"ఈ చిల్లు కుండను దింపేద్దాం.." జగన్ పై ఏపీ బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..
posted on Dec 17, 2020 @ 2:09PM
అమరావతి రాజధాని ఉద్యమానికి ఏడాది పూర్తైన సందర్భంగా ఈరోజు అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో రాయపూడిలో "జనభేరీ" పేరుతొ సమావేశం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో పాల్గొన్న బీజేపీ అధికార ప్రతినిధి వామరాజు సత్యమూర్తి మాట్లాడుతూ ఏపీకి ఒకటే రాజధాని అని, అది అమరావతేనని అయన స్పష్టం చేశారు. మనసా వాచా కర్మణా, త్రికరణశుద్ధిగా అమరావతి రాజధానిగా ఉండాలని తాము విశ్వసిస్తున్నామని, చివరి రైతుకు న్యాయం జరిగే వరకూ బీజేపీ పోరాటం చేస్తుందని సత్యమూర్తి హామీ ఇచ్చారు.
సత్యమూర్తి ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
"ఈ ఉద్యమాన్ని 365 రోజులుగా నిరాటంకంగా సాగిస్తున్న సోదర సోదరీమణులకు, వారి పోరాట పటిమకు బీజేపీ తరపున సాష్టాంగ నమస్కారం చేస్తున్నా. ఈ ఉద్యమానికి బీజేపీ తరపున మద్దతు తెలపడానికి బీజేపీ ప్రతినిధిగా ఇక్కడికి వచ్చా.. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నారు? పాదయాత్ర చేస్తూ రోడ్డుమీద ఉన్నారు. అపుడు మనం అందరం ఇళ్లలో ఉన్నాం. అయితే ఈ రోజు ఆయన్ను గెలిపించిన తర్వాత ఆయన మనందరినీ రోడ్డుమీద పడేశారు. ఆయన మాత్రం హాయిగా ఏసీ గదుల్లో ఉన్నారు. ఇలా ప్రజలను రోడ్డుమీద పడేసిన సీఎం జగన్‌కు గుణపాఠం నేర్పాల్సిందే. ఈ రోజు మనం విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాం. ఒక చిల్లుకుండను మనం నెత్తిమీద పెట్టుకున్నాం. మనం అలాంటి కుండను నెత్తిన పెట్టుకొని బాధపడి లాభం లేదు. మన కన్నీరు కూడా ఎవరికీ కనిపించదు సరికదా.. మనం ఏడుస్తున్నామని కనీసం సానుభూతి ప్రకటించే స్థితిలో కూడా ఎవరూ లేరు. కాబట్టి ఈ చిల్లుకుండను ఎంత త్వరగా దించుకుంటే మనకు అంత మంచిది. ఇక్కడ నేను రాజకీయాలు మాట్లాడడానికి రాలేదు. మన జెండాలు వేరైనా... అజెండా మాత్రం ఒక్కటే. ఏపీకి అమరావతి ఒకటే రాజధానిగా ఉంటుంది. ఈ నినాదంతోనే బీజేపీ ముందుకు సాగుతుంది. అమరావతి ఉద్యమానికి మేము పూర్తి మద్దతిస్తాం. త్రికరణ శుద్ధిగా అమరావతి ఉద్యమం వెంట ఉంటాం.’’ అని బీజేపీ ప్రతినిధి వామరాజు సత్యమూర్తి పేర్కొన్నారు.