విపక్షాల ఐక్యత ఎండమావేనా?
posted on Dec 19, 2022 @ 10:39AM
2024 సార్వత్రిక ఎన్నికలలో అధికారం కోసం అర్రులు చాస్తున్న బీజేపీ యేతర పార్టీల జాబితాలోకి తాజాగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) చేరింది. ఇప్పటికే కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, జేడీయూ, తృణమూల్ కాంగ్రెస్ లు ఆ ప్రయత్నాలలోనే ఉన్నాయి. అయితే ఈ పార్టీలన్నిటికీ ఒంటరిగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఢీకొనడం అంత తేలిక కాదని స్పష్టంగా తెలుసు. అందుకే కూటముల ఏర్పాటు విషయంలో ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అయితే స్వరాష్ట్రంలో రాజకీయ అవసరాల దృష్ట్యా.. కూటమిలో కీలక పొజిషన్, సముచిత ప్రాధాన్యత విషయంలో ఏకాభి ప్రాయానికి రాలేక చర్చల ప్రక్రియను సుదీర్ఘంగా విడతల వారీగా కొనసాగిస్తూ వార్తలలో ఉండేందుకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే స్థాయికి పరిమితమైపోయాయి.
వచ్చే లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కేంద్రంలో పాలక బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు సంఘటితం అయి తీరాలన్నది.. బేజేపీయేతర శక్తులన్నీ అంగీకరిస్తాయి. అయితే అందుకోసం వేసే లేదా వేస్తున్న అడుగులే.. బావిలో కప్పల చందంగా ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో ఇటువంటి చర్చే విస్తృతంగా సాగుతోంది. ముఖ్యంగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కారణంగా ఈ చర్ బలంగా తెరమీదకు వచ్చింది. సాదారణంగా ఇలాంటి చర్చలలో మేధావులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవడం సహజం. ఇప్పుడూ అదే జరుగుతోంది. అయితే విశేషమేమిటంటే.. ఆ భిన్నాభిప్రాయాలలో కూడా విపక్షాల ఐక్యతపై సందేహాల విషయంలో అనుమానాల విషయంలో ఏకాభిప్రాయమే వ్యక్తంఅవుతోంది.
2024 సార్వత్రిక ఎన్నికలలో ప్రతిపక్షాలు ఏకతాటి మీదకు వచ్చి, సంఘటితంగా బీజేపీపై పోరాటం జరిపే అవకాశం ఉందంటూ జాతీయ దినపత్రిక ఇటీవల ఒక విశ్లేషణను ప్రచురించింది. నిజానికి, ఏ దినపత్రికా ఈ మధ్య కాలంలో జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యత విషయంపై పెద్దగా దృష్టి సారించడం లేదు. అయితే తాజాగా ఓ జాతీయ దినపత్రిక విపక్షాల ఐక్యతపై ఓ కథనం ప్రచురించడమే కాకుండా.. ఆ ఐక్య కూటమికి లేదా ఫ్రంట్ కు నతీష్ కుమార్ ఔను బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమారే నాయకత్వం వహించే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషించింది. అయితే ఈ విశ్లేషణను నితీష్ కుమార్ వెంటనే ఖండించారు. విపక్షాల ఐక్యతా ప్రయత్నాలను ఖండించకుండానే.. తాను ప్రధాని రేసులో లేనని స్పష్టం చేశారు. ఇంత వరకూ బానే ఉంది. ప్రతిపక్షాల ఐక్యత కోసం నడుంబిగించి ముందుకు వచ్చే నాయకుడు ఎవరు? గతంలో ఇలాంటి పరిస్థితి వచ్చిన ప్రతి సారీ వామపక్షాలు ముందుకు వచ్చేవి. ముఖ్యంగా సీపీఎం నాయకులు తమంత తాముగా చొరవ తీసుకునే వారు. 1996, 2004 సంవత్సరాల మధ్య లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రతిపక్షాలు ఎవరికి వారుగా ఉన్నప్పుడు కూడా సీపీఎం చొరవ తీసుకుని ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తీసుకు రాగలిగింది.
ఇక జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పొత్తుల ఎత్తులలో ముందు చూపు ఉన్న నేత అనడంలో సందేహం లేదు. ఆయన దాదాపుగా ప్రతి ఎన్నికలోనూ ఏదో ఒక పార్టీతో పొత్తుపెట్టుకునే రంగంలోకి దిగుతారు. ఆ పొత్తుల ఎత్తులతోనే ఆయన గత 15 ఏళ్లుగా బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ వస్తున్నారు. తాజా పరిస్థితి తీసుకుంటే.. ఇటీవల వరకు బీజేపీతో కలిసి సాగిన నితీశ్ కుమార్ ఇప్పుడు అదే బీజేపీని బద్ధ శత్రువుగా పరిగణిస్తున్నారు. ఇప్పుడు ఆయన జాతీయ స్థాయిలో బీజేపీని గద్దె దింపేందుకు ప్రతిపక్షాల మధ్య ఐక్యత అంటున్నారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఢీ కొనాలంటే పొత్తుల విషయంలో దూరదృష్టి మాత్రమే ఉంటే సరిపోదు.
గతానికీ ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రధానిగా పదవీ బాధ్యతలుచేపట్టిన తరువాత భారత ఎన్నికల ముఖచిత్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ మార్పు వచ్చింది. ప్రజలు పార్టీలు ఏవైనా సరా, కూటములు ఏవైనా సరే.. ముందు ఆయా పార్టీల, కూటముల ప్రధాని అభ్యర్థి ఎవరన్నది చూస్తున్నారు. అంటే విపక్షాల ఐక్యత సాకారం కావడమంటే.. అవి ఎన్నకలకు ముందే ప్రధాని అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చి ఆవిషయాన్ని ప్రకటించాల్సి ఉంటుంది. అప్పుడే జనం ఆ కూటమిని కన్సడర్ చేసే పరిస్థితి ఉంటుంది. అందుకే 2004 వరకూ ఒక లెక్క.. 2004 తరువాత నుంచీ మరో లెక్క అన్నట్లుగా జాతీయ రాజకీయాలు మారిపోయాయి. ఈ మార్పును పరిగణనలోనికి తీసుకుంటేనే విపక్షాల ఐక్యత సాకారమవుతుంది. లేదంటే ఐక్యతా ప్రయత్నాల దారి గతుకుల బాటగానే మిగిలిపోతుంది.