కరవమనలేదు.. విడవమనలేదు.. ఎమ్మెల్యేలతో భేటీలో మారిన జగన్ స్వరం

ఎమ్మెల్యేలూ మీ తీరు మారాల్సిందే.. నాతో కలిసి పనిచేయాల్సిందే.. లేదంటే కష్టం, ఇందులో ఏం మొహమాటాల్లేవు   అంటూ ఎమ్మెల్యేలకు జగన్ ఇప్పటికే  స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అదే పని మరో సారి చేశారు. పని తీరు బాగాలేదంటూ ఈ సారి  30 మంది ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇందుకు ఆయన తన వద్ద ఉన్న సర్వేలు, నివేదికలను చూపించారు. వచ్చే ఎన్నికలలో పోటీ చేసుందుకు పార్టీ టికెట్ దక్కాలంటే పని తీరు మెరుగుపరచుకోవడం వినా మరో దారి లేదని హెచ్చరించారు.  ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలతో సీఎం జగన్ సోమవారం (ఫిబ్రవరి 13) భేటీ అయ్యారు. ససాక్ష్యంగా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలలో ఓ 30 మంది  ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గడపగడపకు కార్యక్రమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని జగన్ వాళ్లకు క్లాస్ పీకారు. అయితే గతంలో నిర్వహించిన సమావేశంలో గడపగడపకు కార్యక్రమాన్ని నిర్లక్స్యం చేసిన వారి సంఖ్య 45 అని చెప్పిన జగన్ ఈ సమావేశంలో దానిని 30కి కుదించారు.  ఇందుకు కారణం ఆ 15 మంది తన వార్నింగ్ తరువాత పద్ధతి మార్చుకుని దారిలో పడ్డారా? లేక ఇటీవలి కాలంలో పార్టీ ఎమ్మెల్యేలలో కనిపిస్తున్న తిరుగుబాటు ధోరణికి జంకి  ఆ సంఖ్య తగ్గించేశారా? అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల్లో కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు జగన్ పరిస్థితి కరవమంటే కప్పకు కోసం.. విడవ మంటే పాముకు కోపం అన్నట్లుగా తయారైంది. ప్రతి నియోజకవర్గంలోనూ సిట్టింగ్ కు పోటీగా సమన్వయకర్తలు, ఇన్ చార్జిలు అంటూ నియామకాలు జరపడంతో.. ఎమ్మెల్యేకు అనుకూలంగా మాట్లాడితే ఇన్ చార్జిలకు, ఇన్ చార్జిలకు అనుకూలంగా మాట్లాడితే ఎమ్మెల్యేలకు కోపం వచ్చి మొదటికే మోసం వచ్చే పరిస్థితి పలు నియోజకవర్గాలలో ఉంది. అంతే కాకుండా పని తీరు పేరు చెప్పి చర్యలు తీసుకుంటే పార్టీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధంగా ఉన్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. గత సమావేశంతో పోలిస్తే, తాజా సమావేశంలో జగన్ స్వరం మారింది. గళం మారింది. బుజ్జగింపు ధోరణే కనిపించింది. ఎమ్మెల్యేలకు ఊరట కలిగించడానికా అన్నట్లు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కూడా కలిసి వచ్చింది. దీంతో గడపగడపకూ కార్యక్రమానికి బ్రేక్ వచ్చింది.  దాని స్థానంలో ఈ నెల 20న జరిగే  మా భవిష్యత్ నువ్వే  జగన్  కార్యక్రమంలో  చురుగ్గా  పాల్గొనాలని ఎమ్మెల్యేలను జగన్ ఆదేశించారు. ఆదేశించారు అనే కంటే అభ్యర్థించారు అనడం బెటర్ అనిపించేలా ఆయన ధోరణి ఉందని ఆ సమావేశానికి హాజరైన కొందరు ఎమ్మెల్యేలు జోకులు వేయడమే కాదు.. ఆఫ్ ది రికార్డ్ అంటూ మీడియాకు కూడా లీకులిచ్చారు. అదే గతంలో గడపగడపకు సమీక్షా సమావేశంలో జగన్ ఎమ్మెల్యేలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  పనితీరు మార్చుకోకపోతే టికెట్లు ఇచ్చేది లేదంటూ ఖరాఖండీగా చెప్పేశారు. రెండు నెలలే గడువు ఇచ్చారు.  ఎన్నికలకు ఆర్నెల్ల ముందే ఎమ్మెల్యేల ప్రొగ్రస్ రిపోర్టును బట్టి ఎవరెవరికి టికెట్లు ఇస్తానన్న విషయాన్ని ప్రకటించేస్తానని చెప్పేశారు.   వారంలో నాలుగు రోజుల చొప్పున, నెలకు 16 రోజులు కూడా తిరగకపోతే ఎలా, రోజుకు గంటో రెండు గంటలో కాదనీ, ఏడు నుంచి ఎనిమిది గంటలు గ్రామాల్లో తిరగాలని దిశా నిర్దేశం చేశారు.  ఎమ్మెల్యేలు సమస్యలు చెబుదామన్నా వినడానికి ఇసుమంతైనా ఇష్టపడలేదు. అదే తాజా సమావేశం దగ్గరకు వచ్చే సరికి ఆగ్రహం, హెచ్చరికా షరా మామూలే అయినా  స్వరంలో తీవ్రత లేదు. మాటల్లో పదును లేదు. ఎలాగోలా సమావేశం ముగించి.. వారిని పార్టీకే అంటిపెట్టుకుని ఉండేలా చేస్తే చాలన్న తాపత్రయమే కనిపించింది. గత ఏడాది సెప్టెంబర్ లో జరిగిన సమావేశానికీ.. ఇప్పుడు  సోమవారం (ఫిబ్రవరి 13) జరిగిన సమావేశానికీ మధ్య ఏం జరిగిందని జగన్ ఇలా జావకారిపోయారు, అన్న ప్రశ్నకు పార్టీ శ్రేణులలో.. ప్రజలలో వ్యతిరేకత ప్రస్ఫుటంగా కనిపిస్తుండటమే కారణమని బదులిస్తున్నారు.   అప్పట్లో వచ్చే ఎన్నికలలో వైనాట్ 175 అంటూ వచ్చే ఏన్నికలలో 175కు 175 అసెంబ్లీ స్థానాలలోనూ విజయం సాధించాలన్న పగటి కలను సాకారం చేసుకోవడానికి జగన్ నేల విడిచి సాము చేశారు? పార్టీ ఎమ్మెల్యేల సహనాన్ని తెగేదాకా లాగారు. ఇంకే ముంది గట్టు తెగింది. అసమ్మతి, అసంతృప్తి, ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నాయి. నెల్లూరు జిల్లాతో మొదలైన తిరుగుబాటు పవనాలు రాష్ట్ర మంతటా వ్యాపిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ స్థితిలో జగన్ తాజాగా పార్టీ నేతలతో నిర్వహించిన కీలక  భేటీని మరో సారి అధికారంలోకి వస్తే చాలు అన్న టోన్ లో ఎమ్మెల్యేలను బుజ్జగించడానికే సరిపెట్టేశారు.  ఇంత కాలం తాను ముఖం చాటేసి ఎమ్మెల్యేలను గడపగడపకూ పంపిన జగన్ ఇక తాను కూడా  ప్రజల మధ్యకు వెళ్లి తన ప్రభుత్వం చేసిన మంచిని వివరించడానికి రెడీ అయ్యారు. ఎమ్మెల్యేలతో తాజా భేటీలో ఇదే విషయం చెప్పారు.   

మిచిగాన్ స్టేట్ వర్సిటీలో కాల్పులు.. ముగ్గురు మృతి

అమెరికాలోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలో ఓ దుండగుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో కనీసం ముగ్గురు విద్యార్థులు మరణించారు. పలువురు తీవ్రంగా  గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.   వర్సిటీలోని రెండు ప్రాంతాలలో దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అమెరికాలోని అత్యంత ప్రతిష్ఠాత్మక వర్సిటీలలో మిచిగాన్ స్టేట్ వర్సిటీ ఒకటి. ఈ యూనివర్శిటీలో ఎక్కువగా భారత విద్యార్థులు, అందులోనూ తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సంఖ్య ఎక్కువ. ఈ క్యాంపస్ లో 50 వేల మంది విద్యార్థులు ఉన్నారు. ఇలా ఉండగా వ‌ర్సిటీ క్యాంప‌స్‌లోని బెర్కీ హాల్‌లోనూ, స‌మాచారం వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో అక్క‌డ ఉన్న పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లారు. అనేక మంది బాధితుల్ని పోలీసులు గుర్తించారు. ఆ త‌ర్వాత మ‌రో బిల్డింగ్ వ‌ద్ద కూడా కాల్పుల శ‌బ్ధాలు వినిపించాయి. ఈ ఘటన తర్వాత దుండగుడు ఆ ప్రాంతం నుంచి వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో చిక్కినట్లు పోలీసులు చెప్పారు. ఆ తరువాత కాల్పులకు తెగబడిన వ్యక్తి పోలీసు కాల్పులలో హతమయ్యాడని పేర్కొన్నారు. 

హ్యాట్రిక్ పై కమల నాథుల కన్ను.. రాముడే బీజేపీ ధీమా?

