ఫలిస్తున్న లోకేష్ కృషి.. నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారు క్షేమంగా వెనక్కు!

లోకేష్ ఆధ్వర్యంలో ఆపరేషన్ నేపాల్ విజయవంతంగా సాగుతోంది. తీవ్ర సంక్షోభంలో ఉన్న నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారిని స్వరాష్ట్రానికి తీసుకురావడానికి లోకేష్ బుధవారం (సెప్టెంబర్ 10) నుంచి నిర్విరామంగా చేస్తున్న కృషి ఫలిస్తోంది. నేపాల్ లో చిక్కుకున్న పలువురు ఆంధ్రప్రదేశ్ వాసులు స్వరాష్ట్రానికి బయలు దేరారు సిమికోట్‌లో చిక్కుకున్న 12 మందిని ప్రత్యేక విమానంలో అధికారులు ఉత్తర్‌ప్రదేశ్ సరిహద్దు సమీపంలోని నేపాల్ గంజ్ విమానాశ్రయానికి తరలించారు.   అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లో లక్నో చేరుకుంటారు. అక్కడ నుంచి విమానాంలో వారిని హైదరాబాద్ తీసుకువస్తారు. అలాగే నేపాల్ రాజధాని ఖాట్మండూ లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి అధికారులతో సమన్వయం చేసి మంత్రి లోకేశ్‌ ప్రత్యేక విమానం ఏర్పాటుచేశారు. నేపాల్‌లో చిక్కుకున్న వారు రాష్ట్రానికి సురక్షితంగా తిరిగివచ్చి ఇళ్లకు చేరే వరకూ సంబంధిత అధికారులు అంతా అప్రమత్తంగా ఉండాలని లోకేష్ ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి, పర్యవేక్షించడం కోసం ఆయన అనంతపురం వేదికగా జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభకు కూడా వెళ్ల లేదు. ఇక పోతే విజయనగరం జిల్లా నుంచి మానససరోవర యాత్ర కోసం  వెళ్లి నేపాల్ లో  చిక్కుకుపోయిన 61 మందిని కూడా సురక్షితంగా తిరిగి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. లోకేష్ ఆదేశం  మేరకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఫోన్ ద్వాయా ఆ యాత్రికుల యోగక్షేమాలు విచారించారు.  ఇక పొఖారాలో చిక్కుకున్న తెలుగువారిని తరలించడానికి ప్రత్యేక విమానం  ఖాట్మండు చేరుకుంది. ఇప్పటి వరకూ 176 మంది తెలుగు వారు అక్కడి విమానాశ్రాయానికి చేరుకున్నారు.    ​మొత్తంగా..  ఖాట్మండు, హేటౌడా, పొఖారా, సిమికోట్ సహా నేపాల్‌లోని 12 ప్రదేశాల్లో సుమారు 217 మంది తెలుగు ప్రజలు చిక్కుకున్నారు. వీరిలో చాలా మందిని విమానాలు, రోడ్డు మార్గాల ద్వారా తరలిస్తున్నారు. సహాయక చర్యలను ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. చిక్కుకుపోయిన ప్రజలకు ఆహారం, నీరు, వసతి, ఇతరత్రా సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని మంత్రి లోకేష్ రియల్ టైమ్ గవర్నెన్స్ కమాండ్ సెంటర్ ద్వారా రెండు రోజులుగా పర్యవేక్షిస్తున్నారు.  ఢిల్లీలోని ఏపీ భవన్‌లో  హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. చిక్కుకున్న ప్రజలందరినీ సురక్షితంగా ఆంధ్రప్రదేశ్ చేర్చడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. 

పింక్ డైమండ్.. దర్యాప్తు నివేదిక ఏం తేల్చిందో తెలుసా?

తిరుమల పింక్ డైమండ్ వివాదానికి దర్యాప్తు నివేదిక ఫుల్ స్టాప్ పెట్టేసింది. మునిరత్నం రెడ్డి నేతృత్వంలో ఆర్కియిలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ విషయంలో అసలు పింక్ డైమెండే లేదని విస్పష్టంగా తేల్చేసింది. మైసూర్ మహారాజు వెంకటేశ్వరుడికి సమర్పించిన నెక్లెస్‌లో ని పింక్ డైమెండ్ మాయం అయ్యిందంటూ 2018లో అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన పూజారి రమణదీక్షితులు ఆరోపించిన సంగతి తెలిసిందే.  ఆయన అప్పట్లో పింక్ డైమండ్ ను రహస్యంగా విదేశాలకు తరలించేశారని కూడా ఆరోపించారు. ఆయన ఆరోపణలు అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. భక్తులు సైతం శ్రీవారి ఆభరణాలకే భద్రత లేదా అన్న ఆందోళణ వ్యక్తం చేశారు. అప్పట్లో వైసీపీ అప్పటి అధికార తెలుగుదేశం ప్రభుత్వంపై ఈ విషయంలో తీవ్ర ఆరోపణలు చేసింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా ఆరోపణలు, విమర్శలు గుప్పించింది.  అయితే నాడు రమణదీక్షితులు చేసిన ఆరోపణలు శుద్ధ అబద్ధాలని ఇప్పుడు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తేల్చేసింది.  మైసూరు మహారాజా తిరుమల వేంకటేశ్వరుడికి సమర్పించిన నెక్లస్ లో పింక్ డైమండ్ లేనే లేదనీ, ఉన్నదల్లా కెంపులూ, రాళ్లేనని స్పష్టం చేసింది. తమ దర్యాప్తులో భాగంగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మైసూర్ ప్యాలెస్ రికార్డులను పరిశీలించింది. అలాగే మైసూర్ మహారాణి ప్రమోదాదేవినీ సంప్రదించింది. ఆ తరువాత ఆ నెక్లస్ లో అసలు పింక్ డైమండే లేదని నిర్ధారించి, ఆ మేరకు నివేదిక సమర్పించింది.  అంతే కాకుండా 2001లో గరుడ సేవ సందర్భంగా భక్తులు విసిరిన నాణేల కారణంగా నెక్లస్ లోని కెంపు దెబ్బతిని విరిగి ముక్కలైందనీ, ఆ విషయం అప్పట్లో అధికారికంగా నమోదైందనీ దర్యాప్తు నివేదిక పేర్కొంది. దాని ఆధారంతో పింక్ డైమండ్ అంటూ తప్పుడు ప్రచారం జరిగిందని స్పష్టం చేసింది.  

