మళ్ళీ మోగుతున్న వార్నింగ్ బెల్స్... అలర్ట్ అయిన కేంద్రం

కరోనా వైరస్ వ్యాప్తి మొదలవడంతో గతేడాది మార్చి 24 న దేశ వ్యాప్తంగా కేంద్రం మొట్టమొదటిసారి లాక్ డౌన్ విధించిన సంగతి తెల్సిందే. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసి ప్రజల ప్రాణాలను కాపాడడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గడిచిన సంవత్సరంలో అనేక చర్యలు తీసుకున్నాయి. మరోపక్క ఈ ఏడాది జనవరిలో కరోనా వ్యాక్సిన్ కు కేంద్ర ప్రభుత్వం అత్యవసర అనుమతి ఇవ్వడంతో ముందుగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు తరువాత 60 ఏళ్ల పైబడిన వృద్దులకు కూడా ప్రస్తుతం వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇది ఇలా ఉండగా కొంత కాలం క్రితం వరకు తగ్గినట్లుగా కనిపించిన వైరస్ వ్యాప్తి మళ్ళీ ఉధృతమవుతోంది. మరీ ముఖ్యంగా ఐదారు రాష్ట్రాల్లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. రెండు వారాల క్రితం వరకు 10 వేలలోపే ఉన్న రోజువారీ కేసులు.. ఉన్నట్టుండి 26 వేలకు చేరడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ మళ్ళీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసే పనిలో పడింది   దీంతో ప్రధాని మోదీ మరోసారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కావాలని నిర్ణయించారు. దీనికోసం  బుధవారం నాడు వర్చువల్ సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటికే పలు రాష్ట్రాలు కేంద్రంతో నిమిత్తం లేకుండా తగిన చర్యలను తీసుకుంటున్నాయి. మహారాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్రాలు కొన్ని ప్రాంతాలలో లాక్‌డౌన్, రాత్రి వేళ కర్ఫ్యూను విధిస్తూ కరోనాను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో పాటు ఇంకా ఏమేమి చర్యలు తీసుకుంటే కరోనాను కట్టడి చేయవచ్చన్న విషయంపై ఈ సమావేశంలో చర్చలు జరపనున్నారు. కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఏమేం చేయాలన్న దానిపైనే ప్రధానంగా చర్చించనున్నారు. కరోనా విజృంభిస్తున్న రాష్ట్రాలు తాము తీసుకుంటున్న చర్యలను గురించి ప్రధానికి వివరించనున్నట్లు తెలుస్తోంది.  

చంద్రబాబుకు సీఐడీ నోటీసులు

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన సిఐడి అధికారులు..ఆయన నోటీసులు ఇచ్చారు. అమరావతి రాజధానిలో అసైన్డ్ భూములు కొనుగోలు అమ్మకాలపై చంద్రబాబుపై కేసు నమోదు అయింది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇచ్చిందని తెలుస్తోంది.  41సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారని చెబుతున్నారు. నోటీసులు  ఇచ్చాక ఇన్వెస్టిగేషన్ కు పిలుస్తామని ఏపీ సీఐడీ అధికారులు చెబుతున్నారు. అమరావతి నుంచి రెండు సీఐడీ బృందాలు హైదరాబాద్ వెళ్లినట్లు తెలుస్తోంది. చంద్రబాబుపై 120బి, 166, 167, 217 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.  చంద్రబాబుతో పాటు మాజీ మంత్రులుకూ సీఐడీ నోటీసులు  అందాయి. 41 సీఆర్పీసీ కింద మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. 

రెండేళ్లయింది.. వివేకా కేసు ఏమైంది?

వైసీపీ నేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి రెండు సంవత్సరాలు పూర్తయింది. పులివెందులలో వైఎస్ వివేకా రెండో వర్ధంతిని నిర్వహించారు.డిగ్రీ కళాశాల రోడ్డుకు సమీపంలో ఉన్న వైఎస్‌ కుటుంబీకుల సమాధుల ప్రాంగణంలో ఆయన సమాధి వద్ద పలువురు కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన స్మారకార్థం నిర్మించిన చిన్న పిల్లల పార్కును ప్రారంభించారు. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందారెడ్డి 2019 మార్చి 14 అర్ధరాత్రి తర్వాత పులివెందులలో తన స్వగృహంలో దారుణ హత్యకు గురయ్యారు. అయితే వైఎస్ వివేకా వర్థంతి కార్యక్రమానికి కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి కుటుంబ సభ్యులు హాజరుకాలేదు. వివేకా హత్య ఘటనపై ఆయన కూతురు మారెడ్డి సునీత హైకోర్టుకు ఇచ్చిన అనుమానితుల జాబితాలో ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిల పేర్లు ఉన్నాయి.   వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురై రెండేండ్లు పూర్తైనా.. ఇప్పటికీ ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదని కాంగ్రెస్ నేత, ఆ పార్టీ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో నిందితులను గుర్తించలేదని, చార్జిషీటు కూడా దాఖలు చేయలేదని అన్నారు. ఇలా చేయడం వల్ల పోలీసు వ్యవస్థ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సిట్, సీబీఐలపై ప్రజలకు ఉన్న కాస్త నమ్మకం కూడా పోతుందని తులసిరెడ్డి అన్నారు. ఇప్పటికైనా ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు అనుమానాలు తలెత్తుతున్నాయని తులసిరెడ్డి అన్నారు.  తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటును ప్రకటించిన తర్వాత, తొలిసారి షర్మిల తన తల్లితో కలిసి పులివెందుల వచ్చారు. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందారెడ్డి రెండో వర్ధంతి కార్యక్రమంలో పాలుపంచుకొన్నారు. అనంతరం షర్మిల వేంపల్లి మండలం ఇడుపులపాయలోని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఘాట్‌కు చేరుకొని తన తండ్రి సమాధి వద్ద నివాళులు ఆర్పించారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, వైసీపీ కీలక నాయకులు, గతంలో షర్మిలతో సన్నిహితంగా ఉన్న నాయకులు సైతం ఆమెను కలిసి పలకరించలేదు  

2 వేల నోటు ఇక ఉండదా! 

రెండు వేల నోటుపై ఎప్పుడూ ఏదో ఒక ప్రచారం జరుగుతూనే ఉంటుంది. 2 వేల నోటును కేంద్ర సర్కార్ రద్దు చేస్తుందనే ప్రచారం కూడా చాలా సార్లు జరిగింది. అయితే తాజా కేంద్ర ప్రభుత్వమే రెండు వేల నోటుకు సంబంధించి కీలకమైన ప్రకటన చేసింది.  2019 ఏప్రిల్ నుంచి రెండు వేల రూపాయల నోట్లను ముద్రించడంలేదని ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఎన్డీయే సర్కారు 2017లో పెద్ద నోట్లను రద్దు చేసింది.  వాటి స్థానంలో కొత్త నోట్లను తీసుకువచ్చింది. పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్ర సర్కార్... మునుపెన్నడూ లేనివిధంగా రూ.2000 నోట్లను ప్రవేశపెట్టింది. దీవిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉండగానే  కొద్దికాలానికే రెండు వేల నోటు లభ్యత తగ్గిపోయింది. తాజాగా ఈ అంశంపై కేంద్రం వివరణ ఇచ్చింది.ఈ నోట్లను పెద్ద ఎత్తున దాచుకోవడంతో పాటు, నల్లడబ్బు రూపేణా విపణిలో చలామణీ చేసే అవకాశం ఉందని... అందుకే ఈ నోట్ల ముద్రణను రెండేళ్లుగా నిలిపివేసినట్టు వివరించారు. లోక్ సభలో ఆయన ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో చర్చించిన మీదటే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. 2018 మార్చి 30 నాటికి దేశంలో 3,362 మిలియన్ల రూ.2000 నోట్లు చలామణీలో ఉండగా... 2021 ఫిబ్రవరి నాటికి కేవలం 2,499 మిలియన్ల రూ.2000 నోట్లు చలామణీలో ఉన్నట్టు గుర్తించామని పేర్కొన్నారు. కేంద్ర సర్కార్ నిర్ణయం ప్రకారం త్వరలో రెండు వేల నోటు రద్దు కాబోతోందని తెలుస్తోంది. రెండేండ్లుగా కొత్త నోట్లు ముద్రణ కావడం లేదు. అంటే ప్రస్తుతం చలామణిలో ఉన్న నోట్ల వరకే మార్కెట్లో వినియోగంలో ఉంటాయన్న మాట. దీన్ని బట్టి కొంత కాలానికి 2 వేల నోటు మొత్తానికే కనిపించకుండా పోతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.  

