ఘర్షణ వాతావరణం లో గవర్నర్ తో సిఎం కేసీఆర్ భేటీ..
posted on Jul 20, 2020 @ 5:16PM
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అటు ట్విట్టర్ లోను ఇటు పాలనా పరం గాను చాల యాక్టివ్ గా ఉన్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి ఎక్కువైన తరువాత ఆమె స్వయం గా నిమ్స్ కు వెళ్లి అక్కడ వైద్యులకు పిపియి కిట్లు వంటి రక్షణ పరికరాల లభ్యత, అలాగే కరోనా రోగుల కు అందుతున్న సేవలు వంటి అంశాల పై ఆరా తీశారు. ఐతే అదే సమయంలో సీఎం కేసీఆర్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. అంతేకాక తెలంగాణాలో కరోనా విషయంలో తాజా పరిస్థితి గురించి చర్చించేందుకు సీఎస్, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని రాజభవన్ కు రావాల్సిందిగా కోరగా వారిద్దరూ ఒక రోజు ఆలస్యంగా వెళ్లడంతో విమర్శలు తలెత్తాయి. దీని వెనుక సీఎం కేసీఆర్ హస్తం ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతే కాకుండా కరోనా నేపథ్యంలో ప్రయివేట్ హాస్పిటల్స్ ఎక్కువ మొత్తంలో బిల్లులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు రావడంతో ఆయా యాజమాన్యాలతో ఆమె చర్చించారు
ఇటువంటి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ ఈ రోజు గవర్నర్ తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై చర్చిస్తారని సమాచారం. దీంతో పాటుకొత్త సచివాలయ నిర్మాణం, కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు తదితర అంశాలపై కూడా అయన చర్చించనున్నట్టుగా సమాచారం.