తెలంగాణ కళాకారుల వివరాలు మొబైల్ యాప్ లో

కళల ఖజానాగా వర్ధిల్లుతున్న తెలంగాణలో ఉన్న ఎంతోమంది జానపద, గిరిజన, శాస్త్రీయ, లలిత కళాకారుల వివరాలు ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేసింది రాష్ట్ర సాంస్కృతిక శాఖ. ఇందుకు సంబంధించి ప్రత్యేక యాప్ T-CULTURE ను  తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (TITA) సహకారంతో రూపొందించారు. ఇందులో కళాకారులందరికీ సంభందించిన డేటా అందుబాటులో ఉంటుంది.  మొబైల్ యాప్ ద్వారా ప్రజలకు, కళాకారులను మరింత చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర పురపాలక, పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి కెటి రామారావు పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక మొబైల్ యాప్ ను రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక , సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. వినూత్న మొబైల్ యాప్ ను రూపొందించినందుకు శాఖ కార్యదర్శి   శ్రీనివాసరాజు, డైరెక్టర్ మామిడి హరికృష్ణ లను మంత్రి అభినందించారు. మారుమూల ప్రాంతాలలో ఉన్న కళాకారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆన్ లైన్  ద్వారా గుర్తింపు కార్డులను జారీ చేయడం సులభం అవుతుంది.   కళాకారుల డేటా బేస్ ను రూపొందించి వారి జన్మస్థలం, కళారూపం, వయస్సు, చదువు, సాధించిన విజయాలు వంటి విషయాలు అందుబాటులో ఉంచుతారు. ఈ యాప్ ద్వారా ID కార్డ్ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని MEE SEVA తో అనుసంధానం చేశామన్నారు. ID కార్డు కావాలనుకునే కళాకారులెవరైనా తమ వివరాలు, కళా ప్రదర్శన వివరాలు, వారి గురించి పత్రికలలో వచ్చిన కథనాలను మీ సేవ సెంటర్ లలో సమర్పించి 30 రోజులలో తమ ID కార్డ్ ను పొందవచ్చు. ఈ యాప్ 1 ఆగస్టు, 2020 నుండి అందుబాటులో ఉంటుంది. మొదటి కార్డు ను కవి, కళాకారుడు, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణకు అందించారు.

డోసుల రేసులో పెరుగుతున్న పోటీలు

కోవిద్ 19 వైరస్ తో అతి ఎక్కువగా ప్రభావితమైన అగ్రదేశాలు వ్యాక్సిన్ డోసులు కొనుగోలు చేసే రేసులో పోటీలు పడుతున్నాయి. వ్యాక్సిన్ తయారి కోసం ప్రపంచంలోని అనేక దేశాల్లోని 150కి పైగా సంస్థలు ప్రయోగాలు చేస్తున్నాయి. అయితే ఆక్స్ ఫర్డ్, రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తి చేసుకుని మార్కెట్ లోకి రావడానికి సిద్ధమవుతున్నాయి. అయితే పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ అందుబాటులోకి రాకముందే కరోనాతో తీవ్రంగా ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం చవిచూసిన అగ్రరాజ్యాలు తమ ప్రజలకు కావల్సిన స్థాయిలో వ్యాక్సిన్ డోసులు కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నాయి.  ఫైజర్‌, బియోఎన్‌టెక్‌ఎస్‌ఈ సంయుక్తంగా తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ కోసం డొనాల్డ్‌ ట్రంప్‌ పాలకవర్గం ఒప్పందం చేసుకుంది. యూఎస్‌ఎఫ్‌డీఏ ఆమోదం లభిస్తే డిసెంబర్‌లోగా అందించే 10 కోట్ల డోసులకు 200 కోట్ల డాలర్లు చెల్లించడానికి అమెరికా సిద్దంగా ఉంది. ఈ వ్యాక్సిన్ బాగా పనిచేసి సురక్షితమే అని స్పష్టమైన తర్వాత మరో 50కోట్ల డోసులు కొనడానికి ట్రంప్ రెడీగా ఉన్నాడు. వ్యాక్సిన్ ఏ దేశం అందుబాటులోకి తీసుకువచ్చినా ముందుగా తమ ప్రజలకు దానిని ఇచ్చేందుకు ట్రంప్ భారీగా కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే బ్రిటన్‌ తొమ్మిది కోట్ల డోసులకు ఒప్పందం కుదుర్చుకుంది. కొత్తగా నిమిషానికి 43 మంది .. ప్రపంచంలోనే ఎక్కువగా కరోనా కేసులు నమోదు అయిన దేశం అమెరికానే. ఇక్కడ నిమిషానికి 43 మంది కొత్తగా కోవిద్ 19 వైరస్ బారిన పడుతున్నారు.  దేశవ్యాప్తంగా కరోనా కేసులు 40 లక్షలు దాటిపోయాయి. లక్షా 47,342 మంది మరణించారు. దాదాపు 20లక్షల మంది రికవరీ అయ్యారు.

అయోధ్య రామమందిరం భూమిపూజ ఆపివేయాలని హైకోర్టులో పిల్ 

ప్రస్తుతం అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆగస్టు 5న ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం జరగనుంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆ ఏర్పాట్లలో నిమగ్నమైన వేళ.. భూమి పూజ ఆపాలంటూ అలహాబాద్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయింది. అన్‌లాక్ 2 గైడ్ లైన్స్ ప్రకారం ప్రార్థనా మందిరాల్లో సామూహిక వేడుకలు నిర్వహించకూడదని ఢిల్లీకి చెందిన లాయర్ సాకేత్ గోఖలే పిల్ వేశారు. ఎక్కువ మంది ప్రజలు ఒక్క చోట గుమిగూడితే వైరస్ మరింత వ్యాప్తి చెందే ప్రమాదముందని అందులో అయన పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని భూమి పూజ కార్యక్రమంపై స్టే విధించాలని హైకోర్టును కోరారు. ఇందులో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ను, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చారు. ఐతే ఈ పిల్‌ను చీఫ్ జస్టిస్ ఇప్పటి వరకు విచారణకు స్వీకరించలేదు. ఐతే హైకోర్టులో పిల్ వేసినందువల్ల, కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ఎక్కువ మందిని ఆహ్వానించకూడదని శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నిర్ణయించిన విషయం తెలిసిందే. కేవలం 150 మంది అతిథులు సహా 200 మంది మాత్రమే కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించింది.

ఆర్టికల్ 356ని కొని తెచ్చుకోవద్దు.. రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వచ్చే శుక్రవారంలోగా అమలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ ను ఉద్దేశించి వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థతో చీవాట్లు పెట్టించుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అనవసరంగా న్యాయవ్యవస్థలతో పెట్టుకుని ఆర్టికల్ 356ని కొని తెచ్చుకోవద్దని హెచ్చరించారు. కోర్టులకు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్లే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అన్నారు. మనది రాచరిక వ్యవస్థ కాదని, ప్రజాస్వామ్య దేశమని.. న్యాయ వ్యవస్థలను, కోర్టులను గౌరవిద్దామని చెప్పారు.  సుప్రీంకోర్టు నిర్ణయాన్ని గౌరవించి ఎస్ఈసీగా నిమ్మగడ్డను తిరిగి నియమించాలని కోరారు. కోర్టు తీర్పు మేరకు నిమ్మగడ్డను నియమిస్తే తప్పేముందని ప్రశ్నించారు. గవర్నర్ మాట వినలేదు.. కనీసం సుప్రీంకోర్టు తీర్పునైనా గౌరవించండి అని హితవు పలికారు. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయం సరైనదని.. కరోనా మహమ్మారి నుంచి ఆ నిర్ణయం ప్రజలను కాపాడిందని చెప్పారు. తాను సలహా ఇస్తే స్వీకరించరు. సలహాదారులు బోలెడంత మంది ఉన్నా.. వారేమో సరైన సలహాలు ఇవ్వరని ఎద్దేవా చేశారు. చెప్పుడు మాటలు విని ముఖ్యమంత్రి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేయడమే తన తప్పైపోయిందని  వ్యాఖ్యానించారు. 22 మంది ఎంపీలను మీకు అప్పగిస్తాం.. రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని ఢిల్లీకి వచ్చి వేడుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం మీద అవగాహన లేని కొంతమంది చేసే ఫిర్యాదులతో తనకు ఏమీ కాదని అన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధి గొంతును నొక్కే ప్రయత్నం చేయవద్దని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.

వ్యాధితో కొందరు.. భయంతో మరికొందరు

ప్రాణాలు హరిస్తున్న కరోనా ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న కరోనా ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది. ప్రజల ప్రాణాలను హరిస్తోంది. ఈ వ్యాధి పై జరుగుతున్న ప్రచారంతో ఇదో భయంకరమైన రోగంగా భావిస్తూ కరోనా పాజిటివ్ అని తెలియగానే కొందరు భయంతోనే చనిపోతున్నారు. కరోనా సోకి ఉంటుందని అనుమానించిన మామిడాల రాజా వెంకటరమణ (54) ఆత్మహత్య చేసుకున్నాడు. మంచిర్యాల విద్యాశాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఆయన కరోనా భయంతో ప్రాణాలు తీసుకున్నాడు. కరోనా భయంతో ఎయిర్‌‌‌‌లైన్స్ మాజీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌ శ్రీనగర్‌‌‌‌కాలనీలో ఎల్లారెడ్డి గూడకు చెందిన నాగేంద్ర (75) ఇండియన్ ఎయిర్‌‌‌‌లైన్స్‌‌లో పనిచేసి రిటైర్ ‌‌‌‌అయ్యారు. జర్వం, జలుబు, దగ్గుతో బాధపడుతున్న నాగేంద్రను కుటుంబసభ్యులు బుధవారం చెస్ట్ ‌‌హాస్పిటల్‌‌కి తీసుకెళ్లారు. పరీక్షల అనంతరం శ్రీనగర్‌‌‌‌కాలనీలోని ప్రైవేట్ హాస్పిటల్‌‌లో అడ్మిట్‌‌చేశారు. తనకు కరోనా సోకిందనే భయంతో  హాస్పిటల్ బిల్డింగ్‌‌ మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కరోనా వ్యాధి వచ్చిందని తెలిసిన క్షణంలోనే గుండెపోటుతో ఓ రిటైర్డ్ ‌‌ప్రభుత్వ ఉద్యోగి మృతిచెందారు. ములుగు జిల్లా ఏటూరు నాగారానికి చెందిన భాస్కర్‌‌‌‌(65) జ్వరం రాగా స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. వరంగల్ వెళ్ళాలని డాక్టర్ సూచించడంతో  వరంగల్ లోని ఎంజీఎంకు వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్ట్స్ మూడు రోజుల్లో వస్తాయని డాక్టర్లు చెప్పడంతో అక్కడే ఉన్న తన సోదరి ఇంటికి వెళ్లారు. ఈ నెల 22న సాయంత్రం భాస్కర్‌‌‌‌కు పాజిటివ్ ‌‌వచ్చిందని ట్రీట్మెంట్ కోసం ఎంజీఎం ఆసుపత్రికి రావాలని చెప్పడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబసభ్యులు ఎంజీఎం తీసుకెళ్ల‌గా పరీక్షించిన డాక్టర్లు చనిపోయినట్లు చెప్పారు. భయం వద్దు... తాజా లెక్కలను చూస్తే కరోనా బారిన పడుతున్నవారి కంటే కోలుకుంటున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. రికవరీ రేటు పెరుగుతోంది. మిగతా జబ్బుల మాదిరిగానే ఇది వైరస్ కారణంగా వచ్చే ఒక వ్యాధి మాత్రమే. అయితే ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపించే ఈ వ్యాధి కారక వైరస్ ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో కొద్దిగా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అయితే రెండు నుంచి మూడు వారాల పాటు సరైన జాగ్రత్తలు తీసుకుంటూ.. శరీరంలో ఆక్సిజన్ స్థాయిని గమనిస్తూ డాక్టర్ సలహాల ప్రకారం మందులు వేసుకుంటే తగ్గిపోతుంది. భయం అన్నది లేకుండా చికిత్స తీసుకుంటే చాలు.

