బీఆర్ నాయుడితో టీటీడీ మాజీ ఈవో శ్యామలరావు బేటీ!

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ నేడు బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ ఈ పదవిలో ఉన్న శ్యామలరావును ప్రభుత్వం జీఏడీ ప్రధాన కార్యదర్శిగా బదలీ చేసింది. శ్యామలరావు బదలీకి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడితో ఆయనకు ఉన్న విభేదాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. బీఆర్ నాయుడితో శ్యామలరావు విభేదాలు    తొలి సారి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం సమయంలోనే బహిర్గతమయ్యాయి. అప్పట్లో జరిగిన తొక్కిసలాటలో భక్తులు మరణించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా సమీక్షకు తిరుమల వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే ఇరువురూ వాగ్వాదానికి దిగారు.  అయితే అప్పట్లో చంద్రబాబు ఇద్దరినీ మందలించి సర్ది చెప్పినా.. విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తిరుపతి గోశాలలో అవుల మృతి వ్యవహారంలో వైసీపీ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆ అంశాన్ని సరిగా హ్యాండిల్ చేయడంలో శ్యామలరావు విఫలమయ్యారన్న ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. అంతే కాకుండా తిరుమలలో అన్యమత ప్రచారాన్ని ఆపడంలో కూడా శ్యామలరావు విఫలమయ్యారని, ఈ విషయంలో టీటీడీ చైర్మన్ తో సమన్వయంతో వ్యవహరించకుండా ఏకపక్షంగా వ్యవహరించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక తాజాగా చంద్రగ్రహణం సందర్భంగా టీటీడీ చైర్మన్ నిర్వహించిన  సంప్రదాయక కార్యక్రమానికి టీటీడీ ఈవోగా హాజరు కావలసిన శ్యామలరావు ఉద్దేశపూర్వకంగా డుమ్మా కొట్టడం కూడా ఇరువురి మధ్యా విభేదాలను అద్దంపట్టింది. దీంతో ప్రభుత్వం శ్యామలరావును టీటీడీ ఈవోగా తొలగించాలన్న నిర్ణయానికి వచ్చి ఆయనను బదిలీ చేసింది.  అయితే టీటీడీ ఈవోగా రిలీవ్ అయిన తరువాత శ్యామలరావు బుధవారం (సెప్టెంబర్ 10) టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడితో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఈవోగా తన పదవీ కాలంలో బీఆర్ నాయుడు అందించిన సహకారానికి కృతజ్ణతలు తెలిపారు. అలాగే బీఆర్ నాయుడు శ్యామలరావును శాలువతో సత్కరించి శ్రీవారి ప్రతిమను జ్ణాపికగా అందించారు. 

మోడీ దెబ్బకు ట్రంప్ దిగివచ్చినట్లేనా?

భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తొలగిపోనున్నాయా? ట్రంప్ టారీఫ్ వార్ నుంచి వెనక్కు తగ్గనున్నారా? ఇరు దేశాల మధ్యా వాణిజ్య సంబంధాలు మళ్లీ పూర్వ స్థితికి చేరుకోనున్నాయా? అంటీ పరిశీలకులు ఔననే అంటున్నారు. వరుస ఎదురుదెబ్బలతో భారత్ తో టారిఫ్ వార్ ను ముంగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెంపర్లాడుతున్నారని అంటున్నారు. ఇరు దేశాల మధ్యా త్వరలో వాణిజ్య చర్చలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోడీ  వేర్వేరుగా సంకేతాలు ఇచ్చారు.  భారత్ తో వాణిజ్య చర్చల పునరుద్ధరణ ప్రతిపాదనను తొలుత డొనాల్డ్ ట్రంప్ తీసుకువచ్చారు. ఇరు దేశాల మధ్యా అంతరం తనకు విచారాన్ని కలిగిస్తోంంటూ సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. అంతే కాదు.. ఇరు దేశాలు సహజ భాగస్వాములు అంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. రెండు దేశాల మధ్యా వాణిజ్య అవరోధాలు త్వరలోనే తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సోషల్ ట్రూత్ వేదికగా ఆయన ఇంకా మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. తనకు మోడీ మంచి మిత్రుడిగా ఆభివర్ణించారు. ఆయనతో చర్చల కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. ట్రంప్ టారిఫ్ వార్ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మోడీ.. అక్కడితో ఆగకుండా ట్రంప్ ఫోన్ కాల్స్ కు కూడా స్పందించని సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ ఒక మెట్టు దిగడంతో మోడీ కూడా ఒకింత మెత్తబడినట్లు కనిపిస్తోంది. ట్రంప్ పోస్టులకు మోడీ ఎక్స్ వేదికగా స్పందించారు. త్వరలో ట్రంప్ తో మాట్లాడతానని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్యా వాణిజ్య ఉద్రిక్తతలకు తెరపడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అక్కడితో ఆగకుండా ట్రంప్ సానుకూల వ్యాఖ్యలను స్వాగతిస్తున్నానంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. తాజా పరిణామాలతో భారత్ పై అమెరికా టారిఫ్ టెర్రర్ కు ఎండ్ కార్డ్ పడే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఫిలింనగర్ భూ వివాదంపై కోర్టులో ముగిసిన వాదనలు

  జూబ్లీహిల్స్ లోని దక్కన్ కిచెన్ వ్యవహారం ఎటు తేలడం  లేదు.. దగ్గుబాటి కుటుంబానికి సంబంధించిన ఈ కిచెన్ వ్యవహారం పైన కోర్టులో సుదీర్ఘంగా నడుస్తుంది.. దక్కన్ కిచెన్ లోకి అక్రమంగా చొరబడి తమని మోసం చేశారని చెప్పి నందకుమార్ పైన హీరో వెంకటేష్ ,సురేష్ బాబులు పిర్యాదు చేశారు.. సురేష్ బాబు స్థలంలోకి ఉన్న దక్కన్ కిచెన్ ని అధికారులు కూల్చివేసి నందకుమార్‌ను పంపించివేసి స్థలాన్ని దగ్గుబాటి కుటుంబానికి అప్పగించారు.  దక్కన్ కిచెన్ వ్యవహారంలో తాను తీవ్ర స్థాయి లో నష్టపోయానని, తనకు అగ్రిమెంట్ ఉన్నప్పటికీ తన ప్రమేయం లేకుండా నిర్మాణాలను కూల్చి వేసి పెద్ద మొత్తంలో నష్టం కలిగించారని హీరో వెంకటేష్ , సురేష్ బాబు పై చర్యలు తీసుకోవాలంటూ నందకుమార్ కోర్టును ఆశ్రయించాడు.. గతంలో దక్కన్ హోటల్ కూల్చి వేసిన విషయం తెలిసిందే... అయితే నందకుమార్ దక్కన్ హోటల్ నడుపుతున్నాడు.  నందకుమార్ ను   ఖాళీ చేయాలంటూ హెచ్చరించారు ..కానీ నందకుమార్ కోర్టును ఆశ్రయిం చాడు. అయితే అన్ని కోర్టు ఆర్డర్లు ఉన్నా కూడా సురేష్ బాబు కొంతమంది అధికారులతో కలిసి దక్కన్ హోటల్ కూల్చివేశారు.  దీంతో నందకుమార్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈమెరకు కోర్టులో విచారణ కొనసా గుతున్నది.. అయితే నందకు మార్ గత 18 నెలలుగా తాను కోర్టులో పోరాడు తున్నానని, తన హోటల్ ను అన్యా యంగా కూల్చివేశారని... నందకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.. ఎమ్మెల్యే కొనుగోలు కేసులో నేను అప్రూవర్గ మారినందుకే నా మీద 12 అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు... కోర్టు ఎన్ని మార్లు చెప్పినా కూడా సురేష్ బాబు, వెంకటేష్  కోర్టు కు హాజరు కావడం లేదు. అంతేకాకుండా సురేష్ బాబు అతని కుటుంబ సభ్యులు కోర్టు విచారణకు రాకుండా కేసును విత్‌డ్రా చేసుకోక పోతే నన్ను చంపే స్తానని బెదిరింపు లకు గురి చేస్తున్నా రని నందకుమార్ వాపోయాడు. ఇప్పటికే కోర్టు సురేష్ బాబు, వెంకటేష్, రానా, అభిరామ్ లను కోర్టు కు రావాలని ఆదేశించింది. ఈ కేసు విచారణ 16వ తేదీకి వాయిదా వేసింది ..అప్పుడు హీరో వెంకటేష్ తో పాటు సురేష్ బాబులు రాని పక్షంలో చర్యలకు ఆదేశాలు ఇస్తామని కోర్టు హెచ్చరించింది.

నెల్లూరు రౌడీ షీటర్ శ్రీకాంత్ ఆడియో వైరల్‌

  నెల్లూరు రౌడీ షీటర్ శ్రీకాంత్  అతడి అనుచరుడు జగదీష్ ఆడియో కాల్ వైరల్‌గా మారింది. లేడీ డాన్ అరుణ తనను చంపాలని  స్కెచ్ వేస్తుందని జగదీష్  చెప్పగానే  జగదీష్ పై శ్రీకాంత్ మండిపడ్డారు. అంతా నువ్వే చేశావ్ అంటూ జగదీష్‌ను   శ్రీకాంత్ తిట్ల దండకం అందుకున్నారు. అరుణ  ఎక్కడ.. ఎక్కడ డబ్బులు వసూలు చేసిన విషయాలు జగదీష్  వెల్లడించారు. మీ గ్యాంగ్‌లో  నుంచి  పక్కకు వస్తే చంపేస్తారా అని శ్రీకాంత్‌ను ఆయన ప్రశ్నించారు.   ఖైదీలు జైలు నుంచి ఫోన్ లు ఏలా  మాట్లాడ గలుగుతున్నారు. రౌడీ షీటర్‌ల  వెనుక ఎవరి హస్తం ఉందని  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జీవిత శిక్ష అనుభవిస్తున్న రౌడీ షీటర్ అలివేలి శ్రీకాంత్...మరో రౌడీ షీటర్ జగదీష్ లో మద్య ఫోన్లో వాగ్వివాదం జరిగింది.నెల్లూరు సెంట్రల్ జైలులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తోన్న ఒక రౌడీ షీటర్‌ శ్రీకాంత్ తో హాస్పిటల్‌లో నిడిగుంట అరుణ  సన్నిహితంగా మెలిగిన వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. 

క్రాస్ ఓటింగ్ పరువు తీసింది!

అనూహ్యం కాదు. అద్భుతం కాదు. అనుకున్నదే జరిగింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో, అధికార ఎన్డీయే కూటమి విజయం సాధించింది. ఎన్డీయే అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్’ భారత 15 ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అవును..  గెలుపు ఓటముల వరకూ అయితే..  అధికార కూటమి అభ్యర్ధి గెలుపు  అనూహ్యం కాదు. విపక్ష ఓటమి అసాధారమూ కాదు. అధికార కూటమి అభ్యర్ధి విజయంపై ఎవరికీ ఎలాంటి అనుమానాలూ  ఏ దశలోనూ లేవు.   కానీ..  జరిగింది అది కాదు. విపక్ష ఇండియా కూటమి సంఖ్యా బలం లేక ఓడి పోవడం మాత్రమే కాదు.. ఉన్న ఓటులో చీలిక వచ్చింది. క్రాస్ ఓటింగ్ జరిగింది. అది కూడా..  ఒకటీ రెండు ఓట్లు కాదు..  ఏకంగా 14 మంది ఇండియా  కూటమి ఎంపీలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు.  అధికార కూటమి అభ్యర్ధి రాధాకృష్ణన్ కు ఓటేశారు. అందుకే..  అధికార ఎన్డీయే కూటమి అభ్యర్ధి రాధాకృష్ణన్ కు  పార్టీల బలాబలాల ప్రకారం రావలసిన 437 ఓట్లకు బదులుగా  452 ఓట్లు అంటే 14 ఓట్లు అదనంగా వచ్చాయి.  విపక్ష ఇండియా కూటమి అభ్యర్ధి సుదర్శన్ రెడ్డికి రావలసిన 315 ఓట్లకు గానూ, 300 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే.. ఇండియా కూటమి ఎంపీల్లో 14 మంది అధికార ఎన్డీఎకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేశారు. దీంతో..  ఇండియా కూటమి ప్రధాన ఎన్నికల ప్లాంక్  అపొజిషన్ యూనిటీ, విపక్షాల ఐక్యత బొక్క బోర్లా పడింది. విపక్షాల ఐక్యత అయ్యే పని కాదని మరో  మారు సందేహాలకు అతీతంగా  తేలిపోయింది. అలాగే..   ఇండియా కూటమి ఓట్లు అని అయితే చెప్పలేం కానీ..   మరో 15 ఓట్లు చెల్లకుండా పోయాయి.   అదొకటే కాదు..  ఉపరాష్ట్రపతి ఎన్నిక  విపక్ష ఇండియా కూటమిలో డొల్ల తనాన్ని బయట పెట్టిందని   విశ్లేషకులు అంటున్నారు.  నిజానికి.. అభ్యర్ధి ఎంపిక మొదలు పోలింగ్ మేనేజిమెంట్ వరకు..  ప్రతి నిర్ణయంలోనూ ఇండియా కూటమి తప్పటడుగులే వేసిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా.. ఓ వంక కులగణన పేరిట బీసీ నినాదం ఎత్తుకున్న కాంగ్రెస్ పార్టీ పాలక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సుదర్శన్ రెడ్డి ని ఇండియా కూటమి ఉమ్మడి అభ్యర్ధిగా ఎంపిక చేసింది. ఇది ఇండియా కూటమి నాయకత్వం చేసిన తోలి పెద్ద తప్పుగా పరిశీలకులు పేర్కొంటున్నారు.  అలాగే..  సుదర్శన్ రెడ్డి  ప్రయోగించిన తెలుగు వారి ఆత్మ గౌరవం కార్డు  కూడా పనిచేయలేదు.  ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్,ఎంఐఎం తప్ప జగన్  రెడ్డి  పార్టీ వైసేపీతో సహా  మరే పార్టీ కూడా  రెడ్డి గారికి మద్దతు ఇవ్వలేదు. అంతే కాదు..  పుండు మీద కారం పూసినట్లుగా  11 మంది ఎంపీలున్న  వైసీపీ ఏకంగా ఎన్డీయేకి మద్దతు ఇచ్చింది. స్వరాష్ట్రం తెలంగాణలోనూ సుదర్శన్ రెడ్డి  అదనంగా ఒక్క ఎంఐఎం ఓటు మాత్రమే యాడ్ అయింది. నిజానికి.. ఇండియా అభ్యర్ధి  సుదర్శన్  రెడ్డి కాకుండా ఇంకేవరైనా కూడా ఎంఐఎం, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇండియా కూటమి అభ్యర్ధికే ఓటు వేస్తారనేది, జగ మెరిగిన సత్యం. మరో వంక నలుగురు రాజ్య సభ ఎంపీలున్న బీఆర్ఎస్ యూరియ  కొరతను సాకుగా చూపి పోలింగ్ కు దూరంగా ఉండి పోయింది. అదలా ఉంచితే.. పోల్ మేనేజిమెంట్  విషయంలో ఇండియా కూటమి  పూర్తిగా తప్పులో కాలేసిందని అంటున్నారు. ముఖ్యంగా ఏకంగా 15 ఓట్లు చెల్లలేదంటే..  ఇండియా కూటమి పోల్ మేనేజిమెంట్  ఎంత పూర్ గా వుందో అర్థమవుతుందని అంటున్నారు. అలాగే.. చివరకు రాహుల్ గాంధీ, పోలింగ్ బూత్ కు ఎలా వెళ్ళాలో తెలియక తడబడ్డ తీరును చూస్తే..  ఎక్కడో దిద్దుకోలేని తప్పు జరిగిందనే విషయం అర్థమవుతోందని అంటున్నారు.   మరో వంక బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి, త్వరలో ఆసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళ నాడు రాష్ట్రానికి చెందిన  మహా రాష్ట్ర గవర్నర్  సీపీ రాధా కృష్ణన్  ను అభ్యర్ధిగా ఎంపిక చేయడం మొదలు పోల్ మేనేజెమెంట్ వరకు ఎక్కడా చిన్న తప్పైనా జరగకుండా పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగింది. అందుకే రాధాకృష్ణ అనూహ్య మార్జిన్  తో విజయంసాధించారు.   అందుకే విపక్ష ఇండయా’ కూటమి అభ్యర్ధిది కేవలం ఓటమి కాదు.. అంతకు మించి.  

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిపై బీఆర్ఎస్ కసరత్తు ముగిసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. మాగంటి గోపానాథ్ మరణంతో జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. అయితే సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా  కైవశం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న బీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికలో అభ్యర్థిగా ఎవరిని ఎన్నిక చేయాలన్న విషయంపై మల్లగుల్లాలు పడింది. పలువురి పేర్లు పరిశీలించింది. అయితే తాజాగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలతో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు భేటీ అయ్యారు. ఆ భేటీలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక.. అభ్యర్థి అంశాలపై విస్తృతంగా చర్చించారు. నియోజకవర్గ కార్యకర్తల అభిష్టం మేరకు కేటీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నకకు బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత పేరును ఖరారు చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. 

కుప్పకూలిన హాస్టల్ భవనం!

గురుకుల పాఠశాల హాస్టల్ భవనం ఒక్క సారిగా కుప్పకూలింది. ఆ సమయంలో హాస్టల్ లో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. సంగారెడ్డి జిల్లా లింగంపల్లి గ్రామంలో బుధవారం (సెప్టెంబర్ 10)ఈ ఘటన జరిగింది. హాస్టల్ భవనం కుప్పకూలిన సమయంలో విద్యార్థులు భోజనానికి వెళ్లడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. భవనం కూలిన సమయంలో హాస్టల్ ముందు ఉన్న ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. హాస్టల్ లో మొత్తం 600 మంది విద్యార్థులు ఉంటున్నారు. ఈ భవనం శిథిలావస్థకు చేరి చాలా కాలమైంది. ఈ విషయమై విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులూ పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  

ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కల్యాణ్ ఫొటోలపై పిల్... డిస్మిస్ చేసిన హైకోర్టు

ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటోను ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డిస్మిస్ చేసింది.   ఈ పిటిషన్ రాజకీయ దురుద్దేశంతో వేసినట్లుగా ఉందని కోర్టు అభిప్రాయపడింది.  ప్రభుత్వ కార్యాలయాలలో డిప్యూటీ సీఎం ఫొటోలను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్ ను బుధవారం (సెప్టెంబర్ 8) విచారించిన హైకోర్టు..  గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉప ముఖ్యమంత్రి  ఫొటో పెట్టకూడదని చెప్పేందుకు చట్టపరమైన నిబంధనలు ఎక్కడ ఉన్నాయని  పిటిషనర్‌ను ప్రశ్నించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టింది.  ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కల్యాణ్ ఫొటో ప్రదర్శనకు చట్టబద్ధమైన అనుమతులు లేవని, దీనిపై ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానం రూపొందించే వరకు ఆ ఫొటోలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని రైల్వే విశ్రాంత ఉద్యోగి  కొండలరావు ఈ పిటిషన్ దాఖలు చేశారు.  ఈ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు నిజమైన ప్రజా ప్రయోజనాలు ఉన్న వ్యాజ్యాలను మాత్రమే న్యాయస్థానాలు పరిగణనలోకి తీసుకుంటాయని పేర్కొంది. రాజకీయ లక్ష్యాలను సాధించుకోవడానికి కోర్టులను ఒక వేదికగా మార్చుకోవడం సరైన స్పష్టం చేసింది.  అనవసర వ్యాజ్యాలతో కోర్టు సమయాన్ని వృథా చేయవద్దని సూచిస్తూ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.

తెలుగు వారి క్షేమం కోసం ముందు కదిలేది తెలుగుదేశమే!

ప్రపంచంలో ఏ మూల ఏ సంక్షోభం తలెత్తినా.. అక్కడున్న తెలుగువారి క్షేమం కోసం ముందుగా కదిలేది ఒక్క తెలుగుదేశం మాత్రమే అన్న విషయం గతంలో పలుమార్లు రుజువైంది. ఛార్ ధామ్ యాత్రలో చిక్కకున్న తెలుగువారిని స్వరాష్ట్రానికి రప్పించడంలో కానీ, బర్మా, బంగ్లాదేశ్, దుబాయ్.. ఇలా ఎక్కడ తెలుగువారు ఇబ్బందుల్లో ఉన్నా వారిని ఆదుకునేందుకు తెలుగుదేశం ఆఘమేఘాలపై కదులుతుంది. అధికారంలో ఉన్నా, లేకున్నా తెలుగు పీపుల్ ఫస్ట్ అన్న విధానంతో తెలుగుదేశం స్పందన ఉంటుందన్నది తెలిసిందే. తాజాగా నేపాల్ లో జరుగుతున్న విధ్వంసకాండ, హింసాకాండ నేపథ్యంలో ఆ దేశంలో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా స్వరాష్ట్రానికి తీసుకు వచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం కూటమి సర్కార్ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. మంత్రి లోకేష్ రంగంలోకి దిగారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరిట ఆంధ్రప్రదేశ్ లోని టీమ్ ఎన్డీయే ప్రభుత్వం  అనంతపురంలో భారీ ఎత్తున నిర్వహిస్తున్న సభకు హాజరుకావడం మానేసి మరీ ఆయన నేపాల్ లోని తెలుగువారిని రక్షించడం కోసం రంగంలోకి దిగారు. ఉదయమే సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రానికి చేరుకుని నేపాల్ లో చిక్కుకున్న తెలుగవారిని రక్షించేందుకు అవసరమైన ఏర్పాట్లు చర్యలలో మునిగిపోయారు. ఒక స్పెషల్ వార్ రూమ్ ను ఏర్పాటు చేసి..24 గంటలలూ పర్యవేక్షించాలని సీనియర్ అధికారులను ఆదేశించారు.  నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు హెల్ప్ లైన్ నంబర్లు, వాట్సాప్ నంబర్లను ప్రకటించారు.  నేపాల్ లో దాదాపు 300 మంది చిక్కుకున్నారనీ, వారిలో అత్యధికులు ముక్తినాథ్ యాత్రికులు ఉన్నారనీ నిర్ధారణ అయ్యింది. అత్యంత వేగంగా లోకేష్ కదిలి యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించడం వల్లనే నేపాల్ లో చిక్కుకున్న వారి సంఖ్య, ఆచూకీ ఇంత త్వరగా తెలిసిందని అంటున్నారు. నేపాల్ లో చిక్కుకున్న వారిలో కొందరితో లోకేష్ స్వయంగా ఫోన్ లో మాట్లాడి అన్ని విధాలుగా సహాయ సహకారాలందిస్తామంటూ భరోసా ఇచ్చి వారిలో ధైర్యం నింపారు. నేపాల్ లో చిక్కుకున్న వారి భద్రతకు సంబంధించి ప్రతి రెండు గంటలకూ అప్ డేట్ లు సేకరించాలని అధికారులను ఆదేశించారు. నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారందరినీ భద్రంగా స్వరాష్ట్రానికి తీసుకువస్తామని లోకేష్ వారి భరోసా ఇచ్చారు.  

నేపాల్ లోని భారతీయుల సహాయార్ధం హెల్స్ లైన్ నంబర్లు

నేపాల్ లో నెలకొన్న రాజకీయ సంక్షోభం.. కొనసాగుతున్న హింసాకాండ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. నేపాల్ లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు చర్యలకు ఉపక్రమించింది. ఇందు కోసం నేపాల్ లోని భారత రాయబార కార్యాలయం హెల్ప్ లైన్ నంబర్లను ప్రకటించింది. నేపాల్ లోని భారత్ కు చెందిన వివిధ రాష్ట్రాలకు చెందిన వారి వివరాలను తెలుసుకునేందుకు నేపాల్ లో ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, నేపాల్ లో ఉన్న భారతీయుల సహాయార్థం ఆ దేశంలోని రాయబార కార్యాలయం 977 – 980 860 2881 /  977 – 981 032 6134 నంబర్లను ప్రకటించింది. ఈ నెంబర్లకు సాధారణ కాల్స్ తో పాటు వాట్సాప్ లో కూడా సంప్రదించవచ్చని తెలిపింది.  నేపాల్ లో  చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసుల వివరాలు తెలుసుకుని వారిని స్వరాష్ట్రానికి తీసుకువచ్చుందుకు మంత్రి నారా లోకేష్ తన హిందుపూర్ పర్యటనను రద్దు చేసుకుని సచివాలయంలోని ఆర్టీజీఎస్ లో సమీక్ష నిర్వహించారు.  ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారు నేపాల్ లో చిక్కుకుపోయి ఏదైనా అత్యవసర సహాయం లేదా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే...  ఢిల్లీలోని ఏపీ భవన్ : +91 9818395787, రియల్ టైమ్ గవర్నెన్స్: 08632381000, హెల్ప్ లైన్ నంబర్లు 0863 2340678, వాట్సాప్: +91 8500027678, ఇమెయిల్: helpline@apnrts.com అలాగే  info@apnrts.com, లను సంప్రదించాలని మంత్రి లోకేష్ తెలిపారు.  

కాలినడకన తిరుమలకు అనిల్ కుమార్ సింఘాల్

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఆయన బుధవారం (సెప్టెంబర్ 10)న టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. అనిల్ కుమార్ సింఘాల్ టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టడం ఇది రెండో సారి.. గతంలో  2017 మే 6 నుంచి 2020 అక్టోబర్ 4 వరకూ టీటీడీ ఈవోగా పని చేశారు.  తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా రెండో సారి అవకాశం దక్కించుకున్న తొలి వ్యక్తి అనిల్ కుమార్ సింఘాల్. టీటీడీఈవోగా బాధ్యతలు చేపట్టేందుకు ఆయన అలిపిరి మార్గం ద్వారా కాలినడకన తిరుమల చేరుకున్నారు. మార్గ మధ్యంలో ఆయన భక్తులతో మాటామంతి కలిపి వారి నుంచి తిరుమలలో సౌకర్యాల కల్పనపై సలహాలు, సూచనలూ స్వీకరించారు. తాను 1984లో మొదట తిరుమలకు కుటుంబంతో పాటు వచ్చానని గుర్తు చేసుకున్న ఆయన అప్పట్లో శ్రీవారి దర్శనానికి తనకు ఏడుగంటలకు పైగా సమయం పట్టిందన్న ఆయన  సామాన్య భక్తుడిగా దర్శనం చేసుకున్నప్పుడు  తిరుమలలో సామాన్య భక్తుల బాధలు తెలిశాయని చెప్పారు.  చిత్తూరు జాయింట్ కలెక్టర్ గా ఉన్నప్పుడు విధుల్లో భాగంగా తరచూ తిరుమల దర్శనానికి వచ్చేవాడినని అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. తిరుమలలో భక్తుల సౌకర్యాలకు పెద్ద పీట వేస్తానని సింఘాల్ అన్నారు.  

అంబానీ సెక్యూరిటీ అన్ లిమిటెడ్!

ఇదిగో ఈ వీడియో లాంగ్ షాట్ చూస్తున్నారా? కొన్ని వందల మంది క్యూ కట్టి వెళ్తున్నారు చూశారా? వీరంతా ఏ మిలటరీ పరెడ్ కీ వెళ్లడం లేదు. మరే సైనిక కార్యక్రమానికీ హాజరు కావడం లేదు. ఆ మాటకొస్తే వీరెవరూ అసలు సైనిక విభాగానికి చెందిన వారు కానే కారు. వీరు జస్ట్ ఒక వ్యక్తి, సింగిల్ పర్సన్ కి సెక్యూరిటీగా పని చేస్తున్నారంతే.. ఏంటి అంతలా నోరెళ్లబెట్టేశారు? ఎస్ మీరు విన్నది కరెష్టే.. ఇంతకీ ఆ వ్యక్తి ఆ సింగిల్ పర్సన్ ఎవరనేగా మీ డౌటనుమానం. అయితే   చెవులు రిక్కించి మరీ వినండి.. ఆ వ్యక్తి మరెవరో కాదు ముఖేష్ అంబానీ ముద్దులు కొడుకు అనంత్ అంబానీ. పేరుకు తగ్గట్టే ఆయన సెక్యూరిటీ కూడా అనంతంగానే ఉంది కదూ? అనంత్ అంబాని ఒక క్లబ్ కి ఇంత భారీ ఎత్తున వస్తుండగా.. జనమంతా కలసి.. వీడియోలు తీశారు. అదిగో చూడండి చూడండి.. ప్రపంచ ఎనిమిదో వింత వస్తోంది చూడండీ.. అంటూ వారు వీడియోలో కాసేపు ఊరించి ఊరించి చూపించారు. ఎవరో ఏంటో ఏ విచిత్రమో చూపించవచ్చనుకుంటాం. కానీ ఇది అంతకన్నా మించిన వింతే. ఒక వ్యక్తికి ఇన్ని వందల మంది రక్షణ విభాగమా!? ఆయనేమైనా సినీ సెలబ్రిటీనా? క్రికెట్ వీరుడా? రాజకీయ నాయకుడా? అని మనకు అనిపించవచ్చుగానీ.. ఆయన అంతకన్నా మించి.. అంబానీలంటే మరేంటనుకున్నారు. ముంబై ఇండియన్స్ వంటి పెద్ద పెద్ద జట్లకు జట్లను కొనగలరు. ఇంకా వారి వ్యాపార సామ్రాజ్యం ఈ ప్రపంచంలోనే అతి పెద్దది. ఏషియాలో టాప్ త్రీ పొజిషన్. ఇంకా మాట్లాడితే.. ముంబైలో వారిల్లే ఒక టూరిస్ట్ అట్రాక్షన్. ఇక ఫోర్బ్స్ జాబితాలో నిత్యం తొణికిసలాడే పేరది. అంబానీ అంటే అది సిరిసంపదలకే బ్రాండ్ అంబాసిడర్ లాంటి పేరు. మరి ఆ మాత్రం ఉండదా ఏంటి??? అనంటారు ఆర్ధిక రంగ నిపుణులు. కేవలం అనంత్ అంబానీ సెక్యూరిటీకే ఏటా కొన్ని కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తారంటే అతిశయోక్తి కాదేమో!

తిరుడా తిరుడీ!.. చోరీ చేస్తే ఆ కిక్కే వేరప్పా!

తిరుడా తిరుడీ అంటే  తమిళంలో దొంగా దొంగది అని అర్ధం. అరవై నాలుగు కళల్లో చోర కళ కూడా ఒకటే.. కాదనడం లేదు. కానీ.. ఒక మహిళా సర్పంచ్   పద్దెనిమిదేళ్లుగా ఎవరికీ అనుమానం రాకుండా ఈ చోర కళతో దొంగతనాలు చేస్తున్నారు.  అయినా ఇదేం పిచ్చి? ఇదేం క్రేజీ? అని ప్రశ్నిస్తే..  చోరీ చేయండం మంచి కిక్ ఇచ్చే రియాల్టీ గేమ్ షో.. అంటారామె. ఏదో ఇప్పుడిలా చిక్కి పోయామని ఫీలవుతున్నాను గానీ.. దొంగతనం చేసి దొరక్కుండా దాన్ని మన పరం చేసుకోవడం అంటే ఆ మజాయే వేరు అంటారు  తమిళనాడుకు చెందిన భారతి. ఈమె గత 18 ఏళ్లుగా తిరుపత్తూరు జిల్లా, సరియంపట్టు అనే గ్రామానికి సర్పంచ్ గా పని చేస్తున్నారు. అధికార డీఎంకే పార్టీకి చెందిన ఆమె. ఇల్లూ- వాకిలీ- నగా- నట్రాతో  లైఫ్ లో మంచి పొజిషన్లోనే ఉన్నారు. కానీ ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉన్నట్టు ఆమెకు చేతి వాటం కాస్త ఎక్కువ. మొన్న ఒక బస్సులో ప్రయాణిస్తుండగా ఆమె చేసిన చిలిపి పనేంటంటే.. పక్క సీట్లో ఉన్న మహిల బంగారు చైను దొంగతనం చేయడం.  ఇదేం పాడుబుద్ధమ్మా! నీకు చూస్తుంటే కలిగినింటి దానిలాగానే ఉన్నావని అడగ్గానే.. సారీ సారీ తప్పయిపోయింది క్షమించండి. నాకు గత కొంతకాలంగా ఈ దొంగతనాలు చేయడం ఒక అలవాటు. అదేంటో తెలీదు.. అలా చేస్తే నాకు భలే కిక్ అనిపిస్తుంది. ఏమనుకోకండే అని వారితో చెప్పడంతో.. వారికి ఈమెను ఏమనాలో అర్ధం కాలేదట. దీంతో తిరుడీ తిరుడీ అంటూ తమిళంలో తిట్టేసుకుని పోలీస్ కంప్లయింట్ చేశారట. దీంతో ఇప్పుడు ఆ సర్పంచ్ దొంగను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు నెటిజనులు.  

ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కల్యాణ్ ఫొటోలపై పిటిషన్

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటోలను ప్రభుత్వ కార్యాలయాలలో పెట్టడంపై ప్రజాప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలైంది. రైల్వేలో పని చేసి రిటైర్ అయిన ఒక వ్యక్తి ఈ పిల్ దాఖలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలలో ఫొటోల ప్రదర్శనపై ఒక స్పష్టమైన విధానం రూపొందించాలని పేర్కొన్న ఆయన.. ఆ విధానం రూపొందే వరకూ ఉప ముఖ్యమంత్రి ఫొటోలను ప్రభుత్వ కార్యాలయాల నుంచి తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయనా పిటిషన్ లో కోరారు. కోర్టు ఆయన పిటిషన్ ను బుధవారం (సెప్టెంబర్ 10) విచారించే అవకాశం ఉంది.   వాస్తవానికి రాజ్యాంగం ప్రకారం చూస్తే ఉప ముఖ్యమంత్రి పదవి అన్నది లేదు.  పవన్ కళ్యాణ్ కూడా తాను కేబినెట్ మంత్రిగా మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మాత్రం ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ కు ప్రత్యేక హోదా, గౌరవం ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలలో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటోతో పాటు ఆయన ఫొటో కూడా ఉంచుతోంది.   అయితే ప్రభుత్వ కార్యాలయాలలో రాష్ట్రపతి,  ప్రధాని,  రాష్ట్ర ముఖ్యమంత్రి ఫొటోలు మాత్రమే ఉండాలనీ.. ఉప ముఖ్యమంత్రి ఫొటోను ఉంచడానికి వీల్లేదనీ పేర్కొంటూ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.  

ఎన్ఎస్ఈ చైర్మన్ గా తెలుగు తేజం ఇంజేటి శ్రీనివాస్

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ చైర్మన్ గా తెలుగుతేజం ఇంజేటి శ్రీనివాస్ నియమితులయ్యారు. ఒడిశా కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన ఇంజేటి ఎన్ఎస్ఈ చైర్మన్ గా మంగళవారం (సెప్టెంబర్ 10)  బాధ్యతలు చేపట్టారు. వచ్చింది. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ(ఐఎఫ్ఎస్సీఏ) మాజీ చైర్మన్ ఇంజేటి శ్రీనివాస్ ఇటీవలే ఎన్ఎస్ఈలో పబ్లిక్ ఇంటరెస్ట్ డైరెక్టర్ గా చేరారు. గతంలో ఆయన కార్పొరేట్ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా కూడా పని చేశారు. గత రెండేళ్లుగా ఎన్ఎస్ఈ చైర్మన్ పదవి ఖాళీగా ఉంది. ఎన్ఎస్ఈ తొలి పబ్లిక్ ఇష్యూకి రెడీ అవుతున్న సమయంలో ఇంజేటి శ్రీనివాస్ నాయమకం జరిగింది.   కార్పొరేట్, ఆర్థిక నియంత్రణలు, పారిశ్రామిక ప్రోత్సాహం, కార్పొరేట్, దివాలా చట్టం, కాంపిటీషన్ చట్టం, చార్టెడ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ వంటి భిన్న రంగాల్లో  నాలుగు దశాబ్దాలకు పైబడిన అనుభవం ఉన్న ఇంజేటి కీలక సమయంలో ఎన్ఎస్ఈ చైర్మన్ గా నియమితులయ్యారు. ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి బీఏ (ఆనర్స్) పూర్తి చేసిన ఇంజేటి శ్రీనివాస్ 1983లో ఒడిశా కేడర్ అధికారిగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు.

సూపర్ సిక్స్.. సూపర్ హిట్ విజయోత్సవ సభకు లోకేష్ దూరం.. ఎందుకంటే?

అనంతపురం వేదికగా ఈ రోజు జరగనున్న సూపర్ సిక్స్.. సూపర్ హిట్ విజయోత్సవ సభకు మంత్రి నారా లోకేష్ హాజరు కావడం లేదు. ఆఖరి నిముషంలో ఆయన తన అనంతపురం పర్యటన రద్దు చేసుకున్నారు. ఇంతకీ ఆయన పర్యటన రద్దు చేసుకోవడానికి కారణమేంటంటే.. నేపాల్ లో  నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో  అక్కడ ఉన్న తెలుగువారిని  సురక్షితంగా రాష్ట్రానికి రప్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు   ఆదేశించడంతో నేడు అనంతపురం లో జరుగనున్న సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమాకి లోకేష్ హాజరుకావడం లేదు. తన అనంతపురం పర్యటనను రద్దు చేసుకుని వెలగపూడి సచివాలయం లోని రియల్ టైమ్.గవర్నెన్స్ సెంటర లోపరిస్థితులను సమీక్షిస్తున్నారు.  ఉదయం పది గంటలకు రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ కు చేరుకున్న నారా లోకేష్ అక్కడ ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేసుకుని  సంబంధిత మంత్రులు, శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారిని స్వరాష్ట్రానికి తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటారు.  ఈ మేరకు సంబంధిత అధికారులంతా వెంటనే ఆర్టీజీఎస్ కేంద్రానికి రావాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సాప్ నంబర్ ఏర్పాటు చేసి  లోకేష్ పరిస్థితిని సమీక్షిస్తారు.   నేపాల్ లో చిక్కుకున్న వారి వివరాలు సేకరించి కేంద్ర ప్రభుత్వం సహకారంతో తక్షణమే వారిని రాష్ట్రానికి తీసురావడానికి   మంత్రి నారా లోకేష్ రంగంలోకి దిగారు. 

తెలుగు వారి గుండెలు మండిన రోజు.. బాబు అరెస్టుకు రెండేళ్లు

ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగువారందరి కన్నూ చెమ్మగిల్లిన రోజు.. ధర్మాగ్రహంతో గుండె మండిన రోజు.. రెండేళ్ల కిందట సరిగ్గా ఇదే రోజు.. అంటే 2023 సెప్టెంబర్ 9న ఒక ప్రజా నాయకుడిని, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రపంచం మొత్తం గుర్తించిన వ్యక్తిని కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అప్పటి జగన్ సర్కార్ అరెస్టు చేసింది. అయితే ఆ అరెస్టే జగన్ పాలనకు చరమగీతం పాడటానికి కారణమైంది.   ఒక దార్శనికుడిని కేవలం రాజకీయ వైరంతో ,  రాజకీయ కక్ష సాధింపుతో జగన్ సర్కార్ సరిగ్గా రెండేళ్ల కిందట  ఇదే రోజు  (సెప్టెంబర్ 9)  అరెస్టు చేసింది.  దేశం గర్వించే రాజనీతిజ్ఞుడి అరెస్టు అది.. దేశాన్ని నివ్వెరపరిచిన అరెస్టు అది.  ప్రభుత్వ టెర్రరిజాన్ని పతాకస్థాయికి చేర్చిన అరెస్టు అది.  దేశంలో కోట్ల మంది ప్రజల గుండెలను బరువెక్కించిన అరెస్టు అది.   అప్పటి వరకూ ప్రభుత్వ దమనకాండ, అరాచక చర్యలకు భయకంపితులై.. నోరెత్తడానికే భయపడుతూ ఉన్న జనంలో  తిరుగుబాటు బావుటా ఎగిరేలా చేసిన అరెస్టు అది.  జగన్ ప్రభుత్వ అరాచక, అక్రమ చర్యను ప్రశ్నించడానికి కులం, మతం, ప్రాంతం, వర్గం అన్న తేడా లేకుండా తెలుగు జాతి మొత్తం సమష్టిగా గళమెత్తి నిరసన తెలిపేలా చేసిన అరెస్టు అది.  విధ్వంస ప్రభుత్వం పతనానికి  నాంది పలికిన అరెస్టు అది.  చరిత్ర ఎన్నటికీ క్షమించని తప్పు ఆ అరెస్టు.  ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగామార్చేసిన అరెస్టు అది.  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అరాచ‌క పాల‌న‌తో గొంతెత్తేందుకు భయపడిన జనాన్ని.. ఆగ్రహంతో రోడ్లపైకి వచ్చేలా చేసిన అరెస్టు అది.  ఆ నాడు మొదలైన ప్రజా పోరాటం గత ఏడాది జరిగిన ఎన్నికల్లో జగన్ పతనం చూసే వరకు కొనసాగేలా చేసిన అరెస్టు అది.  ఆ అరెస్టు  వైసీపీ హయాంలో చంద్రబాబు నాయుడు అరెస్టుకు ముందు ఒక లెక్క.. చంద్రబాబు అరెస్టు తరువాత ఒక లెక్క అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.  అప్పటి వరకూ బిక్కుబిక్కు మంటూ బతుకు జీవుడా అన్న చందంలో ఉన్నఏపీ ప్రజలలో చంద్రబాబు అరెస్టు ఆగ్రహ జ్వాలలను రగిల్చింది. తెలుగు రాష్ట్రాలలోనే కాదు, దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ, ప్రపంచ వ్యాప్తంగా 70కి పైగా దేశాలలోనూ చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు జరిగాయి.  ఎక్కడైనా ఒక నాయకుడు అరెస్టైతే అందరూ ఆ నాయకుడు చేసిన అవినీతి, అక్రమాల గురించి మాట్లాడుకుంటారు.  కానీ ఒక్క చంద్రబాబు విషయంలో మాత్రం ఆయన అరెస్టు..  ఆయన చేసిన గొప్ప పనులు, అభివృద్ధికి దోహదం చేసిన ఆయన విధానాల గురించి మాట్లాడుకున్నారు.   ఆయన విధానాలతో ఐటీ కొలువులలో చేరి ఉన్నత స్థాయికి చేరిన ఐటీ ప్రొఫెషనల్స్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి హైదరాబాద్ లో సీబీఎన్ గ్రాటిట్యూడ్ సభను నిర్వహించారు. ఇలా సమాజంలోని అన్నివర్గాలకు చెందిన ప్రజలూ చంద్రబాబు అక్రమ అరెస్టునకు వ్యతిరేకంగా గళమెత్తి.. పోరుబాట పట్టడం... ఆయన తన నాలుగు దశాబ్దాలకు పై బడిన రాజకీయ జీవితంలో... ప్రజల మద్దతును ఏ స్థాయిలో కూడగట్టుకున్నారో ప్రపంచానికి తేటతెల్లం చేసిన అరెస్టు అది.  చంద్రబాబు నాయుడు అంటే కేవలం ఒక రాజకీయ నాయకుడు కాదు.. ప్రజల మనిషి, ప్రజాహృదయాలలో తిరుగులేని స్థానాన్ని సుస్థిరం చేసుకున్న మహోన్నత వ్యక్తి అని చాటిన అరెస్టు అది.

కేంద్రమంత్రి నితిన్ గ‌డ్క‌రీతో సీఎం రేవంత్‌ భేటీ

  ఢిల్లీలో  సీఎం రేవంత్‌రెడ్డి  జాతీయ ర‌హ‌దారుల శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీతో సమావేశం అయ్యారు. రీజిన‌ల్ రింగు రోడ్డుకు (నార్త్ పార్ట్‌) సంబంధించి 90 శాతం భూ సేకరణ పూర్తయినందున ప‌నుల ప్రారంభానికి కేంద్ర ఆర్థిక‌, కేబినెట్ అనుమ‌తులు ఇప్పించాల‌ని గ‌డ్క‌రీకి విన్నవించారు. రావిర్యాల - ఆమ‌న్‌గ‌ల్‌ - మ‌న్న‌నూర్ ర‌హ‌దారిని నాలుగు వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారిగా నిర్మించాల‌ని సూచించారు.  అలాగే, మ‌న్న‌నూర్‌ - శ్రీ‌శైలం (ఎన్‌హెచ్ 765) నాలుగు వరుసల ఎలివేటెడ్‌ కారిడార్‌కు అనుమతించాలని కేంద్ర మంత్రి గ‌డ్క‌రీని ముఖ్యమంత్రి కోరారు. హైద‌రాబాద్‌ - మంచిర్యాల మ‌ధ్య నూత‌న గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారిని జాతీయ ర‌హ‌దారిగా మంజూరు చేయాల‌ని విన్నవించారు. హైద‌రాబాద్ భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్టు వరకు 12 వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారికి అనుమ‌తి ఇవ్వాల‌ని కేంద్ర మంత్రిని కోరారు