దేశం బాగు కోసమే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. బీజేపీ నేత వివరణ
posted on Mar 13, 2021 @ 3:21PM
ఏపీలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశం తీవ్ర చిచ్చు రేపుతున్న సంగతి తెల్సిందే. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం తీవ్ర రూపు దాలుస్తోంది. నిన్న టాలీవుడ్ హీరో మంచు విష్ణు తన సినిమా ప్రమోషన్ కోసం విశాఖకు వెళ్లగా ఆయనను ఉక్కు కర్మాగార ఉద్యోగులు చుట్టుముట్టి తమ ఆందోళనకు మద్దతు తెలపాల్సిందిగా కోరారు. దీంతో విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు ప్రజలు, కార్మికులు చేస్తున్న ఉద్యమానికి తాను పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఈ విషయంపై కార్మికులకు మద్దతు తెలపాలని కొందరు టాలీవుడ్ ప్రముఖులకు ఉన్నా.. కేవలం రాజకీయ కారణాల వల్ల సపోర్ట్ చేయలేకపోతున్నారని తెలిపిన సంగతి తెల్సిందే .
ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు కర్మాగారం పైవేటీకరణపై ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ సునీల్ దేవధర్ స్పందిస్తూ.. దేశవ్యాప్త విధానంలో భాగంగా నష్టాలలో ఉన్న ప్రభుత్వరంగ కంపెనీలను ప్రైవేటీకరించాలని కేంద్రం ఒక నిర్ణయం తీసుకుందని అందులో భాగంగానే ఇక్కడి ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేస్తున్నట్టు అయన తెలిపారు. అదే సమయంలో ప్లాంటు ఉద్యోగుల బాధ్యతను కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుందని అయన చెప్పారు..ప్లాంటు ప్రైవేటీకరణ గురించి సంస్థ ఉద్యోగులు ఎంతమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అయన అన్నారు. మరోపక్క విశాఖ ఉక్కు అంశాన్ని హైలైట్ చేస్తున్న వైసిపి సర్కార్ తెరవెనుక రాష్ట్రంలో మతమార్పిడులకు పాల్పడుతోందని ఆరోపించారు. విజయవాడలో ఈరోజు పార్టీ ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ అయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో ముఖ్యంగా విశాఖ ఉక్కు, తిరుపతి ఉపఎన్నికపై నాయకులు చర్చించారు. తిరుపతి ఎన్నికలలో మాజీ ఐఏఎస్ అధికారిని అభ్యర్థిగా దించే అంశంపై చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా సునీల్ దేవధర్ మాట్లాడుతూ, ఉపఎన్నికపై ప్రకటన వచ్చాక బీజేపీ జనసీన్ ఉమ్మడి అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు. ఇదే సమావేశంలో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ, విశాఖ ఉక్కు విషయంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని అన్నారు. దీనిపై అవసరమైనప్పుడల్లా రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతారని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కొన్ని పార్టీలు కావాలనే రాజకీయం చేస్తున్నాయని మాధవ్ విమర్శించారు