తిరుమలలో తగ్గిన రద్దీ

గురుడసేవ ఆలయం మండపంలోనే ఎప్పుడు రద్దీగా ఉంటూ నమో వెంకటేశాయ అంటూ ప్రతిధ్వనించే ఏడు కొండలు కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ సమయంలో నిశబ్ధంగా మారాయి. లాక్ డౌన్ ఎత్తేసి ఆలయాల్లోకి భక్తులను అనుమతించిన తర్వాత శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య కొంత పెరిగినా.. టీటీడి ఉద్యోగులకు, అర్చకులకు కరోనా రావడంతో మళ్ళీ భక్తుల తాకిడి తగ్గింది. రోజూ లక్షలాది మంది సందర్శించుకునే తిరుమలలో వేల సంఖ్యలోనే దర్శనాలు అవుతున్నాయి. కరోనా కారణంగా దర్శనం టికెట్లను ఇవ్వడం లేదు. కేవలం ఆన్ లైన్లో గతంలో బుక్ చేసుకున్నవారిలో చాలామంది తమ దర్శనం టికెట్లను రద్దు చేసుకుంటున్నారు. ఇప్పటికే  ఆలయంలో జరగాల్సిన చాలా సేవలను రద్దు చేశారు. ప్రతి ఏటా గరుడ పంచమి రోజు గరుడ వాహనంపై తిరుమాఢ వీధుల్లో ఊరేగే స్వామి సేవను ఈ ఏడాది రంగనాయకుల మండపం వరకే పరిమిత చేస్తున్నారు.

నిమ్మగడ్డ కేసులో జగన్ సర్కార్ కు సుప్రీం కోర్టులో మరో షాక్

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా నిమ్మగడ్డ రమేశ్ ను కొనసాగించాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు ఈ రోజు నిరాకరించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను మీరు అమలు చేయాల్సిందేనంటూ జగన్ ప్రభుత్వాన్నిఈ సందర్భంగా ఆదేశించింది.  ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వ తీరు పై సుప్రీం కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. కేసులో వాదనల సందర్బంగా "అసలు ఏపీ లో ఏం జరుగుతోంది..?" అంటూ సుప్రీం కోర్టు పలుమార్లు వ్యాఖ్యానించింది. అసలు గవర్నర్ ఆదేశాలు ఇచ్చినా మీరు ఎందుకు అమలు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గవర్నర్ మీకు సలహాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది..? అని ఏపీ సర్కార్‌పై సుప్రీం కోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. వచ్చే శుక్రవారంలోపు హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని సుప్రీం కోర్టు తాజాగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా జడ్జీలను, జడ్జిమెంట్‌లను ఎటాక్ చేస్తున్నారని నిమ్మగడ్డ తరుఫు లాయర్ చెప్పటంతో ఆ క్లిప్పింగ్స్ తమకు కూడా ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆయనను కోరింది.  నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సీఎస్ కు లేఖ పంపిన సంగతి తెలిసిందే. అయితే, ఈ తీర్పు కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు ఉందని... ఆ తీర్పు కోసం తాము వేచి చూస్తున్నామని, ఒక రాజ్యాంగ పదవి కోరుతున్న వ్యక్తి సుప్రీం తీర్పు వచ్చే వరకు ఆగలేరా అంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఐతే తాజాగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఎలా అడుగు ముందుకు వేస్తుందో వేచి చూడాలి.

వర్షాకాలంలో వజ్రాల వేట

రాయలసీమలో విలువైన రాళ్ల కోసం రైతుల వెదుకులాట రతనాల సీమగా పెరుగాంచిన రాయలసీమలో వర్షాకాలం వచ్చిందంటే చాలు వజ్రాల వేట మొదలౌతుంది. తొలకరి చినుకులు పడగానే పొలాల వెంట పిల్లా పెద్ద అంతా విలువైన రాళ్ల కోసం వెదుకులాట ప్రారంభిస్తారు. అప్పడప్పుడు వారి అన్వేషణ ఫలించి వజ్రాలు దొరుకుతుంటాయి. ఎక్కువగా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో నెలల పాటు వేట కొనసాగుతుంది.  తాజాగా కర్నూలు జిల్లాలో ఓ రైతుకు వజ్రం లభించింది. మద్దికెర మండలం పెరవలిలో దొరికిన ఈ వజ్రం బరువు 2 క్యారెట్లు. గతంలో కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం పగిడిరాయి, బొల్లవానిపల్లె పొలాల్లో ఇద్దరికీ రెండు వజ్రాలు దొరికాయి.  ప్రతి ఏడాది వర్షాకాలంలో సాగే ఈ వజ్రాల, విలువైన రాళ్ల వేట రాయలసీమ ప్రాంతంలో మాములే. అయితే లక్షలాది రూపాయల విలువ చేసే ఈ వజ్రాలను రైతుల, స్థానిక ప్రజల నుంచి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. వీటి విలువ గురించి తెలిసిన వ్యాపారులు అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

