కరోనా పరీక్షల్లో డొల్లతనం.. ఎమ్మెల్సీ కి ఏపీలో పాజిటివ్‌, హైదరాబాద్‌ లో నెగటివ్‌

మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో కరోనా పరీక్షలు అధిక సంఖ్యలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, రోజుకి వేలల్లో పరీక్షలు చేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడమే తప్ప.. ఆ పరీక్షల్లో ఖచ్చితత్వం లేదని, డొల్లతనం కనిపిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డికి కరోనా పరీక్షల్లో నెగటివ్ అయితే పాజిటివ్ అని రిపోర్ట్ ఇచ్చారని టీడీపీ విమర్శిస్తోంది. తాజాగా ఇదే విషయమై ట్విట్టర్ వేదికగా స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. "ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అయితే అంతకన్నా ఆందోళనకర విషయం ఏమంటే... కరోనా పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం... ప్రజారోగ్యంతో ఆటలాడటం. కరోనా పేరుతో పరీక్షా కిట్ల కుంభకోణం, బ్లీచింగ్ పౌడర్ స్కామ్ లు చూసాం. ఇప్పుడు తాజాగా కరోనా పరీక్షల డొల్లతనం బయటపడింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు చేసిన కరోనా పరీక్షల్లో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి కి కరోనా పాజిటివ్ అని వైసీపీ ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చింది. వెంటనే ఆయన్ను క్వారంటైన్ కు వచ్చేయమన్నారు. కానీ అప్పటికే హైదరాబాద్ లో ఉన్న దీపక్ రెడ్డి అక్కడ రెండు చోట్ల పరీక్ష చేయించుకుంటే రెండు రిపోర్టుల్లోనూ నెగటివ్ అని వచ్చింది. ఏమిటిది? ఎక్కడ తప్పు జరుగుతోంది?. " అని చంద్రబాబు ప్రశ్నించారు. "రోజుకు వేల పరీక్షలు చేస్తున్నామని ప్రచారం చేసుకుంటే సరా? అందులో ఖచ్చితత్వం ఇదేనా? నెగటివ్ ఉన్న వ్యక్తికి పాజిటివ్ అని ఎలా చెబుతారు? ప్రజల ఆరోగ్యంతో కూడా ఇలాగే ఆడుకుంటున్నారా? పాజిటివ్ అని నిర్ధారణ కాకముందే ఒక ఎమ్మెల్సీని క్వారంటైన్ లో ఎందుకు పెట్టాలనుకున్నారు?. కరోనా పాజిటివ్ అన్న పేరుతో దీపక్ రెడ్డిని క్వారంటైన్ లో ఉంచాలనుకోవడం వెనుక రాజకీయ దురుద్ధేశాలు ఏమైనా ఉన్నాయా అన్నది కూడా అనుమానంగా ఉంది. అంతకన్నా ముందు కరోనా పరీక్షల ఖచ్చితత్వం ఏంటన్నది ప్రభుత్వం సమాధానం చెప్పాలి." అని చంద్రబాబు జగన్ సర్కార్ ని నిలదీశారు.

టీడీపీ నేత అచ్చెన్న కేసులో అర్ధరాత్రి హైడ్రామా

ఈఎస్ఐ నిధుల దుర్వినియోగం కేసులో జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడు గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయనను ఎసిబి కస్టడీకి అప్పగిస్తూ ఎసిబి కోర్ట్ నిన్న సాయంత్రం ఆదేశాలు ఇచ్చింది. ఐతే తనకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో చికిత్స తీసుకునేందుకు అనుమతించాలని అచ్చెన్న చేసిన అభ్యర్ధనను మాత్రం కోర్టు తిరస్కరించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను ఆస్పత్రిలోనే ఉంచి న్యాయవాది, వైద్యుడి సమక్షంలో విచారించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఆయనను కూర్చోమని లేదా నిలబడమని అధికారులు కోరడానికి వీల్లేదని ఆ ఆదేశంలో స్పష్టం చేసారు. అయితే అర్ధరాత్రి 12 గంటల సమయంలో సీన్ మొత్తం మారిపోయింది. అర్ధరాత్రి సమయంలో అచ్చెన్నాయుడును డిశ్చార్జి చేస్తున్నట్లు జీజీహెచ్‌ అధికారులు హైడ్రామాకు తెర తీసారు. అంతకు ముందు కోర్టుకు అందించిన రిపోర్ట్ లో ఆయనను మూడు నాలుగు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. దీంతో ఆయనను తమ అదుపులోకి తీసుకునేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసి అటు అయన తరుఫు లాయర్, ఇటు టీడీపీ నేతలు ఆందోళనకు దిగడంతో అచ్చెన్న డిశ్చార్జి పై ఆస్పత్రి అధికారులు వెనక్కి తగ్గారు.

