అలా చేస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా
posted on Dec 17, 2020 @ 4:38PM
ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. జగన్ రెడ్డి ఒక ఫేక్ ముఖ్యమంత్రి అంటూ మండిపడ్డారు. రాజధాని అమరావతి రక్షణకై రైతులు చేపట్టిన ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా 'జనరణభేరి' పేరిట భారీ బహిరంగ సభను అమరావతి జేఏసీ నిర్వహించింది. ఈ సభకు హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతి ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. రైతులు, మహిళలను రియల్ ఎస్టేట్ వ్యాపారులని సీఎం అన్నారని, ప్రజల రక్తాన్ని తాగే వ్యాపారస్తుడు జగన్ అని మండిపడ్డారు. త్యాగం చేసిన రైతులపై ఇష్టానుసారం మాట్లాడుతారా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకుని క్షమాపణ చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
‘‘ఒక కులంలో పుట్టడం నా తప్పా?. కులం చూసి హైదరాబాద్, విశాఖను అభివృద్ధి చేయలేదు. నా దగ్గర జగన్ తెలివి తేటలు పనిచేయవు. ద్రౌపది వస్త్రాపహరణం చేసినందుకు సామ్రాజ్యం కూలిపోయింది. మహిళల శాపంతో వైసీపీ నామరూపాలు లేకుండా పోతుంది’’ అని చంద్రబాబు హెచ్చరించారు. అమరావతి అంటే ఈ సీఎంకు ఎందుకింత కోపమో అర్థం కావట్లేదు. ఇవాళ రాజధాని రైతుల కోసం వైసీపీ తప్ప రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు వచ్చాయి. ఊరందరిదీ ఒకదారి అయితే ఈ ముఖ్యమంత్రిది మరోదారి. ఇంతకంటే వితండవాదం మరొకటి ఉంటుందా? అని విమర్శించారు. 10 వేల కోట్లు అమరావతిలో ఖర్చు చేస్తే శ్మశానం అంటారా? అని ప్రశ్నించారు. ఎడారి, శ్మశానం అనడానికి మీకు బుద్ధుందా అని మండిపడ్డారు.
రాష్ట్రమంతా నీతోనే ఉందని చెప్పుకుంటున్నావు కదా.. మరి రిఫరెండంకు వెళదామా? అని చంద్రబాబు జగన్ కు సవాల్ విసిరారు. మీరు ప్రజల ముందుకు వెళ్లి మూడు రాజధానులు కావాలా అని అడగండి.. ప్రజలు గనుక మూడు రాజధానులు కావాలి అని ఓటేస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని చంద్రబాబు అన్నారు.