టీడీపీ నేత అచ్చన్నాయుడికి షాక్.. బెయిల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు 

ఈఎస్ఐ కుంభకోణం కేసులో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు ఈరోజు కొట్టేసింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రమేశ్ కుమార్, పితాని పీఏ మురళి, సుబ్బారావు బెయిల్ పిటిషన్లను కూడా హైకోర్టు తోసిపుచ్చింది. కేసుకు సంబంధించి రెండు పక్షాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు ఏసీబీ వాదనతో ఏకీభవించింది. ఈ కేసుకు సంబంధించిన ఇంకా అనేక మందిని అదుపులోకి తీసుకుని విచారించాల్సి ఉన్నందువల్ల.. నిందితులకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉందని హైకోర్టుకు వివరించింది. దీంతో అచ్చెన్నాయుడు సహా మరికొందరి బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం అచ్చెన్నాయుడు గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా విషయం తెలిసిందే.

పేద బాలికలకు స్మార్ట్ ఫోన్లు

ఆన్ లైన్ క్లాస్ లకు హజరయ్యేందుకు ఉచితంగా అందిస్తున్న పంజాబ్ ప్రభుత్వం కరోనా వ్యాప్తి కారణంగా దేశంలోని విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. ఈ ఏడాది విద్యాసంవత్సరం ఎప్పుడు ప్రారంభం అవుతుందో అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రకటించే పరిస్థితి లేదు. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం విద్యార్థులకు నష్టపోకుండా ఆన్‌లైన్ క్లాసులు ఏర్పాటుచేస్తున్నాయి. అయితే స్మార్ట్ ఫోన్ సదుపాయాలు లేని పేద విద్యార్థుల పరిస్థితి ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు అందచేయాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించింది. తమ రాష్ట్రంలోని పేద బాలికలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు అందిస్తోంది. అందుకోసం 50 వేల స్మార్ట్‌ఫోన్లను సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్  వీటిని  అందిస్తారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర అధికారిక ట్విట్టర్ ఖాతాలో ‘50,000 స్మార్ట్‌ఫోన్‌లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులను వినేందుకు ఇవి ఉపయోగపడతాయి. రాష్ట్రంలో 9 నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న బాలికలందరికీ ఈ ఫోన్లు అందజేయబడతాయి’ అని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ట్వీట్ చేశారు.  గతంలో మన రాష్ట్రంలో బాలికల డ్రాప్ అవుట్స్ ను అరికట్టాలని బాలికలకు సైకిల్స్ ఇచ్చారు. ప్రస్తుతం మారిన పరిస్థితులతో పంజాబ్ లో స్మార్ట ఫోన్లు ఇస్తున్నారు.

రాఫెల్ వచ్చేస్తోంది

భారత వైమానికదళంలో బ్రహ్మస్తం భారత వైమానిక దళంలో మరో అద్భతమైన అస్త్రం చేరబోతుంది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ విమానాల్లో అత్యంత ఆధునిక ఫైటర్ జెట్ గా గుర్తింపు పొందిన రాఫెల్ భారత్  భూభాగంపై ల్యాండ్ కానుంది. రెండు రోజుల కిందట ఫ్రాన్స్ లో టేకాఫ్ అయిన ఈ యుద్ధ విమానం హర్యానలోని అంబాలా ఎయిర్ బేస్ స్టేషన్ లోకు చేరుకోనున్నాయి. దేశ రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వైమానిక దళాధినేత రాకేష్ కుమార్ భడౌరియా, సైనిక ఉన్నతాధికారులు స్వాగతం పలకనున్నారు.  ఏడు వేలకు పైగా కిలోమీటర్ల దూర ప్రయాణించిన ఈ యుద్ధ విమానాలు గగనతలంలోనే ఇంధనం నింపుకోని సురక్షితంగా గమ్యస్థానం చేరుతున్నాయి.  అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఙానంతో రూపొందించిన రాఫెల్ జెట్ విమనాల తయారీ కోసం భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్‌తో  2016లో ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం 36 యుద్ధ విమానాల విలువ 58 వేల కోట్ల రూపాయలు. మనదేశం కొనుగోలు చేసిన 36 రాఫెల్ యుద్ధ విమానాల్లో ఐదు మాత్రమే ఇప్పుడు భారత్ కు చేరుకుంటున్నాయి. దేశ సరిహద్దుల్లో యుద్ధవాతావరణం అలుముకున్న ప్రస్తుత సమయంలో వీటిని సాధ్యమైనంత త్వరగా దేశ సరిహద్దుల్లోకి చేర్చే ప్రయత్నాలు వైమానిక దళం చేస్తోంది. రాఫెల్ యుద్ధవిమానం బరువు పది టన్నులు.  పొడవు 15.30 మీటర్లు, దీని రెక్కల పొడవు 10.90 మీటర్లు. ఎత్తు 5.30 మీటర్లు.  ఒకసారి ఇంధనం నింపితే నిరవధికంగా 3,700 కిలోమీటర్ల దూరం దూసుకుపోతుంది. గంటకు 1912కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్లే ఈ యుద్ధ విమానం 900కిలోల బరువును అవలీలగా తీసుకుపోగలదు. నెక్స్ జెనరేషన్ టెక్నాలజీతో రూపొందిన ఈ జెట్ ఫ్టైట్ విజువలు రేంజ్ కు మించిన దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా ఛేదిస్తాయి. రెండు ఇంజన్లతో పనిచేసే ఈ ఫైటర్ జెట్ ఎయిర్ టూ ఎయిర్, ఎయిర్ టూ ల్యాండ్, ఎయిర్ టూ సర్ఫెస్ లో ఉన్న లక్ష్యాలను ఛేదించే మిసైల్స్ ను ఇవి ప్రయోగిస్తాయి. హర్పూర్, అలారం, పీజీఎం 100,  సైడ్ విండర్, అపాచి, మేజిక్ అండ్ మైకా వంటి యుద్ధ సామాగ్రిని ఇవి గమ్యస్థానానికి అతి త్వరగా చేర్చే సామర్థ్యం ఉంది.  300 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించడానికి అనువైన ప్రత్యేక సాంకేతిక వ్యవస్థ ఈ యుద్ధ విమానాల్లో ఉంటుంది. శత్రుసేనలపై నిమిషానికి 2500 రౌండ్ల పాటు కాల్పులు జరిపేలా 30 ఎంఎం క్యానన్‌ను ఇవి సంధించగల సామర్ధ్యం వీటిలో ఉంది. వీటిలో మరో ప్రత్యేకత గగనతలం లోనే ఇంధనం నింపుకోగలవు.ఫ్రాన్స్‌తో భారత్ 2016లో ఒప్పందం చేసుకుంది. ఈ విమానాలు ఒక్కసారి ఇంధనాన్ని నింపుకుంటే 3,700 కి.మీ దూరం వరకు ప్రయాణం చేయగలవు.  పైలట్లకు రాత్రివేళల్లో స్పష్టంగా కనిపించేందుకు హెల్మెట్‌ మౌంటెడ్‌ డిస్ప్లే, రాడార్‌ రిసీవర్లు ఇందులో అమర్చారు. అంతేకాదు శత్రువుల సిగ్నల్‌ వ్యవస్థలకు అంతరాయం కలిగించే లో-బ్యాండ్‌ జామర్లు, ఇన్‌ఫ్రారెడ్‌ సెర్చ్‌, ట్రాకింగ్‌ లాంటి అత్యంత ఆధునిక సాంకేతిక వ్యవస్థలు రాఫెల్‌లో ఉన్నాయి. ఈ యుద్ధ విమానం అత్యంత ఎత్తైన ప్రదేశాల్లోనే కాదు అతిశీతల పరిస్థితుల్లో కూడా సమర్థంగా దూసుకుపోతాయి. మన దేశ సరిహద్దుల్లో ఉన్న ఎత్తైన మంచుపర్వతాల వెనుక పొంచి ఉండే శత్రుసైన్యాన్ని, వారి స్థావరాలను ఈ యుద్ధ విమానం నామరూపాలు లేకుండా చేయగలదు.

