సెలబ్రేట్ చేసుకోవాల్సిన వేళ రెండుగా చీలిన జనసైనికులు..
posted on Mar 13, 2021 @ 8:21PM
ప్రభుత్వాలను ప్రశ్నించడానికే పాలిటిక్స్ లోకి వస్తున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి రేపటికి ఏడేళ్లు పూర్తవుతాయి. ఈ అకేషన్ ను ఘనంగా జరుపుకోవడానికి ఒకపక్క జనసైనికులు సిద్ధమయ్యారు. ఈలోగా తిరుపతి ఉపఎన్నికలో బీజేపీ తన అభ్యర్థిని బరిలోకి దింపుతుందని ఆ పార్టీ నుండి ఒక ప్రకటన వచ్చింది. దీనికి సంబంధించి ఎపి బీజేపీ నేతలు పవన కళ్యాణ్ తో సుదీర్ఘంగా చర్చించి ఆయనను కూడా ఒప్పించారు. దీంతో తిరుపతి లోక్ సభ సీటుకు జరుగుతున్న ఉప ఎన్నికలలో బీజేపీకి మద్దతు ప్రకటిస్తూ జనసేన పోటీ నుండి తప్పుకుంది.
జనసేనాని పవన్ కళ్యాణ్ తిరుపతి విషయంలో తీసుకున్న తాజా నిర్ణయంతో పార్టీలో మెజారిటీ కార్యకర్తలు ఒక్కసారిగా హార్ట్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే తన తాజా నిర్ణయంపై పవన్ కళ్యాణ్ వివరణ ఇస్తూ.. దేశ, రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక సుదీర్ఘమైన లేఖను విడుదల చేశారు. అయితే పవన్ కళ్యాణ్ తాజా నిర్ణయంతో జనసైనికులు సోషల్ మీడియా సాక్షిగా రెండుగా చీలిపోయారు. ఏ రకంగా చూసుకున్నా బీజేపీ కంటే అత్యధిక ఓటు షేర్ కలిగిన జనసేన... తిరుపతి ఎన్నికల నుండి తప్పుకొని, నోటాతో పోటీ పడుతున్న బీజేపీకి మద్దతు ఇవ్వడం ఏమిటని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. అటు సామాజిక సమీకరణాల పరంగా కూడా ఎంతో బలంగా ఉన్న చోట కూడా జనసేన పోటీ చేయకపోవడం వారిని ఆందోళనకు గురి చేస్తోంది. గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికలలోను బీజేపీ ఇలాగే చేసింది..ఇపుడు మళ్ళీ తిరుపతిలో కూడా అదే పార్టీ పోటీ చేస్తే ఇక మన పార్టీ ఉన్నట్లా లేనట్లా అంటూ జనసేన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ బలపడే అవకాశం ఉన్న ఈ సమయంలో ఇటువంటి నిర్ణయం పార్టీ భవిష్యత్తును దెబ్బ తీస్తుందని వారు వాపోతున్నారు.
అంతేకాకుండా మన పార్టీ బలంగా ఉండి కూడా ప్రతిసారి వేరే పార్టీకి ఓటు వేయడానికా జనసైనికులు ఉంది అంటూ.. నేరుగా పవన్ కళ్యాణ్ ని అడుగుతున్నారు. ఇలా అయితే జనసేన కోసం సొంత డబ్బులు ఖర్చు చేసి ప్రచారం చేయడం దండగ అంటున్నారు. మరోపక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కారణంగా రాష్ట్రంలో బీజేపీ పట్ల పూర్తి వ్యతిరేకత వచ్చిందని, అసలు ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వలన జనసేన కూడా భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని.. కనుక బీజేపీతో కూటమి నుండి పార్టీ బయటికి రావాలని జనసైనికులు కోరుతున్నారు.
ప్రస్తుతం రెండుగా చీలిన జనసేన కార్యకర్తలలో కొందరు పార్టీ అధినేత నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శిస్తుండగా.. మరి కొందరు మాత్రం పవన్ ని సమర్దిస్తున్నారు. పార్టీ అథినేత నిర్ణయాన్ని గౌరవించని వారు అసలు నిజమైన జన సైనికులు కాదని వారు అంటున్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ నిర్ణయం వెనుక పెద్ద వ్యూహం ఉండి ఉంటుందని.. ఇపుడు ఒక సీటు కోల్పోతే రేపు పది సీట్లు తెచ్చుకొనే ప్లాన్ పాన్ వద్ద ఉండవచ్చని కొందరు సమర్థిస్తున్నారు. ఈ విధంగా పవన్ అభిమానులు సోషల్ మీడియాలో రెండుగా చీలిపోయి అయన నిర్ణయాన్ని సమర్ధించే వారు ఒక వైపు, వ్యతిరేకించే వారు మరో వైపు విడిపోయి వాదులాడుకుంటున్నారు. మరి కొంతమందైతే అసలు వచ్చే ఎన్నికలలో పవన్ సీఎం కాండిడేట్ కూడా కాదని... బీజేపీ వాళ్లే ఎదో ఒక రీజన్ చెప్పి.. సీఎం పోస్ట్ కూడా వారే తీసుకుంటారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇలా అన్నింటిని వదులుకుంటూ పొతే ఇక జనసేన ఉనికికే ప్రమాదం ఏర్పడుతోందని జనసైనికులు ఆందోళన చెందుతున్నారు. మరోపక్క తిరుపతి ఉప ఎన్నికలో జనసేన కార్యకర్తలు అంతా కలిసి నోటాకి ఓటు వేయాలని చెపుతుంటే.. మరి కొందరు అలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని వారికీ సర్ది చెపుతున్నారు. ఏది ఏమైనప్పటికి ఈ విషయంపై పార్టీ కార్యకర్తలలో వచ్చిన ఈ చీలిక పవన్ కళ్యాణ్ కి పెద్ద తలనొప్పిగా తయారైంది .. రేపు జనసేన ఆవిర్భావ దినోత్సవం కావడంతో వీరికి పవన్ ఏ విధంగా సర్ది చెపుతారా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.