కొంపముంచిన వైసీపీ యువనేత బర్త్ డే పార్టీ..!!
posted on Jul 20, 2020 @ 5:51PM
కరోనా మహమ్మారి దెబ్బకి ప్రజలు ప్రాణ భయంతో అల్లాడుతుంటే.. మరోవైపు కొందరు అత్యుత్సాహానికి పోయి పుట్టినరోజు వేడుకలు అంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో కరోనా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా హాట్‌స్పాట్ అయిన తూర్పుగోదావరి జిల్లాలో అధికార పార్టీ వైసీపీకి చెందిన ఓ యువనేత పుట్టినరోజు వేడుకను ఆయన అనుచరులు ఘనంగా నిర్వహించారు. రావులపాలెం మండలం ఊబలంకలో జరిగిన ఈ బర్త్ డే వేడుకకు స్థానిక కార్యకర్తలు భారీగానే హాజరయ్యారు. అయితే, ఈ బర్త్ డే వేడుక దెబ్బకు పదుల సంఖ్యలో కరోనా బారినపడ్డారు.
బర్త్ డే వేడుకలో పాల్గొన్న పలువురు అనారోగ్యానికి గురయ్యారు. కొంతమందిలో కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోవడంతో పాజిటివ్ అని తేలింది. ఈనెల 17న ఊబలంక పీహెచ్‌సీలో నిర్వహించిన పరీక్షల్లో బర్త్ డే వేడుకలో పాల్గొన్న 25 మందితో పాటు ఆయా కుటుంబాల్లో మొత్తం 45 మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయినట్లు తెలుస్తోంది. ఈ వేడుకలో పాల్గొన్న మరో 81 మంది ఫలితాలు ఇంకా రాలేదని సమాచారం.
యువనేత పుట్టిన రోజు వేడుకల్లో పలువురు కీలక నేతలు, ప్రజా ప్రతినిధులు కూడా పొల్గొన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ బర్త్ డే వేడుకకు వెళ్లినవారిలో కలవరం మొదలైంది. మరోవైపు, ఆ వేడుక జరిగిన ఊబలంక గ్రామస్తులు కూడా భయంతో వణికిపోతున్నారు.