కాంగ్రెస్‌ కామారెడ్డి సభ వాయిదా

  ఈనెల 15న జరగాల్సిన కాంగ్రెస్‌ కామారెడ్డి సభ వాయిదా పడింది. భారీ వర్షాల కారణంగా సభ వాయిదా వేస్తున్నట్లు టీపీసీసీ తెలిపింది. సభ తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని త్వరలో తెలియస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్‌ కుమార్ గౌడ్‌ ప్రకటించారు.  తెలంగాణలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని హస్తం పార్టీ  కామారెడ్డి వేదికగా  బీసీ మహా గర్జన పేరిట బహిరంగ సభకు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. సభకు హారజరయ్యే కార్యకర్తలు, నాయకులకు ఇబ్బందులు కలుగకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. త్వరల్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాల మద్దతు కూడగట్టుకోవాలని పక్కగా వ్యూహ రచన చేసింది. 

లిక్కర్ స్కాం కేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు

  ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు బిగ్ షాక్ తగిలింది. నిందితులకు  ఈనెల 18 వరకు రిమాండ్‌ను పొడిగించింది. విజయవాడ జిల్లా జైలుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు  మిగతా నిందితులను   రాజమండ్రి సెంట్రల్‌కు తరలిస్తున్నారు. మద్యం కుంభకోణం కేసులో రిమాండ్ ఖైదీగా ఎంపీ మిథున్ రెడ్డికి ఉప రాష్ట్రపతి ) ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇటీవలే విజయవాడ ఏసీబీ కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలోనే ఢిల్లీకి వెళ్లిన మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ గడువు నిన్నటితో ముగియడంతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో‌కు తరలించారు.  మరోవైపు మాజీ మంత్రి నారాయణస్వామి మొబైల్‌ ఫోన్‌ను ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ (ఎఫ్‌ఎస్‌ఎల్‌)కు పంపేందుకు ఏసీబీ కోర్టు అనుమతించింది. దీంతో సిట్‌ అధికారులు మొబైల్‌ ఫోన్‌ను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించారు. గత వైసీపీ హయాంలో నారాయణస్వామి ఎక్సైజ్‌శాఖ మంత్రిగా పనిచేశారు. మద్యం కేసులో ఇటీవల ఆయన్ను సిట్‌ అధికారులు ప్రశ్నించారు. అనంతరం నారాయణస్వామి మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ధనుంజయరెడ్డి, గోవిందప్ప బాలాజీ ఆబ్సెంట్‌ పిటిషన్‌ వేయడంతో మిగిలిన 10 మందిని కోర్టుకు తీసుకొచ్చారు.  

సెభాష్ లోకేష్!.. చంద్రబాబు నోట అరుదైన ప్రశంస

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ రోజు రోజుకూ ప్రజానాయకుడిగా, పరిణితి చెందిన రాజకీయ నేతగా ఎదుగుతున్నారు. ఈ విషయాన్ని ఆయన ప్రత్యర్థులు సైతం అంగీకరిస్తున్న పరిస్థితి. అయితే పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి నుంచి ప్రశంసలు అందుకోవాలంటే ఇది సరిపోదు.. ఇంతకు మించి ఉండాలి అంటారు పరిశీలకులు.  మామూలుగా చంద్రబాబు ఏదైనా లక్ష్యం పెట్టుకుంటే.. అది పూర్తయ్యే వరకూ ఆయన నిద్రపోరు.. ఆ పనితో సంబంధం ఉన్నవారిని నిద్రపోనివ్వరు అంటారు. ఎవరిదాకానో ఎందుకు పలు సందర్భాలలో స్వయంగా చంద్రబాబే ఆ విషయం చెప్పారు.   ఇప్పటికే పరిశీలకులు నారా లోకేష్ ను తండ్రికి తగ్గ తనయుడు అనడమే కాకుండా అంతకు మించి.. తండ్రిని మించిన తనయుడు అని కూడా శ్లాఘిస్తున్నారు. ఇదంతా పక్కన పెట్టి విషయానికి వస్తే.. ప్రతిభను చంద్రబాబు గుర్తిస్తారు. ఆ ప్రతిభకు పరీక్ష పెడతారు. ఆ విషయంలో ఆయనకు తన, పర బేధాలుండవు. ఇప్పుడు జరిగిందదే.  అల్లర్లతో అట్టుడికి పోతున్న నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారిని క్షేమంగా, సురక్షితంగా స్వరాష్ట్రానికి చేర్చే గురుతర బాధ్యతను చంద్రబాబు లోకేష్ కు అప్పగించారు. చంద్రబాబు అప్పగించిన బాధ్యతను లోకేష్ ఆయనే అచ్చెరువోందేంత సమర్థతతో నిర్వహించారు. నిద్రపోను.. నిద్రపోనివ్వను లాంటి మాటలు లేవు. హడావుడి లేదు, ఆర్భాటం లేదు. పరుగులు పెట్టడం లేదు.. పరుగులు పెట్టించడం లేదు. అమరావతి సెక్రటేరియెట్ లోని ఆర్టీజీఎస్ లో కూర్చుని ఆ పనంతా కనుసైగలతో జరిగగిపోయేలా చేశారు.. చుశారు లోకేష్. అవును ఆర్టీజీఎస్ సెంటర్ నుంచే నేపాల్ లో చిక్కుకుని బిక్కు బిక్కుమం టున్న తెలుగువారిలో భరోసా నింపడంతో పాటు.. సురక్షితంగా స్వరాష్ట్రానికి చేరుతామన్న నమ్మకాన్నీ కలిగించారు. అదే సమయంలో కేంద్రంలోని పెద్దలతో టచ్ లో ఉంటూ.. నేపాల్ నుంచి తెలుగువారిని స్వరాష్ట్రానికి తరలించడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేశారు. ఆయన కోరిన మీదటే.. కేంద్ర రెండు విమానాలను ఏర్పాటు చేసింది. ఈ లోగా ప్రతి   రెండుగంటలకు ఓ సారి నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారితో మాట్లాడారు. వారి యోగక్షేమాలు కనుక్కున్నారు.వీడియో కాల్స్ కూడా చేశారు. కేంద్రం రెండు విమానాలను ఏర్పాటు చేస్తే అవి నేపాల్ లోని తెలుగువారిని తీసుకుని ఢిల్లీ చేరుకునే సరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి కోసం ప్రత్యేక ఛార్టర్డ్ విమానాన్ని సిద్ధంగా ఉంచింది. ఆ విమానంలోనే వారిని ఢిల్లీ నుంచి విశాఖకు, తిరుపతి, కడప జిల్లాలకు చేర్చింది. అక్కడ నుంచి ప్రత్యేక కార్లు, బస్సులు ఏర్పాటు చేసి వారి వారి నివాసాలకు చేరేలా అన్ని ఏర్పాట్లూ లోకేష్ ఒంటి చేత్తో పూర్తి చేశారు.   మొత్తం మీద నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా స్వరాష్ట్రానికి తీసుకువచ్చే విషయంలో లోకేష్ అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించిన తీరు అందరినీ మెప్పించింది. అలాగే చంద్రబాబునూ మెప్పించింది. అందుకే సెభాష్ లోకేష్ అంటూ ప్రశంసించడమే కాకుండా చూడమంటే ఏకంగా తీసుకువచ్చేశారు అంటూ ఆనందంతో ప్రశంసించారు.  

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అరెస్ట్

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావును పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలో యూరియా కొరతకు నిరసనగా రాయపర్తిలో మాజీ మంత్రి ధర్నా చేపట్టారు.  ఈ ధర్నాలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నాయి. అలాగే రైతులు కూడా పెద్ద సంఖ్యలో యర్రబెల్లితో పాటు ధర్నాకు దిగారు. దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు రంగంలోకి దిగి ధర్నా విరమించాల్సిందిగా ఎర్రబెల్లిని కోరారు. ఈ సందర్భంగా పోలీసులతో రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు మాజీ మంత్రి ఎర్రబెల్లిని అదుపులోనికి తీసుకుని వర్ధన్న పేట పోలీసు స్టేషన్ కు తరలించారు. అనంతరం రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలను అక్కడ నుంచి చెదరగొట్టి ట్రాఫిక్ క్లియర్ చేశారు.  

కవిత నివాసానికి కేసీఆర్ సతీమణి.. తల్లీ కూతుళ్ల మధ్య ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్‌కు గురైన తర్వాత  కల్వకుంట్ల కుటుంబానికి కవిత పూర్తిగా దూరమైనట్లేనంటూ వార్తలు వచ్చాయి. అంతకు ముందు కూడా కవిత తండ్రిని కలవడానికి ప్రయత్నించినా కేసీఆర్ ఆమెను దూరంగానే ఉంచారు. ఈ నేపథ్యంలో గురువారం(సెప్టెంబర్ 11)  కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత సస్పెండ్ అయిన తరువాత తొలి సారిగా ఆమె తల్లి, కేసీఆర్సతీమణిక ల్వకుంట్ల శోభ కవిత నివాసానికి వెళ్లారు. శోభ తన కుమార్తె కవిత నివాసానికి వెళ్లడం ఇప్పుడు రాజకీయవర్గాలలో చర్చనీయాంశమైంది.  కవిత భర్త దేవనపల్లి అనిల్ కుమార్ పుట్టిన రోజు గురువారం (సెప్టెంబర్ 11). ఆ సందర్భాన్నిపురస్కరించుకుని శోభ కవిత నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె కవితతో  ప్రత్యేకంగా మాట్లాడారు. అన్నీ సర్దుకుంటాయని ఆమె కవితకు చెప్పినట్లు సమాచారం. అదలా ఉంచితే.. అంతేనా? అంతకు మించి ఏమైనా ఉందా అన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. ఎందుకంటే.. కవిత సస్పెన్షన్ తరువాత ఇప్పటి వరకూ కవిత ముఖం కూడా చూడని శోభ ఇప్పుడు పని కట్టుకుని అల్లుడి పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఎందుకు వెళ్లారన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ నెల 2న బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండయ్యారు. ఆ తరువాత మూడు రోజులకు అంటే సెప్టెబర్ 5న కవిత కుమారుడి పుట్టిన రోజు. ఆ సందర్భంగా కవిత తన తల్లిని ఆహ్వానించినా ఆమె మనవడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి వెళ్ల లేదు. ఇప్పుడు ప్రత్యేకంగా అల్లుడి పుట్టిన రోజు సందర్భంగా వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ సూచన మేరకే శోభ కవిత ఇంటికి వెళ్లి ఆమెను సముదాయించి వచ్చారని అంటున్నారు. కుటుంబంలో సయోధ్య కోసం కేసీఆర్ కుమార్తె వద్దకు శోభను పంపారన్న చర్చ జరుగుతోంది.  సొంత పార్టీ నేతలు, బంధువులు కూడా అయిన హరీశ్‌రావు, సంతోశ్‌ కుమార్‌లపై కవిత తీవ్ర అవినీతి ఆరోపణలు చేయడం, వారి వల్లే కేసీఆర్‌కు చెడ్డపేరు వస్తోందని వ్యాఖ్యానించడం పార్టీలో పెను దుమారం రేపడమే కాకుండా కవిత సస్పెన్షన్ కు కూడా ఆ ఆరోపణలే కారణమయ్యాయి. కవితపై క్రమశిక్షణ చర్య కింద సస్పెన్షన్ వేటు వేసినప్పటికీ.. కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ ఇప్పటి వరకూ కవిత ఆరోపణలను ఖండించలేదు. హరీష్ రావుకు మద్దతుగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. మొత్తంగా కవిత ఆరోపణలపై వ్యూహాత్మక మౌనం పాటించారు. ఈ నేపథ్యంలోనే తల్లీ కుతుళ్ల భేటీ రాజకీయంగా   ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్  ప్రమాణస్వీకారం 