కేటీఆర్ ను బర్త్ డే విషెస్ తో ముంచెత్తుతున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న తెలంగాణ మంత్రి కేటీఆర్ ను అటు రాజకీయ ప్రముఖులు, ఇటు సెలబ్రిటీలు బర్త్ డే విషెస్ తో ముంచెత్తుతున్నారు. ఈ సందర్భంగా " మై డియర్‌ బ్రదర్ తారక్ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మిమ్మల్ని దేవుడు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచాలని నేను ప్రార్థిస్తున్నాను" అంటూ ఏపీ సీఎం జగన్ ట్విట్టర్ ద్వారా విషెస్ అందించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ "పుట్టినరోజు శుభాకాంక్షలు డియర్ బ్రదర్‌ శ్రీ కేటీఆర్.. మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని చిల్కూరు బాలాజీని ప్రార్థిస్తున్నాను" శుభాకాంక్షలు తెలిపారు. గతంలో కేటీఆర్ తో వేదిక పంచుకున్న శ్రీమంతుడు మహేశ్ బాబు "హ్యాపీ బర్త్‌ డే కేటీఆర్.. అందరికీ స్ఫూర్తివంతమైన మీ నాయకత్వం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. మీరెప్పుడూ ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను" అని ట్విట్టర్ ద్వారా తన సందేశం పంపారు. వీరితో పాటు టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్ తన ట్విట్టర్ లో "పేదింటికి చిరునవ్వు.. నేతన్న కంటిచూపు.. భాగ్యనగరం బాద్షా.. ఐటీ సూటేసిన.. రాజనీతి రాకెట్టు.. అదరక బెదరక విశ్వవేదికలపై తెలంగాణ వాడిని వేడిని చాటిన ఉద్యమసేనాని.. తండ్రికి తగ్గ తనయుడు..  సిరిసిల్ల శ్రీమంతుడు.. అన్న కల్వకుంట్ల తారకరాముడికి జన్మదిన శుభాకాంక్షలు" అంటూ ట్వీట్ చేశారు.

అధికారుల అత్యుత్సాహం.. డోర్ల‌కు ఇనుప‌ రేకులు పెట్టి మేకులు కొట్టారు

క‌రోనా నియంత్ర‌ణ పేరుతో బెంగ‌ళూరులో అధికారులు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు. క‌రోనా సోకిన వారుండే ప్ర‌దేశాల‌ను అధికారులు కంటైన్మెంట్ జోన్లుగా ప్ర‌క‌టించి జ‌న‌సంచారాన్ని క‌ట్ట‌డి చేయ‌డం చూస్తున్నాం. అయితే, బెంగ‌ళూరు మ‌హాన‌గ‌ర పాలిక సిబ్బంది మాత్రం బాధితుల‌పై క‌క్ష‌గట్టిన‌ట్టు ప్రవర్తించారు. క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ వారు ఉన్నార‌నే కార‌ణంతో ఓ బిల్డింగ్‌ లో ఉన్న ఇళ్ల డోర్ల‌న్నింటికీ ఇనుప రేకులు అడ్డుగా పెట్టి మేకులు కొట్టారు. దీంతో ఆ బిల్డింగ్‌లో ఉన్న‌ కుటుంబాలు ఆందోళ‌న చెందాయి. ఇళ్ల‌ల్లో చిన్న‌పిల్ల‌లు, వృద్ధులు ఉన్నారు.. ఏదైనా అత్య‌వ‌స‌రం అయితే అప్ప‌టిక‌ప్పుడు వారిని ఆస్ప‌త్రికి ఎలా త‌ర‌లించాల‌ని ఆవేదన వ్యక్తం చేశారు. పొరపాటున అగ్ని ప్రమాదం లాంటివి సంభవిస్తే పరిస్థితి ఏంటని, దీనిపై అధికారులు వెంట‌నే  స్పందించాలంటూ ఆ బిల్డింగ్‌లో ఉండే ఓ వ్య‌క్తి ట్వీట్ చేశాడు. దీంతో అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. కాగా, ఈ ఘ‌ట‌న‌పై బెంగ‌ళూరు మ‌హాన‌గ‌ర పాలిక క‌మిష‌న‌ర్ ఎన్ మంజునాథ ప్ర‌సాద్ క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. క‌రోనా బాధితుల ఇళ్ల త‌లుపుల‌కు అడ్డంగా పెట్టిన రేకులను వెంట‌నే తొల‌గించాల‌ని సిబ్బందిని ఆదేశించిన‌ట్టు తెలిపారు. వైర‌స్ సోకిన వారిని కాపాడ‌టం, సోక‌ని వారిని సేఫ్‌ గా ఉంచే ఉద్దేశ్యంతోనే త‌మ సిబ్బంది అలా చేసార‌ని చెప్పుకొచ్చారు. బాధితులంద‌రిని తాము ఒకే ర‌కంగా గౌర‌విస్తామ‌ని స్పష్టం చేశారు.

