పై కోర్టులో సవాల్ చేసానని అన్నారు. ఇదే సందర్భంలో డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ ను తాను కలవడం తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. అదే సమయంలో తమ పార్టీకే చెందిన రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి కూడా వచ్చారని దీంట్లో తాము వివరణ ఇవ్వాల్సిన అవసరం ఏంటని కామినేని ప్రశ్నించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని కుట్రపూరితంగా పదవి నుండి తప్పించి, రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పినా లెక్క చేయకుండా మొండిగా వ్యవహరిస్తున్న వాళ్ళు సిగ్గుపడాలని ఆయన అన్నారు. ఈ నెల 11న సుప్రీంకోర్టు లో జరిగిన వాదనల లో రాష్ట్ర ప్రభుత్వం అడిగిన విధంగా డాక్టర్ రమేష్ కుమార్ కేసులో స్టే ఇచ్చేందుకు నిరాకరించినా రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఆయన విధుల్లో చేరకుండా అడ్డుకుంటోందని శ్రీనివాస్ అన్నారు. తనకు జరుగుతున్న అన్యాయాన్ని డాక్టర్ రమేష్ కుమార్ కోర్టులోనే ప్రస్తావించారని అందువల్ల తాము రహస్యంగా కలిసి చర్చించుకోవాల్సిన అవసరం ఏముంటుందని ఈ సందర్బంగా శ్రీనివాస్ ప్రశ్నించారు. డాక్టర్ రమేష్ కుమార్ ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా లేరని అందువల్ల ఆయన స్వయంగా వచ్చి కలవడంలో ఎలాంటి తప్పు లేదని కామినేని తెలిపారు.

ఏపీ డీజీపీకి మరో సారి హైకోర్టు పిలుపు...

చంద్రబాబు విశాఖ పర్యటన సందర్బంగా ఆయనను ఎయిర్ పోర్ట్ లోనే అడ్డుకోవడం పై వివరణ ఇచ్చేందుకు హైకోర్టు గతంలో ఒక సారి డిజిపిని తమ ఎదుట హాజరు కావాలని పిలిచి తమ ఎదుట సి ఆర్ పిసి 151 సెక్షన్ చదివి వినిపించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో కేసు విషయంలో ఎపి డిజిపిని తమ ముందు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది.  వివిధ కేసులకు సంబంధించి పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలను తమకు అప్పగించడం లేదని అనేకమంది వాహన దారులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ మధ్య కాలంలో అక్రమ మద్యం తరలింపు పేరుతో వేల సంఖ్యలో వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఏపీ ఎక్సైజ్‌ యాక్ట్ 34(ఏ) సెక్షన్‌ కింద కేసులు నమోదు చేసి స్వాధీనం చేసుకున్న వాహనాలను మేజిస్ట్రేట్‌ లేదా ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ ఎదుట హాజరు పరచాల్సి ఉంటుంది. అయితే పోలీసులు ఈ నిబంధనలను పక్కనపెట్టి పోలీస్ స్టేషన్లలోనే ఉంచడంతో అవి ఎండకు ఎండి, వానకు తడిసి పాడైపోతున్నాయి. దీంతో తమ వాహనాలను చట్టబద్ధంగా విడిపించుకునే ప్రయత్నం చేసినా పోలీసులు అంగీకరించడం లేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా నిబంధనల మేరకు తాము మూడు లేదా అంతకంటే తక్కువ మద్యం బాటిళ్లను తమ వాహనాల్లో తీసుకెళ్తున్నప్పటికీ పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారని పిటిషనర్లు వేర్వేరుగా పిటిషన్లు వేశారు.  దీని పై సోమవారం విచారం జరిపిన హైకోర్టు ఎక్సైజ్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 46, సీఆర్‌పీసీ సెక్షన్‌ 102 నిబంధనలు పాటించని సదరు అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి సంబంధించి డీజీపీ నుండి వివరాలు సేకరించి చెప్పాలని కేసును మంగళవారానికి వాయిదా వేసింది. ఈ రోజు జరిగిన విచారణలో ప్రభుత్వ న్యాయవాది ఆ వివరాలు చెప్పకపోవడం తో అహ్రాహించిన హైకోర్టు ధర్మానసం నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి బుధవారమే డీజీపీ హైకోర్టు ఎదుట హాజరు కావలసి ఉంది.

సీఎం జగన్‌ నోట కొత్త జిల్లాల ఏర్పాటు మాట

ఏపీలో జిల్లాల సంఖ్య పెరగనుందని తెలుస్తోంది. స్పంద‌క కార్య‌క్ర‌మంపై రివ్యూ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ సంద‌ర్భంగా సీఎం జగన్‌ నోట కొత్త జిల్లాల ఏర్పాటు మాట వచ్చింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేసే ఆలోచన ఉందని సీఎం తెలిపారు. సీఎం మాట‌ల‌ను బట్టి చూస్తే 13 జిల్లాల ఏపీ.. 25 జిల్లాలుగా మార‌బోతుంది. మరోవైపు, ఇప్ప‌టికే కొత్త జిల్లాల‌పై అధికారులు క‌స‌ర‌త్తులు ప్రారంభించారని తెలుస్తోంది. కొత్త జిల్లాల‌తో పాటే రెవెన్యూ డివిజ‌న్లు, కొత్త మండ‌లాల‌ను కూడా ప్ర‌క‌టించ‌బోతున్నారని సమాచారం. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో కొలువుదీరిన టీఆర్ఎస్ సర్కార్ పది జిల్లాలను కాస్తా 33 జిల్లాలుగా విభజించిన విషయం తెలిసిందే. ఏపీలో కూడా వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త జిల్లాల ఏర్పాటుపై దృష్టి సారించింది. కొత్త జిల్లాల ఏర్పాటు పై గతంలోనే సీఎం జగన్ అధికారులతో చర్చించిన సందర్భాలు ఉన్నాయి. కానీ, వివిధ కారణాల చేత ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయాన్ని తీసుకోలేకపోయింది. అయితే, తాజాగా కొత్త జిల్లాల అంశాన్ని జగన్ మరోసారి ప్రస్తావించడంతో.. ఈ అంశం తెరపైకి వచ్చింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.

ఆ రహస్య భేటీకి చంద్రబాబే సూత్రధారి!!

నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌తో బీజేపీ నేతలు కామినేని శ్రీనివాస్‌, సుజనా చౌదరి రహస్యంగా భేటీ కావడంపై వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. ముగ్గురు కలిసి ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నిమ్మగడ్డ దుర్మార్గపు మనస్తత్వం ఈ భేటీతో బయటపడిందని విమర్శించారు. తప్పుడు పనులు చేస్తున్న నిమ్మగడ్డను తక్షణమే అరెస్ట్ చేసి విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. సుజనా, కామినేని బీజేపీలో ఉంటూ టీడీపీ కోసం పని చేస్తున్నారని విమర్శించారు. ఈ రహస్య భేటీకి చంద్రబాబే సూత్రధారని.. చంద్రబాబు, నిమ్మగడ్డ కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ ముగ్గురి రహస్య భేటీపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిమ్మగడ్డ బండారం బయట పెట్టేందుకు ఎంత దూరమైన వెళ్తామని అంబటి రాంబాబు చెప్పారు.