వైసీపీ షోకాజ్ నోటీసుపై ఎంపీ రఘురామకృష్ణంరాజు రియాక్షన్

ఎమ్మేల్యేల పైన, పార్టీ అధినాయకత్వం పైన తీవ్ర వ్యాఖ్య‌లు చేశారంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఆ పార్టీ అధిష్టానం షోకాజు నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. తనకు షోకాజు నోటీసు జారీ చేయడంపై రఘరామకృష్ణంరాజు స్పందించారు. ఏ నాడు పార్టీని కానీ, పార్టీ అధ్యక్షుణ్ని కానీ పల్లెత్తు మాట అనలేదన్నారు. ప్రజల కోసం చేపట్టిన పథకాలు అనుకున్నట్టుగా జరగడంలేదని.. సీఎంకి చెప్పాల్సిన విషయాలు వీడియో ముఖంగా చెప్పానని తెలిపారు. సీఎం అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నిస్తే దొరకలేదని పేర్కొన్నారు. అపాయింట్‌మెంట్‌ దొరకని కారణంగానే మీడియా ముఖంగా సూచ‌న‌లు చేసినట్టు వివ‌రించారు. త‌న‌కు నోటీసుపై వివ‌ర‌ణ‌కు వారం రోజులు సమయం ఉన్నా రేపు సమాధానం చెబుతానని రఘరామకృష్ణంరాజు పేర్కొన్నారు.

బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ పూజారికి కరోనా

మార్చి నెలలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలవడంతో లాక్ డౌన్ ప్రకటించిన తరువాత ఆలయాలను మూసి వేసి ఈ నెల 8 నుండి తిరిగి భక్తుల దర్సనానికి తెరిచిన సంగతి తెలిసందే. బెజవాడ లోని కనక దుర్గమ్మ ఆలయం లో రెండు రోజులపాటు ట్రయల్ రన్ నిర్వహించి 10 నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నారు.  ఐతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గుడిలోని అర్చకుడికి కరోనా సోకింది. దీంతో ఆయనను హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ అర్చకుడు లక్ష కుంకుమార్చన పూజలో సేవలందిస్తున్నట్లుగా తెలుస్తోంది. గుడిలోని ఇతర అర్చకులకు కరోనా పరీక్ష నిర్వహించారు. కరోనా సోకిన అర్చకుడితో సన్నిహితంగా ఎవరెవరు ఉన్నారో ఆరా తీసి వారికి కూడా పరీక్షలు చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. మరో పక్క విజయవాడలో కరోనా ఉధృతంగా ఉన్న సంగతి తెలిసిందే.

కలిసింది పట్టపగలే.. రాత్రి కాదు కదా.. బీజేపీ నేత సంచలన కామెంట్స్

ఏపీ మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ కలవడంపై వైసీపీ నేతలు స్పందిస్తూ వారంతా కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. దీని పై స్పందించిన బీజేపీ సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు రమేష్ కుమార్‌ను తమ పార్టీ నేతలు కలిసింది పట్ట పగలే కదా.. రాత్రి పూట కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు రమేష్ కుమార్‌ను ఈ ప్రభుత్వం ఎన్నికల ప్రధాన అధికారిగా గుర్తిస్తోందా లేదా అని అయన ప్రశ్నించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి పదవిలో లేరని ఒక పక్క చెపుతున్న ప్రభుత్వం మరో పక్క ఆయనను ఇతరులు కలవడాన్ని ఎందుకు రాజకీయం చేస్తోంది అంటూ నిలదీశారు. అసలు వారు కలవడంలో కుట్ర ఏముందో చెప్పాలని ప్రభుత్వాన్ని అయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరినైనా కలవ వచ్చని ఆయన అన్నారు. కేసుల్లో ఉన్నవాళ్లు కూడా ఎవరెవర్నో కలుస్తుంటారని, అసలు ఇందులో తప్పేముందో చెప్పాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. ఒక పక్క ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహారం వెనుక బీజేపీ పెద్దల సపోర్ట్ ఉందని పుకార్లు వస్తుండగా.. మరో పక్క ఈ వివాదం బీజేపీ వర్సెస్ వైసిపిగా మారుతున్నట్లుగా కనిపిస్తోంది.

