షర్మిలను కలిసిన శ్యామల.. వైసీపీలో చీలిక?
posted on Mar 2, 2021 @ 11:08AM
ఇంకా పార్టీయే పెట్టలేదు. జెండా, ఎజెండా ఖరారు కాలేదు. అప్పుడే షర్మిల పార్టీకి ఫుల్ డిమాండ్. రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముఖలు షర్మిల పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. లోటస్ పాండ్ తో టచ్ లోకి వస్తున్నారు. వరుస భేటీలు, మంతనాలతో మేడమ్ ఫుల్ బిజీ.
లేటెస్ట్ గా ప్రముఖ యాంకర్ శ్యామల.. షర్మిలను కలిశారు. భర్త నరసింహారెడ్డితో కలిసి లోటస్ పాండ్ వెళ్లారు శ్యామల. షర్మిలతో పావు గంటలకు పైగా భేటీ అయ్యారు. పార్టీ ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. షర్మిల పెట్టబోయే పార్టీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు శ్యామల దంపతులు.
అయితే, గతంలో, ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు ముందు శ్యామల, ఆమె భర్త ఇద్దరూ కలిసి ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువాలు కప్పుకున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. తాజాగా షర్మిలతో భేటీ కావడంతో త్వరలోనే వీరిద్దరూ కొత్త పార్టీలోకి వెళ్తున్నారని తెలుస్తోంది. అంటే.. వైసీపీలో చీలిక వస్తోందా? అనే అనుమానం వ్యక్తం అవుతోంది. ఇక ముందు కూడా తెలంగాణలో ఉండే వైసీపీ నేతలు ఫ్యాన్ పార్టీని వీడి షర్మిల పార్టీలో చేరబోతున్నారా? శ్యామల దంపతుల బాటలో మరింత మంది వైసీపీ నాయకులు జగన్ కు హ్యాండ్ ఇచ్చి షర్మిలకు జై కొడతారా?
శ్యామల కపుల్స్ లోటస్ పాండ్ వెళ్లడం ఇదే మొదటిసారి కాదు. ఫిబ్రవరి 10న షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ పుట్టిన రోజున విషెస్ చెప్పడానికి శ్యామల దంపతులు లోటస్‌పాండ్‌కు వెళ్లి కలిశారు. తాజాగా మరోసారి వీరు షర్మిలతో భేటీ అయ్యారు.
ప్రస్తుతం శ్యామల యాంకర్‌గా, సినిమాల్లో ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. నరసింహా పలు సీరియల్స్‌లో నటిస్తున్నారు. అటు, తెలంగాణలోని పలు జిల్లాల అభిమానులు, కార్యకర్తలు, అనుచరులతో షర్మిల వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 9న షర్మిల పార్టీ పేరు ప్రకటిస్తారని తెలుస్తోంది.