బీజేపీతో కేసీఆర్ డీల్.. షేక్ అవుతున్న టీఆర్ఎస్ శ్రేణులు!!
posted on Dec 16, 2020 @ 2:37PM
తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకోబోతున్నాయా? సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాత టీఆర్ఎస్ శ్రేణులు షేక్ అవుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
ఇటీవల తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది. దుబ్బాకలో విజయం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గట్టి పోటీతో.. తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీఆర్ఎస్ కూడా దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీనే తమ ప్రధాన ప్రత్యర్థిగా భావించింది. ఈ రెండు ఎన్నికల్లోనూ బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసింది. రెండు పార్టీల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది.
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల షాక్ తో కేసీఆర్ బీజేపీపై యుద్ధానికి సిద్ధమయ్యారని, అందుకే రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపారన్న అభిప్రాయం వ్యక్తమైంది. అంతేకాదు, బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టారని కూడా ప్రచారం జరిగింది. అయితే, ఒక్కసారిగా అన్నీ తారుమారయ్యాయి. సడెన్ గా కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు ఇతర పార్టీలు కూడా షాక్ అయ్యాయి. కేసులకు భయపడి కేసీఆర్ బీజేపీతో కాళ్ళ బేరానికి వచ్చారని విపక్షాలు ఆరోపించాయి. ఇక రాష్ట్ర బీజేపీ నేతలైతే కేసీఆర్ వంగి వంగి దండాలు పెట్టినా క్షమించేది లేదని, జైలుకి పోవడం ఖాయమని వ్యాఖ్యానించారు.
అయితే, కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు ప్రధాన కారణం కాళేశ్వరం ప్రాజెక్ట్ అని తెలుస్తోంది. అనుమతులు లేకుండానే మూడో టీఎంసీ ఎత్తిపోసేందుకు నిర్మాణ పనులు చేపట్టడాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుందని సమాచారం. అసలు కేంద్రానికి సమాచారమే లేకుండా ఈ పనులు ఎలా ప్రారంభిస్తారని, మూడో టీఎంసీ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని మండిపడినట్టు సమాచారం. దీంతో హడలిపోయిన కేసీఆర్ కేంద్రంతో యుద్దాన్ని పక్కన పెట్టి సయోధ్య కోసం హస్తినకు వెళ్లారని తెలుస్తోంది. అంతేకాదు, బీజేపీ కోపాన్ని చల్లార్చడం కోసం ఏకంగా టీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తానని మాట ఇచ్చారట. అయితే దీనికి ఒక రిక్వెస్ట్ లాంటి కండిషన్ పెట్టారట. తెలంగాణలో తనయుడు కేటీఆర్ ని సీఎంని చేసి, కేంద్ర కేబినెట్ లోకి తనని తీసుకుంటే పార్టీని బీజేపీలో విలీనం చేస్తానని చెప్పారట. గతంలో తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని చెప్పిన కేసీఆర్ .. ఆ మాట తప్పారు. అయితే ఇప్పుడు మాత్రం కేసులు, కాళేశ్వరం కేసీఆర్ ని హడలిపోయేలా చేశాయని.. అందుకే పార్టీని విలీనం చేయడానికి కూడా సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది. అందుకే, కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చినప్పటి నుంచి టీఆర్ఎస్ శ్రేణులు షేక్ అవుతున్నాయని అంటున్నారు.