అమరావతిపై అలా.. మెడికల్ కాలేజీలపై ఇలా.. ఏందిది జగన్?!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో  ఐదేళ్లు అధికారంలో  ఉన్న జ‌గ‌న్  తాను సాధించిన అతి గొప్ప విజయంగా 17 కాలేజీలు నిర్మించానని తన భుజాలు తానే చరిచేసుకుంటూ ఉంటారు. ఆయన పార్టీకి కూడా చెప్పుకునేందుకు ఇది తప్ప మరొకటి కనిపించని పరిస్థితి ఉంది. అయితే వాస్తవం ఉమిటంటే.. జగన్ హయాంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం జరగలేదు. మహా అయితే ఓ   ఐదు కాలేజీల నిర్మాణం పూర్తయి ఉంటుంది. అలా పూర్తయిన కాలేజీలు కూడా పూర్తి స్థాయిలో పని చేయడం లేదు.  ఇక మిగిలిన కాలేజీల విషయానికి వస్తే భూ కేటాయింపులైతే జరిగాయి కానీ, నిర్మాణ పనులు ఆరంభం కాలేదు. కొన్ని కాలేజీలకు పునాదులు మాత్రమే పడ్డాయి. అంతే. ఐతే వైసీపీ మాత్రం 17 కాలేజీల నిర్మాణం తమ హయాంలో పూర్తయ్యిందని గప్పాలు కొట్టేసుకుంటున్నది. ఇదే విషయాన్ని జగన్ బుధవారం (సెప్టెంబర్ 10) మీడియా సమావేశంలో తన హయాంలో 17 కాలేజీల నిర్మాణం పూర్తయ్యిందని మరోమారు చెప్పుకుని, తన భుజం తానే చరుచుకుని చంద్రబాబు మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. సరే జగన్ విమర్శలకు మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారనుకోండి అది వేరు సంగతి. ఇప్పుడు విషయానికి వస్తే జగన్ ను మీడియా ప్రతినిథులు కాలేజీల నిర్మాణం పూర్తి కాలేదుగా అని అడిగితే.. జగన్ ఏ నిర్మాణమైనా ఒక్క రోజులో పూర్తి కాదు.. కొన్నేళ్ల సమయం పడుతుందంటూ జవాబిచ్చారు. ఇందుకు ఉదాహరణగా మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మాణానికి తొమ్మిదేళ్లు పట్టిందంటూ ఉదాహరణ చూపారు. మంగళగిరి ఎయిమ్స్ భారీ భవన సముదాయం. నిర్మాణానికి సమయం పట్టిందంటూ అర్ధం ఉంది. దానిని ఉదాహరణగా చూపుతూ మెడికల్ కాలేజీల నిర్మాణానికి కూడా సమయం పడుతుందంటూ జగన్ సమర్ధించుకోవాలని చూశారు. ఆయన సమర్ధింపు ఎలా ఉందంటే.. మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఐదేళ్ల సమయం సరిపోదన్నట్లుగా ఉంది.  ఈ లాజిక్ తో మీడియా నోరు మూసేశానని జగన్ సంబరపడి ఉండొచ్చు కానీ  2015లో అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఖ‌రార‌య్యాక త‌ర్వాతి నాలుగేళ్ల‌లో రాజ‌ధాని పూర్తి కాలేదంటూ అప్పట్లో జగన్ కురిపించిన విమర్శల మాటేంటన్న ప్రశ్నకు ఆయన ఏం సమాధానం చెబుతారు.  40 వేల కోట్ల‌కు పైగా వ్యయంతో పలు భారీ భవనాలు దాదాపు పూర్తి అయినా అప్పట్లో అమరావతిలో గ్రాఫిక్స్ తప్ప ఏం లేదంటూ చేసిన వ్యాఖ్యల సంగతేంటని నెటిజనులు ఓ రేంజ్ లో జగన్ ను ట్రోల్ చేస్తున్నారు. ఏడు మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఐదేళ్లు  ఎలా సరిపోతాయంటూ తర్కం మాట్లాడుతున్న జగన్.. అమరావతిపై నిర్మాణాలపై అప్పట్లో చేసిన వ్యాఖ్యలు, విమర్శలకు ఏం లాజిక్ చెబుతారని నిలదీస్తున్నారు.  

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముఖ్య అనుచరుడి దారుణ హత్య

అమెరికాలో రాజకీయ హింసకు ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముఖ్య అనుచరుడు ఒకరు బలయ్యారు. ట్రంప్ అనుచరుడు, కన్జర్వేటివ్ కార్యకర్త చార్లీ కిర్క్ బుధవారం (సెప్టెంబర్ 10) ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఈ హత్య జరిగింది. వివరాల్లోకి వెడితే  తన ఆధ్వర్యంలో పని చేసే టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ అనే యువజన సంస్థ  ఓరెమ్‌ నగరంలోని ఉటా వ్యాలీ యూనివర్సిటీలో  ఏర్పాటు చేసిన ఒక చర్చా కార్యక్రమంలో  చార్లీ కిర్క్ పాల్గొన్నారు.   ఈ సందర్భంగా ఒక వ్యక్తి తుపాకీ హింసకు సంబంధించి ప్రశ్నలు అడుగుతుండగా, కిర్క్ సమాధానం ఇస్తున్నారు. ఇంతలోనే ఒక్కసారిగా తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. ఒకే ఒక్క తూటా కిర్క్ మెడ ఎడమ భాగంలోకి దూసుకెళ్లడంతో ఆయన కుప్పకూలిపోయారు. తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ హఠాత్ పరిణామంతో అక్కడున్న వారు భయంతో పరుగులు తీశారు. ఈ సంఘటనకు సంబంధించి తొలుత ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నప్పటికీ అతడు నిందితుడు కాదని తేలింది. హంతకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. చార్లీ కిర్క్ ఒక గొప్ప వ్యక్తి, అమెరికా యువత హృదయాన్ని ఆయన అర్థం చేసుకున్నంతగా మరెవరూ చేసుకోలేరు అంటూ డోనాల్డ్ ట్రంప్ నివాళులర్పించారు.   

ప్రైవేటీకరణకు.. పీపీపీకి తేడా తెలియని జగన్.. మంత్రి లోకేష్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అజ్ణానానికి, అవగాహనా రాహిత్యానికీ నిలువెత్తు సాక్ష్యం ఆయన బుధవారం (సెప్టెంబర్ 10) మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలేనని మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ప్రైవేటీకరణకు, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వా మ్యం(పీపీపీ)కి మధ్య వ్యత్యాసం తెలియదని లోకేష్ అన్నారు. సచివాలయంలో బుధవారం (సెప్టెంబర్ 10)న మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో వైద్య కళాశాలల అభివృద్ధి కోసం తాము పీపీపీ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. వైసీపీ హయాంలో వైద్య కళాశాలలకు కనీసం పునాదులు కూడా వేయలేదని ఆయన తెలిపారు.   కానీ ఇప్పుడు జగన్ తన హయాంలో మెడికల్ కాలేజీలు కట్టేశామని గప్పాలు కొట్టుకుంటున్నారని లోకేష్ విమర్శించారు. జగన్ కు అవగాహన లేకపోతే పోయింది.. ఆయన సలహాదారులను అడిగైనా వాస్తవం ఏమిటో ఆయన తెలుసుకుంటే మంచిదని సూచించారు.  వైద్యకళాశాలలను పూర్తి చేయడం, ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందజేయడమే మా ప్రభుత్వ లక్ష్యమని లోకేష్ అన్నారు.  

కూకట్ పల్లిలో మహిళ దారుణ హత్య

మైనర్ బాలిక సహస్ర హత్య ఉతంతాన్ని మరిచిపోకముందే అలాంటి ఘటనే మరొకటి కూకట్ పల్లిలో  జరిగింది. కూకట్పల్లిలోని ఒక గేటెడ్ కమ్యూనిటీ లోని 13వ అంతస్తు లో ఒక మహిళను అతి దారుణంగా హత్య చేశారు.  కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేసి కుక్కర్ తో  తలపై గట్టిగా మోది అతి కిరాతకంగా హత్య చేశారు. నెలరోజుల కిందట కార్మికులుగా వచ్చిన జార్ఖండ్ వాసులే ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు మహిళ హత్య తర్వాత జార్ఖండ్ వాసులు కనిపించ కపోవడంతో వారిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. కూకట్పల్లిలోని లేక్ స్పాన్ అపార్ట్మెంట్ లో 13 వ అంతస్తు లో రేణు అగర్వాల్(50) అనే మహిళ తన భర్త , కొడుకు తో కలిసి నివాసం ఉంటున్నారు. రేణు అగర్వాల్ భర్త , కొడుకు వ్యాపారం చేస్తుంటారు. ఇంటిలో పని కోసమని ఝార్ఖండ్ నుంచి హర్ష, రోహన్  లను తీసుకొని వచ్చారు.  ఈ ఇద్దరు కార్మికులు నెల రోజుల నుంచి వీరితో పాటే నివాసం ఉంటు న్నారు. కాగా బుధవారం (సెప్టెంబర్ 10) ఉదయం యధాప్రకారం రేణు అగర్వాల్ భర్త, కుమారుడు  షాపుకు వెళ్లిపోయారు. సాయంత్రం నుంచి రేణు అగర్వాల్  ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఏడు గంటల సమయంలో భర్త , కొడుకు ఇంటికి వచ్చారు.ఎంత కొట్టినా   తలుపులు తెరవక పోవడంతో.. భర్తవెంటనే బ్యాక్ డోర్ నుంచి లోపలికి ఒకరిని  పంపించి తలుపులు ఓపెన్ చేయించి చూడగా...ఇంటి హాల్ లో రేణు అగర్వాల్ రక్తం మడుగులో పడి ఉన్నారు.  కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొ ని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమేరా ఫుటేజీల ఆధారంగా  హర్ష, రోహన్ లు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వారిరువురూ బైక్ పై బ్యాగ్ తీసు కొని వెడుతన దృశ్యాలు  సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి.  వాటిని ఆధారంగా వారిని పట్టుకునేందుకు ఇద్దరినీ పట్టుకు నేందుకు పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. 

కాకినాడ ఎంపీ పేరుతో సైబర్ నేరగాళ్ల టోకరా!

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త మార్గాలలో సొమ్ములను కొట్టేస్తున్నారు. వీరి సైబర్ నేరాలకు సామాన్యులే కాదు బడాబాబులు కూడా బలౌతున్నారు. తాజాగా వాట్సాప్ డీపీ మార్చి మోసాలకు పాల్పడుతున్న ఉదంతం వెలుగులోనికి వచ్చింది. ఈ సారి సైబర్ నేరగాళ్ల వలకు చిక్కుకున్నది ఏకంగా కాకిడాన ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ సిబ్బంది. కాకినాడ జనసేన ఎంపి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ పేరుతో సైబర్ నేరగాళ్లు మోసం చేసి  ఏకంగా 92.5 లక్షలు కొల్లగొట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది.  తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ టీ టైమ్ వ్యవస్థాపకుడు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాకినాడ లోక్ సభ స్థానం నుంచి  జనసేన అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అయితే తాజాగా సిఎఫ్ఓ శ్రీనివాసరావు గంగిశెట్టి కి ఆగస్టు 22వ తేదీన ఓ సైబర్ మోసగాడు వాట్సాప్ లో కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకుని మెసేజ్ చేశాడు.అది కొత్త నెంబర్ అని ఎంపీ లాగా  నేరగాడు పరిచయం చేసుకున్నాడు. దీంతో అది తన బాస్ ఉదయ శ్రీనివాస్ నెంబర్ అని సీఎఫ్ వో  శ్రీనివాసులు   నమ్మారు. ఈ క్రమంలో ఆ సైబర్ మోసగాడు ఎంపీ ఉదయ శ్రీనివాస్ పేరు చెప్పి అత్యవసరంగా డబ్బులు కావాలని వండర్లా బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు పంపించమని చెప్పాడు. శ్రీనివాసరావు కూడా తన యజమాని డబ్బులు పంపమ న్నడని భావించి.. డబ్బులు పంపించాడు.ఇలా ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా 11 సార్లు ఎంపీ పేరు చెప్పి రూ.92.5 లక్షలు వసూలు చేశారు.  అయితే ఈ నెల 8న ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాసులు   సిఎఫ్ఓ శ్రీనివాస రావు కలుసుకోవ డంతో అసలు విషయం బయట పడింది. డబ్బులు పంపమని తానెన్నడూ కోరలేదని ఎంపీ చెప్పడంతో  ఇది సైబర్ మోసమని  గుర్తించిన   శ్రీనివాసరావు  వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఎంపీ పేరుతో ఈ మోసం జరగడంతో  దీంతో హైదరాబాద్ లోని సైబరాబాద్ పోలీసులు  సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేశారు. ఇప్పటివరకు పోలీ సులు ఏడు లక్షల రూపాయలను మాత్రమే ఫ్రీజ్ చేయగలిగారు. మిగిలిన డబ్బును వెనక్కి తీసుకురా వడానికి పోలీసులు ప్రయత్ని స్తున్నారు. పోలీసులు ఒకవైపు డబ్బులు ఎవరి బ్యాంకు ఖాతాల్లోకి వెళ్లాయో తెలుసు కునేందుకు బ్యాంక్ రికార్డులు, కాల్ డేటా రికార్డులు, ఐపీ అడ్రస్ లను పరిశీలిస్తూనే.... మరోవైపు  నిందితు లను పట్టుకునేం దుకు ప్రయత్నం చేస్తున్నారు. 

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిట లాడుతుంటుంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉంటారు. అదే విధంగా గురువారం (సెప్టెంబర్ 11) కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 22 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకేన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక బుధవారం (సెప్టెంబర్ 10) శ్రీవారిని మొత్తం 70 వేల 86 మంది దర్శించుకున్నారు. వారిలో 28 వేల 239 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 56 లక్షల రూపాయలు వచ్చింది. 

నేపాల్‌లో చిక్కుకున్నవారిని తీసుకొచ్చే బాధ్యత మాదే : లోకేష్

  నేపాల్‌లో 12 ప్రాంతాల్లో  217 మంది ఏపీ పర్యాటకులు చిక్కుకున్నారని మంత్రి లోకేశ్ తెలిపారు. వీరంతా 12 ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించామని లోకేశ్ పేర్కొన్నారు. తొలి విడతలో బీహార్ బార్డర్‌కు 22 మందిని తరలించామని వెల్లడించారు. రేపు ఖాట్మండులో కర్య్ఫూ సడలించగానే 173 మందిని ప్రత్యేక విమానంలో తీసుకోస్తామని లోకేశ్ తెలిపారు.నేపాల్‌లోని తెలుగువారి పరిస్థితులపై మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు.‘ ‘సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నేపాల్‌లో ఉన్న వారిని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. అక్కడ ఉన్న రాష్ట్ర వాసులతో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నాం. ఏపీ భవన్‌లో టోల్‌ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు చేసి నేపాల్‌లోని తెలుగువారిని గుర్తించామన్నారు. నేపాల్‌ అల్లర్ల నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన ఏపీ వాసులను సురక్షితంగా వారి స్వస్థలాలకు తీసుకొస్తామని తెలిపారు. నేపాల్‌లో ఉన్న ప్రతి ఆంధ్రుడు ఏపీకి చేరేలా ప్రయత్నిస్తున్నాం. నేపాల్‌ నుంచి వచ్చే ప్రత్యేక విమానం విశాఖ, కడపకు చేరుకుంటుంది’’ అని మంత్రి వివరించారు.  

ఇది రాష్ట్ర క‌మిటీ కాదు...కిష‌న్ రెడ్డి క‌మిటీ!

  బీజేపీలో క‌మిటీల క‌ల‌హం మొద‌లైంది. రాష్ట్రానికి కొత్త అధ‌క్షుడొచ్చాడ‌న్న కొత్త ఆశే లేకుండా పోయింది. పాత కొత్త‌ల మేలు క‌ల‌యిక‌గా ఉండాల్సిన పార్టీ జ‌ట్టు కూర్పు కాస్తా ఏక‌ప‌క్షం అయిపోయింది. ఒక ద‌శ‌లో మాజీ బీజేపీ నేత‌, ఎమ్మెల్యే రాజాసింగ్ అయితే ఇది స్టేట్ క‌మిటీనా? సికింద్రాబాద్ క‌మిటీనా? అంటూ తేల్చేశారు. ఆయ‌న అన్న‌ట్టుగానే స్టేట్ బీజేపీలో సికింద్రాబాద్ నుంచి ఏకంగా 11 మందిని తీసుకున్నారు. దీంతో రాజాసింగ్ ఈ కామెంట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. త‌మ‌కు త‌గిన ప్రాధాన్య‌త‌నివ్వ‌క పోవ‌డంతో.. రాజాసింగ్ లాంటి చాలా మంది ఆయ‌న బాట‌లో న‌డిచే అవ‌కాశ‌ముంద‌న్న మాట వినిపిస్తోంది. అయితే ఇదేమీ త‌న మార్క్ టీమ్ కాదంటారు రామ‌చంద్ర‌రావు. ఇది బీజేపీ మార్క్ టీం. ఈ టీమ్ తోనే తాము వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తామ‌ని ఘంటా ప‌దంగా చెప్పారాయ‌న‌. అంతే కాదు.. ఇలాంటి అసంతృప్తులూ ఉంటూనే ఉంటాయి. ఇందులో ఆశ్చ‌ర్య పోవ‌ల్సిన అవ‌స‌రం లేదు. రాజాసింగ్ లాంటి వారు విమ‌ర్శిస్తూనే ఉంటార‌ని కామెంట్ చేశారు టీబీజేపీ చీఫ్ రామ‌చంద్ర‌రావు. ముగ్గురు ఎంపీలున్న ఉత్త‌ర తెలంగాణ జిల్లాలైన క‌రీంన‌గ‌ర్, మెద‌క్, ఆదిలాబాద్ నుంచి క‌నీసం ఒక్క‌రు కూడా క‌మిటీలో లేక పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వ‌రంగ‌ల్ పార్ల‌మెంట్ స్థానం ప‌రిధిలోని నేత‌ల‌కు క‌నీస ప్రాతినిథ్యం లేకుండా  పోయింద‌ని వాపోతున్నారీ ప్రాంత వాసులు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలున్నారు. వీరు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న ప్రాంతాల్లో గ‌త ఎన్నిక‌ల్లో క‌ష్ట‌ప‌డ్డ ఎంద‌రో లీడ‌ర్ల పేర్లు క‌మిటీలో పెట్టాల‌న్న ప‌ప్ర‌తిపాద‌న‌లు అందాయి. బండి సంజ‌య్, ధ‌ర్మ‌పురి అర‌వింద్ వంటి వారు నేరుగా రామ‌చంద్ర‌రావు ముంద‌టే చెప్పారు. మా వాళ్ల‌కు త‌గిన చోటు క‌ల్పించాల్సిందేన‌ని.. కానీ, ఎలాంటి క‌నిక‌రం చూపిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. ఇక ఎమ్మెల్యేలు కూడా ఇదే ర‌క‌మైన సిఫార్సులు చేశారు. వీరెవ‌రి ప్ర‌తిపాద‌న‌లు కూడా ప‌ట్టించుకోలేదు. అన్నీ బుట్ట‌దాఖ‌ల‌యిన‌ట్టు తెలుస్తోంది. క‌మిటీ మొత్తం మాజీ స్టేట్ ప్రెసిడెంట్ కిష‌న్ రెడ్డి, ఆపై రాష్ట్ర ఇంఛార్జ్ సునీల్ భ‌న్స‌ల్ స‌న్నిహితుల‌తో నిండిపోయినట్టు క‌నిపిస్తోంది. వీరితో పాటు రాష్ట్ర సంఘ‌ట‌న్ కార్య‌ద‌ర్శిగా ప‌ని  చేసిన ఒక నేత‌తో పాటు.. పార్టీ ఆర్ధిక వ్య‌వ‌హారాలు చూసిన ఒక ఒక ప్రొఫెస‌ర్ సూచ‌న‌లు సైతం కీల‌కంగా ప‌ని చేసిన‌ట్టు అంచ‌నా వేస్తున్నారు. గ‌తంలో రాష్ట్ర అధ్య‌క్షుడిగా  ప‌ని చేసిన బండి సంజ‌య్ మాట‌ను క‌నీసం ప‌ట్టించుకోలేద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయ్. ఎంపీలు డీకే అరుణ‌, ర‌ఘునంద‌న్ రావు, ఈట‌ల‌, కొండా, గోడం న‌గేశ్ వంటి వారి స‌ల‌హా సూచ‌న‌లేవీ ప‌ట్టించుకున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. వీరంతా తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి పార్టీ అధిష్టానం నుంచి వ‌చ్చిన ఒక నేత‌కు ఫుట్ బాల్ బ‌హుమ‌తిగా ఇచ్చి త‌న నిర‌స‌న వ్య‌క్తం చేసిన ప‌రిస్థితి.  ఇదిలా ఉంటే ఒక ప‌క్క కాంగ్రెస్ బీసీ బిల్లు అంటూ నానా హంగామా చేస్తోంటే.. ఎప్ప‌టిలాగానే బీసీల‌కు బొత్తిగా మొండి చేయి చూపించింది బీజేపీ రాష్ట్ర క‌మిటీ. బేసిగ్గా క‌మిటీలో 40 శాతం పాత వారికి చోటివ్వాల్సి ఉంది. కానీప్ర‌స్తుత జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా ఎన్నికైన ముగ్గురూ కొత్త‌వారే. బండి వ‌ర్గీయులుగా పేరుబ‌డ్డ గీతామూర్తి, మ‌నోహ‌ర్ రెడ్డి, రామ‌కృష్ణారెడ్డి, ఆంజ‌నేయులు, రాణీరుద్ర‌మ‌కు క‌మిటీలో చోటు ద‌క్క‌లేదు. మ‌రోప‌క్క అర‌వింద్, ఈట‌ల సూచించిన పేర్ల‌ను సైతం ప‌క్క‌న పెట్టిన‌ట్టు తెలుస్తోంది. 11 ఓసీలుంటే ఇందులో న‌లుగురు బ్రాహ్మ‌ణులు, న‌లుగురు రెడ్లకు అవ‌కాశం ఇచ్చారు. బీసీవాదుల‌మ‌ని చెప్పుకుంటూనే క‌నీసం స‌గం మందికి కూడా క‌మిటీలో ప్ర‌యారిటీ ఇవ్వలేద‌న్న వాద‌న వినిపిస్తోంది. దీంతో ఈ  ప‌రిణామాలు ఎలా దారి తీస్తాయో తెలీడం లేద‌ని అంటున్నారు. అందుకే రాజాసింగ్ దీన్ని సికింద్ర‌బాద్ ఎంపీ కిష‌న్ రెడ్డి క‌మిటీగా  కామెంట్ చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. కిష‌న్ రెడ్డి మాట ఇంకా చెల్లుబాటు కావ‌డం అంటే అది తిరిగి పాత బీజేపీగానే వెన‌క‌బ‌డి ఉంటుంది త‌ప్ప కొత్తద‌నం అంటూ ఏమీ ఉండ‌దు.. ముందుకెళ్ల‌డం అంత‌క‌న్నా జ‌ర‌గ‌ద‌న్న కామెంట్ వినిపిస్తోంది. రాజాసింగ్ మాట‌ల‌ను అనుస‌రించి చెబితే ఆయ‌న‌కు అధికారంలోకి పార్టీ రావ‌డం క‌న్నా.. ఎవ‌రు అధికారంలో  ఉంటారో వారి ద్వారా ప‌నులు చ‌క్క‌బెట్ట‌డం బాగా తెలుసు కాబ‌ట్టి.. ఇది ముందుకెళ్లే క‌మిటీ కాదు.. వెన‌కెన‌క దాగి సొంత ప‌నులు  చేయించుకునే క‌మిటీగా కొంద‌రు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

