తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
posted on Sep 12, 2025 6:52AM
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. శ్రీవారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచీ, విదేశాల నుంచీ కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు. గంటల తరబడి క్యూలైన్లలో, కంపార్ట్ మెంట్లలో వేచి ఉండి మరీ తిరుమలేశుని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు.
ముఖ్యంగా వారాంతం సమీపిస్తుంటే భక్తుల రద్దీ మరింత పెరుగుతుంది. ఆ క్రమంలోనే శుక్రవారం (సెప్టెంబర్ 12) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక గురువారం (సెప్టెంబర్ 11) శ్రీవారిని మొత్తం 66 వేల 312 మంది దర్శించుకున్నారు. వారిలో 27 వేల 728 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 81 లక్షల రూపాయలు వచ్చింది.