అమెరికా సుంకాల యుద్ధం వెనుక అసలు కథ ఇదేనా?

భారత్, అమెరికాల మధ్య సంబంధాలు చెడటానికి అసలు కారణం.. అగ్రరాజ్య అధినేత టారిఫ్ వార్ ఒక్కటే కాదని పరిశీలకులు అంటున్నారు.  అసలు కథ  వేరే ఉందంటున్నారు. ట్రంప్ కోరినట్లుగా  జన్యుపర విత్తనాల (Genetic seeds) ఒప్పందానికి  భారత్ అంగీకరించకపోవడమే అసలు కారణంగా చెబుతున్నారు. ఒక వేళ భారత్ జెనిటిక్ సీడ్స్ ఒప్పందానికి అంగీకరించి ఉంటే..   అమెరికా విత్తనసంస్థ మాన్ శాంటో ఏజెంట్ బేయర్  పెత్తనం చెలాయిస్తారు. జెనిటిక్ సీడ్స్ పేటెంట్ పొందిన సంస్థ కసారి   దేశంలోకి అనుమతిస్తే.. ఇక అంతే సంగతులు.  ఆ విత్తనం విత్తితే తరతరాలు ఆ సంస్థకు సొమ్ములు చెల్లిస్తూ ఉండాల్సిందే. అంతే కాదు దేశీయ విత్తన సంస్థలు మూడపడాల్సింది. అలాగే రైతువారీ విత్తన సేకరణకు ఫుల్ స్టాప్ పడాల్సిందే.  స్వదేశీ వ్యవసాయ పరిశోధనలు ఇక  గతించిన చరిత్రగా మారిపోతాయి. . 1950, 1960లలో అంటే ఇండియాలో ఇంకా హరిత విప్లవం మొదలు కాని రోజులలో  అమెరికా పీఎల్ 480 పేరుతో గోధుమలను సరఫరాచేసేది. అయితే ఆ సరఫరాకు అమెరికా విధించిన షరతులు దేశానికి ఆమోదయోగ్యం కాకపోవడం వల్లనే దేశంలో హరిత విప్లవానికి నాంది పలికింది.  ఇప్పుడు అమెరికాలో తయారవుతున్న జెనిటిక్ క్రాప్స్  మొక్కజోన్న,సోయా తదితరాలు  మనిషిని చంపవు కానీ శరీరాన్ని గుల్లు చేసే రసాయినాలు కలిగి ఉంటాయి. ఆ కారణంగా అమెరికా జెనిటిక్ క్రాప్స్ ను ఇక్కడ దేశీయంగా వినియోగిస్తే..  మందుల వినియోగాన్ని విపరీతంగా పెరిగిపోతుంది. ఒళ్లు, జేబూ కూడా గుల్ల అయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. ఇంకా స్పష్టంగా ఉదాహరణ ఇవ్వాలంటే.. అమెరికాలో 1990 తరువాత ఊబకాయుల సంఖ్య పెరిగిపోవడానికి ఈ జెనిటిక్ క్రాప్సే కారణం. చిన్న తనంలోనూ డయాబెటిక్ వంటి వ్యాధుల సంక్రమణకూ ఇవే కారణమని వైద్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే  సంతానలేమి, ,కాన్సర్,కాలేయవ్యాధులు, గుండెజబ్బులు విపరీతంగా పెరగడానికీ ఇవే కారణం.దీనివల్ల మందుల వినియోగం పెరిగిపోవడం సహజం. ఈ సకల దుష్ఫరిణామాలకూ  జన్యూపరమైన పంటలు, వాటితో తయారైన ఆహారం పదార్ధాలు కారణమని నిపుణులు చెబుతున్నారు.  అందుకే ఇండి యా జెని టిక్స్ సీడ్స్ ఒప్పందానికి నిర్ద్వంద్వంగా నో చెప్పింది.  జబ్బులు, రుగ్మతలతో పాటు ఈ ఒప్పం దానికి ఔదాల్చితే  దేశీయ విత్తనాలు,  పంటలు,  ఆత్మగౌరవం,  భవిష్యత్తు ఇవేమీ ఉండవు. ఈస్టిండియా కంపె నీ వాణిజ్యం పేరుతో ఇండియాను ఆక్రమించిన వలసకాలంనాటి పరిస్థితులు మళ్లీ ఇప్పుడు పునరావృతమౌతాయంటున్నారు పరిశీలకులు.  

బడాయి బాబూ.. ఏంటీ డాబు?

రీసెంట్ గా చంద్రబాబు పదే పదే చెబుతున్న పీపీపీ విధానం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. మరీ ముఖ్యంగా మెడికల్ కాలేజీల వ్యవహారంలో ప్రైవేటు భాగస్వామ్యం మీద భారీ ఎత్తున చర్చ నడుస్తోంది. అయినా ప్రభుత్వం కాలేజీ కట్టాల్సిందంతా కట్టి ప్రైవేటు పరం చేయడమేంటన్నదొక చర్చ. గతంలో ప్రస్తుతం ఆరోగ్య శ్రీ మాత్రం ప్రైవేటు కార్పొరేటు ఆస్పత్రులను ఎంకరేజ్ చేయడం కాదా? అన్నది బాబు ప్రభుత్వ వాదన. అంతా ప్రభుత్వమే నడిపిస్తే తడిసి మోపెడవుతుంది కాబట్టి ఇదే కరెక్ట్ అన్నది వీరి కామెంట్. ఇదెలా ఉన్నా.. ఇలా ప్రతిదీ ప్రైవేటు పరం చేయడం వల్ల చివరికి ప్రభుత్వం కన్నా ప్రైవేటే మిగలదా? అన్న మాట ఎక్కువగా వినిపిస్తోంది. ఇక పీ4. దీనిపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్. ఇదైతే ఆయన అనుకూల మీడియా కూడా విరుచుకుపడేంత విమర్శనాత్మకంగా మారింది. పీ4 ద్వారా పేదరిక నిర్మూలన సాధ్యమేనా? అసలు జీరో పావర్టీ అంటూ ఒకటి ఉంటుందా? ఒక వేళ ఉంటే ఆ సమాజం ఎలా ఉండబోతోంది?   ఇప్పటికే అలివి కాని హామీలిచ్చారన్న మాట ఉండనే ఉంది. పీ 4 ద్వారా బాబు పేదరికం నిర్మూలిస్తున్నారా? లేక ఇందులోకి వచ్చే బడాబాబుల జేబులు తడిపేలా మరేదైనా పథక రచన చేశారా? అన్నది కూడా చర్చనీయాంశమే. ఎవరు సంపన్నులు కావడానికి ఈ పేదరిక నిర్మూలనా పథకం? అర్ధం కావడం లేదంటారు కొందరు. ఇప్పటికే వైసీపీ ఈ దిశగా తన విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టినట్టు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. స్త్రీ శక్తి పథకం. ఇదైతే.. కూటమి ప్రభుత్వాన్ని భారీ ఎత్తున ఇరుకున పడేస్తోంది. మొన్న విజయనగరంలో ఆటో డ్రైవర్లు ర్యాలీ తీస్తే.. నిన్న పిఠాపురంలో  ఆటో డ్రైవర్లు యాచన చేస్తూ ఈ పథకం పట్ల తమ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఫ్రీ బస్సు అవసరమా? ఫ్రీ వైద్యం విద్య అవసరమా? తేల్చుకోవాలంటూ.. ప్రభుత్వంపై ఇప్పటికే విరుచుకుపడుతున్నారు కొందరు. వికలాంగులకు కూడా ఫించన్లు తొలగిస్తున్నారంటూ మరొక గొడవ. ఇంత పెద్ద ఎత్తున ఫించన్లు అమలు చేయడం ఎందుకు? వాటిని ఇవ్వలేక పోవడం ఎందుకన్నది ఒక వాదన. ఇదిలా ఉంటే నెల నెలా బాబు ఫించన్ల పేరిట చేస్తున్న హైడ్రామా.. ఆయన పబ్లిసిటీ  మోజు ఎక్కువైందన్న కామెంట్ వినవస్తోంది. ఇప్పటికే గత గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన తొక్కిసలాటలో  29 మంది మరణించడానికి కారణం.. ఆయన పబ్లిసిటీ కోసం పెట్టుకున్న షూటింగ్ కారణంగా భక్తులను ఘాట్ లోకి స్నానానికి అనుమతించకుండా నిలువరించడమేనన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడీ ప్రచార మోజు అంత అవసరమా అన్ని విమర్శలు వినిపిస్తున్నాయి.   సూపర్ సిక్స్- సూపర్ హిట్ అంటూ చేస్తున్న హంగామా సైతం   విమర్శలకు దారి తీస్తోంది. పథకాలు ఇచ్చామంటే ఇచ్చాశామన్నది ముఖ్యం కాదు. దాన్నెంత సవ్యంగా అందరికీ అందేలా ఇస్తున్నామన్నది ముఖ్యం. ఇలా విజయోత్సవ సభలు నిర్వహించడం కార్యక్రమాలు రూపొందించి జనం సొమ్ము తగలేయడం సరి కాదన్న వాదన వినిపిస్తోంది.  గతంలో వైసీపీ కూడా ఇంటింటికీ వంటి అతి కార్యక్రమాల ద్వారా.. పొందిన లాభం కంటే నష్టమే ఎక్కువ. చంద్రబాబు ఈ ధోరణి మానుకోవాలన్నది  జనం మాటగా వినిపిస్తోంది. అతి సర్వత్రా వర్జయేత్ కాబట్టి ఇలాంటి కార్యక్రమాలను తగ్గించుకోవడమే మేలని అంటున్నారు. మంచి ప్రభుత్వం అంటూ చేసే ప్రచారాలు సైతం చేటు తెచ్చేవే తప్ప.. వాటి ద్వారా ఎలాంటి లాభం లేదన్న విషయం చంద్రబాబు గుర్తించాలని కూడా సలహా ఇస్తున్నారు. యూరియాతో మొదలు పెట్టి రైతులకు గిట్టుబాటు ధర వంటి ఎన్నో సమస్యలుండగా బాబు   డాబు కొద్దీ చేస్తోన్న ఈ ప్రచార పటాటోపం చేటు తెచ్చేదిగానే అభివర్ణిస్తున్నారు చాలా మంది. ఏటా డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి జగన్ చేసిన సంక్షేమాభివృద్ధికి దక్కిన ఫలితం 11 సీట్లు. డబుల్ ఖర్చు చేసి చంద్రబాబు చేయాలని చూస్తున్న ఈ సంక్షేమ సరళి ఎలాంటి ఫలితాలిస్తాయో అన్న ప్రశ్న- కూటమి గెలవక ముందు నుంచే ఉంది. ఒక పక్క వైసీపీ ఆ పార్టీ సోషల్ మీడియా వింగులు మొదలు పెట్టిన ఫేక్ న్యూస్ దాని కట్టడికి తల బొప్పి కట్టేస్తోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ ని ఒక ట్రబుల్ షూటర్ గా తయారు చేయడంలో లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఆయన ఎక్కే హెలికాప్టర్, దిగే ఫ్లైటు ఖర్చులు తడిసి మోపెడు అవుతోంది. ఆపై ఆయన సినిమాల కోసం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం కూడా చేటు తెచ్చేలా తెలుస్తోంది. ఈ దిశగా ఇప్పటికే కేసు నమోదయ్యింది. ఇక నియోజకవర్గానికి 500 మందిని ఎంపిక చేసి పది లక్షలిస్తామని ఆయన ప్రచార సమయంలో చేసిన ప్రకటన గురించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గతంలో వాలంటీర్ల వల్ల 30 వేల మంది అమ్మాయిలు తప్పి పోయారన్నది నిరూపించలేక చేతులెత్తేస్తున్నారు పవన్. ఆపై సుగాలీ ప్రీతి వ్యవహారం ఉండనే ఉంది. ఇలా కూటమి ప్రభుత్వ నిర్వహణ తలాపాపం తిలా పిడికెడుగా కనిపిస్తోందని అంటున్నారు. వీటన్నిటినీ సరిదిద్దుకోవల్సిన బాబు.. వీటన్నిటినీ పక్కన పెట్టి తన ప్రచార పటాటోపం కోసం చేస్తున్న ఈ పాలన సరైనదేనా? అన్న ప్రశ్న వినిపిస్తోంది.

ఏపీకి యూరియా.. కాకినాడ పోర్టులో దిగుమతికి కేంద్రం జీవో

రాష్ట్రంలో యూరియాకు ఎటువంటి కొరతా లేకుండా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.  యూరియా కోసం ఎదురు చూస్తున్న రైతులకు, మరీ ముఖ్యంగా అత్యవసరంగా యూరియా అవసరమైన జిల్లాలకు ఎటువంటి అంతరాయం లేకుండా సత్వరమే యూరియా సరఫరాకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రప్రభుత్వ విజ్ణప్తి మేరకు  17 వేల 293 మెట్రిక్ టన్నుల యూరియా కేంద్రం రాష్ట్రానికి పంపింది. ఈ యూరియాన కాకినాడ పోర్టులో దిగుమతి చేయడానికి అనుమతి ఇస్తూ కేంద్రం జీవో జారీ చేసింది. దీంతో తక్షణ అవసరాలు ఉన్న జిల్లాలకు యుద్ధ ప్రాతిపదికన యూరియా సరఫరా చేయాలని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత, సమస్య అన్న మాటే వినిపించకూడదని అచ్చెన్నాయుడు అధికారులకు స్పష్టం చేశారు.  రాష్ట్రంలో ప్రస్తుతం 80 వేల 503  మెట్రిక్ టన్నల యూరియా ఎరువుల నిల్వ ఉందని అధికారులు ఈ సందర్బంగా మంత్రికి వివరించారు.   యూరియాను బ్లాక్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని  మంత్రి ఆదేశించారు. 

మాట్లాడే అవకాశాలిస్తాం.. సభకు రండి!

వైసీపీ ఎమ్మెల్యేలను సభకు రావాలంటూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరోసారి కోరారు. అనర్హత వేటు వేళాడుతున్న వేళ  వైసీపీ ఎమ్మెల్యేలకు ఆయన మరోసారి సభకు రావాలంటూ కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలతో సంబంధం లేకుండా అందరు ఎమ్మెల్యేలకు ఇచ్చినట్లుగానే వైసీపీ సభ్యులకు కూడా మాట్లేడేందకు తగిన సమయం ఇస్తామని ఆయన ఈ  సందర్భంగా చెప్పారు.  రాష్ట్రంలోని సమస్యలతో పాటు తమతమ నియోజకవర్గాల్లోని ప్రజా సమస్యలకు సంబంధించి అన్ని అంశాలపై చర్చించేందుకు అవకాశం ఇస్తామన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని సభకు హాజరై ప్రజాసమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని అయ్యన్నపాత్రుడు వైసీపీ ఎమ్మెల్యేలను కోరారు. 

ఉద్యోగులకు డీఏ బకాయిల తొలి విడత చెల్లింపు

జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఖజానా ఖాళీ అయ్యింది. అప్పులు, చెల్లింపుల బకాయిలు వినా చిల్లి గవ్వ కూడా లేని పరిస్థితిలో.. గత ఏడాది జరిగిన  ఎన్నికలలో విజయం సాధించి తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టింది. అప్పటి నుంచీ ఒక్కొక్కటిగా అన్నిటినీ సరిదిద్దుకుంటూ.. రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ అడుగులు వేస్తున్నది. అభివృద్ధి, సంక్షేమాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ.. ప్రజాభిమానాన్ని చూరగొంటున్నది. గత ప్రభుత్వం చెల్లింపులకు ఎగనామం పెట్టి ఉద్యోగులకు డిఏలు పెద్ద ఎత్తున బకాయి పడింది. ఇప్పుడు ఆ బకాయిల చెల్లింపులపై చంద్రబాబు సర్కార్ దృష్టి పెట్టింది. తొలి విడతగా సీపీఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిలన విడతల వారీగా చెల్లించేందుకు రెడీ అయ్యింది. ఇందులో భాగంగా సీపీఎస్ ఉద్యోగులకు తొలి విడత డిఏ బకాయిలను విడుదల చేసింది. అనూహ్యంగా తమ ఖాతాల్లో సొమ్ములు జమ అవ్వడంతో  ఉద్యోగులు ఆశ్చర్యపోయారు. దీనిపై ఏపీ సచివాలయ సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. తొలి విడదలోసెక్రటేరియట్ సీపీఎస్‌ ఉద్యోగులకు డిఏ బకాయిలను ప్రభుత్వం జమ చేసింది. త్వరలోనే  మిగిలిన సిపిఎస్ ఉద్యోగులందరికీ  బకాయిలు నగదుగా చెల్లించేందకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఈ బకాయిలను మొత్తం ఆరు విడతలలో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం తొలి విడతలో జమ అయిన బకాయిలు ఒక్కో ఉద్యోగికీ 40 నుంచి 70 వేల వరకూ వచ్చాయి.   జగన్ రెడ్డి హయాంలో ఉద్యోగులకు రివర్స్ పీఆర్సీ ఇచ్చి  డీఏలు ఎగ్గొట్టడంతో బకాయిలు పెద్దఎత్తున పేరుకుపోయిన సంగతి విదితమే. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులు డిమాండ్ చేయకపోయినా వారికి న్యాయంగా అందాల్సిన బకాయిలను అందించే ఏర్పాట్లు చేస్తుండటం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.    

సృష్టి కేసు.. ముగ్గురు వైద్యుల సస్పెండ్

  తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి సంతాన సాఫల్య కేంద్రంలో ముగ్గురు వైద్యలపై  ఏపీ ప్రభుత్వం  చర్యలు తీసుకుంది. ఆంధ్ర వైద్య కళాశాల అనస్తీషియా విభాగాధిపతి డాక్టర్‌ రవి, గైనకాలజీ విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఉషాదేవి, శ్రీకాకుళం వైద్య కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ విద్యుల్లతపై సస్పెన్షన్‌ వేటు వేసింది. హెల్త్ మినిస్టర్ సత్యకుమార్‌ ఆదేశాలతో ముగ్గురిని సస్పెండ్‌ చేస్తూ సంబంధిత శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ముగ్గురిపై హైదరాబాద్‌లో కేసులు నమోదు కావడంతో కూటమి ప్రభుత్వం చర్యలకు దిగింది.  సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత పిల్లలు లేని దంపతులనే లక్ష్యంగా చేసుకుని లక్షల్లో వసూళ్లకు పాల్పడింది. అబార్షన్‌ కోసం ఆస్పత్రికి వచ్చే గర్భిణీలకు డబ్బులు ఆశ చూపి ప్రసవం తర్వాత వారి పిల్లల్ని కోనుగోలు చేసి సరోగసి ద్వారా పుట్టిన బిడ్డగా నమ్మించి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు నమ్రత కన్ఫెషన్ రిపోర్ట్​లో పోలీసులు పేర్కొన్నా సంగతి తెలిసిందే

మనస్తాపంతో జూనియర్ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం

  తనపై నిందలు వేస్తూ పై అధికారులకు ఫిర్యాదు చేయడంతో మనస్థాపం చెందిన జూనియర్ అసిస్టెంట్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకుంది. జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న లకావత్ కల్పన  నల్లబెల్లి తహసీల్దార్ కార్యాలయంలో గత పది సంవత్సరాలుగా జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న కల్పనను. అదే మండలం బిల్ నాయక్ తండాకు చెందిన చరణ్ సింగ్ అనే వ్యక్తి మనసికంగా వేధిస్తూ అధికారులకు తనపై  తప్పుడు నిందలు వేస్తూ ఫిర్యాదు చేశాడని, తనను లైంగికంగా వేధిస్తున్నాడని మనస్థాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నారని సూసైడ్ నోట్‌లో పేర్కొంది.  తన చావుకు చరణ్ సింగ్ తో పాటు మాజీ ఎంపీటీసీ మోహన్   అధికారులు కూడా కారణమంటూ తెలిపింది . కల్పన పురుగుల మందు తాగిన విషయం గమనించిన అటెండర్ కేకలు వేయడంతో సహో ఉద్యోగులు వచ్చి అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను హుటాహుటిన నర్సంపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించి చికిత్స అందిస్తున్నారు.

గంట కొట్టిన బాలయ్య... తొలి దక్షిణాది నటుడిగా రికార్డు

    నందమూరి నటసింహం బాలకృష్ణ మరో అరుదైన ఘనత సాధించారు.  ముంబయిలోని నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) బెల్‌ను మోగించిన తొలి దక్షిణాది నటుడిగా నిలిచారు. అధికారుల ఆహ్వానం మేరకు ఎన్‌ఎస్‌ఈని తాజాగా బాలకృష్ణ సందర్శించారు. ఆ సమయంలో వారి విజ్ఞప్తి మేరకు అక్కడ ఏర్పాటు చేసిన గంటను కూడా మోగించారు. అందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  నందమూరి ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే నటసింహం వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. ఇప్పుడు మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. దీంతో జై బాలయ్య అంటూ సోషల్​ మీడియాలో ఫ్యాన్స్​ తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరుస రికార్డులు అందుకోవడంతో బాలయ్య అభిమానులు సందడి చేస్తున్నారు. ఈ అరుదైన అవకాశం లభించడంపై స్పందించిన బాలకృష్ణ, తన సంతోషాన్ని పంచుకున్నారు. "ముంబై స్టాక్ ఎక్స్చేంజ్‌లో చిరస్మరణీయ, మరపురాని ఘట్టమని పేర్కొన్నారు. బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ప్రతినిధులతో ముంబై పర్యటనలో భాగంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్‌ను ఆయన సందర్శించారు. ఆ సందర్భంలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అధికారులు చూపిన ఆత్మీయత, ఇచ్చిన గౌరవం నా హృదయాన్ని తాకింది.  ప్రత్యేక ఆహ్వానం ఇచ్చి స్టాక్ ఎక్స్చేంజ్ బెల్ మోగించే అవకాశాన్ని ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. దక్షిణ భారతీయ నటుడిగా, హీరోగా ఈ వేదికపై బెల్ మోగించిన మొదటి వ్యక్తిగా నిలవడం నాకు గర్వకారణం మాత్రమే కాదు… ఇది నా తెలుగు ప్రజల ప్రేమ, ఆదరణ, ఆశీర్వాదాల ప్రతిఫలమని భావిస్తున్నాను తెలిపారు. ఈ క్షణం నాకు మరపురానిది. ఇది వ్యక్తిగత ఘనత కాదని.. మనందరి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని నమ్ముతున్నాను." అంటూ బాలకృష్ణ తన ఆనందాన్ని పంచుకున్నారు.

దళారీ వ్యవస్థపై దండెత్తిన చీని రైతులు

  కడప జిల్లా  పులివెందులలో చీని రైతులు, వ్యాపారస్తులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇక్కడి  వ్యాపారస్థులు సిండికేట్ గా మారి ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు కనీసం గిట్టుబాటు ధర కూడా కల్పీంచకుడా తమ పంట దిగుబడిని కొనుగోలు చేస్తున్నారని చీనీ రైతులు ఆందోళనకు వ్యక్తం చేశారు. దళారులు, స్థానిక వ్యాపారుల కారణంగా   తీవ్రంగా నష్టపోతున్నామని, తమకు ఆత్మహత్యలే శరణ్యమని పులివెందులలోని మార్కెట్ యార్డ్ పై సోమవారం చీనీ రైతులు దండెత్తారు. చీని మార్కెట్ లో వ్యాపారస్తులతో వాగ్వివాదానికి దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకొంది.  తమ భార్యల తాలిబొట్లు, పొలాలు బ్యాంకుల్లో తాకట్టు పెట్టు కుంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.  చీని పంటకు గిట్టుబాటు ధరలు లేక పోవడంతో సంవత్సరాలుగా పెంచుకుంటున్న చీని చెట్లను నరికి వేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  *దళారీ వ్యవస్థ తో నష్టపోతున్నాం     కమలాపురం, తొండూరు, పులివెందుల మండలాలకు చెందిన రైతులు సురేంద్రనాథ్ రెడ్డి, కొండారెడ్డి, సోమ లింగారెడ్డి తదితర రైతులు మాట్లాడుతూ   దళారీ వ్యవస్థ లో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని నియోజకవర్గంలోని చీని రైతులం ఆందోళనకు దిగాల్సి వచ్చిందన్నారు. సోమవారం పులివెందుల మార్కెట్ యార్డులో చీని వేలం పాటలో వ్యాపారులు అందరూ ఒక్కటి అయ్యి  రైతుకు గిట్టుబాటు ధర కాకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  టన్ను చీని రూ. 8 వేలు నుండి రూ.10 వేలు అడుగుతున్నారన్నారు. వెంటనే ప్రజాపతినిధులు, అధికారులు జోక్యం చేసుకొని రైతుకు టన్ను రూ.30 వేలు నుండి రూ.40 వేలు  గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు నిరసన తెలిపారు. వ్యాపారుల తీరు మారకపోతే వేలం పాటను అడ్డుకుంటామని రైతులు హెచ్చరించారు. తమకు కనీస గిట్టుబాటు ధర లేకపోతే మార్కెట్ యార్డుకు ఈనెల 11న తాళాలు వేసి బంద్ నిర్వహిస్తామని   రైతులు హెచ్చరించారు.  రైతులు కూడ మార్కెట్ యార్డ్ కు చీని పంట తీసుకు రావద్దని తోటి రైతులకు విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మార్కెట్లో వ్యాపారస్తులందరూ సిండికేట్ అయ్యి రైతులను నిండా ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలామంది రైతులు గిట్టుబాటు ధర లేక చెట్లను నరికివేస్తున్నారని దీనివల్ల రైతుకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఇలాగే ఈ వ్యవస్థ మారకపోతే రైతులు అప్పులు తీర్చలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది అన్నారు.  *ఇతర ప్రాంత  వ్యాపారులను రానివ్వకుండా  గతంలో ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారులు తోటల వద్దకే  వచ్చి కొనుగోలు చేసే వారన్నారు.. ప్రస్తుతం పులివెందుల చీనీ మార్కెట్ యార్డులో వ్యాపారులంతా ఏకమై రైతులను మోసం చేస్తున్నారని తెలిపారు. సూట్ పద్దతిని  రద్దు చేసేందుకే మార్కెట్ యార్డ్లో చీని రైతులకు మరియు వ్యాపారస్తుల మధ్య సయోధ్య  కుదిర్చి  చీని మార్కెట్ యార్డ్ ను ఏర్పాటు చేశారన్నారు.  ప్రస్తుతం  పులివెందుల చీని మార్కెట్ యార్డ్ లో దళారులంతా ఏకమై ఒకటి, రెండు చీని కుప్పలకు మాత్రం అధిక ధర వెచ్చిస్తూ కొనుగోలు చేస్తున్నారన్నారు. మిగతా వాటికి మాత్రం నామకే వాస్తు ధరలను నిర్ణయించి రైతులను నిండా ముంచేస్తున్నారన్నారు. *రైతులతో చర్చించిన బిటెక్ రవి. రైతుల ఆందోళన తెలుసుకున్న పులివెందుల నియోజకవర్గ టిడిపి ఇన్ ఛార్జ్ బిటెక్ రవి, పులివెందుల మార్కెట్ యార్డ్ చైర్మెన్ అమర్నాథ్ తోకలసి మార్కెట్ యార్డ్ కు చేరుకున్నారు. అనంతరం అక్కడి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.  వ్యాపారస్థులతో కూడ సమస్య ఎక్కడ నెలకొన్నది అనే విషయమై వారితో చర్చించారు. బిటెక్ రవి మాట్లాడుతూ చీని రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. రైతులు ఆందోళన, అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు.  

రాష్ట్రంలో యూరియా కొరత ఉండొద్దు : సీఎం చంద్రబాబు

  ఏపీలో రబీ సీజన్‌కు సంబంధించి యూరియా పంపీణీపై ప్రణాళికలు రచించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. యూరియా సరఫరా, ఉల్లి కొనుగోళ్లు, తురకపాలెం గ్రామంలో ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 80,503 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వ ఉన్నయని అధికారులు సీఎంకు వివరించారు.  మరో 10 రోజుల్లో 23,592 వేల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి వస్తుందని అధికారులు పేర్కొన్నారు.  నిత్యావసర వస్తువుగా ఉన్న యూరియాను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని  సీఎం ఆదేశించారు. కర్నూలు మార్కెట్ లో ఉల్లి కొనుగోళ్లు, మద్దతు ధరపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. ఉల్లి ధర క్వింటాలుకు రూ.1200 తగ్గకుండా చూడాలన్నారు. రైతులు ఎవరైనా క్వింటాకు రూ.1200 కంటే తక్కువ ధరకు అమ్ముకుంటే...ఆ మేరకు ప్రభుత్వం చెల్లిస్తుందని  ముఖ్యమంత్రి తెలిపారు. అరకు కాఫీకి సోకిన కాయతొలుచు తెగులు పైనా సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు . కాఫీ తోటలకు సోకిన తెగులును ఇతర ప్రాంతాలకు సోకకుండా చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు. ఇప్పటి వరకు 80 ఎకరాలకు మాత్రమే తెగులు సోకిందని....అందులో 60 ఎకరాలు తొలగించామని  అధికారులు సీఎం చంద్రకు వివరించారు. తురకపాలెం గ్రామ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆరోగ్యశాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ కే.విజయానంద్, వ్యవసాయశాఖ, వైద్యారోగ్యం, ఐటీ శాఖ ఉన్నతాధికారులు పాల్గోన్నారు.   

విశాఖ అభివృద్ధికి రూ.553 కోట్లతో నూతన ప్రాజెక్టు

  విశాఖ నగరాభివృద్ధి కోసం అంతర్జాతీయ ఆర్థిక సంస్థ నుంచి విశాఖపట్నం మహానగర పాలక సంస్థ రుణం తీసుకునేందుకు సంబంధించి ఐఎఫ్‌సీ-జీవీఎంసీ అధికారులు మధ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఒప్పందం జరిగింది. అనంతరం జీవీఎంసీ అధికారులు ముఖ్యమంత్రితో సమావేశమై త్వరలో చేపట్టే అభివృద్ధి ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. ఈ ఒప్పందంతో భారతదేశంలో మొదటిసారిగా అంతర్జాతీయ ఆర్థిక సంస్థ నుంచి ప్రత్యక్ష రుణం పొందిన మున్సిపల్ కార్పొరేషన్‌గా జీవీఎంసీ నిలిచిందని అధికారులు తెలిపారు.  విశాఖపట్నంలోని మధురవాడ జోన్–2లో ఆధునిక మురుగునీటి వ్యవస్థను ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేయనున్నారు. దీనికి మొత్తం రూ.553 కోట్లు వ్యయం అయ్యే ఈ ప్రాజెక్టులో రూ.498 కోట్లు ఐఎఫ్‌సీ రుణంగా ఇవ్వనుంది. మిగిలిన మొత్తంలో అమృత్ 2.0 నుంచి రూ.45.64 కోట్లు, జీవిఎంసీ సొంత నిధులు రూ. 9.36 కోట్లు వినియోగించనుంది. జీవీఎంసీ తన సొంత ఆదాయ వనరుల ద్వారా ఈ రుణాన్ని తిరిగి ఐఎఫ్‌సీకి చెల్లించనుంది. 15 సంవత్సరాల కాలపరిమితి కలిగిన ఈ రుణానికి వడ్డీ రేటు 8.15 శాతం (ఫ్లోటింగ్)గా నిర్ణయించారు.  త్వరలో మొదలయ్యే మధురవాడ మురుగునీటి ప్రాజెక్టుతో 100 శాతం అండర్‌గ్రౌండ్ మురుగునీటి నెట్‌వర్క్, ఆధునిక పంపింగ్ - లిఫ్టింగ్ స్టేషన్లు, అత్యాధునిక శుద్ధి కేంద్రం – నీటి పునర్వినియోగం, రీసైక్లింగ్‌ చేయనున్నారు. 30 ఏళ్ల జనాభా వృద్ధి అవసరాలను దృష్టిలో పెట్టుకొని దీనిని డిజైన్ చేశారు. నీటి శుద్ధి వల్ల వ్యాధులు తగ్గడంతో పాటు, భూగర్భజలాలు కలుషితం కావు, పర్యావరణానికి మేలు చేస్తుంది. వరద నీటి నిర్వహణ సాధ్యమవుతుంది. ఈ ప్రాజెక్టు పరిధిలో నివసిస్తున్న రెండున్నర కోట్ల మందికి ఉపయోగకారిగా ఉంటుంది. ఈ ఒప్పందం ద్వారా భారతదేశంలో నగరాల ఆర్థిక స్వయంప్రతిపత్తికి కొత్త దారి చూపినట్టయ్యింది.

మూసీ పునరుజ్జీవ పనులను సీఎం రేవంత్‌ శ్రీకారం

  మూసీ పునరుజ్జీవ పనులను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఉస్మాన్‌సాగర్‌ వద్ద చేపట్టిన గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్‌ 2, 3 ప్రాజెక్టు పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్‌కు 20 టీఎంసీల నీటిని  తరలించే ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయాలని  నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీని ద్వారా ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ చెరువులను మంచినీటితో నింపనున్నారు. రూ.7,360 కోట్లతో హ్యామ్‌ విధానంలో ఈ పనులు చేపట్టనున్నారు. రెండేళ్లలో గోదావరి ఫేజ్‌ 2, 3 పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.   ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు మూసీ నదిని ప్రక్షాళన చేయాలని ప్రజలు చెప్పారని అన్నారు. సమస్యలు సృష్టించినా సమన్వయంతో ముందుకెళ్తున్నామన్నారు. తాగునీరు అందించేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఎవరు అడ్డం వచ్చినా ఈ పథకం పూర్తి చేస్తామని సీఎం తెలిపారు. నల్గొండ ప్రజల కోసమే మూసీ ప్రక్షాళన చేస్తున్నాం. ఈ పథకం ద్వారా హైదరాబాద్‌ తాగునీటి సమస్య పరిష్కారమే కాకుండా, నల్గొండ ఫ్లోరైడ్‌ సమస్య తీరుతుంది. బీఆర్‌ఎస్ వల్లే రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరిగింది.  మూసీ నది ప్రక్షాళన ఎందుకు జరగకూడదో చెప్పాలి. త్వరలో మహారాష్ట్రకు వెళ్లి అక్కడి ముఖ్యమంత్రిని కలుస్తా అని సీఎం రేవంత్‌ అన్నారు.

లేడీ డాన్ అరుణపై న్యాయవాది సంచలన వ్యాఖ్యలు

  రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపలు సృష్టించిన లేడీ డాన్ అరుణ కేసుకు సంబంధించి హైకోర్టు లాయర్ రాజారాం సంచలన వ్యాఖ్యలు చేశారు...నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పోలీసు అధికారికి ఆయన వినతిపత్రం అందజేశారు. అరుణ ఎస్సీ అని చెప్పుకొని అనేకమందిని బెదిరించి డబ్బులు వసూలు చేసేదని..అసాంఘిక కార్యకలాపాలకు అపార్ట్మెంట్ ని అడ్డాగ చేస్తుందని లాయర్ తెలిపారు.. అదే అపార్ట్మెంట్లో మూడో ఫ్లోర్లో తను నివాసం ఉంటున్నట్లు చెప్పుకొచ్చారు.. అరుణ ఆగడాలు మితిమీరి పోయాయని.. అనేక మంది బాధితులు ఇంకా రాలేక భయపడుతూనే ఉన్నారని తెలిపారు.. ఇటువంటి కిలాడి లేడి డాన్ అరుణను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు..  

బీజేపీ నేత అన్నామలైతో మంత్రి లోకేశ్‌ భేటీ

  తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైను మంత్రి నారా లోకేష్ ఇవాళ భేటీ అయ్యారు.  కోయంబత్తూరులో వీరిద్దరి మధ్య ఈ మర్యాదపూర్వక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను లోకేష్ వివరించారు. డబుల్ ఇంజన్ సర్కారు అధికారంలో ఉన్నందున ఏపీ వేగవంతంగా అభివృద్ధి సాధిస్తున్నట్లు చెప్పారు.  కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, విద్యారంగంలో తాము చేపడుతున్న సంస్కరణలు దేశంలోనే రోల్ మోడల్ గా నిలుస్తున్నాయని అన్నామలైతో లోకేష్ చెప్పారు. ఒకసారి ఆంధ్రప్రదేశ్ ను సందర్శించాల్సింగా అన్నామలైని లోకేష్ ఆహ్వానించారు. ముఖ్యంగా విద్యారంగంలో తాము అమలు చేస్తున్న సంస్కరణలు, కూటమి ప్రభుత్వం సాధిస్తున్న విజయాలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయని లోకేశ్ తెలిపారు.

టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావును ప్రభుత్వం బదిలీ చేసింది. ఈయన స్థానంలో అనిల్ కుమార్ సింఘాల్ ను నియమించింది.  రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదలీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీ ఈవోగా ప్రస్తుతం ఉన్న శ్యామలరావును జీఏడీ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సోమవారం (సెప్టెంబర్ 8) ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సీహెచ్ శ్రీధర్, రోడ్లు భవనాలు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కృష్ణబాబు, ఏపీ రెవెన్యూ, ఎక్సైజ్‌ ముఖ్య కార్యదర్శిగా ముఖేశ్‌కుమార్‌ మీనా, అటవీ, పర్యావరణశాఖ కార్యదర్శిగా కాంతిలాల్‌ దండేను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక పరిశ్రమలు, కార్మిక శాఖ కమిషనర్‌గా శేషగిరిబాబు, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శిగా సౌరభ్‌ గౌర్‌, గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనంతరామ్‌, ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా ప్రవీణ్‌ కుమార్‌‌ నియమితులయ్యారు.  రెవెన్యూ (ఎండోమెంట్‌) కార్యదర్శిగా హరి జవహర్‌లాల్‌ను నియమించింది.  

కవిత విషయంలో స్పందించిన కేటీఆర్‌..ఏమన్నారంటే?

  తన సోదరి కవిత విషయంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ తొలిసారి స్పందించారు. బీఆర్‌ఎస్ పార్టీలో చర్చించిన తర్వాతే తమ అధినేత ఆ నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్‌ స్పష్టత ఇచ్చారు. ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత తాను మాట్లాడేది ఏమి లేదని స్పష్టం చేశారు. రెండు రోజుల క్రితం కవిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి హారీశ్ రావు స్పందిస్తూ వారి విజ్ఞతకే వదిలేస్తున్నాని చెప్పిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కవిత తొలిసారి మీడియాతో మాట్లాడుతూ.. హరీష్‌రావు, సంతోష్ రావు టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేశారు.  ఈ క్రమంలో ‘‘రామన్నా.. హరీష్‌, సంతోష్‌ మీతో ఉన్నట్టు కనిపించవచ్చు కానీ.. మీ గురించి, తెలంగాణ గురించి ఆలోచించే వ్యక్తులు కాదు .. వాళ్లను పక్కనపెడితేనే పార్టీ బతుకుతుంది.. నాన్న పేరు నిలబడుతుంది..’’ అంటూ కవిత పేర్కొన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కనీసం ఫోన్ చేసి అడగాల్సిన బాధ్యత కూడా తీసుకోలేదు. 103 రోజులుగా కేటీఆర్ తనతో మాట్లాడలేదని అన్నారామె. అయితే తనకు నోటీసు ఇవ్వడంపై బాధ కలగడం లేదని.. ఈ వ్యవహారంపై  తెలంగాణ భవన్‌లో మహిళా బీఆర్‌ఎస్ నేతలు స్పందించడంపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎనిమిది నెలల వ్యవధిలో మోడీతో లోకేష్ భేటీలు ఐదు... సంకేతమేంటి?

ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ కు ప్రధాని మోడీ అప్పాయింట్ మెంట్ అడగనవసరం లేకుండానే దొరికేస్తోందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. మోడీయే స్వయంగా నారా లోకేష్ ను కుటుంబంతో సహా ఢిల్లీ వచ్చి తనను కలవాలంటూ ఆహ్వానించిన సంగతిని గుర్తు చేస్తున్నారు. మహామహా సీనియర్లు, దిగ్గజ నేతలకు సైతం ఇంత తక్కవ వ్యవధిలో ఇన్ని సార్లు ప్రధాని మోడీ అప్పాయింట్ మెంట్ లభించిన దాఖలాలు లేవు. అంతెందుకు హిందుత్వను భుజాన వేసుకుని నిత్యం మోడీ విధానాలను పొగిడే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఇప్పటి వరకూ లోకేష్ కు లభించిన  అప్పాయింట్ మెంట్లలో సగం కూడా దొరకలేదు. లోకేష్ కు ఇంత తక్కువ వ్యవధిలో ఇన్ని సార్లు మోడీ అప్పాయింట్ మెంట్లు లభించడంపై దేశ వ్యాప్తంగా విస్మయం వ్యక్తం అవుతోంది. ఇది దేనికి సంకేతమన్న చర్చ కూడా విస్తృతంగా జరుగుతోంది. అప్పాయింట్ మెంట్లు లభించడమే కాదు.. ఆ సందర్భంగా ఇరువురి మధ్యా సుదీర్ఘ చర్చలు కూడా జరుగుతున్నాయంటున్నారు. సాధారణంగా ఎంత కీలకమైన వ్యక్తి అయినా సరే మోడీ అప్పాయింట్ మెంట్ ఇచ్చేది పావు గంట.. మహా అయితే మరో పది నిముషాలు. అయితే లోకేష్ ఆయనతో భేటీ అయిన ప్రతిసారీ ఆ భేటీ గంట, ముప్పావుగంట సాగుతోంది.అయితే ఢిల్లీ బీజేపీ వర్గాలు మాత్రం ప్రధాని మోడీ ప్రతి రాష్ట్రంలోనూ ప్రతిభ, పరిణితి ఉన్న యువనేతలకు గుర్తించి, వారిని ప్రోత్సహిస్తుంటారనీ, సీనియర్ నేతల కంటే వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మామూలేనని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి లోకేష్ లో అటువంటి పరిణితి చెందిన, ప్రతిభావంతుడైన యువనేత లోకేష్ అని గుర్తించిన మోడీ ఆయనకు ప్రాధాన్యత ఇస్తున్నారని అంటున్నారు. అదే సమయంలో పోలిటికల్ సర్కిల్స్ లో ప్రధాని మోడీతో లోకేష్ వరుస భేటీలు రాష్ట్ర రాజకీయాలలో రాబోతున్న మార్పునకు కూడా సంకేతమని అంటున్నారు. లోకేష్ కు పార్టీలో పదోన్నతి విషయంలో గతంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కారణాలేమైతేనేం.. ఆ తరువాత ఆ ప్రస్తావన పెద్దగా రాలేదు. ఇప్పుడు ప్రధాని మోడీతో లోకేష్ వరుస భేటీలు.. లోకేష్ కు ప్రమోషన్ విషయంలో బీజేపీ నుంచి ఎటువంటి అభ్యంతరాలూ ఉండవన్న సంకేతాన్ని ఇస్తున్నదని, ఆ సంకేతం జనసేన కూడా లోకేష్ కు పదోన్నతికి అంగీకారం తెలిపేలా చేస్తుందని చెబుతున్నారు.