మరో రైతు ఉసురు తీసిన రెవెన్యూ ధనదాహం

రైతులను తమ ధన దాహం తో పీడించుకు తింటున్న కొంత మంది రెవెన్యూ ఉద్యోగుల పుణ్యమా అని మొత్తం రెవెన్యూ డిపార్ట్ మెంట్ కే చెడ్డపేరు వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఒక తహసీల్దార్ పై ఒక రైతు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన తెలంగాణాలో చోటు చేసుకుంది. అయినా కొంత మంది అధికారులలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. తన తండ్రి పేరు మీద ఉన్న 1.2 ఎకరాల భూమికి తన పేరు మీద పట్టా ఇవ్వాలని తహసీల్దార్ ఆఫీసు చుట్టూ తిరిగి వేసారిన 65 ఏళ్ళ రైతు అదే ఆఫీసు ముందు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన రాజిరెడ్డి అనే రైతు గత్ కొన్ని నెలలుగా కాల్వ శ్రీరాంపూర్ లోని భూమిని తన పేరుతో పట్టా చేసి ఇవ్వాలని తహసీల్దార్ ఆఫీసు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఐతే ఎంతకీ తన పేరుతో పాసు పుస్తకం ఇవ్వకపోవడం తో విసిగిపోయిన ఆ రైతు బలవంతంగా తన ప్రాణాలు తీసుకున్నాడు.

ప‌రీక్ష‌ల పేరుతో ల‌క్ష‌లాది మంది విద్యార్థులను క‌రోనా కోర‌ల్లోకి నెట్టేస్తున్నారు

కరోనా విజృంభణ నేపథ్యంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఏపీ ప్రభుత్వం మాత్రం కొద్ది రోజుల క్రితం పదో తరగతి పరీక్షలు పెట్టి తీరుతామని చెప్పింది. ఇప్పుడు కరోనా వ్యాప్తి మరింత పెరిగిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా ఆలోచనలో పడింది. తాజాగా ఇదే అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. "ఏపీలో కరోనా విజృంభిస్తోంటే, ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను నిర్వహించే ఆలోచన చేస్తోంది. పొరుగురాష్ట్రాల్లో ఉన్నత విద్యా పరీక్షలనే రద్దు చేస్తోంటే ఇక్కడ చిన్నారుల ఆరోగ్యంతో ఆటలెందుకు? వెంటనే పదో తరగతి పరీక్షలను రద్దుచేయాలి." అని చంద్రబాబు డిమాండ్ చేశారు. "క‌రోనా సామాజిక‌వ్యాప్తి మొద‌లైన ప్ర‌మాద‌క‌ర‌మైన ద‌శ‌లో ల‌క్ష‌లాది మంది విద్యార్థుల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడ‌కుండా టెన్త్ ప‌రీక్ష‌లు ర‌ద్దుచేయాలి. తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలు త‌మ విద్యార్థుల‌ను కాపాడుకునేందుకు ప‌రీక్ష‌లు ర‌ద్దు చేశాయి. ఏపీ ప్ర‌భుత్వం మొండిగా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌నే విధంగా వ్య‌వ‌హ‌రించ‌డం త‌గ‌దు. క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లిన నాటి నుంచి నేటి వ‌ర‌కూ జగన్ గారు మాత్రం తాడేప‌ల్లి గ‌డ‌ప కూడా దాటి రావ‌డంలేదు. ల‌క్ష‌లాది మంది విద్యార్థులను మాత్రం ప‌రీక్ష‌ల పేరుతో క‌రోనా కోర‌ల్లోకి నెట్టేస్తున్నారు. త‌క్ష‌ణ‌మే ప‌రీక్ష‌ల ర‌ద్దు ప్ర‌క‌టించ‌క‌పోతే టీడీపీ ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న‌కు దిగుతాం." అని నారా లోకేష్ పేర్కొన్నారు.