గువాహటి సెంట్రల్ జైలులో 435 మంది ఖైదీలకు కరోనా

అసోం రాజధాని గువాహటిలోని సెంట్రల్ జైలులో 435 మంది ఖైదీలు కరోనా బారినపడ్డారు. ఇది జైలులోని మొత్తం ఖైదీల సంఖ్యలో 44 శాతం కావడం గమనార్హం. రాష్ట్రంలోని 10 జైళ్లలో 535 మంది ఖైదీలకు, గువాహటి జైలులో 435 మంది ఖైదీలకు కరోనా వైరస్ సోకినట్లు అసోం జైళ్ల శాఖ డీజీ దశరథదాస్ తెలిపారు. గువాహటి జైలులో ఖైదీల కోసం 200 పడకలతో కరోనా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అలాగే, లక్షణాలు లేని ఖైదీలను నాగాం ప్రత్యేక జైలులో ఉంచాలని నిర్ణయించినట్టు తెలిపారు. కరోనా నేపథ్యంలో కొంత మంది ఖైదీలను విడుదల చేయాలని  అధికారులు యోచిస్తున్నారు. గువాహటి తోపాటు నల్బరి, ధూబ్రీ, కరీంగంజ్, నార్త్ లఖింపూర్, గోలఘాట్, డిఫూ, ఉడాల్ గురి జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలు ఉన్నారని, దీంతో 376 మంది ఖైదీలను విడుదల చేయాలని అధికారులు యోచిస్తున్నారు. తొలుత అండర్ ట్రయల్ ఖైదీలను విడుదల చేసేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు.

మానవాళికి శుభవార్త.. మరో అడుగు దూరంలో ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ 

కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని కుదిపేస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతూ ఇటు సామాన్యులకు అటు ప్రభుత్వాలకు చుక్కలు చూపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో వ్యాక్సిన్ కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనికా సంస్థ సంయుక్తంగా తయారుచేసిన కరోనా వ్యాక్సిన్ తొలి రెండుదశల ట్రయల్స్ నూ విజయవంతంగా పూర్తి చేసుకోవడం తో ప్రపంచ మానవాళి ఆనందం లో ఉంది. గత ఏప్రిల్ నెల లో వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభం కాగా, మొదటి రెండు దశల ట్రయల్స్ ఫలితాలు రెండు వారాల క్రితం విడుదల అయ్యాయి. తాజాగా మూడవ దశ ట్రయల్స్ జరుగుతుండగా, అవి కూడా విజయవంతం అవుతున్నట్టుగా తెలుస్తోంది. మూడవ దశలో పెద్దఎత్తున వాలంటీర్లను సెలెక్ట్ చేసుకుని వారికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఐతే ముందుగా అందుతున్న ప్రాథమిక ఫలితాల ప్రకారం, ఆ వాలంటీర్ల శరీరంలో కరోనాను ఎదుర్కొనే నిరోధక శక్తి గణనీయంగా పెరిగింది. దీంతో ఫేజ్ 3 లో వచ్చిన డేటా పరిశీలించి దాని ఆధారంగా ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తయారీకి రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ప్రపంచానికి తాము హామీ ఇచ్చిన విధంగా బిలియన్ డోస్ లను అందించేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెపుతోంది. ఈ వ్యాక్సిన్ ను వీలైనంత త్వరగా మార్కెట్లోకి అందించాలని కృషి చేస్తోంది. ఐతే ఈ వైరస్ కొన్ని సంవత్సరాల పాటు ప్రపంచాన్ని వదిలి పెట్టకపోవచ్చని ఆరోగ్య రంగంలోని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఈ వ్యాక్సిన్ త్వరలోనే మార్కెట్లోకి రావాలని మానవాళి మొత్తం కోరుకుంటోంది.