పార్క్ హయత్ లో కమ్మనైన ప్రజాస్వామ్యం.. క‌ల‌లోనూ క‌మ్మ‌నైన క‌ల‌వ‌రింతే

హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్ లో బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ లతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ రహస్య భేటీ అయ్యారనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. 'పార్క్ హయత్ లో కమ్మనైన ప్రజాస్వామ్యం' అంటూ పరోక్షంగా కుల ప్రస్తావన తీసుకొస్తూ ట్వీట్ చేశారు. "పార్క్ హయత్ లో కమ్మనైన ప్రజాస్వామ్యం. దుష్ట చతుష్టయంలో ముగ్గురు దొంగలు అడ్డంగా దొరికారు. ఫేస్ టైం లో మాట్లాడిన నాలుగో బిగ్ బాస్ ఎవరు? మరిన్ని వివరాలు అతి త్వరలో..." అంటూ విజయసాయి ట్వీట్ చేశారు. అయితే, విజయసాయి ట్వీట్ కు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. క‌మ‌లం అనే ధైర్యం విజయసాయికి లేదని ఎద్దేవా చేశారు. "శ‌కుని మామా! నీ అల్లుడు వైఎస్ జగన్ స్వామ్యంలో రాజారెడ్డి రాజ్యాంగం ప్ర‌యోగించి తొల‌గించిన ఎస్ఈసీని చేర్చుకోవాల‌ని కోర్టు ఆదేశించినా ప‌ట్టించుకోకుండా, ఇప్పుడాయ‌న ఎవ‌రితో క‌లిస్తే నీకేంటి?" అని బుద్ధా ప్రశ్నించారు.  "క‌ల‌లోనూ క‌మ్మ‌నైన క‌ల‌వ‌రింతే కానీ! క‌మ‌లం అనే ప‌దం ప‌ల‌కాల‌న్నా వ‌ణుకెందుకో? ఢిల్లీ బాస్ అనే దమ్ము లేదా?" అని బుద్ధా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

గ్యాంగ్ స్టర్ న‌యీం కేసులో కీలక మలుపు

గ్యాంగ్ స్టర్ నయీంతో సంబంధం ఉన్న అధికారులకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఎన్ కౌంటర్ లో నయీం హతమై చాలా కాలమవుతున్నప్పటికీ.. ఈ కేసులో ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం తెరపైకి వస్తూనే ఉంది. నయీంతో పోలీసులు, రెవెన్యూ అధికారుల సంబంధాలపై ఫోరమ్‌ ఫర్ గుడ్‌ గవర్నెన్స్.. లోక్‌పాల్‌లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధ‌మైంది. ఇప్పటికే ఆర్.టి.ఐ చట్టం ద్వారా పోలీసు, రెవెన్యూ అధికారుల పాత్రపై పూర్తి ఆధారాలు సేకరించింది. నయీంతో పోలీస్, రెవెన్యూ అధికారులు దిగిన ఫొటోలను, వీడియో సాక్ష్యాలను లోక్‌ పాల్‌కు సమర్పించనుంది. నయీంతో కలిసి అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని, వారి పాత్రపై విచారణ జరపాలని లోక్ పాల్ ను కోరనుంది. దీంతో, పలువురి అధికారుల జాతకాలు బయటపడే అవకాశముంది.

గుడ్ న్యూస్.. వెనక్కి తగ్గిన చైనా

భారత్-చైనా సరిహద్దులో శాంతియుత వాతావరణం నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్-చైనా లెఫ్టెనెంట్ జనరల్ స్థాయి చర్చలు సఫలమయ్యాయి. వాస్తవాధీన రేఖకు చైనా వైపున ఉన్న మోల్డోలో సోమవారం 12 గంటల పాటు లెఫ్టెనెంట్ జనరల్ స్థాయి చర్చలు జరిగాయి. భారత్ తరపున లెఫ్టెనెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనా తరపున లిన్ లియు చర్చల్లో పాల్గొన్నారు. తూర్పు లదాఖ్‌లోని వివాదాస్పద ప్రాంతాల నుంచి సైనికులను వెనక్కి తీసుకునేందుకు ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని తెలుస్తోంది. గల్వాన్‌ లోని 14, 15, 17 పాయింట్లనుంచి తమ బలగాలను వెనక్కు తీసుకునేందుకు చైనా అంగీకరించిందని సమాచారం. చర్చలు మరోమారు జరిగే అవకాశం ఉంది.  నిజానికి, జూన్ 6న ఇరు దేశాల మధ్య లెఫ్టెనెంట్ జనరల్ స్థాయి చర్చలు జరిగినప్పుడే గల్వాన్ లో సైన్యాలను ఉపసంహరించుకునేందుకు ఇరు దేశాలు ఒక అవగాహనకు వచ్చాయి. కానీ ఆ ఒప్పందాన్ని బేఖాతరు చేస్తూ వాస్తవాధీన రేఖ వెంబడి చైనా టెంట్లను నిర్మించడంతో ఘర్షణ తలెత్తింది. ఇరు దేశాల మధ్య తలెత్తిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు, 40 మందికి పైగా చైనా సైనికులు మృతి చెందారు.

ఏపీలో రాజకీయ దుమారం.. ముగ్గురు వీఐపీల రహస్య భేటీ.. సీసీ టీవీ ఫుటేజ్ లీక్

ఏపీలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, జగన్ సర్కార్ మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ.. బీజేపీ నేతలతో రహస్య భేటీ అయ్యారన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ తో నిమ్మగడ్డ రహస్యంగా భేటీ అయిన సీసీ టీవీ ఫుటేజ్ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ నెల 13న హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో సుమారు గంటసేపు వీరి రహస్య భేటీ జరిగినట్టు తెలుస్తోంది. ఎన్నికల సంఘం వివాదం నడుస్తుండగా ఈ ముగ్గురు రహస్యంగా సమావేశమవ్వడం.. చర్చనీయాంశంగా మారింది. అసలు ఆ భేటీలో ఏం చర్చించారు? నిమ్మగడ్డకు బీజేపీ అండగా నిలుస్తుందా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, పార్క్ హయత్ లాంటి హోటల్‌లో జరిగిన రహస్య భేటీకి సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్ బయటకు రావడం కూడా పలు అనుమానాలకు దారితీస్తుంది. ఎవరో కావాలనే సీసీ టీవీ ఫుటేజ్‌ను బయటపెట్టారన్న వాదనలు విపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ భేటీ రాజకీయంగా తీవ్ర దుమారాన్ని లేపే అవకాశముంది.

కరోనా ఖతం.. రాందేవ్ బాబా పతంజలి మందు వచ్చింది...

కరోనా వైరస్ కు పతంజలి సంస్థ ఆయుర్వేద మందు తీసుకొచ్చింది. 'కోరోనిల్' పేరుతో మార్కెట్‌లో ఈ ఆయుర్వేద మందును రాందేవ్ బాబా విడుదల చేశారు. ఈ మందును తీసుకురావడంలో కృషి చేసిన శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు. ప్రపంచమంతా కరోనాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ కరోనాకు మందు తీసుకురావడం ముఖ్యమైన ప్రక్రియ అని చెప్పారు. ఆయుర్వేదంతో కరోనాను నయం చేయొచ్చని అన్నారు. క్లినికల్ కేసులను క్షుణ్ణంగా పరిశీలించాకే ఈ మందును తీసుకొచ్చామని రాందేవ్ బాబా చెప్పారు. 'కోరోనిల్' మందు ద్వారా 5 నుంచి 14 రోజుల్లో కరోనాను నయం చేయొచ్చని పతంజలి సంస్థ పేర్కొంది. 

అమరావతి పై జగన్ మరో కొత్త డ్రామా.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్

కొద్ది రోజులుగా ఏపీలో వైసిపి ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో కొంత హడావిడి చేస్తున్న సంగతి తెలిసిందే. రాజధాని మార్పు ఇప్పట్లో ఉండదని రెవెన్యూ మంత్రి పెద్దిరెడ్డి చెప్పిన మర్నాడే సీనియర్ మంత్రి బొత్స ఇప్పటికే నిర్మాణం పూర్తైన, మరి కొంత పని పెండింగ్ లో ఉన్న భవనాలను సందర్శించారు. దీంతో అమరావతి విషయంలో అసలు ప్రభుత్వ ఆలోచన ఏంటి అనే విషయం అర్ధం కాక అటు విశ్లేషకులు ఇటు ప్రజలు జుట్టు పీక్కునే పరిస్థితి నెలకొంది. ఐతే ఇదే విషయం పై కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి జగన్ సర్కార్ పై ఫైర్ అయ్యారు. కోర్టులలో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్న నేపథ్యంలో అసత్యాలతో సీఎం జగన్ కాలం గడుపుతున్నారని అన్నారు. ఈ రోజు రాష్ట్రం లో పోలీస్ రాజ్యం నడుస్తోందని అన్నారు. పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని రాష్ట్రంలోని వివిధ రంగాల ప్రజల నుండి హోమ్ శాఖ సహాయ మంత్రిగా ఉన్న తనకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయని అయన అన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఇంకో పార్టీలో చేరితే కష్టం.. పార్టీ ప్రదర్శనలో పాల్గొంటే కష్టం అన్నట్టుగా పరిస్థితి ఉందన్నారు. ఈ పద్ధతులు మంచివి కాదని అయన అన్నారు. అంతే కాకుండా వైసిపి ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఏపీలో మద్యం మాఫియా, ఇసుక మాఫియా పురుడు పోసుకుంటున్నాయని అయన తీవ్ర విమర్శలు చేశారు. ఇదే సందర్భం లో అమరావతి విషయం లో జగన్ సర్కారు డ్రామా ఆడుతోందని కిషన్ రెడ్డి విమర్శించారు.

జగన్ గారి చెత్త పాలన గురించి వైసీపీ నేతల వ్యాఖ్యలు.. వారిని కూడా సీఐడీ అరెస్ట్ చేస్తుందా?

ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విశాఖలో టీడీపీ సానుభూతిపరుడు నలంద కిషోర్‌ను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల క్రితమే ఆయనకు నోటీసులు ఇచ్చిన పోలీసులు ఈ తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు కిషోర్‌ సన్నిహితుడని తెలుస్తోంది. అలాగే కృష్ణాజిల్లా నందిగామలో టీడీపీకి చెందిన చిరుమామిళ్ల కృష్ణను కూడా అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టారంటూ అర్థరాత్రి సమయంలో అతడ్ని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కిషోర్‌, కృష్ణ అరెస్ట్ లపై నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. నందమూరి బాలకృష్ణ నటించిన 'సింహా' సినిమాలోని 'నో పోలీస్' డైలాగును అనుకరిస్తూ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. "వైకాపా మాఫియా ఇసుక కొట్టేస్తే నో సిఐడి, ఇళ్ల స్థలాలు అమ్మతుంటే నో సిఐడి, ఇళ్ల స్థలాల కొనుగోలు పేరుతో కోట్లు కొల్లగొడుతుంటే నో సిఐడి, విషం కంటే ప్రమాదకరమైన మందు పోస్తూ వేల కోట్లు జే ట్యాక్స్ వసూలు చేస్తుంటే నో సిఐడి.108 లో స్కామ్ బయటపడితే నో సిఐడి, మైన్స్ మింగేస్తుంటే నో సిఐడి. మహిళల పై అత్యాచారాలు,వేధింపులకు పాల్పడుతుంటే నో సిఐడి. రాజారెడ్డి రాజ్యాంగంలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ని సోషల్ మీడియా వేధింపుల డిపార్ట్మెంట్ గా మార్చేసారు వైఎస్ జగన్ గారు. భావ ప్రకటనా స్వేచ్ఛ ని హరించే హక్కు మీకు ఎవరిచ్చారు?" అని లోకేష్ ఫైర్ అయ్యారు. "ఏం నేరం చేసారని అర్థరాత్రి చొరబడి మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు? కృష్ణ,కిషోర్ గారికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది. జగన్ గారి చెత్త పాలన గురించి వైకాపా ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలే మీడియా ముఖంగా వివరిస్తున్నారు మరి వారిని కూడా సిఐడి అరెస్ట్ చేస్తుందా?" అని లోకేష్ ప్రశ్నించారు.

అసెంబ్లీ సమావేశాలకు కరోనా సోకిన ఎమ్మెల్యే .. టెన్షన్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు 

