శిరోముండనం బాధితుడికి టీడీపీ ఆర్థిక సాయం
posted on Jul 28, 2020 @ 4:13PM
తూర్పు గోదావరి జిల్లా సీతానగరం శిరోముండనం బాధితుడు వరప్రసాద్ కు టీడీపీ తరఫున రూ.2 లక్షల ఆర్ధిక సాయాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ దళితులకు ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. దళితుల పట్ల అధికార పార్టీ నేతలు దుర్మార్గాలను ఆపకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం తప్పదని హెచ్చరించారు. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ దళితులను అణచివేసేలా వ్యవహరించడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇప్పటికైనా జగన్ దళిత వ్యతిరేక నిర్ణయాలను విడనాడాలని చంద్రబాబు హెచ్చరించారు.
కాగా, ఇటీవల రాజమండ్రిలో దళిత బాలిక సామూహిక అత్యాచారానికి గురైన ఘటన గురించి తెలుసుకొని తీవ్ర ఆవేదన చెందిన చంద్రబాబు.. బాధితురాలికి టీడీపీ తరపున రూ.2లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే పార్టీ తరపున ఆమెను దత్తత తీసుకుని చదివిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఇక, చిత్తూరు జిల్లాకు చెందిన వీరదల్లు నాగేశ్వరరావు కూతుళ్లు కాడెద్దులుగా మారి పొలం దున్నడం చూసి చలించిపోయిన సోనూసూద్ వాళ్లకు ట్రాక్టర్‌ను కొనిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన చంద్రబాబు.. నాగేశ్వరరావు కుమార్తెల చదువుల బాధ్యతను టీడీపీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఇలా కష్టాల్లో ఉన్నవాళ్ళకి వరుసగా సాయం చేస్తుండటంతో చంద్రబాబుపై టీడీపీ శ్రేణులు ప్రశంసలు కురిపిస్తున్నాయి.