ఏడాది పాటు ఘనంగా పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు: సీఎం కేసీఆర్
posted on Jun 18, 2020 @ 1:51PM
మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించారు. పీవీ పుట్టిన రోజైన జూన్ 28 నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
దేశ ప్రధానిగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా, విద్యావేత్తగా, సాహితీ వేత్తగా పీవీ నరసింహారావు బహువిధాలుగా సేవలు అందించారని సీఎం అన్నారు. అంత గొప్ప వ్యక్తి తెలంగాణ వాడు కావడం రాష్ట్ర ప్రజలకు గర్వకారణమని సీఎం అన్నారు.
ఆయన సేవలను ఘనంగా స్మరించుకోవడానికి శతజయంతి వేడుకలను గొప్పగా నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. పీవీ మన ఠీవీ అని గొప్పగా చెప్పుకునే విధంగా ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు.
పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల నిర్వహణ కోసం ఎంపీ కె. కేశవరావు ఆధ్వర్యంలో కమిటీని సీఎం నియమించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, పీవీ కుమారుడు పీవీ ప్రభాకర్ రావు, కుమార్తె శ్రీమతి వాణీదేవి, మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.
పీవీతో కలిసి పనిచేసిన వారు, ఆయనతో అనుబంధం కలిగిన వారు, ఆయన అభిమానులను సంప్రదించి, ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన కార్యక్రమాల రూపకల్పన జరగాలని సీఎం కమిటీని కోరారు.