విజయనగరం జిల్లా ఎస్ కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్ గా తేలిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం ఆయన వైజాగ్ లోని ఒక గెస్ట్ హౌస్ లో హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. తాను త్వరలో కోలుకుని మళ్ళీ మీడియా ముందుకు వస్తానని అయన ఎంతో కాన్ఫిడెన్స్ తో ప్రకటించారు. వైసిపి ఎమ్మెల్యే శ్రీనివాసరావు అసెంబ్లీ సమావేశాల కు ముందు అమెరికా వెళ్లి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆయన అమెరికా నుండి ఏపీకి వచ్చినపుడు ఆయనలో ఎలాంటి అనారోగ్య లక్షణాలూ కనిపించలేదు. దీంతో రొటీన్‌గా విదేశాల నుండి వచ్చే వారికి చేసే పరీక్షలు ఆయనకూ చేసి ఎటువంటి సమస్య లేదని చెప్పారు. దీంతో స్వంత నియోజక వర్గానికి వచ్చి పార్టీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలను కలిశారు. ఐతే ఆయనకు కరోనా అమెరికాలోనే సోకిందా లేక... ఏపీకి వచ్చిన తరవాత సోకిందా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. అంతే కాకుండా ఎమ్మెల్యే శ్రీనివాసరావు మొన్న ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల లో పాల్గొన్నప్పుడు ఎమ్మెల్యేలందరితో కలిసిపోయి తిరిగారు. అంతే కాకుండా అసెంబ్లీలో జరిగిన రాజ్యసభ ఎన్నికల పోలింగ్ లో ఓటు వేశారు. దీంతో ఇప్పుడు మిగతా ఎమ్మెల్యేలు, మంత్రులకు టెన్షన్ మొదలైంది. ఎమ్మెల్యేకు కరోనా సోకినా ఎటువంటి లక్షణాలు బయట పడకపోవడంతో అయన ద్వారా ఇతరులకు సోకే అవకాశం ఉన్నందువల్ల అయన కాంటాక్ట్ లిస్ట్ ను అధికారులు ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పటికే అయన కుటుంబ సభ్యులను హోమ్ క్వారంటైన్ లో ఉంచి కరోనా టెస్ట్ చేశారు. టెస్ట్ రిజల్ట్ ఇంకా రావలసి ఉంది.

కొద్దిసేపట్లో కరోనా ఆయుర్వేద మందు విడుదల... కర్టెసీ రాందేవ్ బాబా

దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రజలు కరోనా మందు, వ్యాక్సిన్ల కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న నేపథ్యంలో రెండు అల్లోపతి మెడిసిన్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నట్లు గ్లెన్మార్క్ , హెటేరో సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. ఐతే తాజాగా పతంజలి వ్యవస్థాపకులు, ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా తాము తయారు చేసిన కరోనా మందును ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్ లోకి విడుదల చేస్తారని పతంజలి సి ఇ ఓ ఆచార్య బాలకృష్ణ తన తాజా ట్వీట్ లో తెలిపారు. పతంజలి తయారు చేసిన ఆయుర్వేద ఔషధం కరోనిల్ (Coronil) ను హరిద్వార్‌లోని పతంజలి యోగ్‌పీట్ లో ప్రారంభించనున్నట్లు బాలకృష్ణ ఆ ట్వీట్ లో తెలిపారు. ఈ సందర్భంగా మొట్ట మొదటి ఆయుర్వేద ఔషధం కరోనిల్ గురించి పూర్తి వివరాలను రాందేవ్ బాబాబు ప్రజలకు తెలియచేస్తారని అయన ప్రకటించారు.

తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్.. భయపెడుతున్న లెక్కలు

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత రెండు మూడు రోజులుగా రికార్డు స్థాయిలో‌ కేసులు నమోదవుతున్నాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 3,189 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఏకంగా 872 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. అంటే, 27.34 శాతం మందికి పాజిటివ్‌ వచ్చింది. ముఖ్యంగా, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. గ్రేటర్‌ లో సోమవారం ఒక్కరోజే ఏకంగా 713 మందికి కరోనా నిర్ధారణ అయింది. తెలంగాణలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,674కి చేరింది. సోమవారం ఏడుగురు మృతిచెందగా.. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 217కి చేరింది. కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకు 60,243 మందికి కరోనా‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు పరీక్షలు చేయించుకున్న ప్రతి వంద మందిలో 14 మందికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా టెస్టుల పాజిటివ్‌ రేట్ 14.39 శాతం ఉంది. జాతీయ స్థాయిలో ఇది 6.11 శాతం ఉండగా, తెలంగాణలో రెట్టింపు కంటే ఎక్కువగా ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇక గత ఐదారు రోజులుగా నమోదవుతున్న కేసులను పరిశీలిస్తే కరోనా టెస్టుల పాజిటివ్‌ రేట్ 20 శాతం పైగా ఉంది. పరీక్షలు చేయించుకుంటున్న ప్రతి వంద మందిలో 20 మందికి పైగా వైరస్‌ సోకినట్టు నిర్ధారణ కావడం మాములు విషయం కాదు. కావున ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

కరోనా కు వ్యాక్సిన్ రెడీ చేసిన నైజీరియా..!!