భార‌త్‌ లో 15 లక్షలు దాటిన కేసులు.. కరోనాపై పోరుకు ఫ్రాన్స్ సాయం

భార‌త్‌ లో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 48,513 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. అదే సమయంలో 768 మంది కరోనాతో మరణించారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 15,31,669 లక్షలకు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 34,193కి చేరింది. దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి 9,88,030 మంది కోలుకోగా, ప్రస్తుతం 5,09,447 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, కరోనా విజృంభణతో అల్లాడిపోతోన్న భారత్‌ కు  ఫ్రాన్స్‌ సాయం చేసింది. వెంటిలేటర్లు, టెస్ట్‌ కిట్లు, ఇతర వైద్య సామగ్రిని పంపించింది. భారత్‌ లోని ఫ్రాన్స్‌ రాయబారి ఇమ్యాన్యుయేల్‌ లెనైన్‌ వీటిని ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీకి అందజేశారు. ఫ్రాన్స్‌ నుంచి భారత్‌ కు 50 ఒసిరిస్‌3 వెంటిలేటర్లు, 70 యువెల్‌ 800 వెంటిలేటర్లు, 50 వేల టెస్ట్‌ కిట్లు అందాయి.

మూడు రాజధానులపై హైకోర్టుకెక్కిన సెక్రటేరియట్ ఉద్యోగులు

ఏపీలో మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ సవరణ బిల్లులు ఒక పక్క గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉండగా మరో పక్క ఏపీ సచివాలయ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా హైకోర్టులో పెండింగ్ లో ఉన్న రాజధాని తరలింపు కేసులో ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం తరపున ఆ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. రాజధాని తరలింపు ప్రక్రియను ఏ ఉద్యోగ సంఘం కూడా వ్యతిరేకించడం లేదని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాక ఆ పిటిషన్ లో రాజధాని తరలింపుపై అమరావతి పరిరక్షణ సమితి వేసిన పిటిషన్‌ను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు రాజధాని తరలింపు కేసులో ఒక పిటిషనర్ అయిన రాజధాని పరిరక్షణ సమితి తమ పిటిషన్ లో ఉద్యోగులపై హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిందని అయన అన్నారు. రాజధాని తరలింపు కోసం ఉద్యోగులకు ఇంటి రుణ సౌకర్యం, మెడికల్ సబ్సీడి వంటి సౌకర్యాలు ప్రభుత్వం ఇస్తుందని తాను ఉద్యోగుల మీటింగ్‌లో చెప్పినట్లుగా పిటిషనర్ హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. అంతే కాకుండా రాజధాని అనేది కేవలం భూములు ఇచ్చిన రైతుల సొంత వ్యవహారం కాదని అది మొత్తం రాష్ట్ర ప్రజలందరి హక్కు అని అయన స్పష్టం చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయంలో 114 సార్లు భూ కేటాయింపులు జరిగితే అమరావతి పరిరక్షణ సమితి స్పందించలేదని, కానీ ఇప్పుడు పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే మాత్రం అడ్డు పడుతుందని అయన విమర్శించారు. అంతే కాకుండా ఇప్పటికే అమరావతిలో రాజధానికి సంబంధించి 70 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పడం పూర్తిగా అవాస్తవమని తమ పిటిషన్‌లో అయన పేర్కొన్నారు. అమరావతి పరిరక్షణ సమితి ఇటువంటి ఆరోపణలతో తమ ప్రతిష్టను దెబ్బ తీస్తున్నారని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. అసలు అమరావతి పరిరక్షణ సమితి పేరుతో కొంత మంది రాజకీయ స్వప్రయోజనాలు, రియల్ ఎస్టేట్ ప్రయోజనాలను కాపాడటం కోసమే ఈ పిటిషన్ వేశారని దీనిలో ఏ విధమైన ప్రజా ప్రయోజనాలు లేవని అయన స్పష్టం చేశారు. రాజధాని తరలింపునకు ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అవాస్తవ ప్రచారం చేస్తున్నారని అయితే రాజధాని తరలింపునకు కేవలం రూ.70 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని అయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అమరావతి పరిరక్షణ సమితి వేసిన పిటిషన్‌ను కొట్టివేయడమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటి నిరాధార పిటిషన్లు వేయకుండా నివారించడానికి పిటిషనర్‌కు భారీ జరిమాన విధించాలని కోర్టుకు అయన విజ్ఞప్తి చేశారు.

వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు వైసీపీ నేత

కడపలోని సెంట్రల్ జైలు ఆవరణలో మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసు విచారణ కొనసాగుతోంది. కడప కేంద్రంగా ప్రముఖులను సీబీఐ బృందం విచారిస్తోంది. పులివెందుల వైసీపీ నేత దేవిరెడ్డి శంకర్‌ రెడ్డి బుధవారం ఉదయం సీబీఐ విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం సీబీఐ అధికారులు ఆయనను విచారిస్తున్నారు. నేడో రేపో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు వైఎస్ కుటుంబసభ్యులను కొందరిని విచారించనున్నట్లు తెలుస్తోంది. వైఎస్ కుటుంబసభ్యుల విచారణ అనంతరం మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిలను సీబీఐ బృందం విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

తెలంగాణ సీఎస్ పై హైకోర్టు ప్రశ్నల వర్షం

క‌రోనా మహమ్మారి అంశం పై త‌మ ఆదేశాల‌ను ఏమాత్రం ప‌ట్టించుకోవ‌టం లేదంటూ ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్న తెలంగాణ హైకోర్టు ముందు సీఎస్ సోమేశ్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య అధికారులు, జిహెచ్ఎంసి కమిషనర్ తో సహా ఈరోజు హ‌జ‌ర‌య్యారు. హై కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ‌వీరంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా కోర్టు తమ ఆదేశాలను ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని సీఎస్ పై ప్రశ్నల వర్షం కురిపించింది. కోర్టు అడిగిన ప్రశ్నలకు సీఎస్ సోమేష్ కుమార్ సమాధానం చెప్పారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టుకు సీఎస్ వివరించారు. ఈ విచారణలో రాష్ట్రం ‌లో కరోనా పరిస్థితులపై ప్ర‌భుత్వానికి హైకోర్టు కీల‌క సూచ‌న‌లు చేసింది. ఐ సి ఎం ఆర్, డబ్ల్యు హెచ్ ఓ గైడ్‌లైన్స్‌ ను తూ.చా. తప్పకుండా పాటించాలని కోర్టు ఆదేశించింది. అదే విధంగా కరోనా హెల్త్ బులెటిన్ లో తప్పులు లేకుండా చూడాలని ప్రతి రోజు కరోనా సమాచారాన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం చేయాలని సూచించింది. గాంధీ ఆసుపత్రిలో కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారా లేదా అని కూడ హైకోర్టు ప్రశ్నించింది. ... విచార‌ణ సంద‌ర్భంగా డ‌బ్బులు చెల్లించుకునే ప‌రిస్థితుల్లో లేని పేద‌వారి క్వారంటైన్ కోసం ఫంక్షన్ హాల్స్ ,కమ్యూనిటీ సెంటర్స్, వెల్ఫేర్ అసోసియేషన్ సెంటర్స్ ను వాడుకోవాలని ప్రభుత్వానికి న్యాయ‌స్థానం సూచించింది. అలాగే క‌రోనా రోగుల‌ను హాస్పిటల్‌లో చేర్చుకునే పద్ధతిని మరింత సులభ తరం చేస్తామని విచార‌ణ సంద‌ర్భంగా సీఎస్ కోర్టుకు తెలిపారు. కరోనాకు సంబంధించి ఇప్పటి వరకు ప్రైవేట్ హాస్పిటల్స్‌లో వైద్యం గురించి 726 ఫిర్యాదులు అందిన‌ట్టు అయన చెప్పారు.వారందరికీ ఇప్పటికే నోటీసులు ఇచ్చి విచారణ చేస్తున్నామని అయన కోర్టుకు తెలిపారు.అలాగే ప్రతీ ఆస్ప‌త్రి వ‌ద్ద డిస్‌ప్లే బోర్డులనూ ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎక్కువగా 21 నుంచి 50 ఏళ్ల మ‌ధ్య ఉన్న‌వారే కరోనా బారిన పడుతున్నారన్న సీఎస్.. దాన్ని నివారించేందుకు అన్ని చర్యలు చేపడుతున్న‌ట్టు తెలిపారు. రాపిడ్ కిట్ల వినియోగంపైనా హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఇప్పటికే రాష్ట్రంలో రాపిడ్ కిట్లు వాడుతున్న‌ట్టు తెలిపిన అయన ప్రస్తుతం రాష్ట్రంలో 2 లక్షల రాపిడ్ కిట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మరో 4 లక్షల కిట్ల కోసం ఆర్డర్ చేశామని తెలిపారు. అయితే రాపిడ్ కిట్లతో ఫ‌లితం 40 శాతం మాత్రమే కరెక్ట్ గా వస్తుందన్న కోర్టు…రాజస్థాన్‌లో ఇప్పటికే రాపిడ్ కిట్ల వాడకం ఆపేసిన‌ట్టు గుర్తు చేసింది. రాష్ట్రంలో కూడా రాపిడ్ కిట్ల వాడకంపై నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన అన్ని ఆదేశాలను తప్పని సరిగా అమలు చేస్తామని ఈ సందర్భంగా సీఎస్ కోర్టుకు హామీ ఇచ్చారు. దీంతో తమ ఆదేశాల‌ను అమలు చేసిన తర్వాత దానికి సంబంధించిన పూర్తి స్థాయి రిపోర్ట్‌ను సమర్పించాలని సీఎస్‌ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్ట్ 13 కు వాయిదా వేసింది.