అగ్నివీర్ అరెస్ట్ . ముంబై నేవీకి చిక్కిన ఇద్దరు అగంతకులు

  అతను ఒక అగ్ని వీర్.. నావి అగ్ని వీర్ గా సెలెక్ట్ అయ్యాడు.. ముంబై నేవీ ప్రధాన కేంద్రంలో పనిచేస్తు న్నాడు ..ఇటీవల కాలంలో అతన్ని ముంబై నుంచి కేరళకు బదిలీ చేశారు.. కారణాలు ఏంటో తెలియదు.. కానీ ముంబై నుంచి కేరళ కి వెళ్లి డ్యూటీలో జాయిన్ అయి వచ్చాడు .. ఇక్కడ వరకు బాగానే ఉంది ..కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది.. రెండు రోజుల క్రితం నేవీ ముంబై ప్రధాన కేంద్రానికి తిరిగి ఈ అగ్ని వీరు వెళ్లారు.. ఈసారి ఏకంగా యూనిఫాంలో పోయాడు..రాత్రి సమయంలో వెళ్లిన ఈ నావి అధికారి ఉమేష్, సెంట్రీ పోస్ట్ లోకి ఎంటర్ అయ్యాడు ..డ్యూటీ చేంజ్ అయ్యే సమయం ..అక్కడ డ్యూటీలో ఉన్న గార్డ్ దగ్గరికి వెళ్లి తాను డ్యూటీలో చేరుతున్నానని నీకు రిలీవ్ ఇస్తున్నానని చెప్పాడు.. 10 గంటల సమయం లో అక్కడ ఉన్న గార్డ్ రిలీవ్ అయి పోయి...నావి అధికారి ఉమేష్ కి బాధ్యతలు అప్పగించాడు. ఆ సమయంలో అతను దగ్గర ఉన్న ఒక ఇన్సాస్ వేపన్ తో పాటు 40 బుల్లెట్స్  కూడా ఉమేష్ కి అప్పగించి సదర్ అధికారి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ..అయితే ఉమేష్  తో పాటు రాకేష్ ని కూడా తన వెంట తెచ్చుకున్నాడు ..రాకేష్ ని గేటు పక్కన నిలబెట్టాడు.. ఉమేష్ చేతిలోకి వెపన్ తోపాటు బుల్లెట్లు రాగానే అక్కడ అధికారుల కళ్ళు కప్పి పక్కనే.. అప్పటికే అక్కడ ఉన్న రాకేష్ కి వెపన్ ఇచ్చేశాడు. కొద్దిసేపు పాటు అక్కడ గార్డ్ డ్యూటీ చేస్తున్నట్లుగా నటించాడు.. ఆ తర్వాత అక్కడి నుంచి మాయమై పోయాడు.. నేవీ ప్రధాన కార్యాల యంలో కొట్టేసిన ఇన్సాస్ వెపన్ తో పాటు బుల్లెట్స్ ను తీసుకొని ఈ ఇద్దరు  చత్రపతి శివాజీ రైల్వే స్టేషన్ కు  చేరుకున్నారు.  అక్కడ ట్రైన్ ఎక్కేసి నేరుగా హైదరాబాద్ వచ్చాడు... హైదరాబాద్ నుంచి తన సొంత ఊరైన ఆసిఫాబాద్ ఎలుక పల్లి కి చేరుకున్నాడు.. తాను తెచ్చిన వెపన్స్  తమ్ముడికి  ఇచ్చి వేశాడు .. డ్యూటీలో ఉండాల్సిన గార్డు అక్కడ లేకపోవడంతో అధికారు లకు అనుమానం వచ్చింది.. వెంటనే రిలీవ్ అయిన అధికారిని పిలిపించారు. మరొకరికి డ్యూటీ బాధ్యతలు అప్ప గించి వెళ్ళిపోయా నని చెప్పాడు.. అక్కడ ఉన్న సీసీ కెమెరాలు పరిశీలిస్తే ఉమేష్ గన్‌తో సహా వెళ్లిపోయి నట్లుగా విషయం బయటపడింది .. దీంతో ఇది ఉగ్రవాద కుట్ర ఏదో జరగబోతుందని అనుమానం అధికారులకు వచ్చింది ..వెంటనే నేవీ ఇంటెలిజెన్స్ అధికారులతో  పాటు ముంబై ఏటిఎస్ , ఎన్‌ఐ రంగంలోకి దిగారు. చివరికి ఆసిఫా బాద్‌లో ఉమేష్ వెప్పన్‌తో సహా చిక్కాడు..తెలంగాణ పోలీసులు ఉమేష్, రాకేష్ ను పట్టుకొని ముంబై పోలీసులకు అప్పగించారు.. అయితే ఉమేష్ ఈ వెపన్ దొంగలించ డానికి అసలు కారణం ఏంటి? అనేదానిపై  అధికారులు ఆరా తీస్తున్నారు. మావోయిస్టు లేదంటే ఉగ్రవాదులతో ఉమేష్ కి సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ జరుగుతుంది..  

రాష్ట్రంలో పిడుగుపాటుకు ఐదుగురు మృతి

  రాష్ట్రంలో పలు చోట్ల పిడుగుపాటుకు ఐదుగురు మృతి చెందారు. గద్వాల జిల్లా అయిజ మండలం భూంపురం శివారులో వర్షం పడుతుందటంతో వ్యవసాయ కూలీలు చెట్టు కిందకు చేరారు. ఈ క్రమంలో పిడుగు పడడంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.  వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించి పార్వతమ్మ(22), సర్వేశ్(20), సౌభాగ్యమ్మ(40) అనే ముగ్గురు మృతి మరణించారు. మరోవైపు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో గేదెలను కాస్తున్న మహేష్(26), మధిరలో వీరభద్రరావు(56) అనే మరో ఇద్దరు పిడుగుపాటుకు మృతి చెందారు తెలంగాణ రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురు, శుక్రవారాల్లో ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, రానున్న నాలుగు రోజులు హైదరాబాద్‌లోనూ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఎంత ట్రంప‌రిత‌నం?