నూతన ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ ఉపరాష్ట్రపతులు వెంకయ్యనాయుడు, జగదీప్ ధనకఢ్ , లోకసభ స్పీకర్ ఓం బిర్లా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ నేతలు హాజరయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతి ధన్ ఖడ్ తన పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు.దీంతో ఆయన ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో తెలపాలని విపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. తాజాగా ఆయన ఈ రోజు కార్యక్రమానికి హాజరై అందరి అనుమానాలను నివృత్తి చేశారు.

వైఎస్ రాజకీయవారసుడు నా కొడుకే.. షర్మిల ప్రకటనతో వైసీపీలో గాభరా

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ  భయాలను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల నిజం చేసేశారు. వైఎస్ రాజకీయవారసుడిగా జగన్ వినా మరొకరు లేరని వైసీపీయులు ఎంతగా అరిచి, గొంతు చించుకుని చెప్పుకుంటున్నా..  షర్మిల కుమారుడు రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ  వారిలో భయాన్నీ, అభద్రతా భావాన్నీ పెంచేసింది. షర్మిల కుమారుడు రాజారెడ్డి.. తల్లి వెంట ఒక్క పర్యటనలో పాల్గొన్నారో లేదో వైసీపీలో గగ్టోలు మొదలైంది. అంతే వైసీపీయులు విమర్శలు, ఆరోపణలతో చెలరేగిపోయారు. రాజారెడ్డి వైఎస్ వారసుడెలా అవుతారు? అందుకు అవకాశమే లేదు అంటూ మీడియా, సోషల్ మీడియాలో పోస్టులు, ప్రకటనతో రెచ్చిపోయారు. దీంతో షర్మిల రియాక్ట్ అయ్యారు. ఎవరు ఔనన్నా కాదన్నా వైఎస్ రాజకీయ వారసుడు తన కుమారుడేనని కుండబద్దలు కొట్టేశారు. తన కుమారుడికి రాజారెడ్డి పేరును స్వయంగా తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పెట్టారని గుర్తు చేశారు. ఎవరు ఎంతగా మొత్తుకున్నా, అరిచి గీపెట్టినా దీనిని ఎవరూ మార్చలేరని స్పష్టం చేసేశారు.  తన కుమారుడు ఇంకా రాజకీయాలలోకి అడుగు పెట్టనే లేదు.. అప్పుడే జగన్  వైసీపీలో ఇంత గాభరా వారిలోని భయాన్ని, అభద్రతా భావాన్నీ సూచిస్తోందని అన్నారు.  జగన్ రెడ్డి తన తండ్రి రాజకీయ సిద్ధాంతాలను పక్కన పెట్టేసి మరీ రాజకీయ లబ్ధి, ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారన్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన రాజకీయ జీవితమంతా వ్యతిరేకించిన బీజేపీతో జగన్ చేతులు కలిపారని షర్మిల పేర్కొన్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలలో జగన్ బీజేపీ మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. కేసుల భయంతో బీజేపీకి అణిగిమణిగి ఉండటమే కాకుండా ఆ పార్టీ నాయకత్వానికి అడుగులకు మడుగులొత్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.  తన సొంత రాజకీయ మనుగడ కోసం జగన్ బీజేపీతో రాజీపడిపోయారన్న షర్మిల.. తన కుమారుడు రాజారెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డికి నిజమైన రాజకీయ వారుసుడిగా ఉంటారనీ, వైఎస్ ఆశయాలు, విలువలను కొనసాగిస్తారని షర్మిల అన్నారు. 

ఏఐ సొల్యూషన్ పేరుతో రూ.వెయ్యి కోట్ల మోసం!