ఏపీలో సెప్టెంబరు 5న పాఠశాలలు ప్రారంభం

కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా పాఠశాలలు మూత పడిన సంగతి తెలిసిందే. అయితే, ఏపీలో సెప్టెంబరు 5న పాఠశాలలు ప్రారంభం అవతాయని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఆగస్టు 31వ తేదీ నాటికి పాఠశాలల్లో నాడు-నేడు పనుల పూర్తి కావాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. నాడు-నేడు పనులపై రెండు రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అయితే, ఏపీలో రోజూ వేలల్లో కరోనా కేసులు నమోదవుతున్న తరుణంలో సీఎం చెప్పినట్టు సెప్టెంబరు 5న పాఠశాలలు ప్రారంభమవ్వడం సాధ్యమవుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ప్రారంభమైనా, కరోనా భయంతో తల్లిదండ్రులు తమ బిడ్డలను పాఠశాలలకు పంపేందుకు వెనకడుగు వేసే అవకాశముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కేసులు తగ్గించి చూపే ప్రయత్నం చేయడంలేదు: సీఎం జగన్

ఏపీ సీఎం వైఎస్‌ జగన్ రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలు, జిల్లాల్లో పరిస్థితిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకూ రాష్ట్రంలోని ప్రతి అధికారి సీరియస్‌గా పనిచేస్తున్నారని అన్నారు. కోవిడ్‌ లెక్కలకు సంబంధించి ప్రభుత్వం ఎక్కడా తప్పులు చేయలేదని, కేసులు ఎక్కువగా వస్తున్నాయని రిపోర్టుల్లో తగ్గించి చూపే ప్రయత్నం చేయడం లేదని పేర్కొన్నారు. దేశంలోనే రోజుకు 50వేలకు పైగా టెస్టులు చేస్తున్న రాష్ట్రం మనదేనని, రోజూ చేసే పరీక్షల్లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని తెలిపారు. ప్రతి 10 లక్షల మందికి 31వేలకు పైగా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో లక్షకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదైతే.. అందులో సగం మందికి నయమైపోయిందని అన్నారు. పెద్ద పెద్ద రాష్ట్రాల మాదిరిగా ఆధునిక కార్పొరేట్ ఆస్పత్రులు లేకపోయినా.. మరణాల రేటును 1.06 శాతానికి పరిమితం చేశామని సీఎం పేర్కొన్నారు.

కాశ్మీర్ వేర్పాటువాది గిలానీకి పాక్ అత్యున్నత పురస్కారం

జమ్మూ కాశ్మీర్ లో వేర్పాటువాద నాయకుడు, కాశ్మీర్ యువతను ఉగ్రవాదం వైపు ప్రోత్సహించిన సయ్యద్ గిలానీని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాక్ ప్రభుత్వం.. అత్యున్నత పౌర పురస్కారమైన ‘నిషాన్ -ఈ- పాకిస్తాన్’ అవార్డును ప్రకటించింది.  గిలానీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించడంతో వేర్పాటు వాదులకు పాక్ ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో అర్ధం అవుతుంది.  అయితే భారత ప్రభుత్వం ఆర్టికల్ 370 ని రద్దు చేసినా.. దానిని ఓ ఎజెండాగా మార్చడంలో గిలానీ విఫలమయ్యారంటూ పాక్ అప్పట్లో ఈయనపై గుర్రుగా ఉంది. కానీ, మనసు మార్చుకున్న పాక్ గిలానీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ఇచ్చింది. ఆర్టికల్ 370 ని రద్దు చేసి, జమ్మూ కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించి, ఓ సంవత్సరం పూర్తికావడానికి వారం ముందే పాక్ ఈ అవార్డును వేర్పాటువాది గిలానీకి ఇవ్వడం గమనార్హం.  పాకిస్తాన్ లో హురియత్ కాన్ఫరెన్స్ ను స్థాపించి కాశ్మీర్ లో వేర్పాటు వాదాన్ని గిలానీ ప్రోత్సహించాడు. గిలానీ కొద్ది రోజుల కిందటే హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ పదవి నుంచి పక్కకు తప్పుకున్నాడు. సంస్థలో జవాబుదారీతనం లోపించిందని, సభ్యుల్లో తిరుగుబాటు తనం పెరిగిపోయిందని, అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించాడు.

శిరోముండనం బాధితుడికి టీడీపీ ఆర్థిక సాయం

తూర్పు గోదావరి జిల్లా సీతానగరం శిరోముండనం బాధితుడు వరప్రసాద్‌ కు టీడీపీ తరఫున రూ.2 లక్షల ఆర్ధిక సాయాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు  ప్రకటించారు. టీడీపీ దళితులకు ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. దళితుల పట్ల అధికార పార్టీ నేతలు దుర్మార్గాలను ఆపకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం తప్పదని హెచ్చరించారు. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ దళితులను అణచివేసేలా వ్యవహరించడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇప్పటికైనా జగన్ దళిత వ్యతిరేక నిర్ణయాలను విడనాడాలని చంద్రబాబు హెచ్చరించారు. కాగా, ఇటీవల రాజమండ్రిలో దళిత బాలిక సామూహిక అత్యాచారానికి గురైన ఘటన గురించి తెలుసుకొని తీవ్ర ఆవేదన చెందిన చంద్రబాబు.. బాధితురాలికి టీడీపీ తరపున రూ.2లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే పార్టీ తరపున ఆమెను దత్తత తీసుకుని చదివిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక, చిత్తూరు జిల్లాకు చెందిన వీరదల్లు నాగేశ్వరరావు కూతుళ్లు కాడెద్దులుగా మారి పొలం దున్నడం చూసి చలించిపోయిన సోనూసూద్ వాళ్లకు ట్రాక్టర్‌ను కొనిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన చంద్రబాబు.. నాగేశ్వరరావు కుమార్తెల చదువుల బాధ్యతను టీడీపీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఇలా కష్టాల్లో ఉన్నవాళ్ళకి వరుసగా సాయం చేస్తుండటంతో చంద్రబాబుపై టీడీపీ శ్రేణులు ప్రశంసలు కురిపిస్తున్నాయి.

మహాప్రభో విశాఖలో లాక్ డౌన్ పెట్టండి.. బీజేపీ సీనియర్ నేత

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షను దాటిపోయిన సంగతి తెలిసిందే. దీంతో పాటు విశాఖ నగరంలో కూడా కేసులు విపరీతంగా రికార్డ్ అవుతున్నాయి. తాజాగా బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఇదే అంశం పై స్పందిస్తూ విశాఖలో కరోనా కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు వెంటనే విశాఖలో పది రోజుల పాటు లాక్ డౌన్ విధించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం నడుస్తున్న కరోనా టైం లో వైన్ షాపులు తెరిచి ఉంచే సమయం పెంచడం దారుణమని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. అనుమానితులు కరోనా టెస్టులు చేయించుకుంటే రిపోర్టులు ఎన్ని రోజుల్లో వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని అయన వ్యాఖ్యానించారు. అంతే కాకుండా అంబులెన్స్ కూడా ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. కరోనా పేషెంట్లను హాస్పిటల్స్ నుండి డిశ్చార్జ్ చేసేటప్పుడు మళ్లీ టెస్టులు చేయడం లేదని విష్ణుకుమార్ రాజు విమర్శించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాలు మెరుగుపరచాలని, అలాగే నర్సింగ్ స్టాప్‌ తక్కువగా ఉన్నందున తక్షణమే కొత్తవారిని నియమించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విశాఖలో ఇప్పటివరకు సుమారు 7,500లకు పైగా కేసులు నమోదయ్యాయని, అంతే కాకుండా రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోందని అయన ఆందోళన వ్యక్తం చేసారు. భవిష్యత్‌లో విశాఖ నగరంలోనే కేసులు 50వేల మార్క్ దాటే అవకాశముందని.. అదే కనుక జరిగితే నగర ప్రజలంతా తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని విష్ణుకుమార్ రాజు అన్నారు.

89 ఎకరాలపై ఏపీ మంత్రి కన్ను.. విచారణకు రానున్న కేంద్ర బృందం?

పశ్చిమ గోదావరి జిల్లాలోని జీలుగుమిల్లి మండలంలో 89 ఎకరాల గిరిజనుల భూములున్నాయి. ఆ భూములు గత 20 ఏళ్ల నుంచి ప్రస్తుత ఓ ఏపీ మంత్రి అధీనంలోనే అనధికారికంగా ఉన్నాయి. అక్కడ ఉన్న మామిడి పంటను కూడా ఆయనే అనుభవిస్తున్నారు. నిజానికి షెడ్యూల్ ఏరియా భూమి అంటే అక్కడ గిరిజనులకు మాత్రమే భూమి ఉండాలి. కానీ ఓ షావుకారు.. వారికి అప్పులిచ్చి, తన పేరు రాయించుకున్నారట. ఆయన మంత్రికి బినామీ అని టాక్. ఇప్పుడు మంత్రి ఆ షావుకారి వద్ద ఉన్న డాక్యుమెంట్లను తీసుకుని, తన పేరు మీదకు బదలాయించుకునే పనిలో ఉన్నారట. దానికోసం పెద్ద స్కెచ్చే వేశారు. 89 ఎకరాల గిరిజనుల భూములన్నీ 1970కు ముందే.. అంటే 1/17 చట్టం అమలుకాకముందే, కొనుగోలు చేసినట్టు.. అంటే సదరు భూములన్నీ మంత్రి హక్కుభుక్తమన్న వాదనను తెరపైకి తీసుకువచ్చారు. ఇప్పటికే ఆర్డీఓ కార్యాలయం నుంచి ఓ డాక్యుమెంటు కూడా పుట్టించేశారట. దాన్ని ఆమోదించాలని అటు ఐటిడిఓ ప్రాజెక్టు ఆఫీసర్, ఇటు జిల్లా కలెక్టర్‌ పై ఒత్తిళ్లు తీసుకువస్తున్నారట. వాళ్లు మాత్రం మావల్ల కాదంటున్నట్లు చెబుతున్నారు.  ఇంతకూ మంత్రి ఆలోచన ఏమిటంటే.. పోలవరం నిర్వాసితులకు ఇళ్ల స్థలాల కింద, తనదని చెబుతున్న ఆ 89 ఎకరాలను ప్రభుత్వంతో కొనుగోలు చేయించి, భారీగా సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారట. ఈ వ్యవహారంపై గిరిజనుల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే దిక్కులేదు.  అయితే, ఇది అటు తిరిగి ఇటు తిరిగి, నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు చెవికి చేరిందట. మరి ఆయన ఊరుకుంటారా? పైగా ఇటీవల సదరు మంత్రి , ఆయనపై బోలెడన్ని విమర్శలు కూడా చేశారు. ఇంకేముంది, ఈ భూముల వ్యవహారంపై కేంద్ర గిరిజనశాఖ మంత్రి అర్జున్‌ ముండాకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దానితో స్పందించిన కేంద్రమంత్రి.. గిరిజన శాఖ ఉన్నతాధికారిని పిలిచి, కమిషనర్ ఆఫ్ ఎంక్వయిసీస్‌కు ఈ బాధ్యత అప్పగించాలని ఆదేశించారని  సమాచారం. ఆ ప్రకారంగా, సదరు అధికారుల బృందం రేపో, మాపో జీలుగుమిల్లికి వచ్చి ఆ భూముల లెక్కేంటో? ఆ షావుకారు లెక్కేంటో? ఆ మంత్రి లెక్కేంటో? తేలుస్తుందట.

ఆంక్షల మధ్య 15 నిమిషాల కవరేజ్

ఇంత గోప్యత ఎందుకో.. తెలంగాణ రాష్ట్ర సచివాలయం కూల్చివేత కు ఎట్టకేలకు మీడియాని తీసుకెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వం. మీడియా ని తీసుకెళ్లడానికి అభ్యంతరం ఏమిటి అని పదేపదే రాష్ట్ర హైకోర్టు  ప్రశ్నించింది. యుద్ధ సమయాలలో కూడా మీడియాను అనుమతిస్తారు. అలాంటిది సచివాలయం కూల్చివేత ప్రాంతానికి అడ్డుచెప్పడం ఎందుకని,  గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది అని హైకోర్టు ప్రశ్నించిన తర్వాత అదరాబాదరగా మీడియాను కూల్చివేత ప్రాంతానికి తీసుకువెళ్లారు. కోవిద్ నియమాలు పాటించకుండా రిపోర్టర్స్, కెమెరామెన్లను వేరువేరు వాహనాల్లో తీసుకువెళ్లారు.  ఇప్పటికే 90శాతం కూల్చివేత పూర్తయింది. సైఫాబాద్ ప్యాలెస్ గా పిలువబడే జీ బ్లాక్ కూల్చేశారు. ఎ,బి,సి,డి, జి, హెచ్, ఎల్ బ్లాక్ల్ లు పూర్తిగా నేలమట్టం అయ్యాయి. పాక్షికంగా కూల్చివేయబడిన  జె, కె బ్లాక్ లు  మరో రెండురోజుల్లో పూర్తిగా నేలమట్టం అవుతాయి. సైఫాబాద్ ప్యాలెస్ గా కూడా పిలువబడే జిబ్లాక్ కూల్చొద్దు అని చారిత్రక కట్టడంగా దాన్ని మార్చాలని విపక్షాలు, చారిత్రక పరిశోధకులు కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కేవలం 15 నిమిషాల్లో మాత్రమే వీడియోలైనా, ఫొటోలు తీసుకోవాలంటూ ఆంక్షలు విధించారు. మీడియా వారికి రెట్టింపు సంఖ్యలో ఉన్న పోలీసులు అడుగడుగున ఉంటూ వారు నిర్దేశించిన ప్రాంతంలోనే తిరిగేలా చర్యలు తీసుకున్నారు. తూతూమంత్రంగా  కఠినమైన ఆంక్షల మధ్య  కవరేజ్ కు అనుమతి ఇచ్చారు. ప్రజా ధనంతో ప్రజల పరిపాలన కోసం కట్టిన భవనాలను కూల్చివేస్తూ, ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం లేదని ఈ ప్రభుత్వం భావిస్తుందేమో అంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి.

గోమూత్రం తో కరోనాకు మందు.. ఐసిఎంఆర్ కోర్టులో బంతి

కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఒక పక్క వ్యాక్సిన్ సిద్ధం చేయడానికి శాస్త్రవేత్తలు కాలంతో పాటు పరుగులు పెడుతుంటే మరో పక్క ఈ వ్యాధిని ఎదుర్కొనేందుకు సరైన మందు కోసం పరిశోధనలు సాగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కేరళలో కరోనా కు విరుగుడుగా గోమూత్రంతో మందులు తయారుచేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన కేసు కేరళ హైకోర్టుకు చేరింది. దీనిపై కేరళ హైకోర్టు స్పందిస్తూ ఈ మందుపై తమ అభిప్రాయం చెప్పాల్సిందిగా భారత వైద్య పరిశోధనా మండలి (ICMR)ని ఆదేశించింది.  ఈ కేసు వివరాల్లోకి వెళితే కరోనా ట్రీట్‌మెంట్‌కి తాము గోమూత్రం తో తయారుచేసిన ఆయుర్వేద మందును వాడేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషనర్ కోరారు. కోజికోడ్ జిల్లా తిరువంబడికి చెందిన వెల్నెస్ కన్సల్టెంట్, సోషల్ వర్కర్ సన్స్ అనే సంస్థ ఈ పిటిషన్ వేసింది. కొన్నిఆమోదం పొందిన ఆయుర్వేద మందులతో పాటు గోమూత్రం కలిపి తాము తయారుచేసిన ఔషధం అటు కరోనా అంతు చూడడమే కాక ఈ వైరస్ వ్యాప్తిని కూడా అరికడుతుందని ఆ సంస్థ కోర్టుకు తెలిపింది. అంతే కాకుండా "ఈ మందు కరోనా పీడితులలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని దీంతో కరోనా వైరస్‌తో పోరాడేలా చేస్తుందని" కోర్టులో వేసిన పిటిషన్‌లో తెలిపారు. పిటిషనర్ తరపున లాయర్ నందకుమార్ కోర్టులో తన వాదనలు వినిపిస్తూ తమ మందుకు అనుమతి ఇవ్వాలని ఐసిఎంఆర్ ను అభ్యర్ధించగా ఇంతవరకూ స్పందించలేదని కోర్టుకు తెలిపారు. గోమూత్రం వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని అందుకే దాన్ని ఆయుర్వేద మందుల తయారీలో వాడతారని అయన కోర్టులో వివరించారు. ఇంకా ఈ మందులో హిమాలయాలలో దొరికే బెర్రీ మూలికతో పాటు మరి కొన్ని వనమూలికలు, గోమూత్రాన్ని కలిపి మందుగా తయారుచేశామని అయన కోర్టుకు తెలిపారు. తాజాగా ఇదే విషయాన్ని ప్రధాని మోదీ కూడా తన మన్‌కీ బాత్ కార్యక్రమంలో కూడా వివరించారని అయన కోర్టుకు తెలిపారు. అంతే కాకుండా మెడికల్ ప్రాక్టీషనర్ అధ్వర్యంలోనే ఈ మందును తయారుచేసినట్లు అయన కోర్టుకు వివరించారు. ఇప్పటికే కొన్ని అల్లోపతి మందులను కరోనా పేషెంట్లకు వాడేందుకు అధికారుల అనుమతులు లభించిన నేపథ్యంలో తమ ఆయుర్వేద మందుకు అనుమతి ఎందుకు ఇవ్వరన్నది పిటిషనర్ వాదన. దీంతో ఇపుడు బంతి ఐసిఎంఆర్ కోర్టుకు చేరింది. మరి దీనిపై ఐసిఎంఆర్ ఏ విధంగా స్పందిసుందో వేచి చూడాలి.