కల్వకుంట్ల కవిత డ్రైవర్ కు కరోనా.. ప్రస్తుతం ఆమె హోమ్ ఐసోలేషన్

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత తగ్గడం లేదు. కామన్ మ్యాన్ నుండి వీఐపీల వరకు అందరిని చుట్టేస్తోంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం మొహమ్మద్ అలీ సహా పలువురు ఎమ్మెల్యేలు కూడా ఈ మహమ్మారి బారినపడ్డారు. తాజాగా, నిజామాబాద్ మాజీ ఎంపీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత కారు డ్రైవర్ కు కరోనా సోకడంతో ఆమె కూడా హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ఇది ఇలా ఉండగా తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య నిన్న 50 వేల మార్కును దాటేసాయి. అదే సమయంలో, ఇప్పటి వరకు 447 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 11,052 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

కేటీఆర్ పుట్టినరోజుకు డైరెక్టర్ బందూక్ లక్ష్మణ్ వినూత్న కానుక

తెలంగాణ రాష్ట్ర మంత్రి కె. తారకరామారావు పుట్టినరోజు సందర్భంగా బందూక్ సినిమా డైరెక్టర్ లక్ష్మణ్ వినూత్న బహుమతి సిద్ధం చేశారు. కెటీఆర్ జన్మదినమైన 24.07.76 రోజుతో కూడిన కరెన్షీ నోట్లని సేకరించి ఈ 2020 జూలై 24న కేటీఆర్ 44వ పుట్టినరోజున అందజేస్తున్నట్టు తెలిపారు. రూపాయి నోటు, ఐదురూపాయల నోటు, పదిరూపాయలనోటు, ఇరవైరూపాయల నోటు, యాబై రూపాయల నోటు, వంద రూపాయలు అలాగే రెండువందల రూపాయల నోట్ల వరకూ 24.07.76 ఒకే నంబర్ గల నోట్లని సేకరించారు. దీంతో పాటు కేటీఆర్ చిన్నతనం నుంచి ఇప్పటివరకు ఫొటోలను సేకరించి వాటిని చింతమడకలోని కేసీఆర్ ఇంటి బ్యాగ్రౌండ్తో అందమైన పోటో ఫ్రేముగా చేసారు. ఈ అరుదైన కానుకని కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా అందజేస్తున్నారు.

ఆ ఎంపీ సీటు పై కన్నేసిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ

తీవ్ర ఆరోపణల కారణంగా ఎస్వీబిసి చైర్మన్ పదవి కోల్పోయిన కమెడియన్ పృథ్వీ తాజాగా నరసాపురం లోకసభ సీటు గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం నరసాపురం ఎంపీగా ఉన్న రఘు రామకృష్ణం రాజుపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు లోకసభ స్పీకర్ ఓంబిర్లాను కోరిన సంగతి తెలిసిందే. ఐతే పృథ్వీ మాత్రం నర్సాపురం సీటుకు ఉప ఎన్నికలు వస్తాయని భావిస్తున్నట్లున్నారు. నరసాపురం ఎంపీ సీటుకు ఉప ఎన్నిక వస్తే ఆ సీటు తనదేనని ఆయన అన్నారు. లేటెస్ట్ గా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ సంగతి తెలిపారు. రఘురామకృష్ణమ రాజు విజయం కోసం తాము అహోరాత్రులు కష్టపడి పనిచేశామని, దానివల్లనే ఆయన ఇప్పుడు ఎంపిగా ఉన్నారని పృథ్వీ అన్నారు. ఐతే రఘురామ రాజు పార్టీపై తిరుగుబాటు చేసి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ఒక వేళ నర్సాపురం నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగితే తాను తప్పకుండా పోటీ చేసి గెలుస్తానని ఆయన అన్నారు. సీఎం జగన్ ను అడిగి తాను టికెట్ తెచ్చుకుంటానని ఆయన చెప్పారు. అయితే, రఘురామకృష్ణమ రాజు వ్యవహారం మాత్రం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసుపై రఘురామ రాజు ఇచ్చిన సమాధానం తో ఒక పక్క వైసిపి పార్టీ కూడా కష్టాలలో పడింది. మరో వైపు అయన వైసీపీలో కొనసాగుతూనే జగన్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలతో చెలరేగిపోతున్నారు.