హైదరాబాద్‌లో మరో భారీ ఇన్వెస్ట్‌మెంట్ స్కాం వెలుగులోకి వచ్చింది.  మాదాపూర్‌  లో  ఏఐ సొల్యూషన్స్ , ఏఐ రియాల్టీ,ఐఐటి క్యాపిటల్స్ పేరుతో పెట్టుబడిదారులను మోసగించిన ఘటన వెలుగులోకి వచ్చింది.  స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే పెద్ద మొత్తంలో లాభాలు ఇప్పిస్తామంటూ మోసానికి పాల్పడ్డ ఈ సంస్థ పైన పోలీసులు కేసును నమోదు చేశారు. ఈ సంస్థ దాదాపు 4500 మంది బాధితుల నుంచి 1000 కోట్ల పైచిలుకు వసూలు చేసి   బిచాణాఎత్తేసింది. ఉభయ తెలుగు రెండు రాష్ట్రాల్లో కలిపి వేలాది మంది బాధితులు ఇప్పుడు రోడ్డున పడ్డారు.  స్టాక్ మార్కెట్లో తమ కంపెనీ ద్వారా పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇవ్వడమే కాకుండా ఆరు శాతం వడ్డీ చొప్పున లెక్క కట్టి ఇస్తామంటూ భారీ ఎత్తున  ప్రచారం చేసిన  ఈ సంస్థ..   ఇందుకు సంబంధించి ఉభయ తెలుగు రాష్ట్రాలలో  సమావేశాలు కూడా నిర్వహించింది. పెద్ద సంఖ్యలో ఏజెంట్లను నియమించుకుంది.  ప్రజలను ఆకర్షించి డిపాజిట్ల సేకరణ కోసం సమావేశాల పేర డిన్నర్ పార్టీలు కూడా ఇచ్చింది.  తమకు చాలా పెద్ద ఎత్తున లాభాలు వచ్చాయంటూ కొందరి చేత ఆ సమావేశాలలో చెప్పించి జనాలను నమ్మించింది. ఇలా ఆ సంస్థను నమ్మి వేలాది మంది బాధితులు పెట్టుబడులు పెట్టారు. ఇలా వేలాది మంది నుంచి దాదాపు వెయ్యికోట్లకు పైగా వసూలు చేసిన ఈ సంస్థ.. బిచాణా ఎత్తేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఈ సంస్థ 4600 మందికి పైగా బాధితుల నుంచి దాదాపు 1032 కోట్ల రూపాయలు వసూలు చేసిందనీ, ఆ సొమ్ములను చాలా వరకూ విదేశాలకు తరలించిందని గుర్తించారు.    స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే పెట్టుబడులు సురక్షితంగా ఉండటమే కాకుండా, అధికలాభాలు కూడా వస్తాయంటూ మభ్యపెట్టి డిపాజిటర్లను ఆకర్షించిన ఈ సంస్థ  వారి నుంచి సేకరించిన సొమ్మును స్టాక్ మార్కెట్ లో పెట్టకుండా.. నకిలీ అక్కౌంట్లలోకి మళ్లించింది.  ఈ కేసులో ప్రధాన నిందితుడు,  ఏవి సొల్యూషన్స్ డైరెక్టర్ గడ్డం వేణుగోపాల్ ను  పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ఐఐటి క్యాపిటల్ టెక్నాలజీస్ ఎం.డి శ్రియస్ పాల్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏవి సొల్యూషన్స్‌కి అనుబంధంగా దాదాపు 10 షెల్ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కంపెనీల ద్వారా దేశంలో సేకరించిన నిధులను విదేశా లకు తరలించినట్లు అధికారులు గుర్తించారు.  ఏఐ సొల్యూషన్స్, శ్రీనివాస అనల్టిక్, ట్రేడ్బుల్ టెక్నాలజీ, ఐఐటి క్యాపిటల్ టెక్నాలజీ పేర్లతో డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించింది. ఈ సంస్థలు తమను బీఎస్ఈ, సెబీలో నమోదు అయిన కంపెనీలుగా ప్రచా రం చేసుకొని ప్రజలను నమ్మించినట్లు పోలీసులు తెలిపారు.  తెలుగు రాష్ట్రాలతో పాటు పలు ఇతర  రాష్ట్రాల్లో కూడా ఈ కంపెనీలు ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. 

చెన్నైలో బస్సు దొంగతనం.. ఆత్మకూరులో అరెస్ట్

చెన్నై లో  తమిళనాడుకు చెందిన ఆర్టీసీ బస్సును దొంగిలించిన వ్యక్తి ఆత్మకూరులో పట్టుబడ్డాడు. విషయమేంటంటే.. ఒడిశా రాష్ట్రానికి చెందిన  రంజన్ సాహు అనే వ్యక్తి చెన్నైలోని కొయ్యం బెడ్ వద్ద నిలిపి ఉంచిన తమిళనాడు ఆర్టీసీ బస్సును దొంగిలించి.. అక్కడ నుంచి డ్రైవింగ్ చేసుకుంటూ.. ఆ రాష్ట్ర సరిహద్దు దాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేరుకున్నాడు. కాగా నిలిపి ఉంచిన బస్సు కనిపించకపోవడంతో తమిళనాడు ఆర్టీసీ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన చెన్నై పోలీసులు బస్సు ఆంధ్రప్రదేశ్ లోని ఆత్మకూరు వైపుగా వెడుతున్నట్లు గుర్తించి ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు.  దీంతో ఆత్మకూరు అలర్ట్ అయ్యారు.   నెల్లూరుపాలెం వద్ద ఆ బస్సును పట్టుకుని  ఆత్మకూరు ఆర్టీసీ డిపోకు తరలించి.. విషయాన్ని చెన్నై పోలీసులకు తెలిపారు. దీంతో చెన్నై పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది ఆత్మకూరు వచ్చి బస్సును దొంగిలించిన వ్యక్తిని అదుపులోనికి తీసుకుని..  టీఎన్ఆర్టీసీ బస్సును చెన్నై తీసుకువెళ్లారు.   

తిరుమల శ్రీవారి ఆలయంలో హుండీ దొంగ దొరికాడు

తిరుమల శ్రీవారికి భక్తులు భక్తితో హుండీలో సమర్పించే కానుకలను దొంగిలిస్తూ ఓ దొంగ పట్టుబడ్డాడు. శ్రీవారి ఆలయ ప్రాంగణంలోని బంగారు బావి పక్కన ఉన్న స్టీల్ హుండీ నుంచి నగదు చోరీ చేసిన దొంగను భద్రతా సిబ్బంది పట్టుకున్నారు.  తమిళనాడుకు చెందిన వ్యక్తి  శ్రీవారి హుండీలో భక్తులు సమర్పించిన నగదును చోరీ చేశాడు. నాలుగువేల రూపాయలను సదరు దొంగ హుండీ నుంచి చోరీ చేయడాన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్ లోని సీసీటీవీలో గమనించిన అధికారులు వెంటనే విజిలెన్స్, భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. భద్రతా సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని నిందితుడిని పట్టుకుని అతడిని పోలీసులకు అప్పగించారు.  