బోసిపోతున్న ఐటీ కారిడార్స్.. ఇంటిదారి పడుతున్న ఉద్యోగులు

వర్క్ ఫ్రమ్ హోమ్ కే ప్రాధాన్యత ఇస్తున్న ఐటి కంపెనీలు ఇంటిదారి పడుతున్న ఉద్యోగులు బోసిపోతున్న ఐటీ కారిడార్స్ పట్నం నుంచి పల్లెలకు పయనం గ్రామాల్లో పెరుగుతున్న ఆదాయం కోవిద్ 19 వైరస్ ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన అలజడి నుంచి బయటపడి పూర్తిగా కోలుకోవాలంటే మరో ఏడాది తప్పదని అనిపిస్తోంది. వైరస్ వ్యాప్తి లక్షలాది మందిని సోకి ప్రజల జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగుల భద్రత కోసం వర్క ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. తాజాగా గూగుల్ సంస్థ వచ్చే ఏడాది జూన్ 30వ తేదీ వరకు తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు బోర్డ్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాన్ని సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. దీంతో గూగుల్ సంస్థలో పనిచేస్తున్న రెండు లక్షల మందికి ఉపయోగకరంగా ఉంటుంది. సెర్చ్ ఇంజన్ సంస్థ ఈ విధమైన నిర్ణయం తీసుకుంటే ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ కూడా తమ ఉద్యోగులు వచ్చే ఏడాది జనవరి 8 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించారు. యాపిల్, ఫేస్బుక్ ,ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, క్వాల్ కామ్, ఐబిఎం, కాగ్నిజెంట్, టిసిఎల్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు కూడా తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పిస్తున్నాయి. కార్పోరేట్ ఐటి సంస్థలు ఈ విధమైన నిర్ణయం తీసుకుంటే కేంద్రప్రభుత్వం లోని కొన్నిశాఖల్లోనూ ఏడాదిలో 15రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇస్తున్నాయి. డిజిటల్ సదుపాయంలో పనిచేసే 75 విభాగాల్లో ఈ మేరకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పిస్తున్నారు.           రెండు నెలలకు పైగా లాక్ డౌన్ విధించినా కంట్రోల్ కాని కరోనాతో స్కూల్స్, సినిమా హాల్స్, క్లబులు, పబులు, పార్క్లు, జిమ్ లు, హాస్టల్స్ అన్నీ మూతపడటం, వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఉండటంతో లక్షలాది మంది ఉద్యోగులు తమ సొంత ఊర్లకు వెళ్ళిపోయారు. ఐటి కంపెనీలు ఎక్కువగా ఉండే నగరాల నుంచి గ్రామాలకు పయనమవుతున్నారు. కేవలం హైదరాబాద్ లోనే సుమారు ఆరు లక్షల మంది ఐటి సంస్థల్లో పనిచేస్తారని అంచనా. వీరితో అత్యధిక శాతం మంది ఇక్కడి ఖర్చుల భరించలేక, వీకెండ్ లో రీప్రెష్ మెంట్ సదుపాయాలు లేక ఊర్లకు వెళ్ళిపోయారు. ఇక ఇతర రంగాల్లో పనిచేసేవారు కూడా సొంత ఊర్లకు వెళ్ళిపోయారు. దాంతో హైదరాబాద్ రోడ్లు, మాల్స్ బోసిపోయాయి. మార్కెట్ లో కొనుగోలు తగ్గుముఖం పట్టాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, అద్దె ఇంటి యజమానులకు వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా భారీగా ఆదాయం పడిపోతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఉండటంతో చాలామంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు లాక్ టాప్ భుజానికి తగిలించుకుని.. సామాన్లు సర్దుకుని ఇండ్లు ఖాళీ చేసి పోతున్నారు. దాంతో నగరంలో వీధికి నాలుగు టూలేట్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఐటీ ఉద్యోగులు లేక, ఆదాయం వచ్చే మార్గాలు లేక నగరంలో షాపులు, కూరగాయల దుకాణాలు బోసిపోతుంటే పల్లెల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఇప్పటి వరకు ఇంటికి దూరంగా ఉన్న వారంతా గ్రామాలకు చేరుకోవడంతో నిత్యావసరాల, కూరగాయల వినియోగం పెరిగింది. గతం కన్నా రెట్టింపు స్థాయిలో నిత్యావసరాలు కొనుగోలు చేస్తున్నారని దుకాణదారులు అంటున్నారు. మరో ఆరునెలల పాటు ఇలాగే కొనసాగితే గ్రామాల ఆర్థికఆదాయం నాలుగింతలు అవుతుందని అంచనా వేస్తున్నారు. స్మార్ట్ సిటీలు అంటూ పట్టణాలకు వలసలను ప్రోత్సహించి ట్రాఫిక్, పోల్యుషన్ పెంచిన ప్రభుత్వాలు గ్రామాల ఆర్థిక ప్రగతిని మరచిపోయాయి. కరోనా నేర్పిన పాఠాలతో స్మార్ట్ విలేజ్ ల కాన్సెఫ్ట్ తీసుకుని గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెంచి, మౌలిక సదుపాయాలపై దృష్టి పెడితే  పట్టణాలకు వలసలు తగ్గుతాయి.

తెలంగాణలో మరో సర్కార్ దవాఖాన సూపరింటెండెంట్ రాజీనామా

కొద్ది రోజుల క్రితం తెలంగాణలోని నిజామాబాద్ జీజీహెచ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేశ్వర రావు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా వరంగల్ లోని ఎంజిఎం ఆసుప‌త్రి సూప‌రిండెంట్ శ్రీ‌నివాసరావు కూడా రాజీనామా చేశారు. ఒక పక్క క‌రోనా వార్డుల్లో స‌రైన చికిత్స‌లు అందటం లేదని ఆక్సిజ‌న్ లేక రోగులు మ‌ర‌ణిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఇలా సూపరింటెండెంట్ ల వరుస రాజీనామాలు కలవర పెడుతున్నాయి. ఒక పక్క వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద‌ర్ త్వరలో వ‌రంగ‌ల్ ఆసుప‌త్రి, క‌రోనా వైద్యంపై స‌మీక్ష‌కు రానున్న నేప‌థ్యంలో సూప‌రిండెంట్ రాజీనామా చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ప్రభుత్వ ఆసుప‌త్రుల్లో సౌక‌ర్యాల కొరత గురించి ప్ర‌భుత్వానికి కూడా తెలుస‌ని, అయితే జిల్లాల్లో జ‌రుగుతున్న పొర‌పాట్ల‌కు త‌మ‌ను బాధ్యుల‌ను చేస్తున్నార‌న్న ఆవేద‌న‌లో ప‌లువురు అధికారులు ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. అంతే కాకుండా ప్రస్తుతం ఉన్న క‌రోనా తీవ్రత దృష్ట్యా ఆసుపత్రిలోనే ఉండి అన్ని జాగ్ర‌త్తలు తీసుకోవాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ముందు నుండి చెప్తుండ‌టంతో పాటు అన్ని వైపులా నుండి వస్తున్న ఒత్తిడిని త‌ట్టుకోలేకే రాజీనామాల బాట ప‌ట్టిన‌ట్లుగా ప్ర‌చారం సాగుతోంది.

ప్రళయం రాబోతోంది.. జగన్ సర్కార్ కి మోత్కుపల్లి హెచ్చరిక

టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేసి బీజేపీలో చేరిన తెలంగాణకు చెందిన సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు ఏపీలోని జగన్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వంలో దళితులపై అమానుషమైన దాడులు జరుగుతున్నాయని, ఇది కచ్చితంగా వైసీపీ నేతలు చేస్తున్న అరాచకమని ప్రత్యక్షంగా తెలుస్తోందని అన్నారు.  దళిత డాక్టర్ ను వేధించారు, కనీసం రిగ్రెట్ లేదు, నడిరోడ్డు మీద గుండు గీశారు. ఆయనకు ఏం న్యాయం చేసింది ప్రభుత్వం? అని ప్రశ్నించారు. మరో దళిత డాక్టర్ అనితారాణిని దారుణంగా వేధించారని మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దలే అందులో ఇన్వాల్వ్ అయ్యారని ఆరోపించారు. మాస్కు పెట్టుకోలేదని దళిత యువకుడిని దారుణంగా కొడితే ఆ యువకుడు దెబ్బలతో ఆస్పత్రి పాలై ప్రాణాలు వదిలాడని అన్నారు. దళిత ఆడపిల్లను గ్యాంగ్ రేపి చేసి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత యువకుడు వరప్రసాద్ వైసీపీ నేతల ఇసుక అక్రమ తరలింపును ప్రశ్నిస్తే గుండుగీయించారని మండిపడ్డారు. ఈ సంఘటనలో పోలీసులు మీద చర్యలు తీసుకుంటారా? వైసీపీ నేతలను, స్థానిక ఎమ్మెల్యేని వదిలేస్తారా? ఎంత అన్యాయం ఇది అని జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా దళితులు మౌనంగా ఉన్నారంటే ప్రళయం రాబోతోందని అర్థం చేసుకోవాలని మోత్కుపల్లి హెచ్చరించారు.  జగన్ ను గెలిపించమని కోరానని గుర్తుచేసారు. దళితులు అయిన మాలమాదిగలు ముందుండి జగన్ కి ఓట్లేసి గెలిపించారు. కానీ జగన్ అలాంటి వారిని అణచివేస్తున్నారు. ఓట్లేసే దాకా ఒక ధోరణి, గెలిచాక ఇంకో ధోరణి అవలంభిస్తారా? అని ప్రశ్నించారు. వీటన్నింటి మీద విచారం వ్యక్తంచేసి, విచారణ జరిపించి బాధ్యులైన వారిని శిక్షిస్తేనే బాధితులకు న్యాయం జరిగినట్లు. లేకపోతే భవిష్యత్తులో జగన్ ఉపద్రవాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అని మోత్కుపల్లి హెచ్చరించారు. కాగా, 2019 ఎన్నికలకు ముందు జగన్ ని గెలిపించాలని ఏపీ ప్రజలను మోత్కుపల్లి కోరిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు దళితులకు అన్యాయం చేశారని, ఆయన ఓడిపోయి జగన్ గెలవాలని తిరుపతి వెళ్లి మరీ వెంకన్నకి మొక్కారు. మోత్కుపల్లి కోరుకున్నట్టుగానే ఏపీలో జగన్ సీఎం అయ్యారు. కానీ, ఇప్పుడు ఆయన పాలనలోనే దళితులపై దాడులు జరుగుతున్నాయని బాధపడుతున్నారు. ఒకప్పుడు జగన్ గెలవాలని బలంగా కోరుకున్న వ్యక్తే.. ఇప్పుడు జగన్ పాలనపై విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది.