తెలంగాణ సీఎస్ పై హైకోర్టు ప్రశ్నల వర్షం
posted on Jul 28, 2020 @ 6:21PM
కరోనా మహమ్మారి అంశం పై తమ ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోవటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తెలంగాణ హైకోర్టు ముందు సీఎస్ సోమేశ్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య అధికారులు, జిహెచ్ఎంసి కమిషనర్ తో సహా ఈరోజు హజరయ్యారు. హై కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు వీరంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా కోర్టు తమ ఆదేశాలను ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని సీఎస్ పై ప్రశ్నల వర్షం కురిపించింది. కోర్టు అడిగిన ప్రశ్నలకు సీఎస్ సోమేష్ కుమార్ సమాధానం చెప్పారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టుకు సీఎస్ వివరించారు.
ఈ విచారణలో రాష్ట్రం లో కరోనా పరిస్థితులపై ప్రభుత్వానికి హైకోర్టు కీలక సూచనలు చేసింది. ఐ సి ఎం ఆర్, డబ్ల్యు హెచ్ ఓ గైడ్‌లైన్స్ ను తూ.చా. తప్పకుండా పాటించాలని కోర్టు ఆదేశించింది. అదే విధంగా కరోనా హెల్త్ బులెటిన్ లో తప్పులు లేకుండా చూడాలని ప్రతి రోజు కరోనా సమాచారాన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం చేయాలని సూచించింది. గాంధీ ఆసుపత్రిలో కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారా లేదా అని కూడ హైకోర్టు ప్రశ్నించింది. ...
విచారణ సందర్భంగా డబ్బులు చెల్లించుకునే పరిస్థితుల్లో లేని పేదవారి క్వారంటైన్ కోసం ఫంక్షన్ హాల్స్ ,కమ్యూనిటీ సెంటర్స్, వెల్ఫేర్ అసోసియేషన్ సెంటర్స్ ను వాడుకోవాలని ప్రభుత్వానికి న్యాయస్థానం సూచించింది. అలాగే కరోనా రోగులను హాస్పిటల్‌లో చేర్చుకునే పద్ధతిని మరింత సులభ తరం చేస్తామని విచారణ సందర్భంగా సీఎస్ కోర్టుకు తెలిపారు. కరోనాకు సంబంధించి ఇప్పటి వరకు ప్రైవేట్ హాస్పిటల్స్‌లో వైద్యం గురించి 726 ఫిర్యాదులు అందినట్టు అయన చెప్పారు.వారందరికీ ఇప్పటికే నోటీసులు ఇచ్చి విచారణ చేస్తున్నామని అయన కోర్టుకు తెలిపారు.అలాగే ప్రతీ ఆస్పత్రి వద్ద డిస్‌ప్లే బోర్డులనూ ఏర్పాటు చేస్తామని చెప్పారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎక్కువగా 21 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్నవారే కరోనా బారిన పడుతున్నారన్న సీఎస్.. దాన్ని నివారించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు.
రాపిడ్ కిట్ల వినియోగంపైనా హైకోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో రాపిడ్ కిట్లు వాడుతున్నట్టు తెలిపిన అయన ప్రస్తుతం రాష్ట్రంలో 2 లక్షల రాపిడ్ కిట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మరో 4 లక్షల కిట్ల కోసం ఆర్డర్ చేశామని తెలిపారు. అయితే రాపిడ్ కిట్లతో ఫలితం 40 శాతం మాత్రమే కరెక్ట్ గా వస్తుందన్న కోర్టు…రాజస్థాన్‌లో ఇప్పటికే రాపిడ్ కిట్ల వాడకం ఆపేసినట్టు గుర్తు చేసింది. రాష్ట్రంలో కూడా రాపిడ్ కిట్ల వాడకంపై నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.
గతంలో హైకోర్టు ఇచ్చిన అన్ని ఆదేశాలను తప్పని సరిగా అమలు చేస్తామని ఈ సందర్భంగా సీఎస్ కోర్టుకు హామీ ఇచ్చారు. దీంతో తమ ఆదేశాలను అమలు చేసిన తర్వాత దానికి సంబంధించిన పూర్తి స్థాయి రిపోర్ట్‌ను సమర్పించాలని సీఎస్‌ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్ట్ 13 కు వాయిదా వేసింది.