హరితహారం.. ఎమ్మెల్యే భూబాగోతం!
posted on Mar 2, 2021 @ 11:37AM
భూకబ్జాల ఆరోపణలతో నిత్యం వివాదాలలో మునిగి తేలుతున్న జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరో కొత్త వివాదానికి కారణమయ్యారు. ప్రధాన రహదారికి దూరంగా ఉన్న తన ఫాంహౌస్ భూముల ధరలు పెంచుకునేందుకు ముత్తిరెడ్డి తెలివిగా ఇతర రైతుల పొలాన్ని ఆక్రమించుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. జనగామ జిల్లా నర్మెట్ట మండలం హన్మంతాపూర్ వద్ద ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి ఫామ్‌హౌస్ ఉంది. అయితే, ఆ ఫామ్ హౌస్ కు వెళ్లే దారి ఇరుకుగా ఉంది. ఆ రోడ్డును విస్తరించుకుని తన భూముల రేట్లు పెంచుకునేందుకు.. అదేసమయంలో తనపై ఏ మాత్రం విమర్శలు రాకుండా ముత్తిరెడ్డి పకడ్బందీగా తన కబ్జా కార్యక్రమాన్ని పూర్తి చేసారు. ఆ రోడ్డు విస్తరణ కోసం, ఎమ్మెల్యే పైసా ఖర్చు పెట్టకుండా.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం పథకాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపణలు వస్తున్నాయి. దీనికోసం ఫామ్ హౌస్ కు వెళ్లే రోడ్డు వెంట ఉన్న రైతుల పొలాలపై ఎమ్మెల్యే గురిపెట్టారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్డు వెంట మొక్కలు నాటాలని, దీనికోసం రోడ్డు విస్తరణ చేపడుతున్నామని చెప్పి.. ముందుగా రైతుల పొలాల్లోని పంటలను తొలగించారు. రోడ్డుకు ఇరువైపులా రైతులకు సంబంధించి 45 ఫీట్ల వరకు పొలాలను కబ్జా చేసారు. అలా అక్రమంగా కబ్జా చేసిన దారి వెంట.. ఎమ్మెల్యే స్వయంగా దగ్గరుండి మొక్కలు నాటించారు.
ఆ మొక్కలు నాటేందుకు ఎలాంటి అనుమతులూ లేవని, భూమి ఇచ్చేందుకు తాము అంగీకరించకపోయినా.. తమ పంట పొలాల్లోకి జేసీబీలు తెచ్చి దౌర్జన్యంగా భూమిని చదును చేశారని జనగామ-హుస్నాబాద్ మార్గంలోని రైతులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే భూకబ్జా వ్యవహారంపై బాధిత రైతులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, పైగా వారు కూడా ఎమ్మెల్యేకే అనుకూలంగా మాట్లాడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా ఈ కబ్జా వ్యవహారం మీడియాకు చేరడంతో.. లాభంలేదని .. కొంత మంది రైతులను పిలిపించుకుని ముత్తిరెడ్డి వారిని సమాధానపరిచే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎక్కువమంది రైతులు మాత్రం దీనిపై సీఎం స్పందించి ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు