తెలుగు వారి గుండెలు మండిన రోజు.. బాబు అరెస్టుకు రెండేళ్లు

ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగువారందరి కన్నూ చెమ్మగిల్లిన రోజు.. ధర్మాగ్రహంతో గుండె మండిన రోజు.. రెండేళ్ల కిందట సరిగ్గా ఇదే రోజు.. అంటే 2023 సెప్టెంబర్ 9న ఒక ప్రజా నాయకుడిని, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రపంచం మొత్తం గుర్తించిన వ్యక్తిని కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అప్పటి జగన్ సర్కార్ అరెస్టు చేసింది. అయితే ఆ అరెస్టే జగన్ పాలనకు చరమగీతం పాడటానికి కారణమైంది.   ఒక దార్శనికుడిని కేవలం రాజకీయ వైరంతో ,  రాజకీయ కక్ష సాధింపుతో జగన్ సర్కార్ సరిగ్గా రెండేళ్ల కిందట  ఇదే రోజు  (సెప్టెంబర్ 9)  అరెస్టు చేసింది.  దేశం గర్వించే రాజనీతిజ్ఞుడి అరెస్టు అది.. దేశాన్ని నివ్వెరపరిచిన అరెస్టు అది.  ప్రభుత్వ టెర్రరిజాన్ని పతాకస్థాయికి చేర్చిన అరెస్టు అది.  దేశంలో కోట్ల మంది ప్రజల గుండెలను బరువెక్కించిన అరెస్టు అది.   అప్పటి వరకూ ప్రభుత్వ దమనకాండ, అరాచక చర్యలకు భయకంపితులై.. నోరెత్తడానికే భయపడుతూ ఉన్న జనంలో  తిరుగుబాటు బావుటా ఎగిరేలా చేసిన అరెస్టు అది.  జగన్ ప్రభుత్వ అరాచక, అక్రమ చర్యను ప్రశ్నించడానికి కులం, మతం, ప్రాంతం, వర్గం అన్న తేడా లేకుండా తెలుగు జాతి మొత్తం సమష్టిగా గళమెత్తి నిరసన తెలిపేలా చేసిన అరెస్టు అది.  విధ్వంస ప్రభుత్వం పతనానికి  నాంది పలికిన అరెస్టు అది.  చరిత్ర ఎన్నటికీ క్షమించని తప్పు ఆ అరెస్టు.  ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగామార్చేసిన అరెస్టు అది.  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అరాచ‌క పాల‌న‌తో గొంతెత్తేందుకు భయపడిన జనాన్ని.. ఆగ్రహంతో రోడ్లపైకి వచ్చేలా చేసిన అరెస్టు అది.  ఆ నాడు మొదలైన ప్రజా పోరాటం గత ఏడాది జరిగిన ఎన్నికల్లో జగన్ పతనం చూసే వరకు కొనసాగేలా చేసిన అరెస్టు అది.  ఆ అరెస్టు  వైసీపీ హయాంలో చంద్రబాబు నాయుడు అరెస్టుకు ముందు ఒక లెక్క.. చంద్రబాబు అరెస్టు తరువాత ఒక లెక్క అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.  అప్పటి వరకూ బిక్కుబిక్కు మంటూ బతుకు జీవుడా అన్న చందంలో ఉన్నఏపీ ప్రజలలో చంద్రబాబు అరెస్టు ఆగ్రహ జ్వాలలను రగిల్చింది. తెలుగు రాష్ట్రాలలోనే కాదు, దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ, ప్రపంచ వ్యాప్తంగా 70కి పైగా దేశాలలోనూ చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు జరిగాయి.  ఎక్కడైనా ఒక నాయకుడు అరెస్టైతే అందరూ ఆ నాయకుడు చేసిన అవినీతి, అక్రమాల గురించి మాట్లాడుకుంటారు.  కానీ ఒక్క చంద్రబాబు విషయంలో మాత్రం ఆయన అరెస్టు..  ఆయన చేసిన గొప్ప పనులు, అభివృద్ధికి దోహదం చేసిన ఆయన విధానాల గురించి మాట్లాడుకున్నారు.   ఆయన విధానాలతో ఐటీ కొలువులలో చేరి ఉన్నత స్థాయికి చేరిన ఐటీ ప్రొఫెషనల్స్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి హైదరాబాద్ లో సీబీఎన్ గ్రాటిట్యూడ్ సభను నిర్వహించారు. ఇలా సమాజంలోని అన్నివర్గాలకు చెందిన ప్రజలూ చంద్రబాబు అక్రమ అరెస్టునకు వ్యతిరేకంగా గళమెత్తి.. పోరుబాట పట్టడం... ఆయన తన నాలుగు దశాబ్దాలకు పై బడిన రాజకీయ జీవితంలో... ప్రజల మద్దతును ఏ స్థాయిలో కూడగట్టుకున్నారో ప్రపంచానికి తేటతెల్లం చేసిన అరెస్టు అది.  చంద్రబాబు నాయుడు అంటే కేవలం ఒక రాజకీయ నాయకుడు కాదు.. ప్రజల మనిషి, ప్రజాహృదయాలలో తిరుగులేని స్థానాన్ని సుస్థిరం చేసుకున్న మహోన్నత వ్యక్తి అని చాటిన అరెస్టు అది.

కేంద్రమంత్రి నితిన్ గ‌డ్క‌రీతో సీఎం రేవంత్‌ భేటీ

  ఢిల్లీలో  సీఎం రేవంత్‌రెడ్డి  జాతీయ ర‌హ‌దారుల శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీతో సమావేశం అయ్యారు. రీజిన‌ల్ రింగు రోడ్డుకు (నార్త్ పార్ట్‌) సంబంధించి 90 శాతం భూ సేకరణ పూర్తయినందున ప‌నుల ప్రారంభానికి కేంద్ర ఆర్థిక‌, కేబినెట్ అనుమ‌తులు ఇప్పించాల‌ని గ‌డ్క‌రీకి విన్నవించారు. రావిర్యాల - ఆమ‌న్‌గ‌ల్‌ - మ‌న్న‌నూర్ ర‌హ‌దారిని నాలుగు వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారిగా నిర్మించాల‌ని సూచించారు.  అలాగే, మ‌న్న‌నూర్‌ - శ్రీ‌శైలం (ఎన్‌హెచ్ 765) నాలుగు వరుసల ఎలివేటెడ్‌ కారిడార్‌కు అనుమతించాలని కేంద్ర మంత్రి గ‌డ్క‌రీని ముఖ్యమంత్రి కోరారు. హైద‌రాబాద్‌ - మంచిర్యాల మ‌ధ్య నూత‌న గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారిని జాతీయ ర‌హ‌దారిగా మంజూరు చేయాల‌ని విన్నవించారు. హైద‌రాబాద్ భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్టు వరకు 12 వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారికి అనుమ‌తి ఇవ్వాల‌ని కేంద్ర మంత్రిని కోరారు

సీపీ రాధాకృష్ణన్‌కు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

  భారత ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్‌కు ఏపీ చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. పదవీకాలం విజయవంతంగా పూర్తి చేయాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. దేశ సేవ, పురోగతికి రాధాకృష్ణన్‌ పనిచేస్తారని భావిస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు ఆయన అపార జ్ఞానం, అనుభవం ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. రాధాకృష్ణన్‌కు మంత్రి నారా లోకేశ్‌ ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు.  మరోవైపు ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్‌కు దేశ వ్యాప్తంగా అభినందనలువెల్లువెత్తున్నాయి. ప్రజా జీవితంలో  మీ దశాబ్దల అనుభవం దేశ ప్రగతికి ఎంతో దోహదపడునుందని మీ బాధ్యతల్లో విజయవంతమవ్వాలని ఆకాంక్షిస్తున్నా అని రాష్ట్రపతి ముర్ము ట్వీట్ చేశారు. రాధాకృష్ణన్‌ జీవితం ఎల్లప్పుడూ ప్రజాసేవకే అంకిత చేశారని అత్యుత్తమ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్‌ నిలుస్తారని భావిస్తున్నాని ప్రధాని మోదీ తెలిపారు. అణగారిన వర్గాల సాధికారతకు కృషి చేసిన వ్యక్తి అని రాజ్యాంగ విలువలను రాధాకృష్ణన్‌ బలోపేతం చేస్తారని ఆశిస్తున్నా ప్రధాని పేర్కొన్నారు

మహారాష్ట్రలో డ్రగ్ రాకెట్ గుట్టు రట్టు

  డ్రగ్స్ ముఠాలపై ఈగల్ టీమ్ ఉక్కు పాదం మోపింది... ఎలాగైనా సరే డ్రగ్స్ స్మగ్లింగ్ చేసే ముఠా లపై కొరడా ఝళిపిస్తూ... డ్రగ్స్ అనే మహమ్మారిని పూర్తిగా రూపుమా పేందుకు ఈగల్ టీం నడుం బిగించింది... ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రలో హవాలా రాకెట్ గుట్టురట్టు చేశారు. రాచకొండ నార్కోటిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈగల్ ఫోర్స్ విదేశీ పౌరుడు ఒన్యేసి ఎసోం కెన్నెత్ మ్యాక్స్వెల్ ఇమ్మన్యుయెల్ బెడియాకో డ్రగ్స్ అమ్ముతూ పట్టు పడ్డాడు.  అయితే ఈగల్ టీం  మ్యాక్స్వెల్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేయడంతో.... 150 అకౌంట్లో ద్వారా నైజీరియాకు డబ్బులు పంపిస్తు న్నట్లుగా వెల్లడైంది.  మాక్స్వెల్ సుమారు రూ.68 లక్షల కమిషన్ సంపాదించాడని ఆ డబ్బును తన భార్య, మరిది  అకౌంట్లోకి తరలించాడని వెల్లడైంది. ఒకే ఒక నైజీరియన్ ఇంత పెద్ద స్థాయిలో వ్యాపారం చేయడం ఏంటా అని ఈగల్ టీం కూపిలాగడంతో చాలా విషయాలు బయట పడ్డాయి. దీంతో 24 ప్రత్యేక ఈగల్ టీంలు మహారాష్ట్ర, ఢిల్లీ, ముంబై ,గోవా, రాజస్థాన్ ,గుజరాత్  రాష్ట్రాలలో ఆపరే షన్ నిర్వహించారు.   ఈ క్రమంలోనే ఉత్తమ్ సింగ్, చేతన్ మమా  నియా, దుర్గా రామ్,చేతన్ సింగ్,చగన్ లాల్ ఆధ్వర్యంలో ఒక పటిష్టమైన హవాలా నెట్వర్క్ బయట పడింది. ఉత్తమ్ సింగ్ , భరత్ కుమార్ గోవాలోని నైజీరియన్ల వద్ద నుండి ప్రతిరోజు 25 లక్షల మనీ వసూలు చేసి వారానికి రూ.2.1 కోట్ల హవాలా ఆపరేటర్ల ద్వారా డబ్బుల పంపిణీ చేసేవారు.  అయితే నైజీరియన్లు బేబీ ఫ్రాక్స్, కుర్తాలు, టీ- షర్ట్ లు, మానవ కేశం, కిరాణా సరుకుల ఎక్స్ పోర్ట్ పేరుతో  ముంబై మరియు చెన్నై పోర్టు ల ద్వారా లాగోస్ కి సముద్ర మార్గం ద్వారా డబ్బులు రవాణా చేసేవారు. ఈ విషయం గుర్తించిన 24 ప్రత్యేక ఈగల్ టీములు మహా రాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, గోవా, ఢిల్లీ రాష్ట్రాలలో దాడులు చేసి 20 మంది డ్రగ్ మనీ లాండర్లను అరెస్టు చేసి వారి వద్ద నుండి మూడు కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు ఈగల్ టీం ఈ కేసులో 50 మంది నిందితులను పట్టుకున్నారు.

తెలంగాణపై ఫోకస్ చేస్తాం : లోకేష్

  తెలంగాణపై తెలుగు దేశం పార్టీ ఫోకస్‌ చేస్తుందని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ఢిల్లీ మీడియా ప్రతినిధులతో లోకేశ్‌ చిట్ చాట్ నిర్వహించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోటీపై పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుదే తుది నిర్ణయమని పేర్కొన్నారు. కవిత టీడీపీలోకి వస్తారా? అనే ప్రశ్నకు లోకేశ్ స్పందించారు. కవిత టీడీపీలో తీసుకోవడం అంటే జగన్‌ను చేర్చుకున్నట్లేనని అన్నారు.ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఎందుకు ఓటు వేశారో జగన్‌ను వైసీపీ ఎంపీలు అడగాలని నారా లోకేశ్‌ సూచించారు.  ఇప్పుడే కాదు.. 2029 ఎన్నికల్లోనూ మోదీకి మద్దతిస్తామని స్పష్టం చేశారు. రెడ్‌బుక్‌లో చాలా స్కామ్‌లు ఉన్నాయని నారా లోకేశ్‌ అన్నారు. అవన్నీ బయటకు వస్తాయని తెలిపారు. ఆ భయంతోనే జగన్‌ బెంగళూరులో ఉంటున్నారని విమర్శించారు. ఏపీ లిక్కర్‌ కేసులో ప్రభుత్వ జోక్యం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసు విచారణ పారదర్శకంగా కొనసాగుతోందని తెలిపారు. ఫైబర్‌ నెట్‌ను టాటా సంస్థకు ఇచ్చే చర్చ జరగలేదని స్పష్టం చేశారు. దేవాన్షు ఎందుకు రాజకీయాల్లో వస్తారు అనుకుంటున్నారు హ్యాపీగా చెస్ ఆడుకుంటున్నాడని పేర్కొన్నారు.   

ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఘన విజయం

  భారత 17వ ఉప రాష్ట్రపతిగా  ఎన్‌డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు. రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు, సుదర్మన్‌రెడ్డికి 300 మొదటి ప్రాధాన్య ఓట్లు వచ్చాయి. దీంతో రాధాకృష్ణన్ 152 ఓట్లుతో గెలుపోందారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఓటింగ్, సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. పార్లమెంట్‌లోని ఉభయ సభల సభ్యులు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందరికంటే ముందుగా తన ఓటు వేశారు.ప్రధాని నరేంద్ర మోదీ తొలి ఓటు వేయగా, ఆయనతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా తదితరులు కూడా ఓటింగ్ లో పాల్గొన్నారు. అయితే, 15 మంది ఓట్లు చెల్ల లేదు. ఈ ఎన్నికల్లో మొత్తం 13 మంది ఎంపీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. వీరిలో బిజూ జనతాదళ్ (బీజేడీ) నుంచి ఏడుగురు, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నుంచి నలుగురు, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) నుంచి ఒకరు, మరో స్వతంత్ర ఎంపీ ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తగిన మద్దతు లభించడం లేదన్న కారణంతో ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు శిరోమణి అకాలీదళ్ ప్రకటించింది. రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుప్పూర్‌లో 1957 అక్టోబర్ 20న జన్మించారు. ఆయన బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. ఆరెస్సెస్ స్వయంసేవకుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. 1974లో భారతీయ జనసంఘ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడుగా ఆయన ఎన్నికయ్యారు. భారతీయ జనతా పార్టీ తమిళనాడు శాఖ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.  ఆయన  కోయంబత్తూరు లోక్ సభ నుంచి 1998, 1999 రెండుసార్లు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2004, 2014, 2019లో వరుసగా మూడుసార్లు ఓడిపోయారు. 2023 ఫిబ్రవరిలో ఝార్ఖండ్ గవర్నర్‌గా రాధాకృష్ణన్  నియమితులయ్యారు. ఆ తర్వాత 2024 జూలైలో మహారాష్ట్ర గవర్నర్‌గానూ బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ మరియు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా  అదనపు బాధ్యతలు కూడా నిర్వహించారు.  రాధాకృష్ణన్ తన రాజకీయ జీవితాన్ని విద్యార్థి ఉద్యమంతో ప్రారంభించారు. 2007లో తమిళనాడు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 93 రోజుల్లో రాష్ట్రంలో 19 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఈ ప్రయాణంలో ప్రధానంగా నదుల అనుసంధానం, ఉగ్రవాదం, ఉమ్మడి పౌరస్మృతి, అంటరానితనం, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు వంటి అంశాలపై దృష్టి సారించారు. ఆ తర్వాత కూడా ఆనకట్టలు, నదుల సమస్యపై 280 కిలోమీటర్లు, 230 కిలోమీటర్ల చొప్పున రెండుసార్లు పాదయాత్రలు చేశారు.  

మాజీ ప్రధాని భార్యను సజీవంగా తగలపెట్టిన నిరసనకారులు

  నేపాల్ మాజీ ప్రధాని జాలనాథ్ ఖనాల్‌ ఇంటికి ఆందోళనకారులు నిప్పంటించారు. ఈ ఘటనలో ఖనాల్‌ సతీమణి రాజ్యలక్ష్మి మంటల్లో కాలిపోయి ప్రాణాలు కోల్పోయారు. చైనా సానుభూతిపరుడైనా ఆయనపై గతంలో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఖనాల్ ఇంటిపై దాడి చేసినట్లు తెలుస్తోంది.  సోషల్‌ మీడియా నిషేధం, అవినీతికి వ్యతిరేకంగా జనరేషన్‌ జెడ్‌ చేపట్టిన ఉద్యమంతో ప్రధాని కేపీ ఓలీ రాజీనామా చేశారు.  మాజీ ప్రధాని కేపీఓలీతో పాటు పలువురు మంత్రులు దేశం విడిచి పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మరింత రెచ్చిపోయిన ఆందోళన కారులు కాఠ్మాండూలోని డల్లూ ప్రాంతంలో మాజీ ప్రధాని జాలనాథ్ ఖనాల్‌ ఇంటిని ముట్టడించారు. ఖనాల్‌ సతీమణి రాజ్యలక్ష్మి చిత్రకార్‌ను ఇంట్లో బంధించి, ఇంటికి నిప్పుపెట్టారు. మంటల్లో చిక్కుకున్న రాజ్యలక్ష్మిని కిర్తిపూర్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మరణించారు.

ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ దుకూడు

  ఫార్ములా ఈ- కారు రేస్ కేసులో మరో సంచలనం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సహా నలుగురిపై న్యాయ విచారణకు ఏసీబీ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఎఫ్ఈఓ లను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్  జిష్ణుదేవ్ వర్మ అనుమతి కొరకై ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి రిపోర్ట్ పంపించారు. గవర్నర్ అనుమతి రాగానే కేటీఆర్, ఐఏఎస్ అధికారి అరవింద్‌ కుమార్‌, బీఎల్‌ఎన్ రెడ్డి, కిషన్‌రావులపై ఛార్జ్‌షీట్ దాఖలు చేయనుందుకు  గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే, గవర్నర్ అనుమతి అనంతరం తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతోంది.  ఫార్ములా ఈ కారు రేస్ లో అవకతవకలు జరిగి నట్లుగా సమాచారం రావడంతో వెంటనే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఫార్ములా ఈ కార్ రేస్ పై తొమ్మిది నెలల పాటు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించారు. ఈ కేసులో ఇప్పటికే రెండుసార్లు కేటీఆర్ తో పాటు అర్వింద్ కుమార్ ను కూడా విచారించి వారి స్టేట్మెంట్లను ఏసీబీ అధికారులు రికార్డు చేశారు. ఈ కారు రేస్  స్పాన్సర్షిప్  చేసిన సంస్థల నుంచి బీఆర్‌ఎస్ పార్టీకి  రూ. 44 కోట్ల రూపాయల ఎలక్షన్ బ్రాండ్స్ లాభం వచ్చినట్లు అధికారులు గుర్తించారు.  ఈ విధంగా  క్విడ్ ప్రో కో  జరిగినట్టుగా  ఏసిబి అధికారులు నిర్ధారించారు. ఏసీబీ అధికారులు 9 నెలల పాటు ఫార్ములా ఈ కార్ రేస్ లో విచారణ జరిపిన అనంతరం ప్రభుత్వానికి  నివేదిక సమర్పించారు. గత కేబినేట్ అనుమతి లేకుండానే ఎఫ్ఈవో కంపెనీకి నిధులు మళ్లించినట్లు ఆరోపణలు రావడంతో 19 డిసెంబర్‌ 2024న ఫార్ములా ఈ-కారు రేసు కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. రూ.54.88 కోట్లకుపైగా నిధులు దారి మళ్లించారని ఆరోపణలు వచ్చాయి. ఫార్ములా ఈ-కారు రేసు కేసులో క్విడ్‌ప్రోకో జరిగినట్లు ఏసీబీ నివేదికలో పేర్కొన్నారు 

కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

  ఢిల్లీ  పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి  కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఇటీవల తెలంగాణలో భారీ వరదల కారణంగా జరిగిన పంట, ఆస్తి నష్టంపై అధికారులు ఇచ్చిన నివేదకను  నిర్మాలా సీతారామన్‌కు అందజేశారు.   విపత్తుతో సర్వం కోల్పోయిన ప్రజలను ఆదుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన తెలంగాణకు వెంటనే నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు తెలంగాణలో చేపడుతున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు నిధులు ఇవ్వాలని కోరారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు గురించి చర్చలు జరిపారు.సీఎం రేవంత్ రెడ్డి. ఈ సమావేశంలో ఎంపీలు చామల కిరణ్ కుమార్‌రెడ్డి, మల్లు రవి, బలరాం నాయక్, సురేష్ షెట్కార్ పాల్గొన్నారు.

తలపతి విజయ్ పార్టీలోకి నటి త్రిష?

తమిళ హీరో తలపతి  విజయ్ వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీలో పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ధృవీకరించేశారు. తమిళనాట పొత్తులు లేకుండా ఒక కొత్త పార్టీ ఒంటరిగాఎన్నికల బరిలోకి దిగడం సాహసమనే చెప్పాలి. అయితే తన అభిమానుల బలంతో తమిళ రాజకీయాలలో సొంత బాట ఏర్పాటు చేసుకోగలన్న విశ్వాసం, ధీమా విజయ్ లో వ్యక్తం అవుతున్నాయి.  అయితే తళపతి విజయ్ కు కోలీవుడ్ పరిశ్రమ మద్దతు ఏ మేరకు ఉంటుందన్న సందేమాలు పరిశీలకులలో వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్ అధికార పార్టీకి బహిరంగంగా మద్దతు తెలపడమే కాకుండా, పరోక్షంగా విజయ్ పై రాజకీయ విమర్శలు కూడా చేశారు. ఇక మరో హీరో కమల్ హసన్ విజయ్ కు మద్దతు ప్రకటిస్తారా అన్నిది కూడా అనుమానమే. ఇప్పటికే డీఎంకే మద్దతుతో రాజ్యసభలోకి అడుగుపెట్టిన ఈ లోక్ నాయకుడు.. బహిరంగంగా విజయ్ కు మద్దతు ప్రకటించే అవకాశాలు లేవని అంటున్నారు. వీరిద్దరినీ పక్కన పెడితే కోలీవుడ్ పరిశ్రమలో విజయ్ వెంట నిలిచేదెవరన్న ప్రశ్న తలెత్తుతోంది. విజయ్ అభిమానులు మాత్రం తమిళ అగ్ర నటులంతా ముందుకు వచ్చి విజయ్ కు మద్దతు పలకాలని ఆశిస్తున్నారు. అయితే ప్రముఖ నటి త్రిష మాత్రం రాజకీయంగా తలపతి విజయ్ కు బహిరంగ మద్దతు ప్రకటించారని అంటున్నారు. ఇటీవల దుబాయ్ లో  ఫెమా ఫంక్షన్ లో ఆమె రాజకీయంగా విజయ్ అనుకున్నది సాధించాలని ఆకాంక్షిస్తూ బెస్టాఫ్ లక్ చెప్పారు.  దాదాపు రెండు దశాబ్దాలుగా తమిళ తెలుగు సినిమాలలో హీరోయిన్ గా ప్రముఖ స్థానంలో ఉన్న త్రిష సినీ కెరీర్ ఇప్పుడు కొద్దిగా నెమ్మదించింది. దీంతో సహజంగానే ఆమె తదుపరి అడుగు రాజకీయాలవైపు పడుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తలపతి విజయ్ కు ఏదో మామూలుగా బెస్టాఫ్ లక్ చెప్పలేదనీ, ముందు ముందు ఆమె తలపతి విజయ్ పార్టీ ద్వారానే రాజకీయ ప్రవేశం చేసే అవకాశం ఉందనీ  అంటున్నారు.  

అల్లు అర్జున్‌కు నోటీసులు... ఎందుకంటే?

  టాలీవుడ్‌ హీరో అల్లు అర్జున్‌కు జీహెచ్‌ఎంసీ అధికారులు షాక్‌ ఇచ్చారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.45 లోని అల్లు బిజినెస్‌ పార్క్‌ భవనంపై అనుమతి లేకుండా వేసిన అక్రమ నిర్మా ణాన్ని ఎందుకు కూల్చివేయరాదో చెప్పాలంటూ బన్నీకి  జీహెచ్‌ఎంసీ సర్కిల్‌-18 అధికారులు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. అల్లు అర్జున్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కలిసి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం. 45లో రెండేండ్ల కిందట అల్లు బిజినెస్‌ పార్క్‌ పేరుతో భవనాన్ని నిర్మించారు. అయితే గీతా ఆర్ట్స్‌తో పాటు అల్లు ఆర్ట్స్‌కు సంబంధించిన వ్యాపారాలు, ఇతర సంస్థలకు చెందిన కార్యాలయాలు ఇక్కడ ఉన్నాయి.  సుమారు 1226 గజాల స్థలంలోని ఈ భవనానికి రెండు సెల్లార్లతో పాటు జీ ప్లస్‌ 4 అనుమతి కూడా ఉంది. కాగా, ఇటీవల నాలుగో అంతస్తుపైన అక్రమ నిర్మాణాన్ని చేశారు. ఈ వ్యవహారంపై సమాచారం అందు కున్న వెంటనే జీహెచ్‌ఎంసీ సర్కిల్‌-18 డీఎంసీ సమ్మయ్య విచారణకు ఆదేశించారు. ఎటువంటి అనుమతి లేకుండా నాలుగవ అంతస్తు పైన అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని దీనిని వెంటనే కూల్చివేయాలి. కానీ అందుకు బన్నీ కుటుంబ సభ్యులు అడ్డుపడుతున్నారు. అయితే అక్రమ నిర్మాణాన్ని ఎందుకు కూల్చవద్దో తెలపాలంటూ అల్లు అర్జున్ కు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

ఏపీలో 4 దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు

  ఏపీలో స్థానిక సంస్థ ఎన్నికలపై  రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని కీలక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికలు నాలుగు దశల్లో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు చేసినట్లు  ఎన్నికల కమిషనర్‌ తెలిపారు. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వాన్ని సంప్రదిస్తామని ఆమె  పేర్కొన్నారు.  మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, బిహార్‌లో ఈవీఎంలు వాడారు. ఈవీఎంల కొనుగోలు,వినియోగంపై త్వరలో నిర్ణయం.’’ తీసుకుంటామని  కమిషనర్‌ నీలం సాహ్ని తెలిపారు. ఇప్పటికే ఏపీలో పలుచోట్ల జడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించిన సంగతి తెెలిసిందే.  అయితే ఈ ఎన్నికల్లో కూటమి నాయకులు ఘన విజయం సాధించారు. దీంతో ఇప్పుడు ప్రభుత్వం స్థానిక సంస్థ ఎన్నికలపై దృష్టి పెట్టింది.

సూపర్ సిక్స్.. సూపర్ హిట్ సభ ఏర్పాట్ల పరిశీలన

అనంతపురం వేదికగా బుధవారం (సెప్టెంబర్ 10) జరగనున్న  సూపర్ సిక్స్-సూపర్ హిట్' విజయోత్సవ సభ ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి.  ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ సభకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో  భద్రతా ఏర్పాట్లను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సభా ఏర్పాట్లు స్వయంగా పరిశీలించారు. పర్యవేక్షించారు.  మంగళవారం (సెప్టెంబర్ 8) సభా ప్రాంగణాన్ని పరిశీలించిన ఆమె, భద్రతాపరమైన అంశాలపై పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ విజయోత్సవ సభకు పెద్ద సంఖ్యలో జనం వచ్చే అవకాశం ఉందనీ, భద్రత విషయంలో ఎటువంటి లోటుపాట్లకూ తావీయవద్దనీ అదికారులకు అనిత ఆదేశాలు ఇచ్చారు.  సభా ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో డ్రోన్లతో నిరంతర నిఘా ఏర్పాటు చేయాలనీ, అలాగే సభకు వచ్చే వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  ట్రాఫిక్ నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్న వంగలపూడి అనిత..  వేదిక నిర్మాణం, బారికేడ్ల ఏర్పాటు వంటి అంశాలపై కూడా అధి కారులకు  సూచనలు చేశారు. 

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. తెలంగాణ స్థానిక ఎన్నికలు.. లింకేటి?

తెలంగాణలో స్థానిక సమరం మరో వాయిదా ఖాయం అన్న సంకేతాలే కనిపిస్తున్నాయి. ఇదిగో.. అదిగో అంటూ వాయిదాల మీద వాయిదాలు పడుతున్న తెలంగాణ స్థానిక ఎన్నికలు కోర్టు స్పష్టమైన గడువు విధించిన తరువాత కూడా మళ్లీ మరో మారు వాయిదా పడటం ఖాయంగానే కనిపిస్తున్నది.  వాస్తవానికి స్థానిక సంస్థల గడువు ముగిసి చాలా కాలమైంది. తెలంగాణలో 2019లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. వాటి గడువు ముగిసి కూడా ఏడాది దాటింది.   అప్పటి నుంచీ కూడా స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నది.  ఈనేపధ్యంలో ప్రభుత్వం స్థానిక ఎన్నికలు ఇప్పుడు నిర్వహిస్తాం, అప్పుడు నిర్వహిస్తామంటూ ముహూర్తాలు ఖరారు చేసి ఉజ్జాయింపుగా తేదీలనూ ప్రకటించేస్తున్నా.. అవన్నీ వాయిదాల మీద వాయిదాలు పడుతూనే వస్తున్నాయి.  అసలీ ఎన్నికలు ఎప్పుడు, ఎలా నిర్వహించాలన్న విషయంలో ప్రభుత్వానికి స్పష్టత ఉన్నట్లు కనిపించదు.    ఇక ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్ బీసీ రిజర్వేషన్ల విషయంలో పట్టుబడుతుండటంతో కోర్టు విధించిన గడువులోగా స్థానిక ఎన్నికల నగారా మోగే అవకాశం ఇసుమంతైనా లేదన్న విషయం దాదాపు స్పష్టమైపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వారి విశ్లేషణకు తగినట్లుగానే ఇటీవలి మంత్రివర్గ సమావేశం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు ఆమోదం లభించే వరకూ స్థానిక పోరుకు వెళ్లవద్దన్ననిర్ణయం తీసుకున్నది. అవసరమైతే కోర్టును ఆశ్రయించి మరి కొంత గడువు కోరాలని కేబినెట్ నిర్ణయించింది. అదే జరిగితే ఇక ఇప్పట్లో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశాలు ఇసుమంతైనా లేనట్లేనని అంటున్నారు. ఎందుకంటే.. బీసీ రిజర్వేషన్ బిల్లు రాష్ట్రపతి, గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది.  వారి వద్ద నుంచి ఈ నెల 30లోగా ఎటువంటి నిర్ణయం వెలువడకుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఇదే కారణాన్ని చూపుతూ కోర్టును ఆశ్రయించడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తంగా బీహార్ ఎన్నికలు ముగిసే వరకూ తెలంగాణ స్థానిక సమరం వాయిదా పడటమే మంచిదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇందు కోసం కోర్టును స్థానిక పోరును మూడు నుంచి నాలుగు నెలల పాటు వాయిదా వేయడానికి అనుమతి ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. ఆ లోగా రాష్ట్రపతి లేదా గవర్నర్ నుంచి బీసీల రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన నిర్ణయం వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నట్లుగా చెప్పే అవకాశం ఉందని అంటున్నారు.   ఇంతకీ బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో లింకేమిటంటే.. బీహార్ ఎన్నికలలో కాంగ్రెస్ కూటమి విజయం సాధిస్తే రాష్ట్రంలో పరిస్థితి కాంగ్రెస్ కు అనుకూలంగా మారుతుందన్నది రేవంత్ బావనగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే కోర్టును ఆశ్రయించైనా సరే స్థానిక ఎన్నికల వాయిదాకు కాంగ్రెస్ పట్టుబ డుతుందని చెబుతున్నారు. 

రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మహిళ అధికారి

  దేశంలో ఏసీబీ వరుస దాడులు చేస్తున్నా అవినీతి అధికారుల తీరు మారట్లేదు. తాజాగా హైదరాబాద్‌ శివారులోని  నార్సింగి మునిసిపల్ కార్యాలయంలో టౌన్‌ ప్లానింగ్‌ అధికారిణి మణిహారిక  రూ.4లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మంచిరేవులలోని వినోద్ అనే వ్యక్తికి చెందిన ప్లాట్ ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియర్‌ చేసేందుకు రూ.10లక్షలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేసింది.  మరోవైపు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అధికారులకు పట్టుబడ్డాక ఆమె కన్నీరు పెట్టురు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్‌ ఆధ్వర్యంలో  కార్యాలయంలో తనిఖీలు చేస్తున్నారు. సోదాలు కొనసాగుతున్నాయి. టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు గతంలో జారీ చేసిన అనుమతులకు సంబంధించిన ఫైళ్లను అధికారులు సోదాలు నిర్వహించారు.

గ్రూప్‌-1 మెయిన్స్ ఫలితాలు రద్దు : హైకోర్టు

  గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మార్చి 10న ప్రకటించిన మెయిన్స్ ఫలితాలు ఆధారంగా  జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌, మార్కుల జాబితాను కోర్టు రద్దు చేసింది. మళ్లీ గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల పేపర్లను రీవాల్యుయేషన్ చేసి, దాని ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని ఉన్నత న్యాయస్థానం  ఆదేశించింది. అది సాధ్యం కాకపోతే పరీక్షలు మళ్ళీ నిర్వహించాలని తెలిపింది. అందులో క్వాలిపై అయిన వారందరికీ అవకాశం కల్పించాలని సూచించింది.  ఈ ప్రక్రియను 8 నెలల్లోపు పూర్తిచేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇలా చేయని పక్షంలో మెయిన్స్ పరీక్షలు రద్దు చేయాల్సి వస్తుందని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. సంజయ్‌ వర్సెస్‌ యూపీఎస్సీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం పునఃమూల్యాంకనం జరపాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. గ్రూప్‌-1 వాల్యుయేషన్‌లో అవకతవకలు జరిగాయని, పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ కొందరు. ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తయి ఉత్తర్వుల దశలో ఉన్న పరీక్షలను రద్దు చేయరాదంటూ ఎంపికైన అభ్యర్థులు మరికొందరు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై జులై 7న న్యాయమూర్తి జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావు వాదనలు విన్నారు. ఈ మేరకు తాజాగా హైకోర్టు తీర్పు వెలువరించారు.  

సీఎం రేవంత్ ఇంటి ప్రహారీగోడ కూల్చివేత!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ప్రహారీగోడను అధికారులు కూల్చివేశారు. నమ్మశక్యం కాకున్నా ఇది నూటికి నూరుపాళ్లు వాస్తవం. సాధారణంగా రాజకీయ నాయకులు, అందులోనూ అధికారంలో ఉన్న వారు తమను తాము చట్టానికి అతీతులుగా భావిస్తుంటారు.  భూసేకరణ, కూల్చివేతలు వంటి అంశాలు తమ ఆస్తుల వరకూ రావని, రాకూడదనీ భావిస్తుంటారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఈ విషయంలో తనకూ సామాన్యులకూ ఒకే విధానం ఉండాలనీ, ఉంటుందనీ నిరూపించారు. విషయంలోకి వస్తే.. మహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డిపల్లిలో రేవంత్ రెడ్డికి పూర్వీకుల నుంచి సంక్రమించిన ఇల్లు ఉంది. కొండారెడ్డి పల్లిలో రోడ్ల విస్తరణలో భాగంగా రోడ్లను 40 పీట్ల నుంచి 60 ఫీట్లకు పెంచాలని నిర్ణయించారు. ఆ క్రమంలోపలు గృహాల ప్రహారీ గోడలను కూల్చివేయాల్సివచ్చింది. ఆ గృహాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ఉంది.  ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. తన నివాసమైనా, ఎవరి నివాసమైనా సరే ఎటువంటి మినహాయింపులూ ఉండడానికి వీల్లేదని స్పష్టం చేశారు. దీంతో ఆయన ఆదేశాల మేరకు అధికారులు ముఖ్యమంత్రి నివాసం ప్రహారీ గోడను కూడా రోడ్డు విస్తరణలో భాగంగా కూల్చివేశారు.   

నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా

  నేపాల్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఉద్రిక్తత పరిస్థితుల నడుమ ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో జరుగుతున్న అల్లర్ల నేపధ్యంలో సైన్యం సూచన మేరకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన దుబాయ్ నుంచి వెళ్లే అవకాశం ఉంది. దీంతో సాయంత్రం కొత్త ప్రధాని పేరును సైన్యం ప్రకటించే అవకాశం ఉంది. దీంతో నేపాల్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారి అదుపుతప్పాయి. ఆగ్రహంతో రగిలిపోతున్న యువత ఏకంగా ప్రధానమంత్రి కేపీ ఓలీ అధికారిక నివాసానికే నిప్పు పెట్టడంతో దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాని తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది ఆందోళనకారులు రాజధాని ఖాట్మండులో విధ్వంసం సృష్టిస్తున్నారు. సోషల్ మీడియాపై బ్యాన్, అవినీతి ఆరోపణలతో మొదలైన నిరసనలు నిన్నటి నుంచి నేపాల్‌లో మరింత హిసాత్మకంగా మారాయి. పార్లమెంట్ ముట్టడితో సైన్యం రంగంలోకి దిగి కాల్పులు జరపగా 20 మంది ప్రజలు మరణించారు. వందలాది మందికి గాయాలయ్యాయి. దీంతో ప్రధాని కేపీ శర్మ ఓలి  ఇందుకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేయడంతో పాటు.. హోంమంత్రి రాజీనామా చేసినా ప్రజల నిరసనలు ఆగకపోవడంతో.. ప్రధాని రాజీనామా చేయడమే అనివార్యంగా మారినట్లు సమాచారం. సాయంత్రం నేపాల్ కొత్త ప్రధానిని ప్రకటించే ఛాన్స్ ఉంది