దేశం కోసమే పవన్ యూ టర్న్?
posted on Mar 13, 2021 @ 6:33PM
రాజకీయాలలో ఏదైనా జరగవచ్చును..ఎవరు ఎవరితో అయినా,ఎప్పుడైనా కలవవచ్చును. కలిసిన చేతులు విడిపోవచ్చును.విడి పోయిన చేతులు మళ్ళీ కలవ వచ్చును.ఆంధ్ర ప్రదేశ్’లో అలా పాత మిత్రులు మళ్ళీ ఒకటయ్యే ప్రయత్నాలు జరుగుతున్నాయా,అంటే,అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయనే మాట రాజకీయ, మీడియా వర్గాలలో వినవస్తోంది.
తిరుపతి లోక్ సభ స్థానానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో మేమంటే మేము పోటీ చేస్తామని, కాషాయ కూటమిలోని భాగస్వామ్య పార్టీలు, బీజేపీ, జనసేన ఒక దానితో ఒకటి పోటీ పడ్డాయి.విషయం,వివాదం ఢిల్లీ వరకు వెళ్ళింది.బీజేపీ అదిష్టానం జనసేనకు ఓకే చెప్పిందని ఆపార్టీ వర్గాలే ప్రచారంలో పెట్టాయి. అయితే,ఇంతలోనే ఏమైందో ఏమోకానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హటాత్తుగా మనసు మార్చుకున్నారు.బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో చర్చలు జరిపిన అనతరం, పవన్ కళ్యాణ్ తిరుపతిలో కూటమి తరపున బీజేపీ అభ్యర్ధి పోటీ చేస్తారని ప్రకటించారు.
పవన్ కళ్యాణ్’కు ఇలా యూ టర్న్ తీసుకోవడం కొత్త కాదు. అది ఆయనకు అలవాటైన విషయమే అయినా,తిరుపతి ఉపసంహరణ వెనక పాత మిత్రుల మద్య కొత్తగా మొగ్గ తొడిగిన స్నేహ బంధమే కారణమని రాజకీయ, మీడియా వర్గాల్లో వినవస్తోంది. గత ఎన్నికల్లో ఓడి పోయినప్పటికి తిరుపతి నియోజక వర్గం,తెలుగు దేశం పార్టీకి మంచి పట్టున్న నియోజక వర్గం. ఇందులో మరో అభిప్రాయానికి తావు లేదు.బీజేపీ గతంలో ఒకసారి ఈ స్థానం నుంచి గెలిచి నప్పటికీ,ఇప్పుడు, కమల దళం , గెలిచే పరిస్థితి ఎంత మాత్రం లేదు. ఇది కూడా ఎవరూ కాదనలేని నిజం .
అదే సమయంలో కాపు సామాజిక వర్గానికి చెందిన కాపు, బలిజ,వంటరి కులాల జనాభా ఎక్కువగా ఉన్న ఈ నియోజక వర్గంలో బీజేపీ కూటమి అభ్యర్ధిగా పవన్ కళ్యాణ్ పార్టీ అభ్యర్ధిని నిలబెడితే, టీడీపీ విజయావకాశాలను దెబ్బతీస్తుంది. పవన్ కళ్యాణ్ అదే సామాజిక వర్గానికి చెందిన వాడు కావడం, గతంలో తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి పవన్ సోదరుడు చిరంజీవి గెలిచి ఉడడంతో, జనసేన అభ్యర్ధిని నిలబెడితే అది పరోక్షంగా వైసీపీ కి మేలు చేస్తుంది.అందుకే శత్రువు శత్రువు మిత్రుడు అనే సూత్రాన్ని గుర్తుకు తెచ్చుకుని పవన్ కళ్యాణ్ పక్కకు తప్పుకున్నట్లు సమాచారం.
ఈ ఏర్పాటుకు బీజేపీ అదిష్టానం ఆమోదం కూడా అన్నట్లు తెలుస్తోంది. తెలుగు దేశం పార్టీని పక్కకు తప్పించి , మెల్లగా ఆ స్థానాన్ని ఆక్రమించాలని కమల నాధులు కన్న కలలు మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్లలుగా తేలిపోయాయి. వైసీపీ , టీడీపీ మధ్యనే పోటీ అన్న విషయం కూడా స్థానిక సంస్థల ఎన్నికలు తేల్చి చెప్పాయి.ఈ పరిస్థితిలో బీజేపీ రాష్ట్రంలో ఉనికిని నిలుపుకుని మనుగడ సాగించాలంటే తెలుగు దేశంతో పూర్వ బంధాన్ని పునరుద్దరించుకోవడం ఒక్కటే మార్గమని కమల దళం కొద్దిగా ఆలస్యంగానే అయినా గుర్తించిందని,అందుకే పవన్ కళ్యాణ్ పౌరోహిత్యంలో తెలుగు దేశంతో మళ్ళీ చేతులు కలిపేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని రాజకీయ విశ్లేషకులు బావిస్తున్నారు.
మరో వంక సార్వత్రిక ఎన్నికలకు ముందు, బీజేపీతో తెగతెంపులు చేసుకోవడం ‘చారిత్రక’ తప్పిదం కంటే పెద్ద తప్పిదమని టీడీపీ ఎప్పుడోనే గ్రహించింది. బీజేపీ తో మళ్ళీ చేతులు కలిపేందుకు సంసిద్ధతను వివిధ రూపాల్లో వ్యక్తం చేసింది. అయినా,అప్పట్లో బీజేపీలోని ఒక వర్గం పడనీయ లేదు. ఇప్పుడు డిల్లీ పెద్దలే పచ్చ జెండా ఊపారు అంటున్నారు కాబట్టి , బీజేపీ,టీడీపీ,జనసేన ముక్కోణ కూటమి తెరకెక్కేందుకు ఎక్కువ సమయం పట్టదని అంటున్నారు. రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు .. శాశ్వత ప్రయోజనాలే ఉంటాయి.