ప్రపంచ వ్యాప్తంగా విలయ తాండవం చేస్తున్న కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు అమెరికా, బ్రిటన్, భారత్, ఆస్ట్రేలియా, చైనా, జపాన్ వంటి అభివృధి చెందిన దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. దీనికోసం అనేక వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇస్తున్న సమాచారం ప్రకారం 13 వ్యాక్సిన్లు ప్రస్తుతం మనుషుల పై ప్రయోగ దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఐతే తాజాగా అందుతున్న సమాచారం ప్రక్రారం నైజీరియా సైంటిస్టులు కరోనా కు వ్యాక్సిన్ కనుగొన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని గురించి నైజీరియన్ యూనివర్సిటీలు ఒక ప్రకటన చేసినట్లు లోకల్ మీడియా తెలిపింది. ఆఫ్రికా ప్రజల కోసం ఆఫ్రికాలో ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేసినట్లు ఆడిలెక్ యూనివర్సిటీ వైరాలజి నిపుణుడు డాక్టర్ వోలాడిపో కోలావోల్ ప్రకటించినట్లు ది గార్డియన్ నైజీరియా ప్రచురించింది. ఈ వ్యాక్సిన్ సామాన్యులకు అందుబాటులోకి రావడానికి 18 నెలలు టైం పట్టవచ్చని డాక్టర్ కోలావోల్ తెలిపారు. దీని పై మరి కొన్ని ట్రయల్స్ అవసరమని అలాగే దీనికి హెల్త్ డిపార్ట్ మెంట్ నుండి అనుమతి కూడా రావాల్సి ఉందని అయన తెలిపారు. కోవిడ్ జినోమ్ కోసం ఆఫ్రికా అంతటా సెర్చ్ చేసి సాధించామని అయన తెలిపారు. వ్యాక్సిన్ రెడీ చేసిన మాట నిజమే.. దీని కోసం చాల ప్రయోగాలు చేసి ఎనలైజ్ చేసాం అని ప్రీషియస్ కార్నర్ స్టోన్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జూలియస్ వోలోక్ దీనిని ధృవీకరించారు. ఆఫ్రికన్లు లక్ష్యంగా ఈ వ్యాక్సిన్ ను తయారు చేసినప్పటికీ ఇది అందరికి ఉపయోగపడుతుందని అయన తెలిపారు. ఫైనల్ గా వ్యాక్సిన్ ఎవరు తయారు చేశారు అనే దాని కంటే అది త్వరగా అందరికి అందుబాటులోకి వస్తే ప్రపంచానికి అంతకంటే కావాల్సిందేముంది.

ఏపీలో క‌ల‌క‌లం.. వైసీపీ ఎమ్మెల్యేకు క‌రోనా!!

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. సామాన్యులతో పాటు రాజకీయ నాయకులు సైతం కరోనా బారిన పడుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడగా.. తాజాగా ఏపీలో కూడా ఒక ఎమ్మెల్యేకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. విజయనగరం జిల్లా ఎస్ కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్ గా తేలిందని సమాచారం. ఆయన ఇటీవల అమెరికాకు వెళ్లి వచ్చారు. యూఎస్ నుంచి రావడంతో హోమ్ క్వారెంటైన్ లో ఉన్న ఎమ్మెల్యే.. పరీక్షలు చేయించుకోగా కరోనా నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. ఏపీ లో ఒక ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్ రావడం ఇదే తొలిసారి. ఎమ్మెల్యే గన్ మెన్ కి కూడా పాజిటివ్ గా నిర్దారణ అయినట్టు సమాచారం.