తెలుగు రాష్ట్రాల సీఎంల ఢిల్లీ టూర్.. కారణం ఒక్కటే!!
posted on Dec 16, 2020 @ 6:52PM
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెంట వెంటనే హస్తిన బాట పట్టడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మొదట తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని, కేంద్ర మంత్రులను కలిసి రాగా.. ఆ వెంటనే ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిశారు. అయితే ఇద్దరు ముఖ్యమంత్రులు విడిగావిడిగా ఢిల్లీకి వెళ్లినప్పటికీ.. వెళ్లిన కారణం మాత్రం ఇంచుమించు ఒక్కటే. ఇద్దరూ ప్రధానంగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి చర్చిండానికే వెళ్లారు. అందుకే, ఇద్దరూ కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ను కలిశారు.
కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు ప్రధాన కారణం కాళేశ్వరం ప్రాజెక్ట్. అనుమతులు లేకుండానే మూడో టీఎంసీ ఎత్తిపోసేందుకు నిర్మాణ పనులు చేపట్టడాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుంది. అసలు కేంద్రానికి సమాచారమే లేకుండా ఈ పనులు ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించింది. దీంతో హడావుడిగా ఢిల్లీ వెళ్లిన కేసీఆర్.. కేంద్ర పెద్దలను కలిసి వారిని కూల్ చేసే ప్రయత్నం చేశారు.
ఇక, వైఎస్ జగన్ పోలవరం, మూడు రాజధానులు వంటి అంశాలు చర్చిండానికి ఢిల్లీ వెళ్లారని చెబుతున్నప్పటికీ.. ప్రధానంగా పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ గురించి చర్చిండానికే షెకావత్ ని కలిసినట్టు తెలుస్తోంది. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విస్తరణ విషయాన్ని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కేంద్రం దృష్టికి వెళితే.. దాన్ని ఆపాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. మరోవైపు, పర్యావరణ అనుమతులు పొందకుండా పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు చేపట్టవద్దంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన ఆదేశాలను ఏపీ ప్రభుత్వం ధిక్కరిస్తోందంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్ షెకావత్ ని కలిసి వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఇలా ఇద్దరు సీఎంలు ప్రధానంగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించే ఢిల్లీ వెళ్లారు. అయితే ఈ రెండు ప్రాజెక్ట్ పనులనూ ఒక ప్రముఖ కంపెనీ చేపడుతుంది. దీంతో సీఎంలు పట్టుబట్టి, అనుమతులు తీసుకోకుండానే ఆ ప్రాజెక్ట్ లు చేయడంపై అనుమానాలకు తావిస్తోంది. మిగతా విషయాలలో ఇంతగా కేంద్రాన్ని పట్టుబట్టని సీఎంలు.. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విషయంలో హడావుడిగా ఢిల్లీ వెళ్లడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.