ప్రమాదం వైపు పరుగెడుతున్న ప్రపంచం: డబ్ల్యూహెచ్ఓ

భారత్ తో పాటు ప్రపంచం మొత్తం కరోనా విలయ తాండవంతో బెంబేలు ఎత్తుతోంది. భారత్ లో ఐతే ప్రతిరోజు వేల కొద్దీ కేసులు నమోదవుతున్నాయి. అంతే కాకుండా కరోనా కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. డబ్ల్యూ హెచ్ ఓ తాజాగా ప్రపంచం లో కరోనా విజృంభణ పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ దేశాలు ఓ కొత్త ప్రమాదక‌ర‌ దశలోకి జారుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. గురు శుక్రవారాల మధ్య గడచిన 24 గంటల్లో లక్షా 50 వేల కేసులు నమోదయ్యాయ‌ని.. ఒకే రోజులో ఈ స్థాయిలో కేసులు తేలడం అత్యంత ప్ర‌మాద‌క‌ర ప‌రిణామం అని అభిప్రాయ‌ప‌డింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఒక్కరోజు వ్యవధిలో రికార్డయిన కరోనా పాజిటివ్ కేసుల్లో ఇదే అత్యధికమ‌ని ఆ సంస్థ తెలిపింది. ప్రస్తుతం అమెరికాతో పాటు ఆసియా దేశాల్లోనూ కరోనా వైర‌స్ బీభ‌త్సం సృష్టిస్తోంద‌ని తెలిపింది.

మేము ప్రారంభించిన పథకాల పేర్లు నేనే మిస్సవుతానేమో అనిపిస్తోంది: సీఎం జగన్

'వైఎస్సార్ నేతన్న నేస్తం' పథకానికి సంబంధించి రెండో ఏడాది ఆర్థిక సాయాన్ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకం ద్వారా సొంత మగ్గం కలిగి దారిద్ర రేఖకు దిగువనున్న ప్రతి చేనేత కుటుంబానికి రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. శనివారం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ ఆన్‌లైన్ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేశారు.  "గతేడాది నా పుట్టినరోజున డిసెంబరు 21న 'వైఎస్సార్ నేతన్న నేస్తం' పథకాన్నిప్రారంభించాం. రెండో విడత సాయాన్ని మళ్లీ అదే రోజున ఇద్దామనుకున్నాం. కానీ కరోనా కష్టకాలంలో నేతన్నలు పడుతున్న కష్టం చూడలేక వారికి ముందుగానే సాయం విడుదల చేస్తున్నాం" అని సీఎం జగన్ తెలిపారు. 81,024 మంది లబ్ధిదారులకు రూ.194.46 కోట్ల సహాయం అందనుందని సీఎం తెలిపారు. అర్హులెవరైనా మిగిలిపోతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని.. వచ్చే నెలలో ఇదే రోజున ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పారు. 13 నెలల కాలంలో చేనేతన్నలకు దాదాపు రూ.600 కోట్ల సహాయం చేశామని సీఎం పేర్కొన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో కనీసం రూ.200 కోట్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించిన పథకాలు చూస్తుంటే, వాటి పేర్లు నేనే మిస్సవుతానేమో అనిపిస్తోంది అంటూ సీఎం చమత్కరించారు. 13 నెలల్లోనే అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు చేశామని సీఎం జగన్ వెల్లడించారు.

ఇసుక బుక్ చేసిన ఏపీ మంత్రి ఇంటికి మట్టి!!

ఏపీలో ఇటీవల కొందరు అధికార పార్టీ నేతలు ఇసుక విషయంలో అసహనం వ్యక్తం చేస్తుంటే.. తాజాగా ఏకంగా ఓ మంత్రికే ఇసుక విషయంలో చేదు అనుభవం ఎదురైంది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రూరల్‌ మండలం భట్నవిల్లి సమీపంలో మంత్రి పినిపే విశ్వరూప్‌ ఇల్లు కట్టుకొంటున్నారు. మంత్రి ఇంటి నిర్మాణం కోసం ఆన్‌లైన్‌లో ఇసుక బుక్ చేశారు. ఏపీఎండీసీ అధికారులు నాలుగు లారీల ఇసుకను తరలించారు. అయితే, ఆ ఇసుక నాసిరకంగా ఉంది. అందులో ఇసుక కన్నా తువ్వ, మట్టే ఎక్కువగా ఉంది.  దీనిపై ఇంటి పనులు చేస్తున్న నిర్వాహకులు మంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన మంత్రి ఇసుక సరఫరాలో లోపాలను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి‌ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన ఆదేశాలతో ఆర్డీవో భవానీశంకర్, పంచాయతీరాజ్‌ ఇంజినీర్‌ రాంబాబు వెళ్లి.. ఇసుక గుట్టలను పరిశీలించారు. ఆ ఇసుక ఎటువంటి నిర్మాణాలకూ పనికిరాదని, కేవలం పునాదుల్లో వేయడానికి ఉపయోగపడుతుందని కలెక్టర్‌కు నివేదించారు. మంత్రికే ఇలాంటి నాసిరకం ఇసుక పంపితే.. సామాన్యుల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మూడు నెలల నుంచి సామాన్యులకు కూడా ఇదే తరహా పనికిరాని ఇసుకను సరఫరా చేస్తున్నారని చెబుతున్నారు. ఇప్పుడు ఆ సమస్య మంత్రి దాకా రావడంతో అధికార యంత్రాంగం కదిలిందని అంటున్నారు.

రూ.50 వేల కోట్లతో కొత్త పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ

వలస కార్మికులకు వారి స్వస్థలాల్లోనే ఉపాధిని కల్పించేందుకు ఉద్దేశించిన ‘గరీబ్ కళ్యాణ్ రోజ్ ‌గార్ యోజన’ పథకాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బీహార్‌ లోని ఖగారియా జిల్లాలో ప్రధాని ఈ పథకాన్ని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెంచడమే ఈ పథకం లక్ష్యమన్న మోడీ.. ఇందుకోసం రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. లాక్ డౌన్ కారణంగా పనులు లేక, ఎన్నో అవస్థలు పడుతూ స్వస్థలాలకు బయలుదేరిన వలస కార్మికుల అవస్థలు తనను కదిలించాయని, వారి కోసమే ఈ పథకమని మోడీ వ్యాఖ్యానించారు.  ఇప్పటివరకూ పట్టణాల పురోగతి కోసం పాటు పడిన వలస కార్మికులు.. ఇక నుంచి తమ ప్రాంతాన్ని ప్రగతి పథంలో నిలపాలని మోడీ ఆకాంక్షించారు. పల్లె ప్రాంతాల్లో నివసిస్తోన్న శ్రామికులైన మన సోదర సోదరీమణులకు ఈ పథకాన్ని అంకితం చేస్తున్నానని మోడీ తెలిపారు. ప్రభుత్వ కాంట్రాక్టు పనుల ద్వారా మౌలిక వసతులను అభివృద్ధి పరచాలని నిర్ణయించామని, ఇందుకు రూ. 50 వేల కోట్లను ఖర్చు చేస్తామని మోడీ వెల్లడించారు. ఆరు రాష్ట్రాల్లోని 116 జిల్లాలో ఈ పథకం అమలవుతుందన్నారు. ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, ఝార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాలలో వలస కూలీలు ఎక్కువగా ఉన్నారు. వీరికి ప్రయోజనం చేకూర్చేలా  ‘గరీబ్ కళ్యాణ్ రోజ్ ‌గార్ యోజన’ ఉంటుంది.

