వైసీపీ సీనియర్ నేత పార్టీకి గుడ్ బై..
posted on Feb 19, 2021 9:27AM
ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఒక ప్రహసనంగా మారిపోయింది. సామాన్య ఓటర్లను ఒకపక్క అధికార వైసిపి నేతలు, మరోపక్క గ్రామ వాలంటీర్లు భయపెడుతున్న సంఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఇది కేవలం సామాన్యుడి అభిప్రాయమే కాదు.. సాక్షాత్తు వైసిపి సీనియర్ నేతలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పుష్పవాణి మామగారైన శత్రుచర్ల చంద్రశేఖర రాజు నిన్న వైసిపికి రాజీనామా చేస్తూ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న దారుణ పరిస్థితులు చూడలేకే పార్టీకి గుడ్ బై చెపుతున్నట్లుగా పేర్కొన్నారు.
వైసిపి పార్టీలో నియంతృత్వ పోకడలు పెరిగిపోయాయని, తనకు అవి నచ్చకే పార్టీని శాశ్వతంగా వీడుతున్నట్టు చంద్రశేఖర రాజు ప్రకటించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేయకాపోతే పింఛన్లు, ఇళ్లు మొదలైన సంక్షేమ పథకాలు కట్ చేస్తామని గ్రామ వలంటీర్ల ద్వారా పార్టీ నాయకులు చెప్పించారని అయన ఆరోపించారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యమైన విధానం కాదని అయన అన్నారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. సామాన్యులపై రాజకీయ దాడులు, బెదిరింపులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి అనేదే లేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వ తీరుతో ఎపి అథోగతి పాలవుతోందని అయన ఆవేదన వ్యక్తం చేశారు. వైసిపి ప్రభుత్వ తీరు తనను ఎంతగానో బాధించాయని, అందుకే పార్టీకి రాజీనామా చేసినట్టు అయన స్పష్టం చేశారు.