ఆంక్షల మధ్య 15 నిమిషాల కవరేజ్
posted on Jul 28, 2020 @ 12:54PM
ఇంత గోప్యత ఎందుకో..
తెలంగాణ రాష్ట్ర సచివాలయం కూల్చివేత కు ఎట్టకేలకు మీడియాని తీసుకెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వం. మీడియా ని తీసుకెళ్లడానికి అభ్యంతరం ఏమిటి అని పదేపదే రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది. యుద్ధ సమయాలలో కూడా మీడియాను అనుమతిస్తారు. అలాంటిది సచివాలయం కూల్చివేత ప్రాంతానికి అడ్డుచెప్పడం ఎందుకని, గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది అని హైకోర్టు ప్రశ్నించిన తర్వాత అదరాబాదరగా మీడియాను కూల్చివేత ప్రాంతానికి తీసుకువెళ్లారు. కోవిద్ నియమాలు పాటించకుండా రిపోర్టర్స్, కెమెరామెన్లను వేరువేరు వాహనాల్లో తీసుకువెళ్లారు.
ఇప్పటికే 90శాతం కూల్చివేత పూర్తయింది. సైఫాబాద్ ప్యాలెస్ గా పిలువబడే జీ బ్లాక్ కూల్చేశారు. ఎ,బి,సి,డి, జి, హెచ్, ఎల్ బ్లాక్ల్ లు పూర్తిగా నేలమట్టం అయ్యాయి. పాక్షికంగా కూల్చివేయబడిన జె, కె బ్లాక్ లు మరో రెండురోజుల్లో పూర్తిగా నేలమట్టం అవుతాయి.
సైఫాబాద్ ప్యాలెస్ గా కూడా పిలువబడే జిబ్లాక్ కూల్చొద్దు అని చారిత్రక కట్టడంగా దాన్ని మార్చాలని విపక్షాలు, చారిత్రక పరిశోధకులు కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదు.
కేవలం 15 నిమిషాల్లో మాత్రమే వీడియోలైనా, ఫొటోలు తీసుకోవాలంటూ ఆంక్షలు విధించారు. మీడియా వారికి రెట్టింపు సంఖ్యలో ఉన్న పోలీసులు అడుగడుగున ఉంటూ వారు నిర్దేశించిన ప్రాంతంలోనే తిరిగేలా చర్యలు తీసుకున్నారు. తూతూమంత్రంగా కఠినమైన ఆంక్షల మధ్య కవరేజ్ కు అనుమతి ఇచ్చారు.
ప్రజా ధనంతో ప్రజల పరిపాలన కోసం కట్టిన భవనాలను కూల్చివేస్తూ, ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం లేదని ఈ ప్రభుత్వం భావిస్తుందేమో అంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి.