భారత్ బంద్ లో దొంగలు పడ్డారు! టీఆర్ఎస్ పై పొన్నం విసుర్లు
posted on Dec 9, 2020 @ 4:10PM
తెలంగాణ రైతుల సమస్యలను పట్టించుకోకుండా ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న రైతులకు మద్దతుగా టీఆర్ఎస్ పార్టీ భారత్ బంద్ లో పాల్గొనడం విడ్డూరంగా ఉందన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్. భారత్ బంద్ లో దొంగలు కూడా పాల్గొన్నారని ఆయన ఎద్దేవా చేశారు. లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని చేయకుండా, సన్నరకం వడ్లు పండించమని చెప్పి మద్దతు ధర ఇవ్వకుండా నియంతలా వ్యవహరిస్తున్న కేసీఆర్ రైతుల గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు పొన్నం ప్రభాకర్. మొక్కజొన్న పంటను మద్దతు ధరతో కొనుగోలు చేయం అని అహంకారంతో చెప్పిన వాళ్లు. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో చట్టం చేయని వాళ్లు భారత్ బంద్ లో ఎలా పాల్గొంటారని ఆయన నిలదీశారు.
టిఆర్ఎస్ పార్టీకి రైతులపై నిజమైన ప్రేమ ఉంటే వెంటనే సన్నరకం వడ్లను మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని పొన్నం డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా పంటకు బోనస్ ఇవ్వచ్చని, నాఫెడ్ సంస్థ ద్వారా సన్న రకపు వడ్లను కొనుగోలు చేయవచ్చని.. కాని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రైతులకు అన్యాయం చేస్తున్నారని పొన్నం మండిపడ్డారు. రైతులను కమీషన్ ఏజెంట్లనిస దళారులు అని మాట్లాడిన ఎంపీ ధర్మపురి అర్వింగ్ వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని పొన్నం డిమాండ్ చేశారు. ఢిల్లీలో దళారులే ధర్నా చేస్తుంటే.. అమిత్ షా వారితో ఎందుకు చర్చలు జరిపారే అర్వింద్ చెప్పాలని పొన్నం నిలదీశారు. ప్రభుత్వం ఒకవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు రైతులను దేశద్రోహులుగా చిత్రీకరించేదాకా వెళ్తున్నారంటే ఎంత కుట్ర దాగి ఉందో అర్థం చేసుకోవాలని పొన్నం చెప్పారు.