దీదీ సాహసం పై బీజేపీ మాజీ నేత సంచలన కామెంట్స్
posted on Mar 13, 2021 @ 5:58PM
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని దగ్గర నుండి చూసిన వారు శివంగితో పోలుస్తారు అంటారు. ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ లో చేరిన బిజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా దీదీ సాహసం గురించి వివరించారు. 1999లో ఖాట్మండు నుండి ఢిల్లీకి వస్తున్న విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసి, ముందుగా కరాచీకి తీసుకెళ్లి.. అక్కడి నుండి కాందహార్ కు తరలిస్తున్న సమయంలో.. విమానంలో బందీలుగా ఉన్న భారతీయులను వదిలి పెట్టాలని, వారికి బదులుగా తనను బందీగా తీసుకోవాలని అప్పట్లో కేంద్ర మంత్రిగా కూడా ఉన్న మమత అన్నారని తెలిపారు .
అంతేకాకుండా మొట్టమొదటి నుండి కూడా ఆమె పోరాట యోధురాలేనని యశ్వంత్ సిన్హా అన్నారు. వాజ్ పేయి సారధ్యంలోని ఎన్డీయే ప్రభుత్వ హయాంలో మమతతో కలిసి తాను పని చేశానని అయన చెప్పారు. ఆ విమానం హైజాక్ జరిగిన సమయంలో కేంద్ర కేబినెట్ మీటింగ్ లో చర్చ జరిగిందని... ఆ సమయంలో తాను బందీగా వెళ్లేందుకు మమత సిద్ధమయ్యారని అయన తెలిపారు. మమతా గొప్ప త్యాగశీలి అని యశ్వంత్ సిన్హా ఈ సందర్భంగా కొనియాడారు.
1999 డిసెంబర్ లో ఖాట్మండు నుండి ఢిల్లీకి వస్తున్న విమానం హైజాక్ ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. జైల్లో ఉన్న ఉగ్రవాదులను విడుదల చేయకపోతే విమానంలోని ప్రయాణికులందరినీ చంపేస్తామని హైజాకర్లు బెదిరించారు. దీంతో కరడుగట్టిన ఉగ్రవాదులు మసూద్ అజహర్, ముస్తాక్ అహ్మద్ జర్గార్, అహ్మద్ ఉమర్ సయీద్ షేక్ లను భారత ప్రభుత్వం విడుదల చేసింది.