చట్టాలు రద్దు చేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తాం.. రైతు సంఘాలు
posted on Dec 9, 2020 @ 5:55PM
కేంద్రం కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తామంటున్న సవరణలను రైతు సంఘాలు నిర్ద్వందంగా తిరస్కరించాయి. కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు మొత్తంగా రద్దు చేయడం అనేదే తమ ప్రధాన డిమాండ్ అని, అది పూర్తయ్యే వరకు తాము నిరసనను కొనసాగిస్తామని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. 14 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్న రైతులను శాంతింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఐదుసార్లు చర్చలు జరిపినా అవి ఫలప్రదం కాలేదు. నిన్న (మంగళవారం) రాత్రి కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగి రైతు సంఘాల నేతలతో చర్చించారు. కానీ, మూడు చట్టాలు రద్దు చేయాల్సిందేనని రైతులు తమ డిమాండ్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అయితే మూడు చట్టాలు రద్దు చేయడం కాకుండా మధ్యే మార్గంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు కొన్ని ప్రతిపాదనలు చేసింది. వ్యవసాయ చట్టాల్లో 7 సవరణలను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అలాగే, కనీస మద్దతు ధర విషయంలో రాతపూర్వక హామీ ఇస్తామని చెప్పింది. అయితే, దాన్ని చట్టంలోనే పెట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కొత్తగా తీసుకొచ్చిన చట్టాల వల్ల మార్కెట్ వ్యవస్థ దెబ్బతింటుందని రైతులు తీవ్ర ఆందోళనలో ఉండడంతో మండీ వ్యవస్థకు భరోసా కల్పిస్తామని కేంద్రం చెబుతోంది.
కేంద్రం తాజాగా తయారు చేసిన ముసాయిదా ప్రతిపాదనలను 13 రైతు సంఘాలకు పంపింది. వీటికి సంబంధించి రైతులకు ఏమైనా సందేహాలు ఉంటే తాము నివృత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా కేంద్రం ప్రకటించింది. కానీ, చట్టాల రద్దు విషయంలో మాత్రం ఎలాంటి ప్రస్తావన చేయలేదు. అంటే "రద్దు కుదరదు. సవరణలపై ఏమైనా ఉంటే మాట్లాడండి." అని కేంద్రం రైతులకు సందేశం పంపింది. ఈ సవరణల ప్రతిపాదనలపై రైతులు తమలో తాము చర్చించకున్నారు. అయితే తమ ప్రధాన డిమాండ్ అయిన చట్టాల రద్దు విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గేది లేదని.. అప్పటి వరకు తమ పోరాటం కొనసాగుతుందని వారు తేల్చి చెప్పారు.
"మూడు కొత్త వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలనేది మా ప్రధాన డిమాండ్. దానిపై వెనక్కి తగ్గేది లేదు. కేంద్రం పంపిన సవరణలను తిరస్కరిస్తున్నాం. మా డిమాండ్ నెరవేరే వరకు పోరాటం చేస్తాం. నిన్న (డిసెంబర్ 8) అమిత్ షాతో చర్చల్లో పురోగతి కనిపించలేదు. చట్ట సవరణలకు సానుకూలంగా ఉన్నామని అమిత్ షా చెప్పారు. అంతేకాకుండా రైతులకు లాభం జరుగుతుందని కేంద్రం చెబుతుంది కానీ, ఏం లాభం జరుగుతుందో మాత్రం చెప్పడం లేదు." అని రైతు సంఘాల నాయకులు అన్నారు.
మరోపక్క దేశంలోని అన్ని జిల్లాలు రాష్ట్ర రాజధానులలో నిరంతరాయంగా ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించాయి. కేంద్రమంత్రులను ఎక్కడికక్కడే ఘోరావ్ చేస్తామని రైతు సంఘాల నేతలు ప్రకటించారు. ఈ నెల 12వ తేదీన దేశంలోని టోల్‌ప్లాజాల వద్ద ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. సోమవారం నాడు ఢిల్లీలో భారీ ప్రదర్శన నిర్వహిస్తామని రైతు సంఘాల నేతలు ప్రకటించారు.రిలయన్స్, జియో ఉత్పత్తులను బహిష్కరిస్తామని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యంత గర్వంతో ప్రవర్తిస్తోందని ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కో ఆర్డినేషన్ కమిటీ వ్యాఖ్యానించింది.