వ్యూహాలు, ఎత్తులు నితీష్ రాజకీయ జిత్తులు
posted on Dec 17, 2022 @ 3:47PM
నితీష్ కుమార్ రాజకీయాలలో పరిచయం అక్కర్లేని పేరిది. పేరుకు జేడీయూ అధినేత.. కానీ ఈయన రాజకీయం అంతా పొత్తులు.. పొరపొచ్చాలే. మైనారిటీలో ఉండి కూడా సమయానుకూలంగా కూటములు కట్టి తన ముఖ్యమంత్రి పదవిని పదిలంగా కాపాడుకోవడంలో ఈయనను మించిన మొనగాడు లేడు. వివాదాలకు సాధ్యమైనంత దూరంగా ఉంటూ.. అందరిలో మంచివాడు, మేధావి అని గుర్తింపు పొందేసి.. బీహార్ ముఖ్యమంత్రి పదవిని గత దశాబ్దంనర కాలంగా తన గుప్పిట్లోనే ఉంటేసుకున్న వ్యూహకర్త. మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదేళ్లు సక్సెస్ ఫుల్ గా నడిపేసిన మాజీ ప్రధాని పీవీ నరసింహరావును మించిన రాజకీయ చాణక్యం ఈయన సొంతం.
అయితే ఇటు కాకుంటే అటు అన్నట్లుగా బీహార్ లో అయితే బీజేపీతో కాదంటే ఆర్జేడీతో జతకట్టి జేడీయూ అధికారంలో కొనసాగేలా.. సీఎం పగ్గాలు తన చేతిలో ఉండేలా చూసుకుంటూ సక్సస్ ఫుల్ గా రాజకీయ ప్రస్థానాన్ని సాగిస్తున్న నితీష్ కుమార్.. రాష్ట్రంలో అన్ని సమస్యల పరిష్కారం విషయంలో ఒక స్పష్టత ఉందన్నట్లుగా ఆయన మాటల తీరు ఉంటుంది. విమర్శకు ప్రతి విమర్శ చేయడంలో నితీష్ కుమార్ దిట్ట. అయితే ఒక్క ప్రశాంత్ కిషోర్ విషయంలోనే నితీష్ కుమార్ మన్మోహన్ సింగ్ ను మించిన మౌనముని అయిపోతారు. ప్రశాంత్ కిషోర్ ఎవరంటారా? ఇంకా తెలియలేదా.. ఎన్నికల వ్యూహ బేహారి పీకే. ఔను పీకేనే.. గతంలో ప్రశాంత్ కిశోర్ అనబడే ఈ పీకే నితీష్ కేబినెట్ లో మంత్రిగా పని చేశారు. అప్పట్లో నితీష్ కుమార్ పీకేను తన రాజకీయ వారసుడిగా కూడా ప్రకటించారు.
అయితే ఆ తరువాత ఏం జరిగిందో ఏమో కానీ.. ఇరువురికీ చెడింది. ఇప్పుడు పీకే రాజకీయ వ్యూహ వ్యాపారానికి ఫుల్ స్టాప్ పెట్టేసి సొంత కుంపటి పెట్టుకుని బీహార్ లో పాదయాత్ర చేస్తున్నారు. నితీష్ పై విమర్శలతో నిరాటంకంగా నడుస్తున్నారు. అయితే నితీష్ కుమార్ మాత్రం పీకే విమర్శలకు కౌంటర్ ఇవ్వడం లేదు. కనీసం స్పందించడం లేదు. ఆయనది కాని తీరులో వ్యవహరిస్తున్నారు. సరే తాను స్పందించేంత సీన్ పీకేకు లేదన్నది నితీష్ అభిప్రాయం అయితే అయి ఉండొచ్చును. అటు పీకే పాదయాత్ర కూడా ఎవరికీ పట్టని యాత్రగానే సాగుతోంది. ఇంత వరకూ విశేషం ఏమీ లేదు కానీ.. ఉరుములేని పిడుగులా నితీష్ కుమార్ 2025లో బీహార్ అసెంబ్లీకి జరిగనున్న ఎన్నికల్లో మహాఘట్ బంధన్ ఆర్జేడీ నేత తేజస్విప్రసాద్ నేతృత్వంలోనే ముందుకు సాగుతుందని ప్రకటించేశారు.
అంతే కాదు ఇప్పటికే ఉపముఖ్యమంత్రి తేజస్వి ప్రసాద్ కు ఇప్పటికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ.. కాబోయే ముఖ్యమంత్రిఆయనే అన్నట్లుగా సీన్ బిల్డప్ చేస్తున్నారు నితీష్. నితీష్ తీరు. శైలి తెలిసిన వారంతా ఇదేంటని ఆశ్చర్యపోతున్నారు. సీఎంగా నితీష్ తాను వినా మరొకరిని కలలో కూడా అంగీకరించరు.. అలాంటిది తేజస్వికి ఆయన స్వయంగా ఇంత బిల్డప్ ఇవ్వడమేమిటని నొసలు ముడేస్తున్నారు. అయితే అసలు విషయమేమిటంటే.. 2024 సార్వత్రిక ఎన్నికలలో మూడో ఫ్రంటో, థర్డ్ ఫ్రంటో ఏదో ఒకటి ఏర్పాటు చేసి తాను ప్రధానిగా పదవీ పగ్గాలు అందుకోవాలన్న వ్యూహ రచనతోనే.. రాష్ట్రంలో ఆయన తేజస్వి ప్రసాద్ కు పగ్గాలు అప్పగించేందుకు కార్యాచరణ ఆరంభించేశారు.
అందుకే 2024 సాధారణ ఎన్నికల్లో విపక్షాలను ఐక్యం చేసే పనిలో నిమగ్నం కావడానికి ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందిస్తున్నారని అంటున్నారు. అందుకే 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో మహాఘట్ బంధన్ కు తేజస్వి ప్రసాద్ నాయకత్వం వహిస్తారని నితీష్ కుమార్ ఇప్పటికే సంకీర్ణం లోని అన్ని పార్టీలకూ స్పష్టమైన సంకేతాలిచ్చేశారు.
అయితే నితీష్ కుమార్ తేజస్విపై చూపుతున్నఈ అపార ప్రేమ వెనుక 2024 సార్వత్రిక ఎన్నికల వ్యూహం ఉందని అంటున్నారు. ఎందుకంటే ఆర్జేడీకి ప్రధానంగా అండగా ఉండేది ముస్లింలు, యాదవులు. ఇక జేడీయూకి అయితే.. దళితుల ఓటు బ్యాంకు మద్దతు ఎక్కువ. దేశ వ్యాప్తంగా కూడా ఈ మూడు వర్గాల మద్దతు కూడగడితే తన పీఎం ఆకాంక్ష సాకారం అవుతుందన్నది నితీష్ వ్యూహంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.