ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడంటే..
posted on Mar 13, 2021 @ 12:53PM
వస్తారా? రారా? ఇప్పుడే వస్తారా? భవిష్యత్‌లోనైనా వస్తారా? అసలు వస్తారా? జూనియర్ వస్తారా? రాజకీయాల్లోకి మళ్లీ ఎంట్రీ ఇస్తారా? చాలా ఏళ్లుగా అభిమానులను ఊరిస్తున్న ప్రశ్న ఇది. ఇటీవల చంద్రబాబు కుప్పం పర్యటనలో టీడీపీ శ్రేణుల నుంచి జూనియర్ ఎన్టీఆర్ కో్సం డిమాండ్ వినిపించింది. బాబు ర్యాలీలో.. ఎన్టీఆర్ ను మళ్లీ రాజకీయాల్లోకి తీసుకురావాలంటూ నినాదాలు చేశారు తెలుగు తమ్ముళ్లు. అప్పటి నుంచీ జూనియర్ పొలిటికల్ ఎంట్రీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. లేటెస్ట్ గా జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆ విషయంపై నేరుగా జూనియర్ నే ప్రశ్నించారు విలేకరులు.
త్వరలో ప్రసారం కాబోతున్న ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’కు ఎన్టీఆర్ హోస్ట్ గా ఉండబోతున్నారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఎన్టీఆర్. పొలిటికట్ ఎంట్రీ ఎప్పుడంటూ ఓ రిపోర్టర్ ప్రశ్నించగా ఎన్టీఆర్ తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చారు. "ఈ ప్రశ్నను మీరు చాలా సందర్భాల్లో నన్ను అడిగారు. నేను చెప్పే సమాధానం ఏమిటో మీకు బాగా తెలుసు. ఇది సమయం కాదు.. సందర్భమూ కాదు. తర్వాత తీరిగ్గా ఓరోజు కాఫీ తాగుతూ మనమే సరదాగా కబుర్లు చెప్పుకుందాం." అన్నారు ఎన్టీఆర్.
పొలిటికల్ ఎంట్రీపై ప్రశ్నకు.. దాటవేసే ధోరణిలో సమాధానం చెప్పారు జూనియర్. అంతేకానీ, ఎక్కడా రాజకీయాల్లోకి రానని గానీ, తనకు ఆసక్తి లేదని గానీ అనలేదు. అలాగని.. వస్తానని కూడా చెప్పలేదు. సో, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావొచ్చు.. రాకపోవచ్చు.. ఏదైనా జరగొచ్చు అంటున్నారు అభిమానులు.