రాజమండ్రి ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక జర్నలిస్ట్ మృతి

ఆక్సిజన్ కొరతతో గాలిలో కలిసిపోతున్న ప్రాణాలు కరోనా బారిన పడిన ప్రజలకు సరైన వైద్యం అందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంటుంది. సరైన వైద్యం అందడం లేదంటూ ఆసుపత్రి నుంచి మరీ రిపోర్టింగ్ చేసి చెప్పిన జర్నలిస్ట్ మనోజ్ సంఘటన మరవకముందే మరో జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో మరో సీనియర్ జర్నలిస్ట్ రాము ఆక్సిజన్ అందక మరణించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ లో టీవీ5 విలేకరిగా పదేళ్ల నుంచి పనిచేస్తున్న రాము(52) వారం రోజులుగా కరోనా బారిన పడ్డాడు. తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో రాజమండ్రి జిల్లా ఆస్పత్రిలో ఆయనను చేర్చారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురుకావడంతో ఆక్సిజన్ పెట్టాలని పదే పదే స్థానిక జర్నలిస్టులు డాక్టర్లను కోరినా ఫలితం లేకపోయింది. ఆసుపత్రిలో చేరిన రోగులకు సరిపోయే ఆక్సిజిన్ అందించే పరిస్థితులు లేవని చెప్పారు. ఆసుపత్రిలో అవసరమైన దానిలో 10శాతం కూడా సరఫరా చేయలేకపోయారు. దాంతో ఊపిరి అందక  విలవిల్లాడుతూ రాము తుదిశ్వాస విడిచాడు. ఈ ఆసుపత్రిలో ఇప్పటికే పదుల సంఖ్యలో కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని పదేపదే అధికారుల దృష్టికి తీసుకువచ్చే జర్నలిస్టు కూడా ఆక్సిజన్ అందక మరణించడంతో స్థానిక జర్నలిస్టుల్లో విషాదం అలుముకుంది. ఇప్పటికైనా ఆక్సిజన్ అందుబాటులో ఉంచకపోతే కరోనా  రోగులు పిట్టల్లా రాలిపోయే ప్రమాదం ఉంది. ఈ విషయంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ తక్షణం స్పందించాలని కోరుతున్నారు.

షాకింగ్.. ఏపీలో ఒకే రోజు 8 వేల కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. ఒకేరోజు దాదాపు 8 వేల కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 58,052 మందికి కరోనా పరీక్షలు చేయగా 7,998 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1391 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 1184, అనంతపురం జిల్లాలో 1016 కేసులు, కర్నూలు జిల్లాలో 904 కేసులు, పశ్చిమ గోదావరి జిల్లాలో 748 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 72,711 చేరింది.  గడిచిన 24 గంటల్లో 61 మంది కరోనాతో మరణించారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 884 మంది మృతి చెందారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 34,272గా ఉంది.

9 ఏళ్ల బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారం

నెల్లూరు జిల్లాలో దారుణ‌మైన ఘ‌ట‌న జరిగింది. బాలికపై ఓ గ్రామ వాలంటీర్ అఘాయిత్యానికి తెగబడ్డాడు. పొదలకూరు మండలం పెదరాజుపాళెంలో 9 ఏళ్ల మైనర్ బాలికపై గ్రామ వాలంటీర్ పవన్‌కళ్యాణ్ అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో బాధితురాలి తల్లిదండ్రులు వెంట‌నే ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి చూసి చ‌లించిపోయిన వైద్యులు.. పోలీస్‌ స్టేషన్‌ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి వెళ్లి బాలికను పరిశీలించారు. నిర్భయ చ‌ట్టం కింద కేసు నమోదు చేసి వాలంటీర్ పవన్‌కల్యాణ్‌ ను అదుపులోకి తీసుకున్నారు.