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. శ్రీవారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచీ, విదేశాల నుంచీ కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు. గంటల తరబడి క్యూలైన్లలో, కంపార్ట్ మెంట్లలో వేచి ఉండి మరీ తిరుమలేశుని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ముఖ్యంగా వారాంతం సమీపిస్తుంటే భక్తుల రద్దీ మరింత పెరుగుతుంది. ఆ క్రమంలోనే శుక్రవారం (సెప్టెంబర్ 12) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక గురువారం (సెప్టెంబర్ 11) శ్రీవారిని మొత్తం 66 వేల 312 మంది దర్శించుకున్నారు. వారిలో 27 వేల 728 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 81 లక్షల రూపాయలు వచ్చింది. 

జగన్ సన్నిహితుడు సునీల్ రెడ్డి నివాసంలో సిట్ సోదాలు

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో సిట్ లాజికల్ ఎండ్ దిశగా సాగుతోంది.ఆ క్రమంలో జగన్ కు అత్యంత సన్నిహితుడు, మద్యం కుంభకోణం సొమ్ములను తరలించడంలో కీలక పాత్ర పోషించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నర్రెడ్డి సునీల్ రెడ్డికి చెందిన నివాసాలు, కార్యాలయాలలో సిట్ గురువారం (సెప్టెంబర్ 11) సోదాలు నిర్వహించింది. పదుల సంఖ్యలో సూట్ కేసు కంపెనీలు పెట్టి వాటి ద్వారం మద్యం కుంభకోణం సొమ్ములను మనీలాండరింగ్ ద్వారా విదేశాలకు తరలించినట్లు సిట్ గుర్తించింది. వాస్తవానికి నర్రెడ్డి సునీల్ రెడ్డి వ్యవహారంపై తెలుగుదేశం ఎంపీ లావు కృష్ణదేవరాయలు గతంలోనే పార్లమెంటులో ప్రస్తావించారు.   మద్యం కుంభకోణం సొమ్ములను విదేశాలకు ఎలా తరలించారన్న విషయాన్ని ఆధారాలతో సహా పార్లమెంటు వేదికగా లావు కృష్ణదేవరాయులు వివరించారు. ఈ సమాచారం ఈడీకి కూడా అందించారు. ఇప్పుడు సిట్ ఆయన నివాసాలు, కార్యాలయాలలో సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లను, హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నది.  ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి జగన్   రెడ్డి సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి పీఏ ద్వారా సమాచారాన్ని రాబట్టిన సిట్.. ఇప్పుడు సునీల్ రెడ్డి నివాసాలు, కార్యాలయాలలో సోదాలు నిర్వహించడం ద్వారా దర్యాప్తు ఈ కుంభకోణం అంతిమ లబ్ధిదారు వరకూ వెడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్.. పది మంది మావోలు మృతి

నక్సల్ విముక్త భారత్ లక్ష్యంగా కేంద్రం ప్రారంభించిన ఆపరేషన్ కగార్ కొనసాగుతున్నది. తాజాగా ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో పది మంది మావోయిస్టులు మరణించారు. మృతులలో  మావోయిస్టు పార్టీ కీలక నేత, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు బాలకృష్ణ అలియాస్ మనోజ్‏ కూడా ఉన్నారు.   గరియాబాద్ జిల్లా అడవులలో మావోయిస్టుల కదలికలపై అందిన స్పష్టమైన సమాచారం మేరకు భద్రతా దళాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ కూంబింగ్ లో మెయినాపూర్ ప్రాంతంలో నక్సల్స్ తారసపడ్డారు. భద్రతా దళాలను చూసి మావోయిస్టులు కాల్పులు ప్రారంభించడంతో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో పది మంది మావోయిస్టులు మరణించారు. పలువురు గాయపడి ఉంటారనీ, దీంతో మృతుల సంఖ్య  పెరిగే అవకాశం ఉందనీ చెబుతున్నారు. సంఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, విప్లవ సాహిత్యాన్ని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. కాగా ఈ ఎన్ కౌంటర్ లో మరణించి మోడం బాలకృష్ణది తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా గణపురం..   స్పెషల్ టాస్క్ ఫోర్స్ , కోబ్రా, సీఆర్‎పీఎఫ్, ఇతర రాష్ట్ర పోలీసు విభాగాలకు చెందిన సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన కూంబింగ్ లో భాగంగా ఈ ఎన్ కౌంటర్ జరిగింది. కాగా ఆపరేషన్ కగార్ తో మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గత ఐదు నెలల కాలంలోనే నాలుగువందల మందికి పైగా మావోయిస్టులు ఎన్ కౌంటర్లలో హతమయ్యారు. వీరిలో మావోయిస్టు అగ్రనేతలు మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశరావు, కేంద్ర కమిటీ సభ్యులు భాస్కర్, సుధాకర్, చలపతి వంటి వారు కూడా ఉన్నారు. అలాగే పెద్ద సంఖ్యలో మావో యిస్టులు లొంగిపోయారు. 

హరీష్ రావుపై కవిత ఆరోపణలు.. కేటీఆర్ ఖండన ఎక్కడ?

బీఆర్ఎస్ లో అంతర్గత రాజకీయం సద్దుమణిగినట్లు కనిపించడం లేదు. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె కవిత ఎపిసోడ్ ఆమె సస్పెన్షన్ తో ముగిసిందని అంతా భావించినా పార్టీలో మాత్రం ఆ అలజడి ఇసుమంతైనా చల్లారలేదని అంటున్నారు. కాళేశ్వరం అవినీతి అంతా హరీష్ రావు, సంతోష్ లదే అంటూ కవిత చేసిన విమర్శల కారణంగానే ఆమెను సస్పెండ్ చేశారని అంటున్నా.. కవిత సస్పెన్షన్ తో ఆ ఆంశం ముగిసిందనడానికి వీలులేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఎందుకంటే కవిత మాజీ మంత్రి హరీష్ రావుపై చేసిన అవినీతి విమర్శలను ఇప్పటి వరకూ బీఆర్ఎస్ అగ్రనేతలు ఎవరూ ఖండించలేదు. ఔను కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ కవిత ఆరోపణలను ఖండించలేదు. కేవలం ఆమెను సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకున్నారు. సస్పెన్షన్ వేటుతో కవిత ఏం వెనక్కు తగ్గలేదు. ఆరోపణలను వెనక్కు తీసుకోనూ లేదు. అయినా కూడా హరీష్ రావుకు మద్దతుగా కవిత ఆరోపణలను ఖండిస్తూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు మాట్లాడలేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే కేటీఆర్ రేవంత్ సర్కార్ పై విమర్శలతో కాలం గడిపేస్తున్నారే కానీ, సొంత పార్టీలో అతి కీలక నేతపై తన సోదరి    కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలను ఖండించడం మాత్రం చేయలేదు. దీంతో సోషల్ మీడియాలో హరీష్ పై ఆరోపణల పరంపర రోజురోజుకూ పెచ్చరిల్లుతోంది. కవిత మద్దతుదారులే కాదు.. కాంగ్రెస్ వర్గాల నుంచి సైతం హరీష్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.   మరో వైపు విశ్లేషకులు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో హరీష్ రావు  సుద్దపూస కాదని నమ్ముతుండటం వల్లనే బీఆర్ఎస్ ఆయనపై ఆరోపణలను ఖండించడం లేదా అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు హరీష్ మద్దతు దారులలో కేటీఆర్ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం అవుతోంది. 

మెడికల్ కాలేజీలపై సిగపట్లు!

ఏపీలో తమ మెడికల్ కాలేజీలు, ఎరువుల కొరత చుట్టూ మాజీ సీఎం జగన్ పాలిటిక్స్ మొదలుపెట్టారు. ఓ వైపు జగన్, ఇంకోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు సై అంటే సై అంటున్నారు. మేం మెడికల్ కాలేజీలు తెస్తే ప్రైవేటుకు అమ్మేస్తారా అని జగన్ క్వశ్చన్ చేస్తుంటే.. భూమి కేటాయించి రిబ్బన్ కట్ చేసి వదిలేస్తే  కాలేజీలు నడుస్తాయా అని సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు.  ఏపీలో ఎరువుల కొరత, మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సంబంధించి మాజీ సీఎం జగన్ విమర్శలు మొదలు పెట్టారు. రైతు సమస్యలపై ఆందోళన చేసిన   వైసీపీ నేతలు కురసాల కన్నబాబు, కాకాణి గోవర్ధన్ రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, అంబటి రాంబాబులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.  రైతుల సమస్యలపై పోరాటం చేసినందుకే ఈ నోటీసులు ఇచ్చారని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. ఎరువులు సకాలంలో అందిస్తే రైతులు రోడ్లపై నిరసనలు చేయాల్సిన అవసరం ఉంటుందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రెండు నెలలుగా రైతులు ఎరువుల కోసం క్యూలలో నిలబడుతున్నా ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కూటమి సర్కారు ఎరువుల కొరత నియంత్రించామని కౌంటర్లు మొదలుపెట్టింది. మరోవైపు ఏపీలో మెడికల్ కాలేజీలను పీపీపీలో చేపట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో పది మెడికల్ కాలేజీలను  పీపీపీ పద్ధతిలో సెట్ చేయనున్నారు. ఇందులో భాగంగా తొలి విడతలో నాలుగు మెడికల్ కాలేజీలు పీపీపీ కింద చేపట్టాలని డిసైడ్ చేశారు. సెప్టెంబర్ 4న జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో ప్రభుత్వం పీపీపీ మోడల్ కింద 10 మెడికల్ కాలేజీలను డెవలప్ చేయడానికి ఆమోదం తెలిపింది.  ఫేజ్-1లో  పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లి ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఉన్నాయి. అలాగే  ఫేజ్-2లో పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం కాలేజీలను డెవలప్ చేయనున్నారు.  ఫస్ట్ ఫేజ్ కోసం ఇప్పటికే  రెడీ అయిన రిక్వెస్ట్ ఆఫ్ ప్రపోజల్ కు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ కృష్ణబాబు ఉత్తర్వులు ఇచ్చారు. మిగిలిన 6 కాలేజీలు ఫీజబులిటీ రిపోర్ట్, డ్రాఫ్ట్‌ ఆర్ఎఫ్‌పీ రెడీ అయ్యాక పీపీపీ విధానంలోకి వెళ్లనున్నాయి. పీపీపీ కోసం కంపెనీలను ఎంపిక చేసేందుకు టెండర్లను కూడా ఆహ్వానిస్తున్నారు.  అసలు ఏపీలో మెడికల్ కాలేజీల చుట్టూ ఏం జరుగుతోందో.. ఇక్కడి వరకు ఓ క్లారిటీ ఉంది.  ఇది ప్రైవేటుకు కట్టబెట్టే కుట్ర అని వైసీపీ అంటుంటే.. కేవలం బిల్డింగ్స్, ఇన్‌‌ఫ్రా వరకు మాత్రమే ప్రైవేట్ వారు చూసుకుంటారని ఇతర యాజమాన్యమంతా ప్రభుత్వానిదే అని కూటమి నేతలు క్లారిటీ ఇస్తున్నారు. అయితే దీనిపైనే ఇప్పుడు పొలిటికల్ వార్ మొదలైంది. తమ పార్టీ తిరిగి అధికారంలోకి రాగానే.. ఈ పీపీపీ మోడల్ కింద ఉన్న అన్ని టెండర్లను రద్దు చేస్తామని మాజీ సీఎం జగన్ వార్నింగ్ ఇస్తున్నారు.  గత వైసీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను మంజూరు చేసి ప్రభుత్వ రంగంలో అమలు చేయాలని చూశారు. కానీ ముందడుగు పడలేదు. దీంతో ఈ మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే టేకప్ చేసే బదులు పబ్లిక్-ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ కు మార్చారు. ప్రభుత్వం చెబుతున్న విషయాల ప్రకారం పీపీపీలో చేస్తే... డిజైన్, ఫైనాన్సింగ్ అమలును ఈజీ చేస్తాయని, ప్రాజెక్ట్ కెపాసిటీని మెరుగుపరుస్తాయని, మనం పెట్టే ప్రతి పైసాకూ లాంగ్ టర్మ్ వాల్యూ అందిస్తాయంటోంది చంద్రబాబు సర్కార్. మొత్తం 10 మెడికల్ కాలేజీలను ఈ పీపీపీలో చేస్తామంటోంది కూటమి సర్కారు.  2027-28 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు ప్రారంభమయ్యేలా నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రైవేట్ భాగస్వామ్యం నిర్మాణానికి మాత్రమే పరిమితం అని ప్రభుత్వం అంటోంది. కాలేజీల పూర్తి యాజమాన్యం, అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ అంతా రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుందంటున్నారు. సగం సగం పనులతో అసలు కాలేజీలు నడుస్తాయా అని కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. 17 మెడికల్‌ కాలేజీలు ఉంటే ఒక్కటి మాత్రమే పూర్తయిందని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. గత ప్రభుత్వం మెడికల్‌ కాలేజీలకు పునాదులు వేసి వదిలేసిందన్నారు.  అందుకే తమ హయాంలో పీపీపీ విధానం తీసుకొచ్చామని చెప్పారు. అసలు మెడికల్ కాలేజీలు అంటే ఏంటో తెలియని వారు కూడా మాట్లాడుతున్నారని చంద్రబాబు ఘాటు కౌంటర్ ఇచ్చారు. పునాది వేయడం, రిబ్బన్ కటింగ్ చేయడం, ఏదో చేసేశామని చెప్పడం, కాలేజీని నడిపే విధానం ఇదేనా? అని సీఎం క్వశ్చన్ చేస్తున్నారు.  అటు వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సైతం దీనిపై రియాక్ట్ అయ్యారు. వైసీపీ హయాంలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల కోసం సంవత్సరానికి 360 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, అయితే కూటమి ప్రభుత్వం కేవలం రెండేళ్లలో 7 వేల కోట్లు ఖర్చు చేసేలా ప్రణాళికలు రచించిందంటున్నారు. పులివెందుల మెడికల్ కాలేజ్ 84 శాతం పూర్తయినప్పటికీ ఎన్ఎంసీ అంచనాల ప్రకారం 48 శాతం బోధనా సిబ్బంది కొరతతో ఉందన్నారు. మోడీ విధానాలతోనే దేశంలో, రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు పెరిగాయని, అందులోనూ రకరకాల నిధులను దారి మళ్లించి ఒక్క మెడికల్ కాలేజీని కూడా జగన్ సర్కార్ పూర్తి చేయలేకపోయిందని ఫైర్ అయ్యారాయన. చేసే పని పకడ్బందీగా చేద్దాం.. మధ్యలో వదిలేసేలా వద్దు అన్నది కూటమి ప్రభుత్వం మాట. బోధనా సిబ్బంది ఉంటే ఇన్ఫ్రా స్ట్రక్చర్ లేకపోవడం, మౌలిక వసతులు ఉంటే డాక్టర్ల కొరత, ఇలా సగం సగం వద్దు అంటున్నారు. అందుకే పీపీపీ మోడల్ తెరపైకి తెచ్చామని క్లారిఫికేషన్ ఇస్తున్నారు. మొత్తానికి ఇది ఇక్కడితో ఆగిపోయేలా కనిపించడం లేదు. పీపీపీ చుట్టూ పెద్ద పొలిటికల్ బ్లాస్టింగ్స్ జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.

నోరు తెరిచిన మ్యాన్ హోల్.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రమాదం

హైదరాబాద్ నగరంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మ్యాన్ హోల్ తెరచి ఉండటంతో.. స్కూల్‌కు వెళ్తూ ఓ విద్యార్థిని ఆ మ్యాన్ లో పడిపోయింది.. ఈ ఘటన హైదరాబాద్‌ పాతబస్తీలోని యాకుత్‌పురాలో చోటుచేసుకుంది. చిన్నారి మ్యాన్ హోల్ లో పడిపోవడం గమనించిన ఆమె తల్లి వేగంగా స్పందించి బాలికను సకాలంలో బయటకు లాగేసింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు బాలిక పుస్తకాల సంచిని బయటకు తీశారు. మ్యాన్ హోల్ లో పడిన బాలిక క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన చార్మినార్ జెనల్ కమిషనర్ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఘటన గురించి హైడ్రాకు సమాచారం అందించారు. బాలిక నివాసానికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.  