మీ కాళ్లు మొక్కుతాం అని వేడుకున్నా వైసీపీ ప్రభుత్వం కనికరించలేదు

ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో వైసీపీ ల్యాండ్ మాఫియా అక్రమాలు చేస్తుందంటూ టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు.  "పేదల స్థలాలు బలవంతంగా లాక్కొని తిరిగి పేదలకు అమ్మడమే 'వైఎస్ జగన్ ఇళ్ల స్థలాల అమ్మకం పథకం'. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో మీ కాళ్లు మొక్కుతాం సార్ అని వేడుకున్నా వైకాపా ప్రభుత్వం కనికరించలేదు." అని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. "దీనిపై కోర్టు ఇచ్చిన స్టే ని సైతం లెక్కచేయకుండా 1999లో టిడిపి ప్రభుత్వం 50 ఎకరాల్లో 964 మంది పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను ఇప్పుడు జగన్ రెడ్డి దౌర్జన్యంగా లాక్కోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో వైకాపా ల్యాండ్ మాఫియా చేస్తున్న అక్రమాలు అన్నీ,ఇన్నీ కావు. భూముల కొనుగోలు పేరుతో కోట్లు కొట్టేస్తున్నారు. అవే స్థలాలు పేదలకు పంపిణీ అంటూ పేదల రక్తాన్ని పీలుస్తున్నారు." అని లోకేష్ విరుచుకుపడ్డారు.  

ఏపీ సర్కార్ తీరు పై మళ్ళీ హైకోర్టు తలుపు తట్టిన నిమ్మగడ్డ

తనను తిరిగి ఎస్ఈసీ గా నియమించాలని ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఏపీ సర్కార్ దానిని అమలు చేయకపోవడం తో డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో సారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తనకు బాధ్యతలు అప్పగించకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ కేసులో ఏపీ సీఎస్, పంచాయత్ రాజ్ సెక్రెటరీ, ఏపీ ఎన్నికల సంఘం కార్యదర్శి లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 13 న ఒక హోటల్ లో రమేష్ కుమార్ ఇద్దరు బీజేపీ నేతలను కలుసుకున్న వీడియోలు బయటకు వచ్చి సంచలనం రేపాయి. అయితే తాము నిమ్మగడ్డను కలవడంలో ఎలాంటి తప్పులేదని సుజనా చౌదరి, కామినేని నిన్ననే క్లారిటీ ఇచ్చారు. ఐతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజకీయ నాయకులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని వైసిపి నాయకులు ఆరోపిస్తున్న నేపథ్యంలో అయన మళ్ళీ హైకోర్టును ఆశ్రయించడం తో అందరిలో ఆసక్తి నెలకొంది.

కేంద్రం కీలక నిర్ణయం.. ఆర్‌బీఐ పరిధిలోకి సహకార బ్యాంకులు

ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో సహకార బ్యాంకుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని సహకార బ్యాంకులను ఆర్‌బీఐ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు. భారత్‌లో 1,482 అర్బన్‌ కో ఆపరేటివ్‌ బ్యాంకులతో పాటు 58 మల్టీ స్టేట్‌ కోపరేటివ్‌ బ్యాంకులు ఉన్నాయి. ఇకపై ఇవన్నీ ఆర్‌బీఐ పరిధిలోకి రానున్నాయి. మంత్రివర్గ సమావేశానంతరం మాట్లాడిన మంత్రి ప్రకాష్ జవదేకర్.. దేశంలోని అన్ని కో ఆపరేటివ్ బ్యాంకులను ఆర్‌బీఐ పరిధిలోకి తెచ్చేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్సును కేబినెట్ ఆమోదించిందని తెలిపారు.

అందుకే మిమ్మల్ని కోర్టుకు పిలిపించాల్సి వచ్చింది

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ హైకోర్టుకు హాజరయ్యారు. అక్రమ మద్యం రవాణా కేసులో సీజ్ చేసిన వాహనాలను తమకు అప్పగించడం లేదని పలువురు వాహనదారులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో నిన్న విచారణ జరిగింది. అయితే న్యాయవాది వాదనలతో సంతృప్తి చెందని న్యాయస్థానం.. డీజీపీని కోర్టుకు రావాలంటూ ఆదేశించింది. దీంతో, ఆయన ఈరోజు హైకోర్టుకు హాజరయ్యారు.  ఈ సందర్భంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కొందరు పోలీసు అధికారుల పని తీరు సరిగా లేదని వ్యాఖ్యానించింది. వాహనాల అప్పగింత జాప్యతపై డీజీపీని వివరణ అడగాలని అడ్వకేట్ జనరల్‌ ని తాము ఆదేశించామని.. అయితే, ఎక్సైజ్ ఏజీపీతో మెమో ఫైల్ చేయించారని పేర్కొంది. మీ న్యాయ సలహా విభాగం సరిగా పని చేయడం లేదని, ఈ కారణం వల్లే మిమ్మల్ని కోర్టుకు పిలిపించాల్సి వచ్చిందని  డీజీపీని ఉద్దేశించి న్యాయమూర్తి అన్నారు. సీజ్ చేసిన వాహనాల విషయంలో పోలీస్ అధికారులు నిబంధనలు పాటించలేదని న్యాయస్థానం పేర్కొంది. మూడు రోజుల్లోగా సీజ్ చేసిన వాహనాలను డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ ముందు ప్రవేశపెట్టాలని ఆదేశించింది. ఎక్సైజ్ కమిషనర్ మూడు రోజుల్లో సీజ్ చేసిన వాహనాలపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు వైసీపీ షోకాజ్ నోటీసులు

ఇటీవల సొంత పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు వైసీసీ షోకాజ్ నోటీసులిచ్చింది. పార్టీపై చేసిన వ్యాఖ్య‌ల‌పై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరింది. వారంలోపు స‌మాధానం ఇవ్వాల‌ని పార్టీ సూచించింది.  కొద్దిరోజులుగా ప్ర‌భుత్వ విధానాలు, పార్టీ నేత‌ల‌పై ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, నేత‌లు అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని ఆరోపించారు. తనను బ్ర‌తిమాలితేనే పార్టీలో చేరాన‌ని.. పార్టీ గుర్తు లేకపోయినా సొంతంగా ఎంపీగా గెలవగల సత్తా తనకుందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలపై విమర్శలు గుప్పించారు. అంతేకాదు, తనకు ప్రాణహాని ఉందని సొంత పార్టీ నేతలపై ఫిర్యాదు చేస్తూ ఆయన లోక్ సభ స్పీకర్ కు లేఖ కూడా రాశారు.  ఈ నేపథ్యంలో ఆయనకు పార్టీ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. పార్టీ అధిష్ఠానానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇంగ్లీష్ మీడియం విషయంలో పార్టీ మేనిఫెస్టోకు భిన్నంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారని తెలిపారు. అలాగే, వైసీపీ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారంటూ ఎటువంటి ఆధారాలు లేకుండా ఆయన ఆరోపణలు చేశారని తెలిపారు. సీఎం జగన్‌పై కూడా పలు వ్యాఖ్యలు చేశారని, అనేక సందర్భాలలో మీడియా ముందు పార్టీ, ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు చేశారని తెలిపారు. ఆ వ్యాఖ్యలన్నింటికీ వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని పేర్కొంటూ ఆయనకు వైసీపీ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

జగన్ సర్కార్ పై ఉండవల్లి విమర్శల వర్షం.. జగన్‌ ఎందుకు అభద్రతా భావంతో ఉన్నారు?

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ ప్రభుత్వం తీరుని తప్పుబట్టారు. ఇళ్ల స్థలాల కోసం కొన్న ఆవ భూములపై విచారణ జరిపించాలని సీఎం జగన్‌కు లేఖ రాశానని ఉండవల్లి తెలిపారు. కానీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. రూ. 45 లక్షలు పెట్టి కొనుగోలు చేశారని, అంత ధర ఉండదని తెలిపారు. అవినీతి రహిత పరిపాలన అందిస్తానని చెప్పిన సీఎం జగన్..  భూముల విషయంలో జరిగిన అవినీతిని ఎందుకు సమర్ధించారని ప్రశ్నించారు. అధిక ధరలకు భూములు కొని, ఇళ్ల ప‌ట్టాలు ఇస్తామ‌న‌టం ప్ర‌భుత్వ అస‌మ‌ర్ధ‌త‌కు నిద‌ర్శ‌నం అని విమర్శించారు.  ప్రభుత్వానికి ఇసుక విధానంపై సరైన ముందస్తు ప్రణాళిక లేదని అన్నారు. దీంతో ఏపీలో నిర్మాణ రంగం కుదేలైపోయింద‌ని, ఇసుక కష్టాలను ఇప్పటికీ తీర్చలేకపోతున్నారని విమర్శించారు. ఇసుక విధానంలో అవినీతి జరగడం మాత్రమే కాకుండా, కూలీలకు ఉపాధి లేకుండా పోతోందని తెలిపారు. మద్యం విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వ తీరుని ఉండవల్లి తప్పుబట్టారు. పక్క రాష్ట్రాల్లో ఉన్న రేట్ల కంటే ఏపీలో మద్యం ధరలు అధికంగా ఉన్నాయని అన్నారు. రేటు పెంచితే తాగేవారు తగ్గుతారనుకోవడం భ్రమేనని ఎద్దేవా చేశారు. అలాగే, రాజకీయ ప్రత్యర్థులపై వైసీపీ ప్రతీకార చర్యలకు పాల్పడడమేంటని ఉండవల్లి ప్రశ్నించారు. జడ్జిలపై వైసీపీ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలు సరికాదని చెప్పారు. జడ్జిలపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టడం సిగ్గుమాలిన చర్యని మండిపడ్డారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో జగన్‌ ఎందుకు అభద్రతా భావంతో ఉన్నారని ఉండవల్లి ప్రశ్నించారు.  కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఉండవల్లి విమర్శించారు. కరోనా నేపథ్యంలో కొంతమంది నియమనిబంధనలు పాటించడంలేదని మండిపడ్డారు. ప్రజల్లో ఎక్కువగా తిరిగే వాలంటీర్లు, ఆశావర్కర్లు, మీడియా ప్రతినిధులు అందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మాస్కు ధరించకపోతే ఫైన్ వేస్తున్న అధికారులు వాళ్లు ఎందుకు మాస్కులు ధరించడంలేదని ఉండవల్లి ప్రశ్నించారు.

భారత్-చైనా సరిహద్దులో కూలిన బ్రిడ్జ్​

భారత్- చైనా సరిహద్దులో ఓ వంతెన కూలిపోయింది. ఉత్తరాఖండ్‌లోని పితోర్గఢ్ జిల్లాలో.. భారీ నిర్మాణ యంత్రాన్ని తీసుకెళ్తున్న లారీ.. బ్రిడ్జ్ దాటే సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. లిలాం జోహార్ లోయలోని మున్సారీ తహసీల్ వద్ద ఉన్న ధపా మిలాం రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో డ్రైవర్ తో పాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానికులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మిలాం నుంచి చైనా సరిహద్దు వరకు 65 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణ పనులు జరుగుతుండగా.. ఆ నిర్మాణ యంత్రాన్ని అక్కడకు తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వంతెన కూలిపోయింది. అయితే, వంతెన కూలిపోవడం వల్ల సరిహద్దు ప్రాంత గ్రామాల్లోని 7000 మందికి పైగా ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆర్మీ, ఐటీబీపీ దళాల ప్రయాణాలకూ విఘాతం కలిగింది.

మాస్క్ పెట్టుకుంటారా ఫైన్ కడతారా.. బ్రెజిల్ అధ్యక్షుడికి జడ్జ్ వార్నింగ్ 

ప్రపంచం మొత్తం మీద కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి. నిన్నటివరకు రోజువారీ నమోదవుతున్న కేసుల విషయంలో ముందున్న అమెరికాను కూడా క్రాస్ చేసి బ్రెజిల్ మొదటి స్థానానికి చేరుకుంది. కొద్ది నెలల క్రితం అసలు కరోనా కేసులే లేని బ్రెజిల్ లో నిన్నఒక రోజే 40,131 పాజిటివ్ కేసులు, 1364 మరణాలు నమోదయ్యాయి. దాదాపు 22 కోట్ల జనాభా కలిగిన బ్రెజిల్ ప్రస్తుత దుస్థితికి ఆ దేశ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో కారణమని విమర్శలు వస్తున్నాయి. కరోనా అంటే అసలు లెక్క లేనట్లుగా బోల్సోనారో ప్రవర్తిస్తున్నాడని, తాను స్వయంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడమే కాకండా ఇటు ప్రజలకు జాగ్రత్తలు చెప్పే పరిస్థితి అసలు లేదు. ఒక పక్క కరోనా తీవ్రంగా ఉండగా అధ్యక్షుడు బోల్సోనారో ప్రజల్లోకి వెళ్లి ర్యాలీలతో పాల్గొంటున్నాడు. దీంతో కరోనా మరింత వ్యాపిస్తోంది. ఒక దేశానికీ అధ్యక్షుడై ఉండి ఆయనే స్వయంగా మాస్క్ పెట్టుకోకపోతే మేమెందుకు పెట్టుకోవాలి అని ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. దీంతో బోల్సోనారో మాస్క్ పెట్టుకోవాల్సిందేనని బ్రెజిల్ ఫెడరల్ జడ్జి రెనాటో బోరెల్లీ ఆర్డర్ వేశారు. ఒకవేళ తన ఆదేశాన్ని పాటించకపోతే మాత్రం రోజుకు 29వేల రూపాయల ఫైన్ వేస్తానని స్పష్టం చేసారు. ఇటు అమెరికా ప్రెసిండెంట్ ట్రాంప్ అటు బ్రెజిల్ ప్రెసిండెంట్ బోల్సోనారో ఇద్దరు కూడా త్వరలో వ్యాక్సిన్ వచ్చేస్తుందని దాంతో కరోనా మాయం అవుతుందని చెప్పి ప్రజలను బలి చేస్తున్నారు.

రామ్ దేవ్ బాబా కరోనా ముందుకు బ్రేకులు..మమ్మల్ని అవమానించడం సరికాదు

యోగా గురు రామ్ దేవ్ బాబా కు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. రామ్ దేవ్ బాబాకు చెందిన పతంజలి సంస్థ కరోనా వైరస్ కు మెడిసిన్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆయుర్వేద ఉత్పత్తులతో తాము కరోనాకు ఔషధాన్ని తయారు చేశామని, ఇది వారం రోజుల్లోనే శరీరంలోని వైరస్ ను పారద్రోలుతుందని చెబుతూ పతంజలి సంస్థ విడుదల చేసిన 'కరోనిల్ మరియు శ్వాసరి' లను కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ అడ్డుకుంది. తక్షణం దీనికి సంబంధించిన ప్రచారం నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. పతంజలి సంస్థ  తయారు చేసిన మెడిసిన్ లో ఎలాంటి ఔషాదాన్ని వాడారో.. ఎంత మొత్తంలో వాడారో చెప్పాలంటూ ఆయుష్ శాఖ ఆదేశించింది. ప్రోటోకాల్, నమూనా పరిమాణం, ఇనిస్టిట్యూషనల్ ఎథిక్స్ కమిటీ క్లియరెన్స్ , క్లినికల్ ట్రయల్ రిజిస్ట్రీ వివరాలు, మెడిసిన్ రీసెర్చ్ డేటాను పరిశీలించే వరకు దీనికి సంబంధించి ప్రచారాల్ని నిలిపివేయాలని ఆదేశించింది. ఆయుష్ మంత్రిత్వశాఖ ఆదేశాలపై యోగా గురువు రామ్ దేవ్ బాబా స్పందించారు. కరోనాకు మందు తయారుచేసే ముందు అన్ని అనుమతులు తీసుకున్నామని స్పష్టంచేశారు. మెడిసిన్‌కు సంబంధించి అన్ని వివరాలు ఇప్పటికే ఆయుష్ మంత్రిత్వశాఖకు అందజేశామని.. అవి త్వరలోనే వారికి చేరుకుంటాయని తెలిపారు. తాము చట్టాన్ని ఎక్కడా అతిక్రమించలేదని స్పష్టంచేశారు. కరోనిల్, శ్వాసరి మందులు కరోనా రోగులపై వందశాతం పనిచేశాయని పేర్కొన్నారు. క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి, 100 శాతం రోగులు కోలుకున్నాకే ప్రజలు చెబుతున్నామని తెలిపారు. పతంజలి చేసిన పరిశోధన, మందు కనుగొనడంతో ప్రభుత్వం తమను అభినందించాల్సింది పోయి.. అవమానించడం సరికాదన్నారు. దీనిపై ఇప్పటికే ఆయుష్ అధికారులతో మాట్లాడామని.. మెడిసిన్ ‌కు సంబంధించి సమాచారం లేదని చెప్పడంతో, పరిశోధనలకు సంబంధించిన వివరాలను పంపించామని రామ్ దేవ్ పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జూన్ ‌కు పూర్తి జీతం

తెలంగాణ ప్ర‌భుత్వం ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలకు ఈ నెల(జూన్‌) పూర్తి జీతాలు చెల్లిస్తామ‌ని తెలిపింది. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో గత మూడు నెలల నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లలకు 50 శాతం వేతనాలు మాత్రమే చెల్లిస్తోంది. లాక్ డౌన్ లో సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో పూర్తి వేతనాలు చెల్లించాలని కొద్దిరోజులుగా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగులు, పెన్షనర్ల ఆందోళనను పరిగణనలోకి తీసుకున్న సీఎం కేసీఆర్‌ జూన్ నెల పూర్తి వేత‌నం చెల్లించాల‌ని నిర్ణ‌యించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఈనెల పూర్తి వేతనం చెల్లిస్తామని సీఎం‌ ప్రకటించారు. రాష్ట్ర ఆదాయ పరిస్థితి కొంచెం కొంచెం మెరుగుపడుతున్న మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం వెల్లడించారు. ఈనెల ఉద్యోగులకు పూర్తి వేతనాలు, పెన్షనర్లకు పూర్తి పింఛన్లు చెల్లించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

క‌రోనా ఉగ్ర‌రూపం.. ఒక్కరోజులో 16 వేల కేసులు.. ఎమ్మెల్యే మృతి

భారత్ లో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటలలో15,968 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,56,183 కు చేరింది. గత 24 గంటలలో కరోనాతో 465 మంది మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 14,476కు చేరింది. ఇప్పటివరకు 2,58,685 మంది క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్ర‌స్తుతం 1,83,022 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీ ఎమ్మెల్యే తమోనాష్ ఘోష్ కరోనాతో బుధవారం ఉదయం మరణించారు. టీఎంసీ కోశాధికారి, మూడుసార్లు ఎమ్మెల్యే అయిన తమోనాష్ ఘోష్ తమను వీడి పోవడం తీవ్ర విషాదం నింపిందని పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ ట్వీట్ చేశారు. 35 ఏళ్లపాటు ప్రజల కోసం పనిచేసిన తమోనాష్ ఘోష్ తమను వీడిపోవడం తీవ్ర విచారం కలిగించిందని పేర్కొన్నారు.

