ఇది రెడ్ల రాజ్యమా? ఎంతమందిని అడ్డుకుంటారు?
posted on Mar 2, 2021 @ 10:07AM
ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్నది రెడ్ల రాజ్యమా? లేక ప్రజారాజ్యమా? రెడ్డియేతర సామాజిక వర్గాలను తొక్కేస్తారా? అంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ ప్రభుత్వ వైఖరి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీరును తప్పుబట్టారు.
ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబును సొంత జిల్లాలో, నియోజకవర్గంలో తిరగకుండా ప్రభుత్వం అడ్డుకుంటోంది. ఆయన సెల్‌ఫోన్‌ను పోలీసులు తీసుకోవడం ఎంతవరకు సమంజసం? ఇక ప్రజాస్వామ్యం ఎక్కడుంది? అని ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో పర్యటించకుండా తననూ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు ఎంపీ రఘురామకృష్ణంరాజు.
పనిగట్టుకుని ఇతర సామాజిక వర్గాల ప్రజాప్రతినిధులను అవమానిస్తున్నారు. రెడ్డి కాకపోవడంవల్లే విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను రాజకీయంగా విజయసాయిరెడ్డి అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. విద్యాసంస్థలకూ కులగజ్జి అంటించే స్థాయికి దిగజారడం బాధాకరం. ఎంతో విశిష్టత ఉన్న ఆంధ్రా యూనివర్సిటీని రెడ్డి కులానికి వేదిక చేస్తున్నారు. ఆంధ్రా వర్సిటీలో విజయసాయిరెడ్డి.. రెడ్డి కుల సభ నిర్వహంచడం ఎంతవరకు సబబు? తక్షణమే గవర్నర్ జోక్యం చేసుకుని వీసీ ప్రసాదరెడ్డిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సాగుతున్న దమనకాండపై అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానన్నారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు.