"అన్నదాత రోడ్డెకాల్సి రావడం దారుణం.. వారికోసం నా త్యాగం" అంటూ సిక్కు మత బోధకుడు ఆత్మహత్య
posted on Dec 17, 2020 @ 9:36AM
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనీ రైతులు 21 రోజులుగా ఢిల్లీ సరిహద్దులలో ఆందోళన చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ ఆందోళనకు సంఘీభావంగా హరియాణలోని కర్నాల్‌కు చెందిన ఓ మత ప్రబోధకుడు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. హర్యానాకు చెందిన సంత్ బాబా రాంసింగ్ (65) అనే ఈ సిక్కు ప్రబోధకుడు "రైతుల కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తున్నానని" లేఖ రాసి, ఢిల్లీ సరిహద్దుల్లో ఆత్మహత్యకు పాల్పడటం తీవ్రం కలకలం రేపుతోంది. అయన ఢిల్లీ సోనేపట్ సరిహద్దులోని కుండ్లీ దగ్గర తన తుపాకీతో కణతపై కాల్చుకుని మరణించారు. ఆయనకు పంజాబ్, హరియాణాల్లో అనేకమంది అనుచరులున్నారు. గడచిన 21 రోజులుగా అయన రైతులతో కలిసి నిరసనల్లో పాల్గొంటున్నారు. ఈ ప్రాంతం రైతు నిరసనలకు ప్రధాన కేంద్రమైన సింఘూ బార్డర్ కు కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. రైతుల నిరసనలను కేంద్ర ప్రభుత్వం ఎంతమాత్రమూ పట్టించుకోవడంలేదని ఆరోపించిన ఆయన, రైతులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపిస్తూ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్‌జీపీసీ)తో పాటు అనేక సిక్కు సంఘాల్లో బాబా రాంసింగ్ క్రియాశీలక సభ్యుడు. "రైతులు పడుతున్న బాధలను చూడలేకపోతున్నాను. రైతులు తమ హక్కుల కోసం పోరాడాల్సి రావడం చాలా బాధను కలిగిస్తోంది. రోడ్డెక్కి తమ హక్కుల కోసం పోరాడుతున్న వారి దుస్థితిని వర్ణించలేను. ప్రభుత్వం వారిని అణచేస్తోంది. ఇది నేరం.. పాపం... దారుణం. దీన్ని ఆపేవారెవరూ లేరు. రైతులకు మద్దుతుగా ఇప్పటికే ఎంతో మంది తమకు గతంలో వచ్చిన అవార్డులను వెనక్కు ఇచ్చారు. నా వంతుగా నన్ను నేనే త్యాగం చేయాలని నిర్ణయించుకున్నాను" అంటూ అయన ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో పేర్కొన్నారు.
నిన్న రాత్రి తన కారులో కూర్చున్న బాబా రామ్ సింగ్, తుపాకితో తనను తాను కాల్చుకుని మరణించారని సోనేపట్ డిప్యూటీ పోలీసు కమిషనర్ శ్యామ్ లాల్ పునియా తెలిపారు. ఆయన భౌతిక కాయాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కల్పనా చావ్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తీసికెళ్లినపుడు ఆయన అనుచరులు వేల మంది అక్కడకు చేరుకున్నారు.
ఆత్మహత్య చేసుకునే ముందు బాబా రామ్ సింగ్, తన మద్దతుదారులతో కలిసి భారతీయ కిసాన్ యూనియన్ హర్యానా యూనిట్ చీఫ్ గుర్నామ్ సింగ్ చారుహునిని కలిసి చర్చలు జరిపారు. నిన్న ఆయన తనతో పాటు 45 నిమిషాలు ఉన్నారని, ఉద్యమం తాజా పరిస్థితుల పై అడిగి తెలుసుకున్నారని, అంతలోనే ఇటువంటి నిర్ణయం తీసుకుంటారని తాము ఎంత మాత్రమూ ఊహించలేదని గుర్నామ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఆయన చేసిన త్యాగం ఎంతో విలువైనదని, దాన్ని వృథా పోనివ్వబోమని అయన స్పష్టం చేశారు.