కరోనా కు వ్యాక్సిన్ అవసరమే రాదు... ఇవిగో ప్రూఫ్స్

కరోనా తో ప్రపపంచం అతలాకుతలం అవుతోంది. భారత్ లో ఐతే కరోనా కేసులు రోజుకు 15 వేలు పైగా నమోదవుతున్నాయి. కరోనా బాధితులకు చికిత్స అందించే వైద్యులను, ఇటు పోలీస్ డిపార్ట్ మెంట్ ను కూడా కరోనా చుట్టేస్తోంది. ఇక సామాన్య జనం ఐతే వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇటలీ శాస్త్రవేత్తలు అందరికి ఊరటనిచ్చే చల్లని కబురు చెపుతున్నారు. స్వైన్ ఫ్లూ, ఎబోలా, సార్స్, మెర్స్ వైరస్‌లు మనపై దాడి చేసి కొంతకాలానికి వాటంతట అవే కనుమరుగయ్యాయి. ఆ వైరస్ ల దారిలోనే కరోనా కూడా చేరుతుందని వారు తెలిపారు. ప్రస్తుతానికి కరోనా వైరస్ పది ప్రధాన దేశాల్లో అత్యంత ప్రమాదకరంగా ఉంది. మిగిలిన దేశాల్లో మాత్రం కేసులు తగ్గుతున్నాయి. ఐతే భారత్, రష్యా, అమెరికా, బ్రెజిల్ వంటి దేశాలలో కరోనా తీవ్రంగా పెరుగుతున్నట్టు తాజా గా అందుతున్న లెక్కలను బట్టి తెలుస్తోంది. ఐతే దీని పై ఇండియా, ఇటలీలో శాస్త్రవేత్తలు లోతైన అధ్యయనం చేసినట్లుగా తెలుస్తోంది. ఆ శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం కరోనా వైరస్‌కి అసలు వ్యాక్సిన్ అవసరం రాకపోవచ్చని ఇటలీ కమ్యునికబుల్ డిసీజెస్ స్పెషలిస్ట్ మ్యాటియో బసెట్టి అంటున్నారు. అయన తెలిపిన వివరాల ప్రకారం ఫిబ్రవరి, మార్చి తో పోల్చితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ చాలా బలహీనపడిందని అంటున్నారు. వైరస్ వ్యాప్తి ఐతే జోరుగా ఉంది గానీ వైరస్ మాత్రం ఇదివరకటి అంత ప్రాణాంతకంగా లేదని చెప్తున్నారు. మార్చి, ఏప్రిల్ కాలంలో కరోనా బాధితుల నుండి సేకరించిన శాంపిల్స్‌లో కరోనా చాలా తీవ్రంగా ఉన్నట్లు తేలింది. ఐతే ఇపుడు మాత్రం 80 నుంచి 90 ఏళ్ల వారు కూడా వెంటిలేటర్ సాయం లేకుండానే చికిత్స పొంది కరోనాను జయిస్తున్నారని ఆయన చెబుతున్నారు. ఇక భారత్ విషయానికి వస్తే జులై లో కరోనా కేసులు గరిష్ఠానికి చేరతాయని అంచనా వేస్తున్నారు. తరువాత ఆగస్టు నుంచి కేసులు తగ్గడం మొదలవుతుందని.. సెప్టెంబర్ నాటికి ఇండియాలో కూడా కరోనా పూర్తిగా తగ్గిపోతుందని టైమ్స్ ఫ్యాక్ట్ ఇండియా ఔట్ బ్రేక్ రిపోర్ట్ చెపుతోంది. ఈ సంస్థ మన కేంద్ర ఆరోగ్య శాఖ ఇస్తున్న లెక్కలు, శాస్త్రవేత్తల అంచనాల్ని లెక్కలోకి తీసుకొని ఈ రిపోర్ట్ తయారుచేసినట్లు తెలుస్తోంది. జులై 25 నాటికి భారత్ లో కరోనా కేసులు అత్యధిక స్థాయికి చేరతాయని ఈ రిపోర్ట్ సారాంశం. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కొత్త కేసుల కంటే రికవరీ ఐన కేసులు బాగా పెరుగుతున్నాయి. భారత్ లో కూడా రికవరీ అవుతున్నవారి సంఖ్య రోజురోజుకూ మెల్లగా పెరుగుతోంది. ఏది ఏమైనా ప్రపంచ శాస్త్రవేత్తలు చెప్పినట్లు వ్యాక్సిన్ తో పని లేకుండానే వైరస్ తగ్గిపోతే మానవాళికి అంతకంటే కావలసిందేముంది.

ప్రధాని వద్దకు వెళ్లి భారతరత్న ఇవ్వాలని విన్నవిస్తా: సీఎం కేసీఆర్

బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశానికి విభిన్న రంగాల్లో అందించిన విశిష్ట సేవలను గొప్పగా తలుచుకునే విధంగా, చిరస్మరణీయంగా నిలిచే విధంగా శత జయంతి ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఏడాది పొడవునా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ప్రగతి భవన్ లో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్ కె. కేశవరావు, మంత్రి ఈటల రాజెందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల నిర్వహణ సందర్భంగా ఏఏ కార్యక్రమాలు నిర్వహించాలనే విషయంలో సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం ఉత్సవాల నిర్వహణ సందర్భంగా చేయాల్సిన కార్యక్రమాలను నిర్దేశించారు. పీవీ జన్మదినమైన జూన్ 28న హైదరాబాద్ లోని పీవీ జ్ఞానభూమిలో ప్రధాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే రోజు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 దేశాల్లో పీవీ జయంతి వేడుకలు నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు. శత జయంతి ఉత్సవాల నిర్వహణకు తక్షణం రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. రాష్ట్ర అసెంబ్లీలో పీవీ చిత్ర పటాన్ని పెట్టాలని నిర్ణయించినట్టు సీఎం తెలిపారు. అలాగే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, వంగరతో పాటు ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో పీవీ విగ్రహాలు నెలకొల్పాలని, విగ్రహాల కోసం వెంటనే ఆర్డర్ ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. భారత పార్లమెంటులో కూడా పీవీ చిత్రపటం పెట్టాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోరతామన్నారు. ‘పీవీ నరసింహారావు దేశం గర్వించదగ్గ నాయకుడు. దేశ గతిని మార్చిన గొప్పవారు. భారతరత్న పురస్కారానికి సంపూర్ణ అర్హుడు. పీవీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంత్రివర్గం, అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంది. ప్రధాని వద్దకు నేనే స్వయంగా వెళ్లి భారతరత్న ఇవ్వాలని విన్నవిస్తా.’ అని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.