హస్తినకు చంద్రబాబు.. కారణమేంటంటే?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం (సెప్టెంబర్12) హస్తిన బయలుదేరి వెళ్లనున్నారు. కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ లో కీలక భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ అధినేతగా ఆయన శుక్రవారం (సెప్టెంబర్ 12) జరగనున్న ఉపరాష్ట్రపతి సీపీ చంద్రశేఖర్ ప్రమాణ స్వీకార కర్యక్రమంలో పాల్గొననున్నాయి. ఇందుకోసమే చంద్రబాబు వెడుతున్నారు. ఉప రాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎన్డీయే కూటమి పార్టీల నేతలే కాకుండా విపక్ష పార్టీలకు చెందిన నేతలూ హాజరౌతారు. రాష్ట్రపతి కార్యాలయంలో జరిగే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తిగా రాజకీయాలకు అతీతం. ఇక విషయానికి వస్తే ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా తెలుగుదేశం కీలకంగా వ్యవహరించింది.  ఏపీ ఎన్డీఏ ఎంపీలందర్నీ మంత్రి లోకేష్ సమన్వయం చేశారు. ఇందు కోసం ఆయన స్వయంగా ఢిల్లీకి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబునాయుడు ఉపరాష్ఠ్రపతి ప్రమాణస్వకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఢిల్లీ వెడుతున్నారు. అయితే ఈ హస్తన పర్యటన సందర్భంగా చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇటీవల హస్తిన వెళ్లి ప్రధాని నరేంద్రమోడీతో దాదాపు ముప్పావుగంట సేపు భేటీ అయ్యారు. ఆ సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి పలు అంశాలపై మోడీతో చర్చించారు. అయితే ఆ సందర్భంగా నారా లోకేష్ కేంద్ర మంత్రులతో భేటీ కాలేదు. ఇప్పుడు చంద్రబాబు హస్తిన పర్యటనలో కేంద్ర మంత్రులతో భేటీ కావడాన్ని లోకేష్, మోడీ భేటీకి కొనసాగింపుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

భారీ వర్షాలకు నిలిచిన రవాణా.. కుళ్లిపోతున్న యాపిల్ పండ్లు

దేశంలో  వివిధ ప్రాంతాల్లో రైతుల కష్టాలు రోజురోజుకు అధికమవుతున్నాయి.. ఆంధ్రప్రదేశ్ లో ఉల్లిరైతులు, జమ్మూ కశ్మీర్ లో యాపిల్ రైతులు కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఏపిలో ఉల్లి రైతులకు గిట్టుబాటు ధరలు అందక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కశ్మీర్ లో భారీ వర్షాల కారణంగా  యాపిల్ పండ్ల రవాణా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీనివల్ల పండ్లు కుళ్లిపోయి రైతులు నష్టాల పాలౌతున్నారు.   జమ్మూ కాశ్మీర్ లో గత ఇరవై రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల  రహదారులు అధ్వానంగా మారాయి. దీంతో యాపిల్ పండ్ల రవాణా ఎక్కడిక్కడ నిలిచిపోయింది. యాపిల్ పండ్లలోడుతో బయలుదేరిన లారీలు మార్గ మధ్యంలోనే నిలిచిపోయాయి. ఒకవైపు వర్షాలు.. మరోవైపు రోజుల తరబడి దిగుమతి చేయకుండా ఉండటంతో యాపిల్ పండ్లు కుళ్ళిపోతున్నాయి. దీనివల్ల యాపిల్ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

సూపర్ విక్టరీతో ఆసియాకప్ లో శుభారంభం చేసిన టీమ్ ఇండియా

ఆసియా కప్‌ను సూపర్ విక్టరీతో ఆరంభించింది టీమిండియా. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్‌లో యూఏఈను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది ఘన విజయాన్నందుకుంది సూర్యకుమార్   సేన. మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ 13.1 ఓవర్లలో 57 పరుగులకే కుప్పకూలింది. లక్ష్య చేధనలో భారత్ 4.3 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 60 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. యూఏఈ ఓపెనర్ అలీషన్.. 22 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. యూఏఈ బ్యాటింగ్ లైనప్‌లో ఏకంగా 8 మంది సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. మరొకరు డకౌట్‌గా వెనుదిరిగారు.  టీమిండియా స్పిన్నర్ల దాటికి ఆతిధ్య జట్టు పూర్తిగా చేతులెత్తేసింది.  9వ ఓవర్‌లో కుల్దీప్ ఏకంగా మూడు వికెట్లు తీయడంతో యూఏఈ పీకల్లోతు కష్టాల్లో పడింది. చివరి 8 వికెట్లను యూఏఈ కేవలం 10 పరుగుల వ్యవధిలో కోల్పోవడం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు, శివమ్ దూబే మూడు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు బుమ్రా, వరుణ్‌ చక్రవరి, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు. ఆ తర్వాత 58 పరుగుల టార్గెట్ ఛేజింగ్‌లో.. టీమిండియా ఫస్ట్ ఓవర్ నుంచే దాటిగా ఆడింది. ఓపెనర్ అభిషేక్ శర్మ మొదటి బంతికే సిక్సర్ కొట్టి తనదైన శైలిలో ఇన్నింగ్స్ ఆరంభించాడు. అభిషేక్ వర్మ 16 బంతుల్లో 30 పరుగులు చేసి ఔటయ్యాడు.  గిల్ 20 పరుగులతో.. సూర్యకుమార్ 7 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఇక ఈ మ్యాచ్‌లో కేవలం 4.3 ఓవర్లలో టార్గెట్‌ను ఫినిష్ చేసిన భారత్ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఆసియాకప్ టీ 20 టోర్నీలో బంతులు పరంగా భారీ విజయం సాధించిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో 93 బంతులు మిగిలుండగానే భారత్ లక్ష్యాన్ని చేధించింది. ఇంతకుముందు ఈ రికార్డు అఫ్గానిస్తాన్ పేరిట ఉండేది. ఇంటర్నేషనల్ టీ20ల్లో అత్యంత వేగంగా రన్ ఛేజ్ చేసిన రెండో జట్టుగా భారత్ నిలిచింది. టీ20 వరల్డ్ కప్-2024లో ఒమన్‌పై కేవలం 3.1 ఓవర్లలోనే ఇంగ్లండ్ లక్ష్యాన్ని చేధించి అగ్రస్దానంలో ఉంది.