టీడీపీని అమ్మేసుకోండి! ఎమ్మెల్యే రోజా సెటైర్లు 

మున్సిపల్ ఎన్నికల్లో విజయంతో విపక్ష నేతలను ఓ రేంజ్ లో టార్గెట్ చేస్తున్నారు వైసీపీ నేతలు నగరి ఎమ్మెల్యే రోజా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్  తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీని ఓఎల్‌ఎక్స్‌లో పెట్టుకుంటే మంచిదంటూ ఎద్దేవా చేశారు.  చంద్రబాబు నాయుడు మనవడితో ఆడుకుంటూ శేషజీవితం గడపాలంటూ రోజా ఎద్దేవా చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో భారీ విజయం అందుకున్న వైసీపీ ఇక టీడీపీని పూర్తిగా అణచివేసినట్లేనని ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు.  శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు వైసీపీ విజయకేతనం ఎగురవేసి టీడీపీని తరిమికొట్టిందని రోజా చెప్పారు. 18 నెలల పాలనలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజల హృదయాల్ని కొల్లగొట్టారని రోజా తెలిపారు. పవన్‌ ఒక్కోచోట ఒక్కో పార్టీ అభ్యర్థికి మద్దతిస్తున్నారని.. ఆయనకు ఒక స్పష్టతే లేదని ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తీరు వానపాము లేచి నాగుపాముపై బుసకొట్టినట్లు ఉందన్నారు. పవన్‌కు అసలు జెండా, అజెండానే లేవని ఘాటుగా ఎమ్మెల్యే రోజా. విమర్శించారు. ఫలితాలు వైసీపీకి అనుకూలంగా వస్తాయని పవన్‌, చంద్రబాబుకు ముందే తెలుసని.. అందుకే వారు లెక్కింపు రోజు హైదరాబాద్‌లోనే విశ్రాంతి తీసుకున్నారని రోజా అన్నారు తమ సొంత పార్టీలోని రెబల్స్‌పై అధిష్ఠానానికి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదని.. విజయంతోనే వారికి సమాధానం చెప్పామన్నారు రోజా. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజున సొంత పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు రోజా. తాను నిలబెట్టిన అభ్యర్థులను ఓడించడానికి రెబెల్స్ ను పెట్టారని, వారు డబ్బులు కూడా కొందరు నేతలు సాయం చేస్తున్నారని ఆరోపించారు. ఫలితాల రోజున సొంత పార్టీ నేతలను టార్గెట్ చేసిన రోజా.. తమకు వ్యతిరేకంగా పని చేసిన వాళ్ల తాట తీస్తామని హెచ్చరించారు. 

బీజేపీ నోటాను బీట్ చేసింది...

రాష్ట్ర విభజతో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో ప్రధాన జాతీయ పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్ ఉనికిని కోల్పోయాయి. 2014లో తెలుగు దేశం, జనసేన పార్టీలతో జట్టు కట్టి పోటీ చేసిన బీజేపీ, 2.2 శాతం ఓట్లతో నాలుగు అసెంబ్లీ, ఒక లోక్ సభ స్థానం గెలుచుకుంది. ఆ విధంగా పొత్తు పుణ్యాన  ఆ మాత్రం ఉనికిని కాపాడుకుంది. కాంగ్రెస్ పార్టీకి 2.8 శాతం ఓట్లు అయితే వచ్చాయి కానీ ఒక్క సీటు కూడా రాలేదు. కేవలం ఒకే ఒక్క సీటులో డిపాజిట్ దక్కించుకుని ఉన్నాను అనిపించుకుంది.  ఇక 2019 కి వచ్చే నాటికి బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు తప్పి ఒంటరిగా పోటీ చేయడంతో కమలం ఓటు 0.9 శాటానికి పడిపోయింది. ‘నోటా’ కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీగా చరిత్ర సృష్టించింది. కాంగ్రెస్ పార్టీ 1.2 శాతం ఓట్లు తెచ్చుకుంది. ఇప్పుడు రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో బీజేపీ, నోటాను బీట్ చేసింది. ఈసారి నోటాకు,1.07 శాతం ఓట్లు పోలైతే, బీజేపీకి 2.41 శాతం ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి పట్టుమని పది కౌన్సిలర్ /కార్పొరేటర్ సీట్లు అయితే రాలేదు కానీ.. నోటాను అయితే దాటేసింది.  ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల సంఘం విడుదల చేసిన లెక్కల ప్రకారం 20 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలో కంటే మున్సిపల్ ఎన్నికలలో వైసీపీ ఓటు అంత గొప్పగా ఏమీ పెరగలేదు. కానీ టీడీపీ ఓటు గణనీయంగా పడిపోయింది.2019 ఎన్నికలలో వైసీపీకి 50.6శాతం ఓట్లు పోలయ్యాయి, ఈ ఎన్నికలో వైసీపీ ఓటు షేర్ 52.63 శాతానికి పెరింగింది. తెలుగు దేశం ఓటు షేర్ 39.7 శాతం నుంచి 30.63 శాతానికి పడిపోయింది. జనసేన ఓటులో కూడా స్వల్పంగానే అయినా తగ్గింది. జనసేనకు 2019లో 5.6 శాతం ఓట్లు పోలయ్యాయి, ఈసారి అది 4.67 శాతానికి తగ్గింది. మున్సిపల ఎన్నికలలో అధికార వైసీపీ సీట్ల పరంగా ప్రభంజనం సృష్టించింది కానీ.. ఓట్ల పరంగా ఓ రెండు శాతం మాత్రమే గెయిన్ చేసింది.

మమతా బెనర్జీ నామినేషన్ పై బీజేపీ అభ్యంతరం... తృణమూల్ లో టెన్షన్

పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో అనుక్షణం ఉత్కంఠ పెరుగుతూ పోతోంది. ముందుగా  సీఎం మమతా బెనర్జీ కొంత మంది దుండగుల దాడిలో గాయపడ్డారని ప్రచారం జరిగింది. అయితే ఆ తరువాత ఆమె ప్రచారంలో జరిగిన యాక్సిడెంట్ గా అధికారులు తేల్చారు. తాజాగా దీదీ పై పోటీ చేస్తున్న బీజేపీ నేత సువేందు అధికారి ఆమెపై కొత్త అభియోగం మోపారు. మమతా దాఖలు చేసిన నామినేషన్ తోపాటు ఇచ్చిన అఫిడవిట్ లో తనపై ఉన్న పోలీసు కేసుల వివరాలు తెలపకుండా దాచిపెట్టారని ఆరోపిస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు. సీఎం మమతా బెనర్జీపై  ఆరు క్రిమినల్ కేసులతోపాటు ఒక సిబిఐ కేసు కూడా ఉందని, మరోపక్క అసోం లో ఆమెపై మరో ఆరు క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆ ఫిర్యాదులో తెలిపారు.   ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మమతా బెనర్జీ నామినేషన్ ను తిరస్కరించాలని యిసిని కోరినట్లుగా వెల్లడించారు.  దీనిపై అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని తాను ఆశిస్తున్నట్లుగా అయన చెప్పారు. ఎన్నికల నిబంధనలు ముందు సీఎం అయినా మరొకరైనా ఒకటేనని.. ఒక బాధ్యతగా దీనిపై అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేసానని అయన అన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై దృష్టి పెట్టినట్లు ఎన్నికల కమిషన్ అధికారులు తెలియచేసారు.  దీంతో తృణమూల్ పార్టీ కేడర్ లో టెన్షన్ నెలకొంది.  

స్థానిక ఎన్నికల్లో వైసీపీ ఖర్చు 10 వేల కోట్లు! 

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపలు ఎన్నికలు ముగిశాయి. పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరిగిపోయాయి. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు సాధించింది. సాధారణంగా ఎక్కడైనా స్థానిక ఎన్నికలు అధికారంలో ఉన్న పార్టీలకే అనుకూలంగా ఉంటాయి. పంచాయతీ ఎన్నికల్లో తాము 80 శాతానికి పైగా గెలిచాయమని వైసీపీ ప్రకటించుకోగా.. 40 శాతానికి పైగా పంచాయతీల్లో తాము బలపరిచిన అభ్యర్థులు గెలిచారని టీడీపీ వెల్లడించింది. అయితే మున్సిపల్, పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి.  ఏపీ ఎడిటర్స్ గిల్డ్ అనే సంస్థ చెప్పిన దాని ప్రకారం వైసీపీ దాదాపు రూ. 10వేల కోట్లకుపైగా స్థానిక ఎన్నికలకు ఖర్చు చేసినట్లు చెప్పిందని దీపక్ రెడ్డి తెలిపారు. ఈ డబ్బు ఎక్కడినుంచి వచ్చిందని ప్రశ్నించారు. ఈ విషయాన్ని కూడా ప్రజలు ఆలోచించాలన్నారు. ఏపీ ప్రజలకు మూడు ప్రశ్నలు వేశారు ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి. వైసీపీ అరాచకాలపై ప్రజలు ఆలోచించాలన్నారు. వెన్నుపోటు రాజకీయాలతో వైసీపీ విజయం సాధించిందని విమర్శించారు. ఎన్నికలు సక్రమంగా జరిగాయో లేదో ప్రజలు ఆలోచించాలని ఆయన కోరారు. మొదటి ప్రశ్న: ‘‘ఇద్దరి మహిళల కథ.. వారికి భర్తలు లేరు.. అయితే పిల్లలు ఉన్నారు. ఇద్దరికీ ఉద్యోగాలు, డబ్బులు లేవు.. ఒక మహిళ కుటుంబాన్ని పోషించేందుకు వేశ్య వృత్తి ఎన్నుకుంటుంది.. మరొక మహిళ కష్టపడి కూలిపనిచేసి కుటుంబాన్ని పోషిస్తుంది. ఈ ఇద్దరిలో మనం ఎవరిని గౌరవిస్తామని’’ దీపక్ రెడ్డి ప్రశ్నించారు. రెండో ప్రశ్న:  ‘‘యుద్ధంలో వీరులు ముందుకుపోయి పోరాడి గెలుస్తారు. మరొకరు వెనుక నుంచి కత్తితో పొడిచి గెలుస్తారు. వారిలో మనం ఎవరిని గౌరవిస్తామని’’ ప్రశ్నించారు. మూడో ప్రశ్న: ‘‘ఎన్నికలకు సంబంధించినది.. ఎన్నికలు సరిగ్గా జరిగాయోలేదో అని విమర్శించనని.. అయితే వాస్తవాలు ప్రజలముందు పెడతాను.. ఈ ఎన్నికలు సరైనవా? కాదా? అన్నిది ప్రజలే నిర్ణయించాలని’’ దీపక్ రెడ్డి కోరారు.

నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎన్నిక రద్దేనా..?

ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు సామాన్యుడి చేతికి రాజ్యాంగం ఇచ్చిన ఆయుధం.. ప్రజలకు పార్టీలపై గానీ ఎన్నికల్లో నిల్చున్న అభ్యర్థులపై గానీ విశ్వాసం లేకపోతె ఓటర్లు నోటాకు ఓటు వేసి వారి అభిప్రాయాన్ని తెలిపేందుకే కేంద్ర ఎన్నికల సంఘం నోటా అనే ఆప్షన్ ని ఎన్నికల్లో ప్రవేశపెట్టిన విషయం మనకు తెలిసిందే.. అదే ప్రశ్నపై ఎప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం, కేంద్రం, భారత ఎన్నికల   ఈ విషయం పై వివరణ కోరింది. ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థుల ఓట్ల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఆ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా వీటిపై తమ అభిప్రాయాలు తెలపాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి   భారత అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీచేసింది.   ‘నోటా’కు అత్యధిక ఓట్లు పోలైన సందర్భంలో ఆ నియోజక వర్గంలో పోలింగ్‌‌ రద్దు చేసి, మళ్లీ ఎన్నిక జరిపించాలని కోరుతూ భాజపా నేత అశ్విని కుమార్‌ ఉపాధ్యాయ సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం‌ దాఖలు చేశారు. దీనిపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ వీ రామసుబ్రమణియన్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిలో భాగంగా నోటాపై అభిప్రాయాలు తెలియజేయాలని ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. పిటిషనర్‌ తరపున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవ్యాధి మేనకా గురుస్వామి, ప్రస్తుతం అభ్యర్థుల్ని తిరస్కరించే హక్కు మాత్రమే (రైట్‌ టు రిజెక్ట్) ఉందని, కానీ, దీన్ని ఓటుగా గుర్తించాలని (రైటు టు రికగ్నైజ్‌‌) వాదించారు. కనీసం 50శాతం నోటా ఓట్లనైనా పరిగణలోకి తీసుకోవాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం 99శాతం నోటాకు ఓట్లు పడినా, ఒక్కశాతం ఓట్లలో మెజారిటీ పొందిన అభ్యర్థి విజయం సాధించే వీలుంది.  

బీజేపీలోకి కొండా విశ్వేశ్వర్​రెడ్డి! రేవంత్ రెడ్డికి మరో షాక్ 

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు ఆ పార్టీకి గుడ్​బై చెప్పగా... తాజాగా మరో సీనియర్ నేత హ్యాండ్ ఇచ్చారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డి కాంగ్రెస్​కు గుడ్ బై చెప్పేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండే కొండా పార్టీ మారడం కాంగ్రెస్ కు పెద్ద షాకే. త్వరలోనే కొండా విశ్వేశ్వర్​రెడ్డి  బీజేపీలో చేరడానికి రంగం సిద్దం చేసుకున్నారని సమాచారం.  కొండా విశ్వేశ్వర్​రెడ్డి తొలిసారి 2014 ఎన్నికల్లో టీఆర్​ఎస్​ నుంచి చేవెళ్ల ఎంపీగా గెలుపొందారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్​పార్టీలో చేరారు. అప్పట్లో టీఆర్​ఎస్​ మంత్రి, కేసీఆర్​ కుమారుడు కేటీఆర్​తో విబేధాలు రావడం వల్లే కొండా పార్టీని వీడినట్టు వార్తలు వచ్చాయి. అయితే 2019లో నిర్వహించిన పార్లమెంట్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ టికెట్​ మీద చేవెళ్ల ఎంపీగా కొండా విశ్వేశ్వర్​రెడ్డి పోటీచేశారు. అయితే సల్ప తేడాతో ఓడిపోయారు. అప్పటి నుంచి చాలా ఆయన కాంగ్రెస్​ కార్యకలాపాలకు దూరంగానే ఉంటున్నారు. యూట్యూబ్​లో వీడియోలు చేస్తూ వివిధ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కొంతకాలంగా ఆయన కాంగ్రెస్​తో దూరంగా ఉంటున్నారు. అయితే ఆయన తాజాగా బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దుబ్బాక, జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్​ నేతలు, క్యాడర్​ చతికిల పడ్డారు. పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్​ కుమార్​రెడ్డి రాజీనామా ప్రకటించినప్పటికీ కాంగ్రెస్​ అధిష్ఠానం ఆమోదించలేదు. కొత్త అధ్యక్షుడిని కూడా నియమించలేదు. దీంతో క్యాడర్​ తీవ్ర అసంతృప్తితో ఉంది. మరోవైపు కాంగ్రెస్​ అధిష్ఠానం మాత్రం ఈ విషయంలో ఇంతవరకు స్పందించడం లేదు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నేతలెవరు సీరియస్ గా పని చేయలేదు. దీంతో కాంగ్రెస్ లో ఉంటే భవిష్యత్ కష్టమనే భావనలో ఉన్న నేతలంతా.. ఆపార్టీ నుంచి బయటకి వస్తున్నారని చెబుతున్నారు. 

ఇక షర్మిల ఒంటరి ప్రయాణమేనా..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె  వైఎస్ షర్మిల తెలంగాణాలో ఒక కొత్త పొలిటికల్ పార్టీ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణాలో రాజన్న రాజ్యం తేవడమే తన లక్ష్యంగా ఆమె ముందుకు అడుగులు వేస్తున్నారు. అయితే ఆమె పార్టీ పెట్టడం ఆమె అన్న అయిన ఎపి సీఎం  జగన్ కు ఏమాత్రం ఇష్టం లేదని వైసిపి నేతలు స్పష్టం చేసారు. అయితే ఏపీలో జగన్  రాజకీయం ఆయన  దారిలో రాజకీయం చేస్తున్నారని.. అలాగే తెలంగాణాలో తన రాజకీయం తనదేనని ఆమె  తేల్చి చెప్పారు.    ఈ నేపథ్యంలో తాజాగా షర్మిల ఇడుపులపాయ పర్యటనలో కొన్ని ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇడుపులపాయలో ఆమె తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద షర్మిల ఒంటరిగా  కూర్చున్న ఫొటోపై రెండు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర చర్చ నడుస్తోంది. సాధారణంగా ఆమె అక్కడ పర్యటనకు వచ్చినపుడు ఆమె వెంట వైసీపీ కార్యకర్తలు, వైఎస్ అభిమానులు స్థానిక నాయకులు అనుసరించి ఉండేవారు.   కానీ తాజాగ వచ్చిన ఫోటోలో షర్మిల తన తండ్రి సమాధి వద్ద ఒంటరిగా కూర్చొని ఉండడం ప్రస్తుతం  చర్చనీయాంశమైంది. అంతేకాకుండా షర్మిల తో ఎపుడూ వెంట ఉండే  వైఎస్ బంధువులు కానీ కేడర్ కానీ ఎవ్వరూ లేకపోవడంతో అన్న చెల్లెళ్లకు నిజంగానే గ్యాప్ పెరిగిందా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. మరోపక్క షర్మిల వెంట పార్టీ కేడర్ కానీ, బంధువులు కానీ ఎవరూ వెళ్లవద్దని వైసీపీ అధిష్టానం ఆదేశించినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో షర్మిల వైఎస్  ఘాట్ పర్యటనకు వైసిపి శ్రేణులు దూరంగా ఉన్నాయని తెలుస్తోంది. షర్మిల తాజా ఇడుపులపాయ పర్యటనతో అన్నా చెల్లెళ్ళ మధ్య గ్యాప్ పెరిగిందన్న విషయం స్పష్టమవుతోందని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.  

తునిలో తుస్సుమన్న యనుమల.. పుట్టాను చూసి నేర్చుకోవయ్య! 

ఆంధ్రప్రదేశ్ లో అతనో సీనియర్ రాజకీయ నాయకుడు.. అసెంబ్లీ స్పీకర్ గా,  పలుసార్లు మంత్రిగా పని చేసిన అనుభవం.. తెలుగు దేశం పార్టీలోనూ ఆయనే  సీనియర్. అధినేత చంద్రబాబు తర్వాత పార్టీలోని కీలక నేతల్లో టాప్ లో ఉంటారు. అలాంటి నేత సొంత నియోజకవర్గంలో టీడీపీ తుస్సుమంది. కనీసం ఖాతా తెరవలేకపోయింది. జిల్లా మొత్తాన్ని శాసించాల్సిన స్థితిలో ఉన్న సీనియర్ నేత సొంత గడ్డలో టీడీపీకి జీరోగా మిలిగిపోవడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.  టీడీపీ ఖాతా తెరవని ఆ మున్సిపాలిటీ తుని. తూర్పుగోదావరి జిల్లాలోని తుని.. మాజీ మంత్రి యనముల రామకృష్ణడు సొంత గడ్డ. ఇక్కడి నుంచే యనుమల పలు సార్లు గెలుపొందారు. కాని ఇటీవల మాత్రం తునిలో టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ విజయం సాధించింది. అదివారం ఫలితాలు వచ్చిన మున్సిపల్ ఎన్నికల్లోనూ చావు దెబ్బ తిన్నది. తునిలో మొత్తం 30 వార్డులు ఉండగా.. 15 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగానే గెలిచారు. మిగిలిన 15 వార్డులకు పోలింగ్ జరగగా.. అన్ని వార్డుల్లోనూ అధికార పార్టీ అభ్యర్థులే గెలుపొందారు. దీంతో తునిలో టీడీపీ జీరోగా మిగిలింది. తునిలో 15 వార్డుల్లో టీడీపీ పోటీలో నిలవకపోవడమే షాకింగ్. తలపండిన రాజకీయ నేతగా ఉన్న యనమల.. అన్ని వార్డుల్లో అభ్యర్థులను పెట్టకపోవడం ఏంటన్న చర్చ టీడీపీలోనే జరుగుతోంది. మీడియా ముందు గొప్పగా ప్రకటనలు చేసే నేతలు.. సొంత కేడర్ ను నిలుపుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. మరోవైపు యనుమల వియ్యంకుడు.. పుట్టా సుధాకర్ యాదవ్ మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చూపించాడు. ఫ్యాక్షన్ గడ్డ, సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత అడ్డ కడప జిల్లాలోని మైదుకూరు మున్సిపాలిటీలో అద్భుత ఫలితాలు సాధించి వైసీపీకి షాకిచ్చారు. నిజానికి కడప జిల్లాలో ప్రస్తుతం టీడీపీ ఉనికే ప్రశ్నార్దకంగా మారింది. పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడా టీడీపీ ప్రభావం పెద్దగా కనిపించ లేదు. మున్సిపల్ ఎన్నికల్లోనూ పులివెందుల, రాయచోటి, ఎర్రగుంట్ల, జమ్మలమడుగులో పోటీ ఏకపక్షంగానే జరిగింది. కొన్ని వార్డులు ఏకగ్రీవం కాగా.. పోటీ జరిగిన చోట వైసీపీనే గెలిచింది. కాని మైదుకూరులో మాత్రం పుట్టా సుధాకర్ యాదవ్ .. అధికార వైసీపీని ధైర్యంగా ఢీకొట్టారు. వైసీపీ రాజకీయ ఎత్తులకు పైఎత్తులు వేస్తూ.. తన సత్తా చాటారు. మైదుకూరులో 24 వార్డులు ఉండగా.. టీడీపీ 12 వార్డులు గెలిచింది. వైసీపీ 11 వార్డులు గెలవగా.. జనసేన ఒక వార్డులో గెలిచింది . మైదుకూరు ఫలితాలతో షాకైన వైసీపీ నేతలు.. ఎలాగైనా ఆ చైర్మెన్ సీటును కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు . మైదుకూరు మున్సిపల్‌ ఎన్నికలు నామినేషన ఘట్టం నుంచే ఆసక్తిగా మారాయి. గత ఏడాది మార్చి 11 నుంచి 13వ వరకు నామినేషన్లు ప్రక్రియ జరిగింది. ఆ సమయంలో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అధికార అండతో వైసీపీ అడ్డుకోవడానికి ఎన్ని ఎత్తులు వేసినా.. మొత్తం 24 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయించడంతో పుట్టా సుధాకర్‌యాదవ్‌ సక్సెస్‌ అయ్యారు. ఏడాది తరువాత పురపోరు ప్రక్రియ మొదలైనా టీడీపీ అభ్యర్థులను వితడ్రా చేయించి మెజారిటీ స్థానాలు ఏకగ్రీవం చేసుకోవడానికి వైసీపీ నాయకుల ప్రయత్నాలకు అడ్డుకట్ట వేస్తూ 24 మంది అభ్యర్థులను క్యాంపునకు పంపి ఒక్క వార్డు కూడా ఏకగ్రీవం కాకుండా అడ్డుకట్ట వేశారు. విత్ డ్రా చివరిరోజు సాయంత్రం 4 గంటల తరువాత టీడీపీ అభ్యర్థి ఒకరి చేత వితడ్రాకు అధికార వైసీపీ నేతలు విఫల ప్రయత్నం చేస్తే  పుట్టా అడ్డుకున్నారు. వైసీపీ నేతలు ఎన్ని విధాలుగా అడ్డంకులు సృష్టించినా రాజకీయ ఎత్తులతో అధిగమిస్తూ పట్టణ పోరులో 12 వార్డులు గెలుచుకుని పెద్దపార్టీగా అవతరించారు. ఫ్యాక్షన్ సీమలో, సీఎం సొంత జిల్లాలో అధికార పార్టీ దౌర్జన్యాలను ఎదుర్కొని పుట్టా సుధాకర్ యాదవ్ హీరోగా నిలిచారు. కాని సీనియర్ రాజకీయ నేతగా ఉన్న యనమల మాత్రం తునిలో తుస్సుమనిపించారు. ఇదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. నిజానికి మైదుకూరు లాంటి రాజకీయాలు తునిలో ఉండవు. బెదిరింపులకు అంతగా అవకాశం ఉండదు. అయినా 15 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులను పోటీలో నిలపలేకపోయారంటే యనుమల పరిస్థితి ఎంతగా దిగజారిందో ఊహించవచ్చు. దీంతో తుని ఫలితాలను.. మైదుకూరుతో పోల్చుతూ కొందరు యనములపై విమర్శలు చేస్తున్నారు. వియ్యంకుడినైనా చూసి రాజకీయం ఎలా చేయాలో నేర్చుకోవాలని యనమలకు సూచిస్తున్నారు. మీడియాలో కనిపిస్తూ షో చేయడం కాదు.. కేడర్ కు అండగా నిలవాలని చెబుతున్నారు. టీడీపీ కార్యకర్తల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఏపీ మంత్రి మాటలతో మహిళా డాక్టర్ కంటతడి..

అనంతపురం జిల్లాలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ హడావుడి చేశారు. పెనుగొండ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించాడు. సిబ్బందిపై విరుచుకుపడ్డారు. సస్పెండ్ చేయిస్తానంటూ కేకలు వేశారు. మంత్రి తీరుతో  ఆసుపత్రి వైద్యురాలు సుకన్య కంటతడి పెట్టారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. సరిపడా సిబ్బంది లేకున్నా... విధులు నిర్వహిస్తూ.. రాష్ట్రంలోనే మంచి ర్యాంకు సాధించిన తమపై మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని వైద్యులు తప్పుబడుతున్నారు. తమపై సస్పెన్షన్‌ వేటు వేసినా తాము సిద్ధమేనని అంటున్నారు. ఆదివారం రాత్రి సోమందేపల్లి మండలం బ్రాహ్మణ పల్లి గ్రామంలో నీళ్ల సమస్యతో ఇరుగు పొరుగు వారు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో వైసీపీకి చెందిన వెంకటేశ్, తరుణ్ గాయాలపాలయ్యారు. వీరు అదే రాత్రి 11.30 కు పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. వీరిని పరామర్శించేందుకు మంత్రి శంకర్ నారాయణ ఆసుపత్రికి సోమవారం వచ్చారువైద్యుల విధులు, ఆసుపత్రి సౌకర్యాలపై ఆరా తీశారు. ఇప్పటివరకు బాగానే... తర్వాతే మంత్రి గారు రెచ్చిపోయారు. అక్కడున్న వైద్యులపై తన ప్రతాపం చూపించారు. వైద్యులు సకాలంలో స్పందించడం లేదని, ప్రైవేటు క్లినిక్ లు పెట్టుకొని ఉన్నారని మండిపడ్డారు. వెంటనే మెమోలు జారీ చేయాలంటూ వైద్యశాఖ ఉన్నతాధికారులను ఫోన్‌లో ఆదేశించారు. సస్పెండ్ చేయాలని డీసీఎస్‌హెచ్ రమేశ్ నాథ్‌తో మాట్లాడారు.  మంత్రి మాటలకు అక్కడే ఉన్న వైద్యురాలు సుకన్య కంటతడి పెట్టారు. నిజాయితీగా పని చేస్తున్న తమపై ఇలాంటి ఆరోపణలు చేయడం తగదన్నారు. పూర్తి వివరాలు తెలుసుకుని మంత్రి మాట్లాడితే బాగుడేందని చెప్పారు. మంత్రి శంకర్ నారాయణ వ్యాఖ్యలపై స్పందించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బుడం సాహెబ్... ఆరు మంది సిబ్బంది ఉండాల్సిన చోట ఇద్దరు వైద్యులు 24 గంటలు పని చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.  సస్పెండ్ చేసిన తాము సిద్ధమేనన్నారు. ఆసుపత్రుల ర్యాంకింగులో ఎక్కడో ఉన్న తమ ఆసుపత్రిని... ఉన్నతమైన స్థితికి తీసుకు వచ్చామని.. రికార్డులు కూడా పరిశీలించొచ్చు అని తెలిపారు. ఎనిమిది గంటల చేయాల్సిన విధులను ... సిబ్బంది కొరత కారణంగా 24 గంటలు చేస్తున్నామని అన్నారు. 

బీజేపీ కంటే కమ్యూనిస్టులే బెటర్! 

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. జనసేనతో పొత్తు  ఉన్నా.. ఏపీ మొత్తంగా కూడా వార్డుల్లో డబుల్ డిజిట్ క్రాస్ చేయలేకపోయింది. వామపక్షాలతో పోల్చితే బీజేపీ చాలా పూర్ గా ఉందని ఫలితాల ద్వారా తెలుస్తోంది. ఏపీలో మొత్తం 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగగా.. బీజేపీ కేవలం  7 వార్డులు, 1 డివిజన్‌ సొంతం చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు, అనంతపురం జిల్లా హిందూపురం, కర్నూల్ జిల్లా గూడూరు మున్సిపాలిటీల్లో ఒక్కో వార్డు, ఆళ్లగడ్డ, జమ్మలమడుగు మున్సిపాలిటీల్లో రెండేసి చోట్ల కమలం వికసించింది. కార్పొరేషన్లలో మాత్రం విశాఖపట్నంలో మాత్రమే ఒక డివిజన్‌లో గెలిచింది బీజేపీ.    మున్సిపల్ ఎన్నికల్లో తమకు పట్టున్న వార్డుల్లోనే బరిలో నిలిచిన వామపక్షాల అభ్యర్థులు 3 వార్డులు, 3 డివిజన్లలో విజయం సాధించారు. సీపీఐ 3 వార్డులు, ఒక డివిజన్‌లో గెలుపొందగా.. సీపీఎం అభ్యర్ధులు రెండు డివిజన్లలో గెలుపొందారు. విశాఖపట్నంలో సీపీఐ, సీపీఎంలు ఒక్కో డివిజన్‌ను కైవసం చేసుకోగా.. విజయవాడలో సీపీఎం ఒక స్థానంలో గెలుపొందింది. రాయలసీమలోని గుంతకల్‌, తాడిపత్రి, డోన్‌లలో ఒక్కో వార్డులో సీపీఐ విజయం సాధించింది.  తాడిపత్రి మున్సిపాలిటీలో చైర్మెన్ ఎన్నికకు సీపీఐ కౌన్సిలరే ఇప్పుడు కీలకంగా మారారి.  మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన జనసేన పార్టీ బోణీ కొట్టింది. బీజేపీతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీ ఎన్నికల బరిలో దిగింది. 320 వార్డుల్లో పోటీ చేసిన జనసేన.. 18 వార్డుల్లో విజయం సాధించింది. 10 మున్సిపాలిటీల్లో బోణీ కొట్టింది. ఉభయగోదావరి జిల్లాల్లో పార్టీ ప్రభావం ఉంటుందని భావించినా.. పెద్దగా విజయం సాధించలేదు. అమలాపురంలో 6 వార్డులు గెలుచి రెండో స్థానంలో నిలిచింది. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో 4 వార్డులు గెలుచుకుంది. కార్పొరేషన్లలో జనసేన 224 డివిజన్లలో పోటీ చేసి 7 చోట్ల గెలుపొందింది. విశాఖపట్నం కార్పొరేషన్‌లో 3 డివిజన్లను గెలుచుకుంది. గుంటూరులో 2 చోట్ల, ఒంగోలు, మచిలీపట్నంలో ఒక్కో డివిజన్‌లో విజయం సాధించింది. 

18 న బడ్జెట్ వ్యవసాయచట్టాలపై తీర్మానం ఉంటుందా ?

తెలంగాణ రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాలు మెదలయ్యాయి. సోమవారం ఉదయం 11 గంటలకు గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ ప్రసంగంతో ప్రారంభమైన సమావేశాలు మొత్తం పది రోజుల పాటు, ఈ నెల 26 వరకు కొనసాగుతాయి. గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన శాసనసభ సభా వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు.ఈనెల  18న ఆర్థిక మంత్రి హరీష్ రావు శాసనసభలో బడ్జెట్ ప్రవేశ పెడతారు. బీఏసీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం, ఇటీవల మరణించిన నాగార్జున సాగర్ శాసన సభ్యుడు, నోముల నర్సింహయ్యకు సభ 16న సంతాపం తెలియచేస్తుంది. 17వ తేదీ గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో చర్చ, దానిపై సమాధానం ఉంటుంది.19, 21 తేదీలను సెలవులుగా ప్రకటించారు.20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగనుంది.23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ జరగనుంది 26న ద్రవ్యవినిమయ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. అయితే, బీఏసీలో పాల్గొన్న కాంగ్రెస్ సభ్యులు, కేంద్ర ప్రభుత్వం చేసిన, వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరారు. గతంలో కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో తెరాస పాల్గొన్న నేపధ్యంలో ప్రభుత్వం కాంగ్రెస్ డిమాండ్’పై ఎలా స్పందిస్తుంది అనేది, ఆసక్తి కరంగా మారింది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు ముందు కేంద్ర చట్టాలకు వ్యతిరేంగా నిర్వహించిన రాస్తా రోకో, కార్యక్రమానికి తెరాస మద్దతు ఇవ్వడమే కాకుండా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సహా పలువురు మంత్రులు, పార్టీ నాయకులు ప్రత్యక్షంగా ఆందోళన కార్యక్రమంలో పాల్గొని, కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోడీని, బీజేపీని తూర్పార పట్టారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగాఅసెంబ్లీ  తీర్మాన చేస్తామని కూడా తెరాస ముఖ్య నేతలు పలు సందర్భాలలో పేర్కొన్నారు. అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత పార్టీ, ప్రభుత్వం స్వరం మారింది. మరి, ఇప్పుడు కాంగ్రెస్ డిమాండ్’కి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.

అవంతి, గంటాకు షాక్! జంపింగ్ ఎమ్మెల్యేకు ఝలక్ 

విశాఖపట్నం కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటర్లు విలక్షమైన తీర్పు ఇచ్చారు. అధికార వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న గాజువాక, పెందుర్తి, భీమిలి నియోజక వర్గాల్లో టీడీపీకి మెజారిటీ వార్డులు దక్కగా.. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నార్త్‌, ఈస్ట్‌, వెస్ట్‌ నియోజకవర్గాల్లో వైసీపీకి ఆధిక్యం వచ్చింది. మంత్రి అవంతి శ్రీనివాస్, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఓటర్లు షాకిచ్చారు. టీడీపీలో గెలిచి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వాసుపల్లి గణేశ్‌కుమార్‌ కు దిమ్మతిరిగే ఫలితాలు వచ్చాయి.  విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీ నుంచి గెలిచిన ఆయన.. దాదాపుగా 18 నెలలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో వైసీపీకి కేకే రాజు ఇన్‌చార్జిగా ఉన్నారు. ఇక్కడ 17 డివిజన్లు వుండగా అందులో వైసీపీకి 15, టీడీపీకి 1, బీజేపీకి 1 వచ్చాయి. ఇక్కడ టీడీపీ ఘోర పరాజయం చవిచూసింది.గంటా సైలెంట్ గా ఉండటంతో టీడీపీ కేడర్ చెదిరిపోయిందని చెబుతున్నారు.  భీమిలి నియోజకవర్గానికి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రాతినిథ్యం వహస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సబ్బం హరి ఇన్‌చార్జిగా ఉన్నారు. భీమిలి నియోజకవర్గం పరిధిలో జీవీఎంసీ పరిధిలో తొమ్మిది వార్డులు ఉన్నాయి. టీడీపీ 5 గెలుచుకోగా, వైసీపీ నాలుగు డివిజన్లు మాత్రమే దక్కించుకుంది. మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాసరావు పట్టు నిలుపుకోకపోవడం చర్చగా మారింది.  విశాఖ దక్షిణం నియోజకవర్గానికి  ఎమ్మెల్యేగా  వాసుపల్లి గణేశ్‌కుమార్‌ ఉన్నారు. టీడీపీ నుంచి గెలిచిన వాసు.. కొన్ని నెలల క్రితం వైసీపీలో చేరారు. కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ వ్యవహారాలన్ని ఆయన చూశారు. ఇక్కడ టీడీపీ నుంచి పార్లమెంటుకు పోటీ చేసిన శ్రీభరత్‌ ఎన్నికల బాధ్యతలు భుజాన వేసుకున్నారు. విశాఖ సౌత్  లో  13 వార్డులు వుండగా.. అధికార వైసీపీకి కేవలం 5 మాత్రమే గెలుచుకుంది. తెలుగుదేశానికి  4 డివిజన్లు దక్కగా.. జనసేన నుంచి ఒకరు గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థులు ముగ్గురు వైసీపీ రెబెల్స్ గెలిచారు.  టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ తూర్పులో  15 వార్డులు ఉన్నాయి. ఇక్కడ టీడీపీకి  3, వైసీపీకి 9, వార్డులు దక్కాయి. జనసేన ఒకటి గెలుచుకోగా, మరొకచోట స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి తెలుగుదేశం ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ 14 వార్డులు ఉండగా టీడీపీకి 5, వైసీపీకి 9 వార్డులు లభించాయి. వైసీపీ ఎమ్మెల్యే ఉన్న గాజువాకలో 17 వార్డులకు గాను..వైసీపీకి కేవలం 7 మాత్రమే వచ్చాయి. టీడీపీకి ఏడు, టీడీపీ బలపరిచిన సీపీఐ ఒకటి, సీపీఎం ఒకటి గెలుచుకోగా, జనసేన ఒక వార్డులో విజయం సాధించింది.  పెందుర్తికి వైసీపీ ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ సారథ్యం వహిస్తున్నారు. తెలుగుదేశం తరఫున మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఇన్‌చార్జిగా ఉన్నారు. ఇక్కడ జీవీఎంసీలో ఆరు వార్డులు ఉన్నాయి. అందులో టీడీపీ 5 గెలుచుకోగా, వైసీపీకి కేవలం ఒకే ఒక్క వార్డు వచ్చింది. ఇక్కడ నుంచి టీడీపీ మేయర్‌ అభ్యర్థి పీలా శ్రీనివాసరావు 96వ వార్డులో భారీ ఆధిక్యంతో గెలిచారు. జీవీఎంసీలో అనకాపల్లికి చెందిన 5 వార్డులు ఉన్నాయి. వాటిలో వైసీపీ నాలుగు గెలుచుకోగా, టీడీపీ ఒకటి దక్కించుకుంది. 

కమలానికి కలిసిరాని తెలుగు పొత్తులు

జాతీయ స్థాయిలో బీజేపీ ఎదుగుదలలో మిత్ర పక్షాల పాత్ర తక్కువేమీ కాదు. అంతే కాదు,  పొత్తులు, ఎత్తులు రెంటిలోనూ కాంగ్రెస్ కంటే కమల దళం రెండాకులు ఎక్కువే చదివింది. ఒకప్పుడు వాజపేయి 24 పార్టీల సంకీర్ణ ప్రభుత్వాన్ని చాలా చాకచక్యంగా నెట్టు కొచ్చారు. ఇప్పటికి కూడా కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైనంత సంఖ్యా బలం ఉన్నా, సాంకేతికంగా సంకీర్ణ (ఎన్డీఏ) ప్రభుత్వంగానే చెలామణి అవుతోంది. మిత్ర పక్షాలను వదులుకోలేదు.అయితే,ఇటీవల కాలంలో పొమ్మనకుండా పొగపెట్టి, భావసారుప్యతగల శివసేన,అకాళీ దళ్’తో సహా చాలా వరకు మిత్ర పక్షాలను సాగనంపింది. మరో వంక ఈనాటికీ సింగల్ మెంబర్ పార్టీలు సహా ఏ పార్టీ వస్తానన్నా వద్దనకుండా కూటమిలోకి ఆహ్వానిస్తుంది. పార్టీలనే కాదు, ఎంపీలు, ఎమ్మెల్ల్యేలు, మాజీలు ఎవరు వస్తానన్నా వద్దనేదే లేదని, అందరికీ స్వాగతం పలుకుతుంది. అయితే, అసలు కథ ఆ తర్వాతనే మొదలవుతుంది అనుకోండి అది వేరే విషయం. అయితే, తెలుగు రాష్ట్రాలలో మాత్రం బీజేపీకి పొత్తులు అంతగా కలిసిరాలేదు. తెలుగు దేశం ఆవిర్భావం నుంచి రెండు పార్టీల మధ్య శతృమిత్ర సంబంధాలు చాలా వరకు మారుతూ వచ్చాయి. మూడు పొత్తులు ఆరు విడాకులు అన్నట్లుగా కథ సాగుతూ వచ్చింది. అయితే పొత్తు పెట్టుకున్న ప్రతి సందర్భంలో, రెండు పార్టీలు ప్రయోజనం పొందాయి. ఉభయ తారకంగానే కథ నడిచింది. అయితే, రాష్ట్రంలో పెద్దన్న పాత్రను పోషించిన తెలుగు దేశం పార్టీ సహజంగానే ఎక్కువ ప్రయోజనం పొందింది,ఒక్కసారి మినహ బీజేపీతో పొత్తున్న ప్రతి సందర్భంలోనూ టీడీపీ అధికారంలోకి వచ్చింది.అయినా రెండు పార్టీల మధ్య సిద్ధాంత పరంగా ఏకొంచెం సారుప్యత లేకపోవడంతో, విడిపోయిన ప్రతిసందర్భంలోనూ రెండు పార్టీల మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. అయినా, రాజకీయ అవసరాల దృష్ట్యా మళ్ళీ కలవడం జరిగింది. అయితే, 2019 ఎన్నికలకు ముందు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక  హోదా సహా ఇతర విభజన హామీలను అమలు చేయక పోవడంతో, తెలుగు దేశం పార్టీ పొత్తును తెంచుకుంది. ఫలితం ఏమిటో వేరే చెప్పనక్కరలేదు. అదలా ఉంటే, ఇప్పుటికే ఒకసారి విడిపోయి రెండవ సారి కలిసిన, పవన్ కళ్యాణ్ పార్టీ, జనసేన బంధం ఏక్షణంలో అయినా పుటుక్కుమనే ప్రమాదం/ప్రమోదం రోజు రోజుకు దగ్గరవుతోంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ రోజున హటాత్తుగా తెరపైకి వచ్చిన పవన్ కళ్యాణ్ తెరాస అభ్యర్ధి వాణీ దేవికి మద్దతు ప్రకటించడంతో, మొదలైన రచ్చ ఇప్పుడు ఏపీ రాజకీయాలలో వచ్చిన మార్పుల నేపధ్యంలో మరో మలుపు తిరిగింది. పవన్ కళ్యాణ్ మళ్ళీ విడాకుల దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, విడాకుల ముహూర్తం ఎప్పుదనండి మాత్రం ఇంకా ఖరారు కాలేదు.

బీజేపీ వల్లే ఓడిపోయాం.. జనసేన సంచలన ఆరోపణలు

బీజేపీకి జనసేన గుడ్ బై చెప్పబోతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకు అనుగుణంగానే రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో ఆ రెండు పార్టీల మధ్య వివాదం ముదురుతోంది. బహిరంరంగానే నేతలు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఏపీ జనసేన నేత పోతినేని మహేష్.. బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విజయవాడలో జనసేన పార్టీకి బీజేపీవల్ల పెద్ద నష్టం జరిగిందన్నారు. తాము ఎక్కడికి వెళ్లినా ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు వ్యతిరేకించారన్నారు. అందువల్ల పశ్చిమ నియోజకవర్గంలో గెలుస్తామనుకున్న స్థానాల్లో ఓడిపోయామన్నారు. విజయవాడలో బీజేపీ తమకు అండగా నిలబడలేదని పోతిన మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు.    బీజేపీపై పోతిన మహేష్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బీజేపీ వల్లే ఓడిపోయామని చెప్పడం అంటే ఆ పార్టీతో తమకు లాభం లేదని జనసేన చెప్పడమేననే చర్చ జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు తమకు దూరమయ్యారని చెప్పడాన్ని బట్టి.. బీజేపీకి జనసేన దూరమయ్యే సంకేతాలు కన్పిస్తున్నాయనే చర్చ జరుగుతోంది. తెలంగాణ బీజేపీని టార్గెట్ చేస్తూ జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మాట్లాడిన కొన్ని గంటల్లోనే పోతిన మహేష్ ఈ కామెంట్లు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీతో పొత్తు తెగతెంపులు చేసుకునే  యోచనలో భాగంగానే జనసేన నేతలు ఒక్కొక్కరుగా బయటకి వస్తున్నారని రాజకీయ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. 

కేసీఆర్ పై గవర్నర్ ప్రశంశలు

తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ ప్రసంగించారు. ఎన్ని ఇబ్బందులు ఉన్న అన్ని విధాలుగా రాష్ట్రము ముందుకు పోతుందని.. చెపుతూ ముఖ్యమంత్రి సేవలను గవర్నర్ కొనియాడారు..  గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. అన్నివర్గాల ప్రజల పురోగతికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని. పారిశ్రామికీకరణ ద్వారా ఉద్యోగ అవకాశాలు పెంచామని. కేసీఆర్‌ సారథ్యంలో అనేక వినూత్న పథకాలు రూపొందించాం అనిఎన్నో ఇబ్బందుల నుంచి నిలదొక్కుకున్నాం. అంటూ గవర్నర్ ప్రసంగం మొదలైయింది.  సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని. అభివృద్ధిలో తెలంగాణ అగ్రగామిగా ఉందని ఆరున్నర ఏళ్ల మేధోమథనం ఫలితంగానే తెలంగాణ ముందుకు దూసుకెళ్తోందని ఆమె అన్నారు.  రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారంపై దృష్టి సారించామని ,వనరుల సద్వినియోగం ద్వారా రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్తోందని.. ఈ ఏడాదికి రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2 లక్షల 28 వేలకు పెరిగిందని.. ఆర్థిక నిర్వహణలో క్రమశిక్షణ పాటించమని.. కోవిడ్‌ వల్ల అనేక రాష్ట్రాలు ఇబ్బంది పడ్డాయి తెలంగాణ మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు వేసిందని కరోనాను సమర్ధంగా ఎదుర్కొనేందుకు అనేక చర్యలు చేపట్టామని..కరోనా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌ ఎంతో కష్టపడ్డారని  గవర్నర్‌ తమిళిసై కరోనా వ్యాక్సినేషన్‌ సక్సెస్‌గా ముందుకు సాగుతోందన్న విషయం ఆమె చెప్పుకొచ్చారు..  విద్యుత్‌ రంగంలో తెలంగాణ అద్వితీయ విజయాలు సాధించింది అతి తక్కువ సమయంలో క్లిష్టమైన సమస్యలను అధిగమించాం వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ అందిస్తున్నాం విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ మారింది జాతయ సగటు కంటే రాష్ట్ర విద్యుత్‌ తలసరి వినియోగం ఎక్కువ విద్యుత్‌రంగ సంస్కరణపై కేంద్రం రాష్ట్రాన్ని ప్రశంసించింది తాగునీటి సమస్యకు మిషన్‌ భగీరథతో శాశ్వత పరిష్కారం మిషన్‌ భగీరథ దేశానికే ఆదర్శంగా నిలిచింది గిరిజన గ్రామాలు, తండాలకు కూడా మంచినీటిని అందిస్తున్నాం 57.26 లక్షల ఇళ్లకు మంచినీటి కనెక్షన్లు తెలంగాణను ఫోరైడ్‌ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాం. మిషన్‌ కాకతీయ ద్వారా పురాతన చెరువులను పునరుద్ధరించాం తెలంగాణలో భూగర్భ జలాలు పెరిగాయి రెవెన్యూ వసూళ్లలో రాష్ట్ర అగ్రగామిగా ఉంది సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది సమైక రాష్ట్రంలో ప్రాజెక్టులను పట్టించుకోలేదు పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేసి 20లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చాం కరువు ప్రాంతాలకు కూడా సాగునీరు ఇచ్చాం భక్త రామదాసు ప్రాజెక్ట్‌ 7 నెలల్లో పూర్తి త్వరలోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ పూర్తి డిండి, సీతారామ ఎత్తిపోతలను పూర్తి చేస్తాం రైతు బంధు ద్వారా ఎకరానికి రూ.10 వేలు తెలంగాణలో 2.10 లక్షల ఎకరాల్లో పంటల సాగు తెలంగాణలో 39,36,521 మందికి పెన్షన్లు పెన్షన్ల కోసం ప్రతి ఏటా రూ.8,710 కోట్లు కేటాయింపు ధాన్యం సేకరణలో తెలంగాణ తొలిస్థానంలో ఉంది 64 లక్షల టన్నుల ధాన్యం సేకరణ జరిగింది.. ఆమె చెప్పారు.  మంగళవారం నాడు దివంగత ప్రజాప్రతినిధుల మృతి పట్ల స‌భ‌లో సంతాప తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. ఎల్లుండి గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతారు. ఈ నెల 18న అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి హ‌రీశ్ రావు బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ నెల‌ 19వ తేదీన సెలవు ఉంటుంది. ఆ త‌దుప‌రి రోజు నుంచి బడ్జెట్‌పై చర్చలు ప్రారంభ‌మ‌వుతాయి. ఇదిలావుంచితే, అసెంబ్లీలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు తొలిసారి అడుగు పెట్టారు. అలాగే, నిజామాబాద్ స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన క‌ల్వ‌కుంట్ల‌ కవితతో పాటు గవర్నర్ కోటాలో ఎన్నికైన ముగ్గురు ఎమ్మెల్సీలు మండ‌లిలో తొలిసారి అడుగు పెట్టనున్నారు.