ఏపీలో ఆ మూడు జిల్లాల పరిధిలో మళ్లీ లాక్‌డౌన్

ఏపీలో క‌రోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరగుతుండటంతో ప్రకాశం, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలో మళ్లీ లాక్‌డౌన్‌ ప్రకటించారు అధికారులు. అనంతపురం జిల్లాలోని 8 మండలాల్లో లాక్‌డౌన్‌ విధిస్తూ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం నుంచి వారం రోజుల పాటు అనంతపురం జిల్లా కేంద్రం సహా ధర్మవరం, తాడిపత్రి, యాడికి, పామిడి, హిందూపురం, కదిరి, గుంతకల్లులో లాక్‌డౌన్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇక‌, ప్రకాశం జిల్లాలో వైరస్‌ వ్యాప్తి ఎక్కువ‌గా ఉన్న ఒంగోలు, చీరాలలో ఆదివారం నుంచి రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ భాస్కర్‌ ‌ప్ర‌క‌టించారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లా పలాసలోనూ అధికారులు లాక్‌డౌన్‌ ప్రకటించారు. పలాసకు చెందిన ఒకరి సంస్మరణ కార్యక్రమం ఈ నెల 11న జరిగింది.  ఇక్క‌డ దాదాపు 200 మందికి భోజనాలు పెట్ట‌గా.. ఈ కార్యక్రమానికి హైదరాబాద్‌ నుంచి వచ్చిన బంధువుకు ఆ త‌ర్వాత క‌రోనా సోకినట్లు తేలింది. అంతేకాదు.. ఆ కార్యక్రమానికి హాజరైన ఓ వ్యాపారికి కూడా క‌రోనా పాజిటివ్ గా తేలింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు.. పలాస, కాశీబుగ్గలను తొలుత కట్టడి ప్రాంతాలుగా గుర్తించారు. సంస్మరణ కార్యక్రమానికి ఎక్కువమంది హాజరైనందున నియోజకవర్గ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ నివాస్‌ ప్రకటించారు.

కల్నల్ సంతోష్ బాబు ఇంటికి వెళ్లి సహాయం అందించనున్న సీఎం కేసీఆర్

గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో మరణించిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం తరుఫున సహాయం ప్రకటించారు. సంతోష్ బాబు కుటుంబానికి రూ.5 కోట్ల నగదు, నివాస స్థలం, ఆయన భార్యకు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తానే స్వయంగా సంతోష్ బాబు ఇంటికి వెళ్లి సహాయం అందించనున్నట్లు సీఎం వెల్లడించారు. ఇదే ఘర్షణలో మరణించిన మిగతా 19 మంది కుటుంబ సభ్యులకు కూడా ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తరుఫున కేంద్ర రక్షణ మంత్రి ద్వారా అందిస్తామని సీఎం వెల్లడించారు. సరిహద్దుల్లో దేశ రక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సైనికులకు యావత్ దేశం అండగా నిలవాలి. వీర మరణం పొందిన సైనికుల కుటుంబాలను ఆదుకోవాలి. తద్వారా సైనికుల్లో ఆత్మ విశ్వాసం, వారి కుటుంబాల్లో భరోసా నింపాలి. దేశమంతా మీ వెంటనే ఉందనే సందేశం అందించాలి అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. వీర మరణం పొందిన సైనికులకు కేంద్ర ప్రభుత్వం ఎలాగూ సాయం చేస్తుంది. కానీ రాష్ట్రాలు కూడా సహాయ సహకారాలు అందించాలి. అప్పుడే సైనికులకు, వారి కుటుంబాలకు దేశం మా వెంట నిలుస్తుందనే నమ్మకం కుదురుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

సరిహద్దుల్లో పాక్ రహస్య డ్రోన్ కూల్చివేత

భారత్-చైనా సరిహద్దులో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ.. భారత్ సరిహద్దులో పాకిస్థాన్‌ రహస్యంగా డ్రోన్ తో ఫోటోలు తీయడానికి ప్రయత్నించడం కలకలం రేపింది. సరిహద్దులో అనుమానాస్పదంగా తిరుగుతున్న డ్రోన్‌ను భారత భద్రతా బలగాలు కూల్చివేశాయి. జమ్ముూకశ్మీర్‌లోని కథువా జిల్లా హీరానగర్  సెక్టారులోని రథువా వద్ద శనివారం ఉదయం పాక్ కి చెందిన డ్రోన్ ఎగురుతూ కనిపించింది. రహస్యంగా ఫొటోలు తీస్తున్నట్టు గుర్తించిన బీఎస్ఎఫ్ 19 బెటాలియన్ కు చెందిన జవాన్లు దానిపై 8 రౌండ్ల కాల్పులు జరిపి దాన్ని కూల్చివేశారు. సరిహద్దుల్లో రహస్యంగా ఫొటోలు చిత్రీకరించేందుకే పాక్ దానిని పంపించి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణలో ఒక్కరోజులో 500 కేసులు.. ప్రతి ఐదు శాంపిళ్లలో ఒకటి పాజిటివ్

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. ఒక్కరోజులో దాదాపు 500 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో 499 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు మొత్తం 2,477 శాంపిల్స్ ను పరీక్షించగా 499 మందికి కరోనా నిర్దారణయింది. అంటే, ప్రతి ఐదు శాంపిళ్లలో ఒకటి పాజిటివ్ గా‌ వచ్చింది. ఇదే మరింత ఆందోళన కలిగిస్తోంది. ఏపీలో 15,000 శాంపిల్స్ కి 400 కేసులు అలా నమోదవుతున్నాయి. కానీ, తెలంగాణలో 2,477 శాంపిల్స్ కే 499 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థంచేసుకోవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో కరోనా తీవ్రత మరింత కలవరపెడుతోంది. గత 24 గంటల్లో నమోదైన 499 కేసుల్లో.. గ్రేటర్‌ హైదరాబాద్‌లో 329, రంగారెడ్డి జిల్లాలో 129 ఉన్నాయి. గత 24 గంటల్లో ఈ రెండు జిల్లాల్లోనే 458 కేసులు నమోదయ్యాయి.

రాజ్యసభ ఎన్నికలు.. నాలుగు స్ధానాల్లో వైసీపీ విజయం

ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ నాలుగు స్ధానాల్లో విజయం సాధించింది. రాజ్యసభ ఎన్నికల్లో నలుగురు వైసీపీ అభ్యర్ధులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి,  మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వానీ విజయం సాధించారు. మొత్తం 175 ఓట్లకు గాను 173 ఓట్లు పోలయ్యాయి. గెలుపొందిన ఒక్కొక్క అభ్యర్థికి 38 ఓట్లు రాగా.. టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్యకు 17 ఓట్లు వచ్చాయి. నాలుగు ఓట్లు చెల్లుబాటు కాలేదు. పోలింగ్‌ ఉదయం 9 గంటలకు ప్రారంభయింది. సాయంత్రం నాలుగు గంటల వరకూ కొనసాగింది. సాయంత్రం ఐదు గంటలకు ఓట్ల లెక్కించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

నాడు జగన్.. నేడు లోకేష్.. అంతా సేమ్ టు సేమ్

అది 2017 జనవరి 26 న ప్రత్యేక హోదా అంశం పై ఆందోళన లో పాల్గొనేందుకు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ విశాఖకు వెళ్లగా ఎయిర్ పోర్ట్ లో ఆయనను అడ్డుకున్నపోలీసులను ఉద్దేశించి "ఇంకా రెండే రెండు సంవత్సరాలు.. అందరినీ గుర్తుపెట్టుకుంటాను. ఎవ్వరినీ మరిచిపోను" అంటూ ఫైర్ అయ్యారు. తర్వాత రెండేళ్లు కష్ట పడి పాదయాత్ర చేసి ఏపీకి సీఎం అయ్యారు. సీన్ కట్ చేస్తే.. 2020.. "అన్నీ రాసుకున్నాం వడ్డీతో సహా చెల్లిస్తాం ఎవరిని వదిలిపెట్టం. మమ్మల్ని మీరేం పీకలేరు" ఈ మాటలన్నది మరెవరో కాదు వైసిపి నేతలు తరచూ పప్పు అని ఎగతాళి చేసే టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్. గత కొంత కాలంగా టీడీపీ కీలక నేతలను టార్గెట్ చేస్తూ వారిని పలు కేసులలో ఇరికించి ఇబ్బంది పెడుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా మొన్న తాడిపత్రిలో జెసి కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ లోకేష్ ఎపి ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు. అంతే కాదు అయన మాటల్లో తడబాటు స్థానం లో ఒక పరిపక్వత.. ఆవేశం కనిపిస్తున్నాయి. గతంలో జరిగిన సంఘటనలను ప్రస్తావిస్తూ రాజకీయ ప్రత్యర్థులను అయన ఇరకాటంలో పెడుతున్నారు. చంద్రబాబు తర్వాత టీడీపీ పరిస్థితి ఏంటి అని సందేహ పడే వారందరికీ అయన తాజాగా వ్యవహరిస్తున్న తీరు జవాబు చెపుతున్నట్లుగా కనిపిస్తోంది. అధికార పక్షం వేధింపులతో సతమతమవుతున్నపార్టీ కేడర్ కు నిత్యం అండగా ఉంటూనే తాజాగా అగ్రెసివ్ మూడ్ లో ఉన్న లోకేష్ ని చూసి టీడీపీ కేడర్ ఐతే ఫుల్ జోష్ లో ఉంది. ఫైబర్ గ్రిడ్ కు సంబంధించిన సెట్ టాప్ బాక్సుల్లో అవినీతి జరిగిందనీ, అందులో లోకేశ్ ప్రమేయముందనీ అధికార వైసీపీ నేతలు చేసిన ఆరోపణలపైనా ఆయన ఫైర్ అయ్యారు. ఫైబర్ గ్రిడ్ ఐటీ శాఖ పరిధిలోకి రాదనే విషయం వైసీపీ నేతలకు తెలియకపోవటం శోచనీయమని ఎద్దేవా చేశారు. అలాంటి నాయకులు అధికారం చెలాయిస్తుండటం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని ఆయనన్నారు. ఈ విధంగా లోకేశ్ దూకుడు పెంచడం టీడీపీ శ్రేణుల్లో ధైర్యాన్ని ఉత్సాహాన్ని నింపింది.

మరింత క్షీణించిన ఢిల్లీ ఆరోగ్య మంత్రి ఆరోగ్యం

ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ కరోనా మహమ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన ఆరోగ్యం క్షీణించినట్టు వైద్యులు తెలిపారు. మూడు రోజుల క్రితం తీవ్ర జ్వరం, శ్వాసపరమైన ఇబ్బందులతో ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో చేరిన సత్యేందర్ జైన్‌కు కరోనా‌ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆయనకు జ్వరం తగ్గకపోగా, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని, శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాని వైద్యులు తెలిపారు. న్యూమోనియా తీవ్రత ఎక్కువయినట్టు పేర్కొన్నారు. సాధారణంగా ఆక్సిజన్ స్థాయి 95 ఉండాలి.. కానీ, ఆయనకు 89కి పడిపోయిందని తెలిపారు. సత్యేందర్ జైన్ ఆరోగ్యం కొంత మెరుగుపడినట్టు గురువారం వెల్లడించారు. అంతలోనే మళ్లీ ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం సత్యేందర్ జైన్‌ను సాకేత్‌లోని మ్యాక్స్ హాస్పిటల్‌కు తరలించి.. అక్కడ ఆయనకు ప్లాస్మా చికిత్స చేయనున్నారని సమాచారం.

రాజ్యసభ ఎన్నికల వేళ టీడీపీకి షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే!!

ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పోరులో వైసీపీ నుండి నలుగురు, టీడీపీ నుండి ఒకరు బరిలో ఉన్నారు. అయితే, ఓడిపోతారని తెలిసి కూడా టీడీపీ ఎన్నికల బరిలోకి దిగి, కుల రాజకీయాలు చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే, అసలు అసెంబ్లీలో టీడీపీ బలమే 23 అంటే.. దానికి తోడు కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలి గిరి వంటి ఎమ్మెల్యేలు టీడీపీకి దూరం జరిగారు. ఇది చాలదు అన్నట్టు ఈరోజు ఇద్దరు ఎమ్మెల్యేలు పోలింగ్ కి దూరమయ్యారు. ఈఎస్ఐ స్కాం ఆరోపణలతో అరెస్టై ప్రస్తుతం అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడు ఓటింగ్ కి రాలేకపోయారు. అలాగే, ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కూడా ఓటు వేయలేదు. కరోనా నేపథ్యంలో సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్న తాను రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ లో పాల్గొన్నలేకపోతున్నాను అంటూ అనగాని సత్యప్రసాద్ టీడీపీ అధినేత చంద్రబాబుకు లేఖ ద్వారా తేలియజేశారు. ఇటీవల వ్యాపార రీత్యా తెలంగాణ జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డిని కలిశానని తెలిపారు. ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో తాను కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సెల్ఫ్ క్వారంటైన్ లో‌ ఉంటున్నానని.. వైద్యుల సలహా మేరకు ఓటింగ్‌కు హాజరు కాలేకపోతున్నానని లేఖలో పేర్కొన్నారు. కాగా, అనగాని సత్యప్రసాద్ పార్టీ మారుతున్నారంటూ ఇటీవల ప్రచారం జరిగింది. దీంతో, ఆయన నిజంగా కరోనా కారణంగానే ఓటింగ్ కి దూరంగా ఉన్నారా? లేక మరేదైనా కారణముందా? అన్న చర్చలు మొదలయ్యాయి.

చంద్రబాబు కథ ఇక ముగిసినట్లే: బొత్స

ఏపీ అసెంబ్లీ లో ఈ రోజు రాజ్యసభ ఎన్నికల హడావిడి నడుస్తోంది. ఈ సందర్బంగా మంత్రి బొత్స టీడీపీ అధినేత చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేసారు. చంద్రబాబు రాజకీయ పుస్తకం పేజీ చిరిగిపోయిందని, ఆయన రాజకీయ జీవితంలో ఇక కొత్త పేజీలు లేవని బొత్స తీవ్ర వ్యాఖ్యలు చేసారు. గవర్నర్ ప్రసంగం వినటం ఇష్టం లేని బాబు.. మళ్ళీ అదే గవర్నరును ఎలా కలుస్తారని ఆయన ప్రశ్నించారు. రాజ్యసభ ఎన్నికలలో తగినంత బలం లేదని తెలిసినా టిడిపి అభ్యర్దిని నిలపటం నీచమని మంత్రి బొత్స బాబు పై మండిపడ్డారు. గతంలో సంఖ్యాబలం ఉన్నప్పుడు దళితులు గుర్తుకు రాలేదని, ఐతే సంఖ్యాబలం లేనప్పుడు మాత్రమే గుర్తుకొచ్చినట్లున్నారని అన్నారు. చంద్రబాబు అంత మోసగాడు రాజకీయాలలో ఎవరూ లేరని...ఆయన జీవితం అంతా కుట్రల మయమేనని బొత్స విరుచుకుపడ్డారు.

మహిళలు ఉన్నారనే విచక్షణ కూడా లేకుండా మంత్రులు అసభ్యంగా ప్రవర్తించారు

ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ విమర్శలు గుప్పించారు. యాక్టివ్ గా ఉండే ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేసి.. తప్పుడు కేసుల్లో ఇరికించి, బెదిరించి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం చేశారు. శాసనమండలిని కూడా దుర్వినియోగం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ద్రవ్య వినిమయ బిల్లును పక్కన పెట్టి.. సీఆర్డీయే, మూడు రాజధానుల బిల్లును పాస్ చేయించుకోవడానికే తహతహలాడారని దుయ్యబట్టారు. ఈ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని గత మండలిలో తీర్మానం చేస్తే.. ఆ తీర్మానం అమలు కాకుండా కార్యదర్శి ద్వారా అడ్డుకున్నారని మండిపడ్డారు. ఇదే అంశంపై కోర్టులో విచారణ జరిగినప్పుడు.. ఈ బిల్లులు సెలక్ట్ కమిటీలో ఉన్నాయని ఏజీ ఒప్పుకున్న విషయాన్ని కనకమేడల గుర్తు చేశారు. బిల్లులు సెలెక్ట్ కమిటీలో ఉన్నప్పుడు.. మళ్లీ మండలిలో బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలనుకోవడంలో ప్రభుత్వం ఉద్దేశమేంటని కనకమేడల ప్రశ్నించారు. ప్రభుత్వం అనుకున్నది జరగకపోవడంతో మండలిలో విపక్ష సభ్యులపై దాడికి దిగారని, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ లపై బెదిరింపులకు దిగారని కనకమేడల విమర్శించారు. మండలికి సంబంధంలేని 16 మంది మంత్రులు ఎందుకు వెళ్లారని, టీడీపీ సభ్యులపై దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. సభలో మహిళలు ఉన్నారనే విచక్షణ కూడా లేకుండా మంత్రులు అసభ్యంగా ప్రవర్తించారని కనకమేడల మండిపడ్డారు.

హీరో సుశాంత్ సింగ్ మరణాన్ని తట్టుకోలేక విశాఖ యువతి ఆత్మహత్య

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణాన్ని తట్టుకోలేక మనస్తాపానికి గురై విశాఖకు చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు పాల్పడినప్పటి నుంచి ఆయనకు సంబంధించిన వీడియోలు టిక్‌టాక్‌లో చూస్తూ ఆ యువతి డిప్రెషన్‌కు గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. మల్కాపురం మండలం శ్రీహరిపురానికి చెందిన సదరు యువతి ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె సుశాంత్‌ సింగ్ కు అభిమాని. ఆమె పదే పదే టిక్‌టాక్‌ వీడియోలు చూస్తుండేది. కొద్ది రోజులుగా సుశాంత్ సింగ్ కు సంబంధించిన వీడియోలను పదే పదే టిక్‌టాక్‌లో చూసింది. దీంతో తీవ్ర డిప్రెషన్‌కు గురై ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. అనంతరం ఆమె మొబైల్‌ను పరిశీలించి సుశాంత్ సింగ్ మరణమే ఆమె ఆత్మహత్యకు కారణమని ప్రాథమిక అంచనాకు వచ్చారు.

ఓటు వేయడానికి వచ్చిన కరోనా పాజిటివ్ ఎమ్మెల్యే..

ఈ రోజు దేశంలోని పలు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నిలకలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా కొన్ని చోట్ల ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ లో జరుగుతున్న పోలింగ్ లో కరోనా సోకిన ఒక ఎమ్మెల్యే పీపీఈ కిట్ ధరించి ఓటు వేయడానికి వచ్చారు. అసెంబ్లీ లో పార్టీల బలాబలాలు సమానం గా ఉన్న నేపధ్యం లో ప్రతి ఓటు కూడా విలువైనది కావడం తో తప్పని సరి పరిస్థితుల్లో ఆ ఎమ్మెల్యే ఓటు వేయడానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్న ఆ ఎమ్మెల్యే పీపీఈ కిట్ ధరించి పూర్తి రక్షణ తో వచ్చి ఓటు వేశారు. ఐతే కరోనా పాజిటివ్ ఉన్న ఎమ్మెల్యే ఓటు వేయడానికి రావడంతో కొంత మంది ఆశ్చర్యా పోగా మరి కొంత మంది ఆందోళనకు గురి అయ్యారు. ఈ రోజు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ మూడు స్థానాలకు కాంగ్రెస్, బీజేపీ చెరో ఇద్దరు అభ్యర్థులను పోటీలో ఉండడంతో పోలింగ్ తప్పనిసరి అయింది. దీంతో రెండు పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

తాము అరిచేవాళ్లం కాదు కరిచేవాళ్లం.. బాలయ్య అన్నది ఆ కుక్కనేనా?

ఈ రోజు రాజ్యసభ ఎన్నికల కోసం ఏపీ అసెంబ్లీలో ఓటింగ్ జరుగుతోంది. ఈ సందర్బంగా ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ ఓటింగ్ లో టీడీపీ ఎమ్మెల్యేలు అందరికంటే ముందు బాలకృష్ణ తన ఓటుహక్కును వినియోగించుకొన్నారు. ఐతే అయన ఓటు వేయడానికి టిడిఎల్పీ కార్యాలయ సిబ్బందితో కలిసి వెళుతున్న సమయంలో ఓ కుక్క అరిచింది. దీంతో తన ఓటు హక్కు వినియోగించుకుని తిరిగి వస్తూ పక్కనున్న వారితో తాము అరిచేవాళ్లం కాదని... కరిచేవాళ్లమని అన్నారు. తాజాగా అయన చేసిన ఈ కామెంట్ హాట్ టాపిక్ గా మారింది. ఐతే ఆయన కేవలం కుక్క అరవడంపైనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? లేక మరేదైనా ఉద్దేశ్యంతో ఇలా అన్నారా అని ప్రస్తుతం అందరు దీని పై చర్చించుకుంటున్నారు.