  ఉద‌యం ఉన్న మాట మ‌ధ్యాహ్నానికి.. మ‌ధ్యాహ్నం మాట సాయంత్రానికి ఉండ‌టం లేదు. ద‌టీజ్ ట్రంప్. ట్రంప్ ఒక మాట మీద ఎంత మాత్రం నిల‌క‌డ చూపించ‌డం లేదు. ఆయ‌న బేసిగ్గానే అంతేనా?  లేక భార‌త్ అంటేనే అలా చేస్తున్నారా? ఏం తెలీడం లేదు.  యాభై శాతం సుంకాల విష‌యంలో.. భార‌త ప్ర‌ధాని త‌న‌తో ఎప్పుడు మాట్లాడ‌తాడా? అని తాను ఎదురు చూస్తున్న‌ట్టు చెప్పారు ట్రంప్. ఈ దిశ‌గా త‌న ట్రూత్ పోస్ట్ లో కామెంట్  చేశారు కూడా.  మోడీ కూడా స‌రిగ్గా ఇలాగే రియాక్ట‌య్యారు. భార‌త్ యూఎస్ మంచి ఫ్రెండ్స్ అన్నారు.  క‌ట్  చేస్తే సాయంత్రానిక‌ల్లా ట్రంప్ చేసిన కామెంట్ ఏంటంటే.. భార‌త్. చైనాల‌పై 100 శాతం సుంకాలు విధించ‌మ‌ని యురోపియ‌న్ యూనియ‌న్ కి సూచించారు. ఉద‌యం మోడీ  తాను మంచి మిత్రులం అన‌డం ఏంటి? ఆయ‌న‌తో ఎప్పుడు మాట్లాడ‌దామా? అని ఎదురు చూస్తున్న‌ట్టు చెప్ప‌డ‌మేంటి? స‌డెన్ గా యురోపియ‌న్ యూనియ‌న్ కి ఇలా సూచించ‌డ‌మేంటి? ఇది ట్రంప్ త‌ప్పా? లేక ట్రంప్ ని మోడీయే స‌రిగా హ్యాండిల్ చేయ‌లేక పోతున్నారా? ఏమీ అర్ధం కావ‌డం లేదంటారు విదేశాంగ నిపుణులు. స‌రే ఇదంతా ఎందుక‌ని చూస్తే.. ర‌ష్యాను కంట్రోల్ చేయ‌డానిక‌ట‌. ఉక్రెయిన్ లో వీలైనంత త్వ‌ర‌గా శాంతి స్థాప‌న జ‌ర‌గాల‌న్న‌ది స‌గ‌టు యురోపియ‌న్ దేశాల అభిమ‌తమ‌ట‌. అయితే వీరికి ట్రంప్ ఇస్తున్న సూచ‌న ఏంటంటే.. భార‌త్. చైనాల‌పై వంద శాతం సుంకాలు విధిస్తే మొత్తం సెట్ అయిపోతుంద‌న‌డం.  ఇదెక్క‌డి విడ్డూర‌మో ఎవ‌రికీ అర్ధం కావ‌డం లేదు. మొన్న‌టికి మొన్న అల‌స్కాలో ఇదే ట్రంప్ పుతిన్ ని క‌లిశారు. చ‌ర్చించారు. ఆ స‌మ‌యంలో తాను అనుకున్న‌ది అనుకున్న‌ట్టు ఆయ‌న చేత చేయించ‌కుండా..ఈ ఇన్ డైరెక్ట్ సెన్స్ లో అర్ధ‌మేంటి? పుతిన్ త‌న‌కు ఎంతో మంచి మిత్రుడ‌ని చెబుతూ కూడా ఆయ‌న్ను దారికి తెచ్చుకోలేక పోవ‌డ‌మేంటి? ర‌ష్యాకు భార‌త్ చ‌మురు కొనుగోలు చేయ‌డం వ‌ల్ల ఆ ఆర్ధిక శ‌క్తితో ఆ దేశం ఉక్రెయిన్ తో యుద్ధం కొన‌సాగించ‌గ‌లుగుతోంద‌న‌డం ఏంటి? నిజానికి భార‌త్ ర‌ష్యా నుంచి కొంటున్న ఆయిల్ వ‌ల్ల వ‌చ్చే లాభం కేవ‌లం తొంభై ఐదు వేల కోట్ల రూపాయ‌లు. దీని ద్వారా క్రూడ్ ఆయిల్ ధ‌ర‌లు ప్ర‌పంచ వ్యాప్తంగా కంట్రోల్లో ఉంటాయి. ఇందు వ‌ల్లే భార‌త్ ర‌ష్యా నుంచి ఆయిల్ కొంటోంది. మోకాలికీ బోడిగుండుకూ లింకు పెట్టిన‌ట్టు ఏంటీ ట్రంప‌రిత‌నం??? అన్న‌ది ఎవరికీ అంతు చిక్క‌డం లేదు.

చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి బిగ్ షాక్

  వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి షాక్ తగిలింది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డికి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు కోట్టివేసింది. చెవిరెడ్డికి బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందన్న ప్రాసిక్యూషన్‌తో కోర్టు ఏకీభవించింది.  ఈ కేసులో 34వ నిందితుడిగా ఉన్న ఆయన ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్నారు. దీంతో బెయిల్ ఇవ్వాలని తరచూ కోరుతున్నారు.  ఈ మేరకు ఆయన బెయిల్ పిటిషన్లు పలుమార్లు తిరస్కరణకు గురయ్యాయి. ఈ సారి అయినా బెయిల్ వస్తుందని ఆశలు పెట్టుకున్న ఆయనకు ధర్మాసనం బిగ్ షాక్ ఇచ్చింది. చెవిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.

నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీలా కర్కి !

  తాత్కాలిక ప్రధానమంత్రిగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కీని  ఆందోళనకారులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. నిరసనకారులతో వర్చువల్‌గా సమావేశమైన సుశీల ప్రభుత్వాధినేతగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఆమె నేతృత్వంలో ఆర్మీ చీఫ్‌తో చర్చలకు నిరసనకారులు సిద్ధమయ్యారు. రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఉన్న యువత ఈ చర్చల్లో పాల్గొనొద్దన్న నిబంధనలకు జెన్ జీ అంగీకరించినట్లు తెలుస్తోంది.సుశీలా నేపాల్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. జనరల్-జెడ్ వర్చువల్ సమావేశంలో దీనిపై ఏకాభిప్రాయం కుదిరింది. సమాచారం ప్రకారం, దాదాపు 5000 మంది వర్చువల్ సమావేశానికి హాజరయ్యారు. సుశీలా కర్కి నేపాల్ మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి. ఆమె జూన్ 7, 1952న మొరాంగ్ జిల్లాలోని బిరత్‌నగర్‌లో జన్మించారు. ఆమె మహేంద్ర మొరాంగ్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. దీని తరువాత, ఆమె నేపాల్ త్రిభువన్ విశ్వవిద్యాలయం నుండి న్యాయ పట్టా పొందింది.  

తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు

  ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ హైదరాబాద్ సహ పలు జిల్లాల్లో వర్షం కురిసింది. రేపు, ఎల్లుండి ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా రాబోయే నాలుగు రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొన్నాది. హైదరాబాద్‌లో వచ్చే నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.  కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఏపీలోని నంద్యాల, వైజాగ్, అనకాపల్లి, జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. గురువారం తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కి.మీ. వేగంతో గాలులు వీయొచ్చని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్‌ హెచ్చరించారు. 

బీజేపీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం చేస్తా : రాజాసింగ్

  గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు వెనుక కొందరు ఉండి బీజేపీని నడిపిస్తున్నారని తెలిపారు. ఆయన రబ్బరు స్టాంప్ మాత్రమే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రాజీనామా చేయాలి నేను కూడా రాజీనామా చేస్తానని తెలిపారు. ఇద్దరు స్వతంత్రులుగా పోటీ చేద్దామని సవాల్ విసిరారు. ప్రజలు ఎవరిని గెలిపిస్తారో తెలుస్తుంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తా అని తెలిపారు.  తనను వరుసగా మూడుసార్లు గోషామహల్ నియోజకవర్గ ప్రజలే గెలిపించారని అన్నారు. రాష్ట్రస్థాయి బీజేపీ తనకు ఏ విధమైన మద్దతు ఇవ్వలేదని విమర్శించారు. ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా ఇచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. తాను చెప్పిన మాటల్లో ఏమైనా తప్పు ఉందా అంటే బీజేపీ కార్యకర్తలను అడిగి తెలుసుకోవచ్చునని అన్నారు. తనకు ఢిల్లీ పెద్దలు తరుచూ ఫోన్ చేసి మాట్లాడుతారని, తనకు అధిష్ఠానం పెద్దల ఆశీర్వాదం ఉందని ఆయన అన్నారు. వాళ్లను కలిసి పార్టీలో జరిగిందంతా చెబుతానని వ్యాఖ్యానించారు. తాను ఎప్పటికీ బీజేపీ నేతనేనని, కానీ సెక్యులర్ వాదిని మాత్రం కానని స్పష్టం చేశారు. తాను బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో చేరేది లేదని తేల్చి చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినందుకు యోగి ఆదిత్యనాథ్ తనకు ఫోన్ చేసి తిట్టారని అన్నారు. తాను చేసే కామెంట్స్ పార్టీపై కాదని, కొందరు నేతలపై మాత్రమే అన్నారు. కార్యకర్తలు ఆందోళన చెందవద్దని, ఢిల్లీ పెద్దలు పిలిస్తే వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు.   

దసరా రోజున ఆటో డ్రైవర్‌కు రూ.15వేలు : సీఎం చంద్రబాబు

  పేదవాడి ఆకలి తీర్చాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు పెట్టామని సీఎం చంద్రబాబు అన్నారు. సూపర్‌ సిక్స్‌.. సూపర్‌ హిట్‌’ పేరిట కూటమి పార్టీల ఆధ్వర్యంలో అనంతపురంలో నిర్వహించిన బహిరంగసభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. దసరా రోజున వాహన మిత్ర పథకం ప్రారంభించి.. ఒక్కో ఆటో డ్రైవర్‌కు రూ.15వేలు చొప్పున ఇస్తామని చంద్రబాబు తెలిపారు. ఎన్నికల్లో చెప్పాం... ఎన్ని కష్టాలున్నా అమలు చేస్తామని సీఎం తెలిపారు. సంక్షేమం అంటే ఓట్ల రాజకీయం కాదు. సంక్షేమం అంటే పేదల జీవితాలు మారాలని సీఎం తెలిపారు. అందుకే అన్ని వర్గాలతో చర్చించి 2024 ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలు తెచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు   2023, మే నెల 28న రాజమండ్రి మహానాడులో సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించామని సూపర్ సిక్స్ హామీలతో పాటు ఉమ్మడిగా కూటమి మేనిఫెస్టోతో ఎన్నికలకు వెళ్లి  ప్రజా తీర్పు కోరామని తెలిపారు. 2024 ఎన్నికలు చరిత్రను తిరగరాశాయి. కనీ వినీ ఎరుగని రీతిలో 57 శాతం ఓట్ షేర్, 93 శాతం స్ట్రైక్ రేట్‌తో 164 అసెంబ్లీ సీట్లు, 21 లోక్‌సభ సీట్లు గెలుచుకున్నామని చంద్రబాబు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రజావేదిక కూల్చివేతతో పాలన మొదలు పెట్టి రాష్ట్రాన్ని అగాథంలోకి నెట్టివేసిందని చంద్రబాబు అన్నారు. రూ. 10 లక్షల కోట్ల అప్పులు, తప్పులు, పాపాలు, అక్రమాలు, వేధింపులు, దోపిడీలు, దౌర్జన్యాలు, మహిళలపై దురాగతాలు, అవినీతితో అంతటా అశాంతి, అభద్రత కలిగించారని ఆయన పేర్కొన్నారు.      ప్రతి పేద బిడ్డా చదవాలని తల్లికి వందనం’ తీసుకువచ్చామని తెలిపారు. ఒక కుటుంబంలో ఎంత మంది పిల్లలున్నా, పరిమితులు లేకుండా అందరికీ రూ. 15 వేలు చొప్పున అందించాం. 67 లక్షల మంది విద్యార్ధుల చదువులకు ఒకేసారి రూ.10 వేల కోట్లు ఇచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు.  రైతన్నకు అండగా ఉండేందుకు అన్నదాత సుఖీభవ తెచ్చాం. 47 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేశాం. దీపం-2 పథకం ద్వారా ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామన్నారు.    ప్రతి ఇంట్లో వెలుగులు నింపాం కాబట్టే దీపం పథకం సూపర్‌ హిట్‌ అయింది. మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్‌ ఉద్యోగాలు భర్తీ చేశాం’’ అని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో అధికారం చేపట్టాక 3 పార్టీలు కలిసి నిర్వహిస్తున్న తొలిసభ కావడంతో కార్యకర్తలు భారీగా తరలించ్చారు. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్‌ సభా ప్రాంగణానికి రాగానే.. కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. వారికి చంద్రబాబు, పవన్‌, మాధవ్‌ అభివాదం చేశారు. దీంతో వారంతా ఉత్సాహంతో కేరింతలు కొట్టారు.   

దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ ఎస్ఐఆర్

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) చేపట్టనున్నట్లు గతంలోనే ప్రకటించిన ఎన్నికల సంఘం.. తాజాగా ఈ విషయంపై రాష్ట్రాల ఎన్నికల సంఘం అధికారులతో బుధవారం (సెప్టెంబర్ 10) కీలక సమావేశం నిర్వహించింది. రాష్ట్ర ఎన్నికల సంఘాల ప్రధాన అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ భేటీ అయ్యారు. బీహార్ లో ఇటీవల ఈ సర్వే చేపట్టి ఓటర్ జాబితాలో పెద్ద సంఖ్యలో అనర్హులను తొలగించిన విషయం తెలిసిందే. ఎన్నికల ముందు ఈ సర్వే చేపట్టడంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. దీనిపై అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, ఈసీ చర్య రాజ్యాంగబద్ధమేనని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. రాష్ట్రాల ఎన్నికల సంఘం అధికారులతో  సమావేశంలో కేందర ఎన్నికల సంఘం సీనియర్‌ అధికారులు ఎస్‌ఐఆర్‌పై ప్రత్యేక ప్రజెంటేషన్‌ ఇచ్చారు. బీహార్‌ లో ఈ విధానాన్ని అమలు చేసిన తీరును ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి వివరించారు. అక్రమ వలసదారులను తొలగించడంతో పాటు ఓటరు జాబితాల సమగ్రతను కాపాడటమే లక్ష్యంగా ఈ చర్యలు ప్రారంభించినట్లు ఈసీ చెబుతోంది. వచ్చే ఏడాది తమిళనాడు, బెంగాల్‌, కేరళ, అస్సాం, పుదుచ్చేరిల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివర్లోనే దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.