వ్యాక్సిన్ పంపిణీకి తెలంగాణ 'కొవిడ్' యాప్! ఫ్రంట్ లైన్ వారియర్స్ కే ఫస్ట్
posted on Dec 10, 2020 @ 11:38AM
కరోనా వ్యాక్సిన్ తయారీ తుది దశకు చేరడంతో టీకా పంపిణీకి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయి. జనవరి రెండో వారంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండటంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ సర్కార్. తొలి దశలో కరోనా వ్యాక్సిన్ ను తీసుకునేందుకు అర్హులైన వారు తమ పేర్లను నమోదు చేయించుకునేందుకు వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ యాప్ ను సిద్ధం చేస్తోంది. కోవిడ్ యాప్ ను మరో వారం, పది రోజుల్లో అందుబాటులోకి తీసుకుని వస్తామని అధికారులు తెలిపారు. అయితే ఫ్రంట్ లైన్ యోధులైన ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికే వ్యాక్సిన్ మొదట ఇవ్వనున్నారు. ఏఎన్ఎంలు, ఆసరా కార్యకర్తలతో కలిసి మొత్తం 3 లక్షల మందిని ఇప్పటికే గుర్తించారు. మునిసిపల్ సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టుల సమాచారాన్నికూడా తెలంగాణ వైద్యాధికారులు సేకరిస్తున్నారట.
ఫ్రంట్ లైన్ వారియర్స్ తో పాటు 50 ఏళ్లకు పైబడిన వయో వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు కూడా యాప్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకుని వ్యాక్సిన్ తీసుకోవచ్చని తెలంగాణ అధికారులు స్పష్టం చేశారు. మొదటి విడతలోనే 70 నుంచి 75 లక్షల మందికి టీకాలు వేయాలని నిర్ణయించామని, దాదాపు 3 కోట్ల డోస్ లను నిల్వ చేసేందుకు అవసరమైన మౌలిక వసతులన్నీ సిద్ధంగా ఉన్నాయని అధికారులు అంటున్నారు. వ్యాక్సిన్ పై ఎంపిక చేసిన వైద్య సిబ్బందికి ప్రత్యేక ట్రయినింగ్ క్యాంప్ కూడా మొదలైంది. వర్చ్యువల్ విధానంలో బుధవారం ప్రారంభమైన శిక్షణ రెండు రోజుల పాటు జరగనుంది.