100 రోజులకు రైతుల ఆందోళన.. బ్రిటిష్ పార్లమెంట్ లో చర్చ
కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన వ్యవసాయ సంస్కరణల్లో భాగంగా తీసుకొచ్చిన వ్యసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో వందరోజులకు పైగా రైతులు చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది. ఆందోళనను ఎంతకాలం అయినా కొనసాగిస్తామని, ఆందోళను సారధ్యం వహిస్తున్న రైతు సంఘాల సమాఖ్య స్పష్తం చేస్తోంది. సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఈ ఆందోళనకు దేశం సరిహద్దుల వెలుపలి నుంచి మద్దతు లభిస్తోందా అంటే, అవుననే అనవలసి వస్తోంది.
ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న రైతు సంఘాలు, రైతు సంఘాలకు మద్దతు ఇస్తున్న రాజకీయ పార్టీలు, కేవలం, పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ మూడు రాష్ట్రాలకే పరిమితం అయిన ఆందోళను, దేశంలోని ఇతర రాష్ట్రాలకు విస్తరించే ప్రయత్నం అంతగా చేయడం లేదు. కానీ, అంతర్జాతీయ మద్దతును కూడకట్టడంలో మాత్రం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. బహిరంగంగానే అంతర్జాతీయ సమాజం మద్దతు కోరుతున్నారు. అంతర్జాతీయ ప్రముఖుల మద్దతును రైతు సంఘాలు బహిరంగంగానే స్వాగతించాయి.
మన దేశంలో జరుగతున్న రైతుల ఆందోళన బ్రిటీష్ పార్లమెంట్’లో మార్చి 8న చర్చకు రానుంది. అయితే భారత దేశంలో జరుగతున్న రైతుల ఆందోళన ఆ దేశ అంతర్గత వ్యవహారం’ అని బ్రిటిష్ ప్రభుత్వం స్పష్తం చేసింది ‘రైతుల నిరసనల అంశం భారత్ అంతర్గత సమస్యేనని బ్రిటన్ ప్రభుత్వం అభిప్రాయం. వాటిని పరిష్కరించుకోవడం పూర్తిగా భారత్ చేతుల్లోనే ఉంది’ అని భారత్‌లోని బ్రిటన్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లీస్ స్పష్టంచేశారు. అయితే బ్రిటన్ పార్లమెంట్ నియమాల ప్రకారం, ఏదైనా అంశంపై లక్షకు పైగా సంతకాలతో, ఈ-పిటిషన్ దాఖలైతే పార్లమెంట్ చర్చించక తప్పుదు. భారత దేశంలో జరుగుతున్న రైతుల ఆందోళనపై చర్చను కోరుతూ లక్షకు పైగా సంతకాలతో ఈ-పిటీషన్ దాఖలైంది. అందుకే చర్చ. ఇది సాధారణ ప్రక్రియ. బ్రిటీష్ ప్రభుతం మాత్రం రైతుల ఆందోళను భారత దేశ అంతర్గత సమస్యగానే చూస్తోంది, అని భారత్‌లోని బ్రిటన్ హై కమిషనర్ స్పష్టం చేశారు. అయితే బ్రిటిష్ ప్రభుత్వ భావన ఏదైనా,భారత రైతుల ఆందోళనను అంతర్జాతీయ సమస్యగా చిత్రించే ప్రయత్నం సాగుతోంది అనేది మాత్రం, లక్ష సంతకాలతో స్పష్టమైంది.
మరోవంక ‘టైమ్స్ మ్యాగజైన్’ తాజా సంచిక రైతుల ఆందోళనలో మహిళా రైతుల పాత్రను హై లైట్ చేస్తూ, కవర్ స్టొరీ ప్రచురించింది. అలాగే, ‘ఫ్రీడం హౌస్’ అనే స్వచ్చంద సంస్థ భారత దేశంలో మానవ హక్కుల హననం జరుగుతోందని ఆరోపిస్తూ, భారతప్రజలకు సంపూర్ణ స్వేఛ్చ లేదని పాక్షిక స్వేచ్ఛను మాత్రమే అనుభవిస్తున్నారని,2021 వార్షిక నివేదికలో పేర్కొంది.
భారత ప్రభుత్వం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని పలుమార్లు, పార్లమెంట్ లోపల వెలుపల కూడా స్పష్టం చేసింది. నూతన వ్యసాయ చట్టాల విషయంలో ఏర్పడిన ప్రతిష్టంభనను తొలిగించేందుకు రైతు సంఘాలతో 11 మార్లు చర్చలు జరిపింది. అలాగే, చట్టాలకు సవరణలు చేసేందుకు, 18 నెలల పాటు చట్టాల అమలును నిలిపి వేసేందుకు సంసిద్ధతను వ్యక్త పరిచింది. అయినా, రైతు సంఘాలు మాత్రం మెట్టు దిగిరావడం లేదు. చట్టాల సంపూర్ణ,సముల రద్దు తప్ప దేనీకీ అంగీకరించేది లేదని రైతు సంఘాలు భీష్మించుకు కూర్చున్నాయి. అందుకే, రైతుల ఆందోళన విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ శక్తుల జోక్యానికి సంబంధించి పలు సందేహాలు వ్యక్త మవుతున్నాయి.