బీజేపీ కష్టంలోనూ, సుఖంలోనూ రామనామ జపమే చేస్తూ వస్తోంది. ఆ పార్టీ ఎదుగుదలకు, నేడు అధికారంలో ఉండటానికీ ఆ శ్రీ రామచంద్రుడి పేరు వాడుకోవడమే కారణం. ఔను నిజం ఇప్పుడు ముచ్చటగా మూడో సారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధించాలన్న తన ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు కూడా బీజేపీ రామనామ జపాన్నే నమ్ముకుంది.  బీజేపీ   ఇప్పుడైతే జాతీయ స్థాయిలో అత్యంత శక్తివంతమైన రాజకీయ శక్తిగా ఎదిగి ఉండోచ్చు. వరసగా రెండు సార్లు (2014, 2019) సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించి ఉండోచ్చు. స్వయంగా సంపూర్ణ మెజారిటీ సాధించి, మూడు దశాబ్దాలకు పైగా నడుస్తున్న సంకీర్ణ రాజకీయ చరిత్రను తిరగ రాసి ఉండొచ్చు. ఈ రోజున కేంద్రంలో, సగానికి పైగా రాష్ట్ర్రాలలో అధికారంలో ఉండొచ్చు.  అయితే  బీజేపీ విజయాల వెనుక, కాంగ్రెస్ సహా ఇతర రాజకీయ పార్టీల బలహీనత కంటే రామజన్మ భూమి పేరిట ఆ పార్టీ చేసిన ఆందోళన,  1990 దశకంలో దేశాన్ని కదిలించిన  రామజన్మ భూమి ఆందోళన..అద్వానీ రథ యాత్రే కారణం. అవును 1990 లో, అప్పటి ప్రధాని వీపీ సింగ్ ప్రభుత్వం  మండల్ కమిషన్  చేసిన సిఫార్సుల ఆధారంగా వెనక బడిన కులాలకు 27 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును తెచ్చింది. వీపీ సింగ్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా అగ్రవర్ణాల ప్రజలు ఆందోళనకు దిగారు. అదే సమయంలో వీపీ సింగ్ ప్రభుత్వ రాజకీయ ఎత్తుగడకు జవాబుగా బీజేపీ, అప్పటికే విశ్వ హిందూ పరిషత్ ఇతర సంఘ పరివార్ సంస్థలు సాగిస్తున్న రామ జన్మభూమి ఆందోళనకు మద్దతు ప్రకటించింది. అందుకు అనుగుణంగా అప్పటి బీజేపీ అధ్యక్షుడు ఎల్ కే అద్వానీ 1990లో రథ యాత్రను చేపట్టారు.ఇక ఆ తర్వాత 1992 డిసెంబర్ 6,అయోధ్యలోని వివాదాస్పద కట్టడం, (బాబ్రీ మసీదు) కూల్చివేత వరకు, సాంస్కృతిక జాతీయవాదం పేరిట బీజేపీ సాగించిన ప్రయాణమే, బీజేపీ ఎదుగుదలకు బీజం వేసింది. ఇక ఆ తర్వాత జరిగింది   చరిత్ర.  ఇక అప్పటి నుంచి బీజేపీ, ప్రతి ఎన్నికలలోనూ తమ పార్టీ అధికారంలోకి వస్తే, రామజన్మభూమి అయోధ్యలో దివ్య భవ్య రామ మందిరం నిర్మిస్తామని వాగ్దానం చేస్తూనే వుంది. ఇప్పుడు ఆ వాగ్దానం నెరవేరే రోజు దగ్గరకొచ్చింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సుప్రీం కోర్టు 2019 నవంబర్ లో అనుమతి ఇచ్చింది.  ప్రధాని నరేంద్ర మోడీ, 2020 ఆగష్టులో శంకుస్థాపన చేశారు. ఇదంతా మన కళ్ళముందు కదులుతున్న  చరిత్ర.  కాగా, ఈ సంవత్సరం జరిగే తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా, వచ్చేస సంవత్సరం ( 2024) లోక్ సభ ఎన్నికల విజయానికి  బీజేపీ మరో మారు రాముడినే నమ్ముకుంది. రామ మందిర్  అంశాన్ని ఎన్నికల ప్రచార అస్త్రంగా వినియోగించుకునేందుకు రంగం సిద్దం చేసుకుంటోంది. ఇప్పటికీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో ఎన్నికల సన్నాహయాత్రలు సాగిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ తేదీని ప్రకటించారు. వచ్చే సంవత్సరం (2024) జనవరి 1న రామ మందిరాన్ని ప్రారంభిస్తామని ఆయన  ప్రకటించారు.  రాహుల్ బాబా  విను, .2024 జనవరి 1 నాటికి అయోధ్యలోని రామ మందిరం సిద్ధం అవుతుంది అంటూ అమిత్ షా కాంగ్రెస్ పార్టీని, రామమందిర్   వివాదంలోకి లాగేందుకు వ్యూహాత్మకంగా ప్రయత్నం చేశారు. అలాగే, అయోధ్యలో రామ మందిర్  నిర్మాణాన్ని కాంగ్రెస్, వామపక్ష, లౌకిక వాద పార్టీలు అడ్డుకున్నాయని,  ఆరోపించారు. అయోధ్య అంశాన్ని కోర్టు పరిధిలో సుదీర్ఘ కాలం ఉండేలా చేశాయని ఆరోపించారు. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలను,ఇతర లౌకికవాద పార్టీలను హిందూ వ్యతిరేక పార్టీలుగా చిత్రించే ప్రయత్నానికి ఈ విధంగా అమిత్ షా శ్రీకారం చుట్టారు. అంటే 2024 ఎన్నికలలో బీజేపీ మరోమారు రామ మందిర్ అంశాన్ని ప్రధాన ఎన్నికల ప్రచార అస్త్రం చేసుకునేందుకు సిద్డంవుతోందని అమిత్ షా వ్యాఖ్యలతో అర్ధమైపోయింది. నిజానికి అయోధ్య రామమందిరం అంశాన్ని బీజేపీ  ప్రతి ఎన్నికలలోనూ ఉపయోగించుకుంటూనే వుంది. అయితే, ఈసారి, రామ మందిర నిర్మాణం పూర్తి చేసిన నేపధ్యంలో హిందూ ఓటు బ్యాంకును మరింత పటిష్ట పరచుకునే ప్రయత్నం మొదలెట్టింది. అమిత్ షా మాటలు ఈ విషయాన్నే తేటతెల్లం చేస్తున్నాయి.  

విదేశీ ప్రయాణీకులకు కరోనా ప్రొటోకాల్ ఎత్తివేత

కరోనా మహమ్మారి మరో మారు, ప్రపంచవ్యాప్తంగా కలకలం, కలవరం సృష్టిస్తోందన్న వార్తలు డిసెంబర్ నెలలో తీవ్ర కలవరం సృష్టించాయి. జనం బెంబేలెత్తిపోయారు.  కరోనా పుట్టిల్లు అయిన చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న  కరోనా వేరియంట్ బీఎఫ్‌7 రకానికి చెందిన ఒమిక్రాన్‌ కేసులు భారత్ దేశంలోనూ నమోదు అవ్వడంతో దేశంలో మరోసారి లాక్ డౌన్ తప్పదా అన్న అనుమానాలు తలెత్తాయి. జనవరిలో దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంటుందనీ వార్తలు వచ్చాయి. అయితే ఆ సమయంలోనే నిపుణుల అభిప్రాయాలను ఉటంకిస్తూ తెలుగువన్ ‘కరోనా వచ్చినా లాక్ డౌన్ ఉండదు’ అంటూ విస్పష్టంగా తెలియజేసింది.   కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ   అప్పట్లో భారత్‌లో కొవిడ్‌ కేసుల పెరుగుదలపై కేంద్రం ఓ కన్నేసి ఉంచిందని చెప్పారు.  మరోవైపు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ర్యాండమ్‌గా నమూనాలను సేకరించి, పరీక్షించాలని మాండవీయ ఆదేశించారు.   ఇప్పటికే దేశ జనాభాలో అర్హులైనవారిలో 95 శాతం మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయిన నేపథ్యంలో.. లాక్‌డౌన్‌వంటి పరిస్థితి రాదని తెలుగువన్ నిపుణుల అభిప్రాయాల ఆధారంగా విస్పష్టంగా పేర్కొంది.  భారతీయుల రోగనిరోధక శక్తి చైనీయుల కంటే అధికంగా ఉందని కూడా వివరించింది.  జనవరి వచ్చింది.. వెళ్లిపోయింది. కరోనా కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. రోజుకువంద కేసుల కంటే తక్కువే నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు ఇప్పటి వరకూ ఉన్న కరోనా ప్రొటోకాల్ ను కేంద్రం ఎత్తివేసింది. చైనా, సింగపూర్, హాంకాంగ్, కొరియా, థాయిలాండ్, జపాన్ దేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు ప్రీ బోర్డింగ్ ఆర్టీ పీసీఆర్ పరీక్షలు తప్పనిసరి అంటూ అమలులో ఉన్న ఉత్తర్వులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం, పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.     

విజయవాడలో పొలిటికల్ హీట్... కేసినేని నాని అడ్డాలో నాయుడుగారి కోడలు?

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు కోడలు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీకి గ్రౌండ్ ప్రిపేర్ అయ్యిందా? వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో అధికారంలోకి రావడమే కాకుండా.. పార్లమెంటు స్థానాలలో కూడా విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న చంద్రబాబు నాయుడు వచ్చే సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రంలోని పాతిక లోక్ సభ స్థానాలలోనూ విజయం సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక కూడా దాదాపుగా పూర్తి చేసేశారన్న టాక్ పార్టీ వర్గాలలో జోరుగా సాగుతోంది. వచ్చే ఎన్నికలలో విజయం సాధించి రాష్ట్రంలో అధికారం చేపట్టడం ఎంత ముఖ్యమో, అత్యధిక లోక్ సభ నియోజకవర్గాలలో విజయం సాధించి.. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన ప్రయోజనాలను సంపూర్ణంగా సాధించడమే చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అదేమంత కష్టసాధ్యం కాదని ఆయన భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో విజయం నల్లేరు మీద బండినడకేనని ఆయన అంచనా వేస్తున్నారు. అధికార వైసీపీ ఎన్ని కుయుక్తులు పన్నినా..  జగన్ సర్కార్ పై ఉన్న తీవ్ర వ్యతిరేకత కారణంగా అన్ని వర్గాలూ తెలుగుదేశం వైపే మొగ్గు చూపుతాయన్న విశ్వాసం ఆయనలోనే కాదు, తెలుగుదేశం శ్రేణుల్లోనూ వ్యక్తం అవుతోంది. దానికి తోడు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను అంటూ జనసేనాని పవన్ కల్యాణ్ శపథం కూడా తెలుగుదేశం పార్టీకే ప్రయజనకరంగా పరిణమించనున్నది. జనసేన, తెలుగుదేశం పార్టీల పొత్తు ఇప్పటికే ఖాయమైందనీ, అధికారిక ప్రకటన లాంఛనమేననీ భావిస్తున్న వేళ.. చంద్రబాబు లోక్ సభ నియోజకవర్గాలపై కూడా దృష్టి పెట్టారని చెబుతున్నారు. కచ్చితంగా గెలుపు గుర్రాలకే పార్టీ టికెట్లు ఇచ్చేందుకు నిర్ణయించుకున్న చంద్రబాబు రాష్ట్రంలోని పాతిక లోక్ సభ నియోజకవర్గాలలో 24 నియోజకవర్గాలపై ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారని అంటున్నారు. అయితే కీలకమైన విజయవాడ లోక్ సభ స్థానం విషయంలోనే ఆయన ఒకింత ఇబ్బంది ఎదుర్కొంటున్నారనీ, ఆ నియోజకవర్గం అభ్యర్థి విషయంలో కేశినేని బ్రదర్స్ మధ్య విభేదాలు ప్రతిబంధకంగా మారాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికలలో విజయవాడ ఎంపీగా ఎన్నికైన కేశినేని నాని, ఈ సారి ఎన్నికలలో ఆ సీటు కోసం పోటీ పడుతున్న ఆయన సోదరుడు కేశినేని శివనాథ్ ల మధ్య సయోధ్య సాధ్యమయ్యే పరిస్థితి లేకపోవడం.. విజయవాడ ఎంపీ అభ్యర్థి ఎంపిక విషయంలో చంద్రబాబుకు తలనొప్పులు తప్పడం లేదంటున్నారు. కేశినేని నాని వ్యవహార శైలి పార్టీని ఇబ్బందుల పాలు చేస్తున్నది. అదే సమయంలో ఆయన సోదరుడిని ప్రోత్సహించి టికెట్ ఇచ్చినా.. కేశినేని నాని సహకారం లేకుంటే విజయం సాధించే అవకాశం లేదు. అలాగని కేశినేని నానికి టికెట్ ఇచ్చినా ఆయన సోదరుడి సహకారం అవసరం. వీరిద్దరినీ కాదని కొత్త వారిని ఎంపిక చేస్తే.. అన్న ఆలోచనే నారా బ్రాహ్మణి పేరును తెరమీదకు తెచ్చిందంటున్నారు. నారా బ్రాహ్మణిని విజయవాడ తెలుగుదేశం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే కేశినేని బ్రదర్స్ ఇద్దరూ మారు మాట్లాడకుండా అంగీకరిస్తారని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే కేశినేని నాని తనకు పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా.. తన సోదరుడికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ఇవ్వడానికి వీల్లేదని పేర్కొన్న సంగతిని ఈ సందర్భంగా తెలుగుదేశం శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. అందుకే నారా బ్రాహ్మణిని విజయవాడ లోక్ సభ స్థానం నుంచి పార్టీ ఎంపీ అభ్యర్థిగా నిలబెడితే కేశినేని  బ్రదర్స్ ఇద్దరూ పార్టీ అభ్యర్థి విజయం కోసం పని చేస్తారని, అదే సమయంలో బ్రాహ్మణి ఎంట్రీ పార్టీకి కొత్త జోష్ తీసుకు వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. బ్రాహ్మణి రాజకీయాల్లోకి వస్తే  టీడీపీకి మరింత ఊపు వస్తుందని పార్టీ శ్రేణులు అంటున్నాయి.     పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ, జనసేనాని పవన్ కల్యాణ్ ల సినిమా గ్లామర్ కు ఎన్టీఆర్ మనవరాలు బ్రాహ్మణి ఎంట్రీ మరింత బలం చేకూరుస్తుందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.  ఇప్పటికే పార్టీ అధినేతగా చంద్రబాబు ప్రజాక్షేత్రంలో జగన్ పాలనా వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఆయన కుమారుడు లోకేష్ యువగళం పాదయాత్రలో ప్రభుత్వ విధానాలను తూర్పారపడుతున్నారు. ముందు ముందు (పొత్తు కుదిరితే) పవన్ కల్యాణ్ బస్సు యాత్ర కూడా తెలుగుదేశం గ్రాఫ్ ను మరింతగా పెంచేస్తుంది. ఇక విజయవాడ లోక్ సభ స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా రంగంలోకి దిగితే ఇటు అసెంబ్లీ, అటు లోక్ సభ స్థానాలలో తెలుగుదేశం స్వీప్ చేయడం ఖాయమని పార్టీ శ్రేణులు అంటున్నాయి.   అదే విధంగా బ్రాహ్మణి లాంటి విద్యావంతురాలు లోక్ సభలో తెలుగుదేశం సభ్యురాలిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా గళం వినిపిస్తారని తెలుగుదేశం శ్రేణులు భావిస్తున్నాయి. ఏతా వాతా వచ్చే సార్వత్రిక ఎన్నికల తరువాత కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంతో పొత్తు కుదిరితే బ్రాహ్మణికి కేంద్ర మంత్రి పదవి కూడా దక్కే అవకాశాలు పుష్కలంగా ఉంటాయన్నది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు.  

తెలంగాణకు కొత్త గవర్నర్ ప్రచారానికి ఇక ఫుల్ స్టాప్?

తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు చేపట్టి  మూడున్నరేళ్లు పూర్తి కావస్తోంది. 2019 సెప్టెంబర్ లో ఆమె తెలంగాణ గవర్నర్  గా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ నుంచి  బాధ్యతలు స్వీకరించారు. ఆ లెక్కన ఆమె పదవీ కాలం ముగిసేందుకు ఇంకా ఏడాదిన్నరకు పైగానే సమయముంది. అయితే, త్వరలోనే, ఆమె స్థానంలో తెలంగాణకు కొత్త గవర్నర్ వస్తున్నారని రాజకీయవర్గాలలో నిన్న మొన్నటి వరకూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ప్రస్తుతం తమిళి సై తెలంగాణ గవర్నర్  బాధ్యతలతో పాటుగా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు.  ఈ నేపధ్యంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్’ బాధ్యతలు పూర్తి స్థాయిలో ఆమెకు అప్పగించి, తెలంగాణకు కొత్త వారిని గవర్నర్  గా నియమించే ప్రతిపాదనకు కేంద్ర హోం మంత్రి  అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారనీ, ఇహనో ఇప్పుడో ఉత్తర్వులు వెలువడటమే తరువాయి అన్న స్థాయిలో ఈ ప్రచారం సాగింది.  ఇటీవల కాలంలో గవర్నర్ కు ముఖ్యమంత్రికి, రాజ్ భవన్ , ప్రగతి భవన్ కు మధ్య దూరం పెరిగిపోవడం, రాజ్యాంగ వ్యవస్థల మధ్య వివాదాలు తలెత్తడం వంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోవడం ఒక కారణం అయితే  , రాష్ట్ర ప్రభుత్వంతో తలెత్తిన వివాదాలకు సంబంధించి గవర్నర్ తమిళి సై పలు మార్లు కేంద్ర హోం మంత్రికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను, రాష్ట్ర ప్రభుత్వంలో బాధ్యతగల మంత్రులు, ఇతర అధికారులు మీడియా ముఖంగా లేవనెత్తిన అంశాలను పరిశీలించిన మీదట, కేంద్ర హోం శాఖ అధికారులు, తెలంగాణకు రాజకీయ నాయకుల కంటే, రిటైర్డ్  సివిల్ సర్వెంట్స్ గవర్నర్’గా నియమించడం అవసరమని నిర్ణయానికి వచ్చారని, అందుకే తమిళి సై స్థానంలో  రిటైర్డ్ సివిల్ సర్వెంట్’ ను నియమించేందుకు వీలుగా ఆమెను పుదుచ్చేరికి పరిమితం చేయనున్నారనీ కూడా అప్పట్లో విస్తృతంగా వార్తలు వివనవచ్చాయి. గతంలో తెలంగాణ ఆందోళన ఉదృతంగా ఉన్న రోజుల్లో (2010)లో ఉమ్మడి రాష్త్రం గవర్నర్’గా వచ్చిన మాజీ ఐపీఎస్ ఈఎస్ఎల్ నరసింహన్, రాష్ట్ర విభజన తర్వాత ఉభయ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్  గా వరసగా 9 ఏళ్ళు కొనసాగడమే కాకుండా విభజన వ్యవహారాలను సమర్ధవంతంగా నిర్వహించిన విషయాన్ని గుర్తు చేస్తూ తమిళిసై మార్పుతధ్యమన్న ఊహాగానాలు షికార్లుచ చేశాయి. నరసింహన్ గవర్నర్ గా ఉన్న రోజుల్లో,గవర్నర్, ముఖ్యమత్రి మధ్య సత్సంబంధాలు ఉండేవి, ముఖ్యమంత్రి కేసీఆర్  రాజ్ భవన్  కు వెళ్లి గవర్నర్ తో అన్ని విషయాలు చర్చంచి, సలహాలు తీసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. వ్యక్తిగత స్థాయిలోనూ ఇద్దరి మధ్య గౌరవప్రదమైన సంబంధాలే చివరి వరకు కొనసాగాయి. ముఖ్యమంత్రి, గవర్నర్ దంపతులకు సాష్టాంగ నమస్కారం చేసి, ఆశీస్సులు అందుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. పండగలు పబ్బాలకు శుభాకాంక్షలు ఇచ్చి పుచ్చుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.  ఈ అంశాలు అన్నింటినీ పరిగణలోకి తీసుకుని, ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన రిటైర్డ్ సివిల్ సర్వెంట్ ను తెలంగాణ కొత్త గవర్నర్ గా నియమించే అలోచనలో కేంద్ర హోం శాఖ ఉందని, . అయితే, ఇప్పటికే గవర్నర్ గా పనిచేసిన అనుభవం ఉన్న మాజీ సివిల్ సర్వెంట్’ను నియమిస్తారా? లేక కొత్తవారికి అవకాశం ఇస్తారా,అనేది తేలాల్సి ఉందని కూడా జోరుగా వార్తలు వినవచ్చాయి.  అయితే కేంద్రం తాజాగా కొన్నిరాష్ట్రాలకు గవర్నర్ లను నియమించింది. కొందరిని బదిలీ చేసింది. సాటి తెలుగురాష్ట్రం అయిన ఏపీ గవర్నర్ ను సైతం ఛత్తీస్ గఢ్ కు బదలీ చేసింది. అయినా తెలంగాణ గవర్నర్ తమిళిసైని మాత్రం కదపలేదు.  దీంతో ఇంత కాలంగా జరుగుతున్న ప్రచారం అంతా ఊహాగానాలేనని తేలిపోయింది.  కేంద్రం తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ తమిళిసై మధ్య ఉన్న విభేదాలను పెద్ద సీరియస్ గా తీసుకోలేదని తేలిపోయింది.  తమిళిసైను తెలంగాణ గవర్నర్ గా ఆమె పదవీ కాలం ముగిసే వరకూ కొనసాగించే అవకాశాలే ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. 

కేసీఆర్ వ్యూహ వైఫల్యాలు.. రీజనేంటంటే?

మాటల మాంత్రికుడు.. రాజకీయ వ్యూహ చతురుడు కేసీఆర్. గత తొమ్మిదేళ్లుగా తెలగాణ కేసీఆర్ కు పర్యాయపాదాలుగా వాడే పదాలు అవే. అయితే గత కొద్ది కాలంగా ఆయన మాటలు మంత్రాలుగా చెలామణి కావడం లేదు. వ్యూహాలు వికటిస్తున్నాయి. బీఆర్ఎస్ అధినేత ప్రణాళికలు పారడం లేదు సరికదా బూమరాంగ్ అవుతున్నాయి. అనుకున్నదొక్కటీ, అయినది ఒక్కటి  బోల్తా పడ్డావులే దొరా అన్నట్లుగా తయారైంది కేసీఆర్ పరిస్థితి. ముఖ్యంగా ఫామ్ హౌస్ కేసు విషయం నుంచి నూతన సచివాలయం ప్రారంభోత్సవం వరకూ ఆయన ఏం అనుకున్నా అందుకు రివర్స్ అవుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఇది సీఎంలో అసహనం పెంచుతోందా అంటే బీఆర్ఎస్ శ్రేణులు ఔననే అంటున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు గవర్నర్ ప్రసంగం విషయంలో కూడా కోర్టు వరకూ వెళ్లి కూడా కేసు ఉపసంహరించుకుని మరీ వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి కేసీఆర్ ఎంతగా డిఫెన్స్ లో పడ్డారో అందరికీ తేటతెల్లం చేసింది. వ్రతం చెడ్డా కూడా ఫలం దక్కలేదన్నట్లు.. గవర్నర్ ను స్వయంగా అసెంబ్లీలోకి ఆహ్వానించినా కూడా  గతేడాది సెప్టెంబరులో అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ తమిళిసై ఆమోదించకుండా పెండింగ్‌లోనే ఉంచారు.   అంతకు ముందుఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ విషయంలోనూ ఆయన తొందరపాటు కారణంగానే.. సభకు జనాన్ని బాగానే సమీకరించగలిగినా... ఆయన అనుకున్న విధంగా బీఆర్ఎస్ కు కావలసినంత మైలేజీ రాలేదు. హస్తిన వేదికగా భారీ బహిరంగ సభ అని తొలుత అనుకున్నప్పటికీ.. తెలుగుదేశం ఖమ్మం సభ విజయవంతం కావడం.. రాష్ట్రంలో ఆ పార్టీ పూర్వ వైభవం దిశగా వేగంగా కదులుతోందన్నఅంచనాల నేపథ్యం ఒక వైపు.. ఖమ్మం నుంచి ఇద్దరు పలుకుబడి కలిగిన నాయకులు తుమ్మల, పొంగులేటి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పనున్నారన్న ప్రచారం మరో వైపీ.. అన్నిటికీ మించి ప్రధాని మోడీ వందే భారత్ ప్రారంభోత్సవానికి హైదరాబాద్ వచ్చి, భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నరన్న సమాచారంతో బీఆర్ఎస్ సత్తా చాటకపోతే వెనుకబడిపోతామన్న భావనతో గత నెల 18నే ఆయన ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ ఆవిర్బావ సభ నిర్వహించేశారు. అది విజయవంతం అయ్యిందా లేదా అన్న విషయం కంటే జాతీయ పార్టీ  ఆవిర్భావ సభ హస్తిన వేదికగా నిర్వహించి ఉంటే వచ్చే మైలేజే వేరుగా ఉండేది.. అయితే కేసీఆర్ ఆ అవకాశాన్ని చేజార్చుకున్నారు.  ఇక  బీఆర్ఎస్ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్మించిన నూతన సచివాలయ ప్రారంభోత్సవ వేడుకను కూడా అనివార్యంగా వాయిదా వేసుకోవలసిన పరిస్థితి కేసీఆర్ కు ఏమంత సంతోషం కలిగించే విషయం కాదు. అసలు నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి తన పుట్టిన రోజును ముహూర్తంగా నిర్ణయించడంపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. తీరా ప్రారంభోత్సవ తేదీ ప్రకటించేసిన తరువాత నూతన సెక్రటేరియెట్ లో సంభవించిన అగ్ని ప్రమాదం నెగటివ్ సెంటిమెంట్ ను స్ఫురింప చేసింది. అదలా ఉండగానే ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎలక్షన్ కోడ్ అంటూ ఆ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. అలాగే ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల ఫామ్ హౌస్ కేసు, రిపబ్లిక్ డే నిర్వహణ ఇలా కేసీఆర్ ఇటీవలి కాలంలో తీసుకున్న ప్రతి నిర్ణయం, ప్రతి వ్యూహం బూమరాంగ్ అవుతూనే వచ్చాయి. 

తారకతర్న ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే? తాజా అప్ డేట్?

తారకరత్న ఆరోగ్యం మరింత మెరుగుపడింది. బెంగళూరు హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై గత నాలుగైదు రోజులుగా ఎటువంటి అప్ డేట్స్ రాకపోయినప్పటికీ, నందమూరి కుటుంబ సభ్యుల సన్నిహితుల నుంచి అందిన అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగుపడిందనీ, చికిత్సకు చక్కగా స్పందిస్తున్నారనీ తెలుస్తోంది. అన్నిటికీ మించి తారక రత్న ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఎప్పటికప్పుడు బాలకృష్ణ వైద్యులతో సంప్రదిస్తున్నారనీ, వైద్యులు కూడా తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించిన అప్ డేట్స్ అన్నీ ఆయనకే తెలియజేస్తున్నారనీ అంటున్నారు.   గత నెల 27న చిత్తూరు జిల్లా కుప్పంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్వి నారా లోకేష్ ప్  పాదయాత్రలో పాల్గొన్న తారకరత్నగుండెపోటుకు గురైన సంగతి విదితమే.    ఆయనకు మరి కొన్ని పరీక్షలు చేయాల్సి ఉందని,   చికిత్సకు తారకరత్న స్పందిస్తున్నారనీ, ప్రస్తుతం ఆయనకు బ్రెయిన్ డ్యామేజీ రికవరీ చికిత్స అందిస్తున్నామనీ గతంలో వైద్యులు తెలిపిన విషయం తెలిసిందే. అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న పొటో ఒకటి కూడా గతంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫొటోలో తారకరత్న క్లీన్ షేవ్ తో కనిపించారు. 

ఢిల్లీ లిక్కర్ స్కాం.. ఇక ఎమ్మెల్సీ కవిత వంతేనా?

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ పరంపరలో తరువాతి వంతు తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వంతేనా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అసలు ఇప్పటి వరకూ జరిగిన అరెస్టులు తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్నాయి సౌత్ లాబీలో కీలకమైన వ్యక్తుల్ని సీబీఐ, ఈడీ   అరెస్టు చేసుకుంటూ వెళ్తున్నాయి. అయితే ఇప్పటికే అరెస్టు కావలసిన  అరుణ్ రామచంద్ర పిళ్లై, అప్రూవర్ గా మారబోతున్నరన్న సమాచారం నేపథ్యంలో కవిత చుట్టూ ఉచ్చు గట్టిగానే బిగుసుకుందన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే రామచంద్ర పిళ్లై కవిత బినామీగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో చురుకుగా వ్యవహరించారని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని చార్జిషీట్ లో కూడా పొందుపరిచాయి. రామచంద్ర పిళ్లై అప్రూవర్ గా మారడం నిజమైన పక్షంలో కవితకు చిక్కులు తప్పవని అంటున్నారు.  ఇప్పటికే కవితను ఒక సారి ప్రశ్నించడం జరిగింది. అప్పుడే మరో సారి విచారణకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాల్సి ఉంటుందని చెప్పారు.  గతంలో కవితను హైదరాబాద్ లోని ఆమె నివాసంలో విచారించారు. అయితే మరో సారి విచారణకు మాత్రం ఆమె సీబీఐ ఎక్కడకు రమ్మంటే అక్కడకు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటి దాకా లిక్కర్ స్కాంలో జరిగిన అరెస్టులను గమనిస్తే విచారణకు పిలిచి, విచారణ అనంతరం చేసినవే. ఇక కవిత విషయానికి వస్తే.. ఢల్లీ లిక్కర్ స్కామ్ చార్జిషీట్ లో ఈడీ కవిత పేరు ప్రస్తావించింది. దీంతోఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోందని చెప్పవచ్చు. ఈ కుంభకోణంలో ఈడీ, సీబీఐల దూకుడు గమనిస్తే కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోందనే న్యాయనిపుణులు సైతం అంటున్నారు.  ఈ కుంభకోణంలో ఇప్పటికే కవితకు సన్నిహితులుగా ఉన్నవారిని విచారించి, కొందరిని అరెస్టు చేసిన సీబీఐ కవితను కూడా  ఆమె నివాసంలో సుదీర్ఘంగా విచారించింది. దాదాపు ఏడున్నర గంటల పాటు కవితను విచారించిన సీబీఐ.. ఆ విచారణ ముగిసిన అనంతరం ఆమెకు మరో నోటీసు జారీ చేసింది. తొలి నోటీసు సీఆర్పీసీ 160కింద ఇచ్చిన సీబీఐ.. ఆ నోటీసు మేరకు విచారణ పూర్తయిన తరువాత ఇచ్చిన నోటీసు సీఆర్పీసీ 91 కింద ఇచ్చింది. అంటే తొలి నోటీసులో ఆమె వివరణ తీసుకుందుకు మాత్రమే నంటూ ఆమె ఎక్కడ కావాలంటే అక్కడ విచారణ జరుపుతామని పేర్కొన్న సీబీఐ.. ఆమె   ఎంపిక చేసుకున్న విధంగా ఆమె నివాసంలోనే విచారించింది. అయితే రెండవ సారి జారీ చేసిన నోటీసులో మాత్రం ఆమెకు అటువంటి వెసులు బాటు ఇవ్వలేదు. ఈ సారి  సీబీఐ తాను ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఆమె విచారణ నిమిత్తం వెళ్లాల్సి ఉంటుంది. తొలి నోటీసు మేరకు ఆమె నివాసానికి వెళ్లి దాదాపు ఏడున్నర గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన సీబీఐ అధికారులు..మలి నోటీసుకు సంబంధించి మాత్రం సమయం, తేదీ, ప్రాంతం తరువాత తెలియజేస్తామని పేర్కొన్నారు.  విచారణకు వచ్చేముందు ధ్వంసం చేసి ఫోన్లు, లిక్కర్ స్కాంకు సంబంధించిన డాక్యుమెంట్లు  అన్నిటినీ తమకు సమర్పించాల్సి ఉంటుందని నోటీసులో పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇవన్నీ కూడా సాక్ష్యాలుగా పరిగణిస్తారు.  మలి నోటీసు మేరకు కవితను విచారించిన అనంతరం ఆమెను లిక్కర్ స్కాం కేసులో నిందితురాలిగా చేర్చే అవకాశాలున్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు.  ఇక ఫోన్ల ధ్వంసం సంబంధించిన కచ్చితమైన   నిర్దారణకు వచ్చిన తరువాతనే  సీబీఐ అధికారులు ఆమెను సీఆర్పీసీ 91 కింద నోటీసు జారీ చేశారని భావిస్తున్నారు. సీబీఐ కోరిన మేరకు కవిత ఆ వివరాలన్నీ అందించితే ఒక ఇబ్బంది, అందించకుంటే మరో ఇబ్బంది అన్నట్లుగా ఆమె ఇరుక్కున్నారని న్యాయనిపుణులు అప్పట్లోనే అభిప్రాయపడ్డారు.   ఈ కేసులో ఇప్పటి వరకూ సీబీఐ విచారణ తీరును గమనిస్తున్న వారు కవితను సీబీఐ హస్తినకు పిలిపించుకుని విచారణ జరిపే అవకాశాలే మెండుగా ఉన్నాయంటున్నారు. 

కోతికి పెళ్లి సరదా!

వివాహ వేడుక పై ఓ కోతికి సరదా పుట్టింది. పెళ్లి తంతును ఎన్నిసార్లు గమనించిందో ఏమో.. అత్యంత ముఖ్యమైనది ముహూర్త సమయానికి పెళ్లి కూతురూ, పెళ్లి కొడుకూ ఒకరి తలపై ఒకరు పెట్టుకుని జీలకర్రా బెల్లంకు ఉన్న ప్రాముఖ్యత అర్దమైంది. అందుకే ఆ కోతి పెళ్లి కొడుకు తలపై పెళ్లి కూతురు తీసుకు వెళ్లిన జీలకర్రా బెల్లాన్ని అపహరించుకుపోయింది. నిజమే.. నెట్టింట ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే ఆ కోతి కొంటెతనం అర్ధమౌతుంది. ఎక్కడ జరిగింది.. ఎప్పుడు జరిగింది అన్నది తెలియలేదు కానీ.. పెళ్లి సందడిలో ఓ కోతి ప్రత్యక్షమైంది. తలంబ్రాలు పోసుకుంటున్న నవదంపతుల వద్దకు వెళ్లింది. వారి తలపై ఉన్న జీలకర్ర బెల్లం ఎత్తుకుని ఎలా వచ్చిందో అలాగే వెళ్లిపోయింది. అందరూ ఒక్క క్షణం నిర్ఘాంత పోయినా  వెంటనే తేరుకుని హాయిగా నవ్వుకున్నారు. ఆ కోతి కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటోందని వ్యాఖ్యలు చేశారు. 

మంత్రి విడదల రజని.. సినీ నిర్మాతగా కొత్త అవతారం!

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఇప్పుడు తన దృష్టిని టాలీవుడ్‌పై ఫోకస్ చేశారు. సినిమా  నిర్మాతగా ఆమె కొత్త అవతారం ఎత్తబొతున్నారు. ఇందు కోసం ఇప్పటికే  హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో మంత్రి విడదల రజిని కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. సినిమాలపై ఆసక్తితోనే ఆమె ఈ రంగంలోకి అడుగు పెడుతున్నట్లు ఫిల్మ్ నగర్ తో పాటు, వైసీపీలో కూడా చెప్పుకుంటున్నారు.  రజనీ నిర్మాలగా   తొలి సినిమాకు కథ కూడా సిద్ధమైందని అంటున్నారు.  చిత్ర దర్శకుడు, హీరో ఇత్యాది విషయాలపై త్వరలోనే ఒక స్పష్టత వస్తుందని చెబుతున్నారు.      సినిమా భారీ బడ్జెట్ తోనే విడదల రజని నిర్మించబోయే సినిమా తెరకెక్కబోతోందని  ఫిలింనగర్‌ వర్గాలు చెబుతున్నాయి.   2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం కోసం.. యూఎస్ నుంచి ఎన్నారైల బృందం ఆంధ్రప్రదేశ్‌కు వచ్చింది. వారిలో విడదల రజినీ కూడా ఒకరు. అలా ఆ ఎన్నికల్లో రజని తెలుగుదేశం పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు.   2017లో విశాఖపట్నంలో నిర్వహించిన మహానాడు వేదికపై నుంచి తెలుగుదేశం అధినేత, అప్పటి సీఎం చంద్రబాబు నాయుడిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆ తర్వాత 2018లో  వైసీపీలో చేరి... 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి  విజయం సాధించారు. జ గన్ మలి కేబినెట్‌లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా విడదల రజినీ బాద్యతలు చేపట్టారు. అయితే తొలిసారి ఇలా ఎమ్మెల్యే అయి.. అలా మంత్రి పదవి చేపట్టి విడదల రజినీ.. వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమె.. అడుగులు పాలిటిక్స్ నుంచి సినిమా రంగం వైపు  పడుతుండటం ఆసక్తి కలిగిస్తోంది.  జగన్ పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలకు టాలీవుడ్‌లోని నటీనటులు, దర్శక, నిర్మాతలతో స్నేహ సంబంధాలు, బంధుత్వాలు ఉన్న సంగతి తెలిసిందే.  ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడు నర్సిపట్నం ఎమ్మెల్యే పి. ఉమా శంకర్ గణేశ్, మరో దర్శకుడు కురసాల కళ్యాణ కృష్ణ సోదరుడు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఇక చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పలు చిత్రాల్లో నటించారు.  విశాఖ ఎంపీ సత్యనారాయణ సైతం.. పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా.. నటిస్తున్నారు కూడా. నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా.. సినీమారంగం నుంచే రాజకీయాలలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక రాజమండ్రి ఎంపీ మారగాని భరత్ కూడా సినిమాలో నటించారు. అలాగే ప్రముఖ మాటల రచయిత కోన వెంకట్ సమీప బంధువు కోన రఘుపతి బాపట్ల ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక ప్రముఖ నటుడు అలీ, పోసాని కృష్ణమురళీ ఉండనే ఉన్నారు.  అలాగే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.  తాజాగా ఈ జాబితాలో మంత్రి విడదల రజినీ   చేరారు.

ఏపీకి కొత్త గవర్నర్.. జగన్ సర్కార్ కు ఇక చుక్కలేనా?

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్‌ను కేంద్రం చత్తీస్ ఘడ్‌కు  బదిలీ చేసింది. ఆయన స్థానంలో గత నెలలో   పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను నియమించింది. అయోధ్య కేసుతో పాటు ట్రిపుల్ తలాక్ కేసులపై తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తుల ధర్మాసనంలో అబ్దుల్ నజీర్ కూడా ఒకరు. అటువంటి ఆయనకు   అలా సుప్రీం కోర్టు  న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారోలేదో ఇలా గవర్నర్ గా పదవి ఇచ్చేసింది కేంద్రం. ఏపీ గవర్నర్ బదలీతో పాటు మరికొన్నిరాష్ట్రాల  గవర్నర్ల బదలీ కూడా జరిగినప్పటికీ,  ఏపీ గవర్నర్ బదిలీ మాత్రం రాజకీయంగా చర్చనీయాంశం కావడంతో పాటు, రాజకీయ ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. బిశ్వభూషణ్ హరిచందన్ గవర్నర్ గా యాక్టివ్ గా లేరు. ఇందుకు ఆయన వయస్సు కూడా ఒక కారణం అయ్యి ఉండవచ్చు.  అలాగే   ఏపీ ప్రభుత్వం పంపుతున్న వివాదాస్పద బిల్లులు, నిర్ణయాలన్నింటికీ ఆమోద ముద్ర వేస్తూ వచ్చారు. ఆయన ఆమోదించిన పలు బిల్లులు కోర్టుల్లో వీగిపోయాయి. దీంతో గవర్నర్ పై   విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం గవర్నర్ ను హామీగా చూపించి రుణాలు తీసుకున్నా ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. ఏపీ ప్రభుత్వం.. కేంద్రంతో సన్నిహితంగా ఉంటుంది. గవర్నర్  బిశ్వభూషణ్ హరి చందన్‌ను   రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా మద్దతుగా ఉండటానికి ఇది కూడా ఒక కారణం అని ఇప్పటి వరకూ అంతా అనుకుంటూ వచ్చారు. అయితే హఠాత్తుగా ఇప్పుడు కేంద్రం ఆయనకు స్థాన భ్రంశం కల్పించడంతో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అన్న చర్చ మొదలైంది.  ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు దాదాపు ఏడాదిన్నర కాలం ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల వేడి సెగలు కక్కుతోంది. అలాంటి వేళ..  ఆకస్మాత్తుగా గవర్నర్‌ను బదిలీ చేసి.. ఆయన స్థానంలో అదీ ఇటీవలే పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తిని నియమించడం పట్ల..  పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే మరోవైపు వైఎస్ వివేకా హత్య కేసులో విచారణను సీబీఐ వేగవంతం చేసింది... ఈ కేసులో పాత్రదారులు ఎవరన్నది తెలిసినా.. సూత్రధారులు సైతం బయటకు వచ్చే సమయం అసన్నమైందని అంటున్నారు.  మరోవైపు  ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా విశ్వభూషణ్ హరిచందన్...  జగన్ ప్రభుత్వం మధ్య ఎక్కడ ఎలాంటి పొరపొచ్చలు  లేవనే సంగతి కూడా అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల జగన్ ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన బకాయిలు ఇప్పించాలంటూ.. ఉద్యగ సంఘం నాయకుడు సూర్యనారాయణ... రాజ్‌భవన్‌కు వెళ్లి వినతిపత్రం సమర్పించి రావడం.. ఆ తర్వాత ఉద్యోగ సంఘాల నాయకుల మధ్య కొద్దిపాటి ఘర్షణ వాతావరణం నెలకొనడం.. ఆ తర్వాత గవర్నర్‌తో భేటీకి ఉద్యోగ సంఘం నాయకుడికి అపాయింట్‌మెంట్ ఎవరు ఇప్పించారంటూ ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగి ఆరా తీయడం.. ఆ తర్వాత గవర్నర్ కార్యదర్శి ఆర్పీ సిసోడియాపై బదిలీ వేటు పడిందనే ఓ చర్చ  వాడి వేడిగా సాగింది. అలా గవర్నర్ కార్యదర్శి బదిలీ అయిన కొద్ది రోజులకే గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కూడా బదిలీ కావడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాశమైంది. కానీ గవర్నర్ బదిలీ  ఇంత ఆకస్మాత్తుగా జరుగుతుందని ఎవరూ అసలు ఊహించలేదు.   అదీకాక... పక్కనే ఉన్న తెలంగాణలో గవర్నర్ తమిళ సై సౌందర్‌రాజన్‌కు సీఎం కేసీఆర్ మధ్య అగాధం నెలకొన్న సంగతి విదితమే. గవర్నర్, బీఆర్ఎస్ సర్కార్ మధ్య విభేదాలు బహిరంగ రహస్యమే. గవర్నర్ ప్రభుత్వ వైఖరిని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ మంత్రులు కూడా గవర్నర్ పై మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో తెలంగాణకు కొత్త గవర్నర్ వస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది.    తెలంగాణలో గవర్నర్‌కు, సీఎం కేసీఆర్  మధ్య కోల్డ్ వార్ జరుగుతోన్నా.. ఆ  రాష్ట్రంలో గవర్నర్  జోలికి వెళ్లకుండా.. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్ ను బదలీ చేయడం పలు ప్రశ్నలకు తావిచ్చింది.  ఆయోధ్య తీర్పు వెలువరించిన అయిదుగురు జడ్జిల ధర్మాసనంలో జస్టిస్ అబ్దుల్ నజీర్ ఏకైక మైనారిటీ న్యాయమూర్తి,  అలాగే ట్రిపుల్ తలాక్ చెల్లదని తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు ధర్మాసనంలో కూడా జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏపీ గవర్నర్ గా నియమితులు కావడంతో ఏపీ విషయంలో బీజేపీ వ్యూహం ఏమిటి? వైఖరి ఏమిటి? ముఖ్యంగా ఏపీ రాజధాని విషయంలో కేంద్రం పార్లమెంటు వేదికగా తన వైఖరి ప్రకటించడం, అలాగే  ఈ నెలాఖరులో సుప్రీం తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో కొత్త గవర్నర్ రాక ప్రాధాన్యత సంతరించుకుంది.

రాజధాని లేని రాష్ట్రం.. జగన్ నిర్వాకం.. పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం

మొండివాడు రాజుకంటే బలవంతుడు, ఇక రాజే మొండివాడయితే, ఆ రాజ్యం, నేటి ఏపీ  అవుతుంది. ఆంధ్ర రాష్ట్రం ముక్కలై, నవ్యాంధ్ర  ప్రదేశ్ రాష్టం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలైంది, అయినా ఇంతవరకు,రాజధాని లేని రాష్ట్రంగానే ఏపీ  మిగిలిపోయింది. నిజానికి, రాష్ట్ర విభజన జరిగిన వెంటనే, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపుతో, అందరి ఆమోదంతో, అమరావతి కేంద్రంగా దివ్యభవ్య రాజధాని నిర్మాణానికి, శ్రీకారం చుట్టారు.ఆ ప్రాంత రైతులు, నభూతో న భవిష్యతి అన్న విధంగా, రాజధాని కోసం 33,700 ఎకరాల భూమిని, రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ, సిఆర్‌డిఎకు స్వచ్ఛందంగా ఇచ్చారు. స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజధానికి శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అయితే  బాలారిష్టాలను దాటుకుని, రాజధానికి ఒక రూపం స్వరూపం వస్తున్న సమయంలో, రాష్ట్రంలో అధికారం చేతులు మారింది. 2019 ఎన్నికల్లో, ‘ఒక్క ఛాన్స్’ అభ్యర్ధనతో అధికారంలోకి వచ్చిన వైసీపే అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల ఆశలపై నీళ్ళు చల్లారు. అమరావతే రాజధానిగా ఉంటుందని ప్రజలకు వాగ్దానం చేసిన ఆయన,మాట తప్పారు, మడమ తిప్పారు. ప్రతిపక్ష నేతగా శాసన సభలో అమరావతికి జై కొట్టిన జగన్ రెడ్డి, అదే సభలో  ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే,అధికార వికేద్రీకరణ వంకన మూడు రాజధానుల ప్రతిపాదనతో అగ్గి రాజేశారు. 2019 డిసెంబరు 17న అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడి మూడు రాజధానుల ప్రకటన చేశారు.ముఖ్యమంత్రి ప్రకటనతో ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని లేకపోవడమే రాష్ట్రాభివృద్ధికి పెద్ద ప్రతిబంధకంగా మారింది. 2019లో జగన్ ప్రభుత్వం ఏర్పడగానే అమరావతిని కాదని మూడు రాజధానుల అంశం తెరమీదకు రావడం తెలిసిందే. ఇక అప్పటి నుంచీ రాష్ట్రానికి రాజధాని ఏదన్న విషయంలో ఎర్నడిన గందరగోళం రాష్ట్ర అభివృద్ధని ప్రశ్నార్థకం చేసేసింది. జగన్ సర్కార్ ఏర్పడిన వెంటనే అమరావతి అభివృద్ధి ఆగిపోయింది. విశాఖ, కర్నూలు అంటూ ప్రభుత్వం మాటలు చెప్పిందే కానీ.. ఆ దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు పడిన దాఖలాలు లేకుండానే నాలుగేళ్లు గడిచిపోవచ్చాయి. ఇక అదే రాజధాని విషయంలో ఉన్న ప్రతిష్ఠంభన మీమాంస కారణంగా రాష్ట్రంలో అసలు పాలన జరుగుతోందా? లేదా అన్నది ఓ పెద్ద సందేహంగా మారిపోయింది. విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా, అమరావతి శాసన వ్యవహారాల రాజధానిగా ఉంటాయని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు అంటూ ముఖ్యమంత్రి అ జగన్ ప్రకటించిన తరువాత ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమరావతే రాజధాని అంటూ లోక్ సభ సాక్షిగా ప్రకటించే వరకూ.. ఏపీ అభివృద్ధి విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కేంద్రం అంత విస్పష్టంగా ప్రకటించిన తరువాత కూడా విశాఖ రాజధాని అంటూ మంత్రులు చేస్తున్న ప్రకటనలు అయోమయాన్ని ఇంకా కొనసాగించేందుకే ఉపయోగపడుతున్నాయి. ఇక ఈ నెలలో ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. అయితే.. కోర్టులో ఉన్న అంశంపై ముఖ్యమంత్రి జగన్ హస్తినలో జరిగిన ఏపీ గ్లోబల్ సమ్మిట్ సన్నాహక సమావేశంలో చేసిన విశాఖ రాజధాని అన్న వివాదాస్పద వ్యాఖ్యలు సైతం గందరగోళాన్ని మరింత పెంచేవిగానే ఉణ్నాయి. ఇలాంటి గందరగోళం రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాలను ఎంతగా దెబ్బతీస్తోందో ఈ  మూడున్నరేళ్ల పైబడిన కాలంలో చూస్తూనే ఉన్నాము. 2015 ఏప్రిల్ లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే.. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించింది. అప్పటి నుంచీ రాజధాని విషయంలో అయోమయం, గందరగోళం కొనసాగుతూనే ఉంది.   ఇన్నేళ్ల పాటు రాజధాని అన్నది లేకుండా రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయింది. పలు అవకాశాలను చేజార్చుకుంది. పెట్టుబడుల విషయంలో అధ:పాతాళానికి దిగజారిపోయింది.  

ఉభయ తారకం

ఆంధ్రప్రదేశ్ విషయంలో బీజేపీ తీరేమిటో? వైఖరి ఏమిటో అంతుబట్టని విధంగా ఉంది. ఏ విధంగా చూసుకున్న ఏపీలో బీజేపీకి ఇసుమంతైనా బలం లేదు.  అయిన దానికీ కాని దానికీ మీడియా ముందుకు వచ్చి పాండిత్య  ప్రదర్శన చందంగా ఏవో మాటలు మాట్లాడే ఒకరిద్దరు నేతలు తప్ప బీజేపీకి రాష్ట్రంలో నాయకత్వం అన్నది దాదాపు పూజ్యం. అదే విధంగా జనాదరణ విషయంలో కూడా ఆ పార్టీ పరిస్థితి చెప్పుకోవడానికి ఏమీ లేదన్న చందంగానే ఉంది. తెలుగుదేశంతో పొత్తు లేని ఏ సందర్భంలోనూ ఆ పార్టీ ఏపీలో ఒక్కటంటే ఒక్క అసెంబ్లీ స్థానం కూడా గెలుచుకున్న దాఖలాలు లేవు. తగుదునమ్మా అని ఇటీవలి కాలంలో ఒంటరిగా పోటీ చేసిన ఉప ఎన్నికలలో కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పరిస్థితి బీజేపీది. అలాంటి బీజేపీ ఏపీలో వేగంగా సంభవిస్తున్న రాజకీయ పరిణామాల పట్ల ఎందుకు అంత ఉదాశీనంగా ఉంటుందన్నది పరిశీలకులను సైతం ఆశ్చర్య పరుస్తోంది. గత ఎన్నికలలో ఒంటరిగా పోటీలోకి దిగిన బీజేపీ ఏపీలో ఒక్క స్థానం కూడా గెలుచుకోలేదు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న కారణాని ఏపీలో జరిగే ప్రతి అంశంలోనూ ఆ పార్టీ తీరేమిటన్నదే ప్రాధాన్యతా అంశంగా మారిపోయింది. అలాంటి ప్రతి ప్రాధాన్యత అంశంలోనూ బీజేపీ వ్యవహార తీరు తామరాకు మీద నీటుబొట్టు చందంగానే ఉంది. మూడు రాజధానుల విషయంలో జగన్ ప్రభుత్వం తీరుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదా అన్న అనుమానాలు కలిగేలా మోడీ ప్రభుత్వం వ్యవహరించింది. తీరా పార్లమెంటు వేదికగా విషయం తేల్చాల్సి వచ్చే సరికి జగన్ సర్కార్ ను నట్టేట్లో ముంచింది. ఇలా ఏ విషయం తీసుకున్నా.. ఏపీ విషయంలో బీజేపీ ఆలోచన ఏమిటి? తీరేమిటి? అసలు ఏపీ విషయంలో ఆ పార్టీకి ఉన్న ఆశలేంటి? రాజకీయంగా ఏపీ నుంచి ఆ పార్టీ ఆశిస్తున్నదేమిటి? అన్న ప్రశ్నలకు తలలు పండిన రాజకీయ పండితులు కూడా తలలు బద్దలు కొట్టుకునేంత మిస్టీరియస్ గా వ్యవహరిస్తోంది. రాజకీయంగా ఏపీలో బీజేపీకి జనసేన మిత్రపక్షం. అదే సమయంలో తెలుగుదేశం వైరి పక్షం. గత ఎన్నికలు ముందు దాకా ఎన్డీయే భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం.. ఆ తరువాత ఏపీ విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందంటూ తెగతెంపులు చేసుకుంది. అప్పటి నుంచీ ఇరు పార్టీల మధ్యా వ్యవహారం ఉప్పు, నిప్పుగానే ఉంది. కానీ మళ్లీ అసెంబ్లీ ఎన్నికల వేడి రాష్ట్రంలో రాజుకోవడం ఆరంభించేసరికి బీజేపీకి తెలుగుదేశం విషయంలో పరస్పర రాజకీయ ప్రయోజనాలు గుర్తుకు వచ్చాయి. కేంద్రంలో అధికారం పదిలం చేసుకోవాలంటే.. అంటే మోడీ సర్కార్ హ్యాట్రిక్ సాధించాలంటే.. ప్రతి పార్లమెంటు సీటు ప్రధానమే అన్న విషయం గుర్తుకు వచ్చింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో ఆ పార్టీ భారీగా ఆశలు పెట్టుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ప్రస్తుతం తమ అధీనంలో అంటే తాము అధికారంలో ఉన్న కర్నాటకలో మరో సారి అధికారం చేజిక్కించుకోవాలంటే అద్భుతం జరగాలన్న విషయం ఆ పార్టీకి అవగతమైంది. ఆ రాష్ట్రంలో లోక్ సభ స్థానాలలో విజయం కూడా కష్టమేనని అర్ధమైంది. అందుకే బీజేపీ తెలంగాణపై బాగా ఆశలు పెంచుకుంది. ఇక ఏపీ విషయానికి వస్తే అక్కడ అధికారం ఎటూ చాన్స్ లేని విషయమే కావడంతో, ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ తో పొత్తు పెట్టుకుంటే.. పార్లమెంటులో ఆ పార్టీ ఎంపీల మద్దతు పొందే అవకాశం ఉంటుందన్నది ఆ పార్టీ వ్యూహం, ఆశ, ఆలోచన. ఆ విధంగా చూస్తే.. ఏపీలో పొత్తల విషయంలో ఆ పార్టీ ఒకింత చురుకుగా, జోరుగా, కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే అందుకు భిన్నంగా బీజేపీ ఏపీ విషయంలో అనుసరిస్తున్న నిర్లిప్త, ఉదాశీన వైఖరి ఒకింత ఆశ్చర్యం కలిగించక మానదు. ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్రంలో ఎంతో కొంత జనాదరణ ఉన్న జనసేనతో మైత్రీ బంధంలో ఉంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు రెండు తెలుగు రాష్ట్రాలలోనే అపార అభిమాన జన సందోహం ఉంది. మరో వైపు రాష్ట్రంలో ప్రధాన విపక్షం తెలుగుదేశం మాజీ మిత్రపక్షం. ఆ పార్టీకి రాష్ట్రంలో బలమైన కార్యకర్తలు ఉన్నారు. పటిష్ట నిర్మాణం ఉంది. జగన్ సర్కార్ ను దీటుగా ఎదుర్కొనే సత్తా ఉంది. బీజేపీ ప్రస్తుత మిత్ర పక్షం జనసేన, మాజీ మిత్రపక్షం తెలుగుదేశం వచ్చే ఎన్నికలలో కలిసి అడుగులు వేయడానికి ఇప్పటికే దాదాపుగా ఒక అవగాహనకు వచ్చేశాయి. ఈ పరిస్థితుల్లో కూడా బీజేపీ ఉదాశీనంగా వ్యవహరించడం పట్ల రాజకీయవర్గాలలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వచ్చే ఎన్నికలలో బీజేపీ వ్యూహంపై పలు విశ్లేషణలకు తావిచ్చింది. అసలింతకీ బీజేపీ జనసేన, తెలుగుదేశం పొత్తు విషయంలో పట్టీపట్టనట్లు వ్యవహరించడం వెనుక ఉన్న వ్యూహం ఏమిటి? అధికార వైసీపీతో అవగాహనతో వచ్చే ఎన్నికలను ఎదుర్కొనేందుకు రెడీ అయ్యిందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఏపీలో బీజేపీ, జనసేన పొత్తులో ఉండగా, బీజేపీ వైసీపీతో జట్టు కట్టడం రాజకీయంగా ఏమంత ప్రయోజనం ఉండదని బీజేపీ శ్రేణులే చెబుతున్నాయి.  అదీకాక ఏపీలో తెలుగుదేశం కు వ్యతిరేకంగా వెళితే ఆ ప్రభావం తెలంగాణలో బీజేపీపై పడుతుందన్న భావన కూడా బీజేపీ అగ్రనేతల్లో ఉంది. అందుకే ఉభయ తారకంగా ఏపీ రాజకీయాల్లో బీజేపీ ప్రేక్షక పాత్రకే పరిమితం అయితే బెటర్ అన్న అభిప్రాయం ఆ పార్టీ టాప్ బ్రాస్ లో కనిపిస్తోంది. అంటే ఏపీ రాజకీయాలలో తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లినా, బీజేపీ మాత్రం జనసేనతో తన మిత్రత్వాన్ని వదులు కోదు. అంతే కాకుండా పొత్తులో భాగంగా తెలుగుదేశం, జనసేనల సీట్ల సర్దుబాటులో జనసేన కోటాకు వచ్చిన సీట్లలో రెండో మూడో తనకు దక్కేలా జనసేనతో బీజేపీ అవగాహన కుదుర్చుకునే అవకాశం ఉంది. అలాగే ఒకటో రెండో పార్లమెంటు సీట్లను కూడా కోరే అవకాశం ఉంది. ఈ ఏర్పాటు వల్ల తెలంగాణ ఎన్నికలలో జనసేన, తెలుగుదేశం మద్దతు కమలం పార్టీకి లభిస్తుంది. ప్రస్తుతానికైతే బీజేపీ గేమ్ ప్లాన్ ఇదేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   

లోకేష్ పాదయాత్ర.. సజ్జల కుమారుడి ఓవరేక్షన్..

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది. రోజు రోజుకూ పెరుగుతున్న ప్రజాదరణతో జన ప్రభంజనంలా సాగుతున్న పాదయాత్రను డీఫేమ్ చేయడమే లక్ష్యంగా అధికార వైసీపీ సోషల్ మీడియా టీమ్ ఇప్పటి వరకూ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో వైసీపీ తనకు మాత్రమే తెలిసిన రివర్స్ ప్రతిభకు పదును పెట్టింది. దీంతో గ్రామంలోకి లోకేష్ పాదయాత్ర ప్రవేశించడానికి ముందే ఖాళీ రహదారులను డ్రోన్ ల ద్వారా చిత్రించి లోకేష్ పాదయాత్రకు జనం కరవయ్యారని బిల్డప్ ఇచ్చుకోవడానికి నానా తంటాలూ పడుతోంది. జనం లేని ఖాళీ ప్రాంతాలను ఫొటోలు తీసి పంపించాలంటూ పోలీసులపై ఒత్తిడి తెస్తోంది. అలా చేయకపోతే సస్పెన్షన్ తప్పదంటూ హెచ్చరికలూ చేస్తోంది. దీంతో అనివార్య పరిస్థితుల్లో ఏ రోజు కారోజు లోకేష్ పాదయాత్ర షెడ్యూల్ ప్రకారం ఆయన పర్యటించబోయే గ్రామాలలో ఆయన కంటే ముందే పోలీసులు ద్విచక్రవాహనాలలో చుట్టేసి ఖాళీ రోడ్లను, మైదానాలను ఫొటోలు తీస్తున్నారు. అక్కడితో ఆగకుండా డ్రోన్ ల ద్వారా ఖాళీ ప్రదేశాలను చిత్రీకరిస్తున్నారు. వాటన్నిటినీ ఎప్పటికప్పుడు వైసీసీ సోషల్ మీడియా కార్యాలయానికి పంపిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ప్రభుత్వ సలహాదారు సజ్జల కుమారుడు సజ్జల భార్గవ రెడ్డి ఆధ్వర్యంలో 50 మందితో కూడిన బృందం లోకేష్ పాదయాత్రకు జనం కరవయ్యారు అని ఎస్టాబ్లిష్ చేయడమే లక్ష్యంగా పని చేస్తోంది. ఈ బృందమే తమకు అందిన ఫొటోల ఆధారంగా లోకేష్ పాదయాత్ర విఫలం అంటూ సామాజిక మాధ్యమంలో ట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందు కోసం లోకేష్ పాదయాత్రలో జనం లేరు అని కనిపించేలా తమకు అందిన ఫొటోలను ఉపయోగిస్తున్నారు. ఇందు కోసం తమకు ఫొటోలు, డ్రోన్ చిత్రీకరణలను పంపించాలంటూ పోలీసులపై తీవ్ర మైన ఒత్తడి తీసుకు వస్తున్నారు. అసలు ఇప్పటికే లోకేష్ పాదయాత్రకు పోలీసులు ‘పై’ నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడ ఆయన ప్రసంగించబోయినా అడ్డుకుంటూ, ఆఖరికి ఆయన మైక్ ను లాగేసుకోవడమే కాకుండా, నిలబడిన స్టూల్ ను కూడా గుంజుకున్న పరిస్థితి. ఇది చాలదన్నట్లు లోకేష్ పాదయాత్రకు జనాదరణ లేదని చిత్రీకరించేందుకు పోలీసులు పై వారి ఒత్తిడి మేరకు చేస్తున్న ప్రయత్నాలు నవ్వు పుట్టిస్తున్నాయి. పోలీసుల ప్రయత్నాలపై సామాజిక మాధ్యమంలో సెటైర్లు పేలుతున్నాయి. అలాగే లోకేష్ పాదయాత్ర సాగే గ్రామాలలో పోలీసులు ముందుగానే ద్విచక్రవాహనాల్లో పర్యటించి పాదయాత్రలో పాల్గొంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనవలసి వస్తుందంటూ హెచ్చరికలు కూడా జారి చేస్తున్నారని పలు గ్రామాల ప్రజలు మీడియా ముఖంగా ఆరోపణలు గుప్పించారు. సజ్జల కుమారుడి అత్యుత్సాహంతో లోకేష్ పాదయాత్రకు మరింత క్రేజ్ పెరుగుతోందన్న అభిప్రాయం కూడా సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఎంతగా అడ్డుకోవాలని ప్రయత్నిస్తే అంతకు రెండింతలుగా జనం లోకేష్ కు మద్దతుగా పాదయాత్రలో భాగం పంచుకునేందుకు వస్తున్నారని తెలుగుదేశం శ్రేణులు చెబుతున్నాయి. లోకేష్ పాదయాత్రకు జనం లేరంటూ వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఎంతగా ప్రచారం చేస్తుంటే అంతకు రెండింతలుగా నెటిజన్లు లోకేష్ పాదయాత్రకు జనం ప్రభంజనంలా కదిలి వస్తున్న దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారని చెబుతున్నారు. 

ఆసీస్ తో తొలి టెస్టు.. టీమ్ ఇండియా భారీ విజయం

ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ ను టీమ్ ఇండియా ఘన విజయంతో ప్రారంభించింది. తొలి టెస్టులో  టీమ్ ఇండియా ఇన్నింగ్స్ 132 పరుగుల భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. స్పిన్ కు అనుకూలించిన నాగ్ పూర్ పిచ్ పై ఆస్ట్రేలియా పూర్తిగా తేలిపోయింది. బౌలింగ్ లో, బ్యాటింగ్ లో ఇండియా పూర్తిగా పై చేయి సాధించింది. భారత్ 400 పరుగులు చేసిన ఇదే పిచ్ పై ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లోనూ కలిపి కూడా ఆ మాత్రం పరుగులు చేయలేకపోయింది. స్పిన్ పిచ్ కోసం ఆస్ట్రేలియా ముందుగానే సిద్ధమై ముగ్గురు స్పిన్నర్లతో రంగంలోనికి దిగినా ఫలితం లేకపోయింది. తొలి టెస్టు ఆడుతున్న మర్ఫీ వినా మిగిలిన వారెవరూ భారత బ్యాటర్లను ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. మర్ఫి తన తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లోనే 7 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.  ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియాతో నాలుగు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా నాగపూర్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ లో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల ఆధిక్యతతో విజయం సాధించింది. మ్యాచ్ మూడో రోజే ముగిసింది. స్పిన్ కు అనుకూలించిన ఈ పిచ్ పై భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాను 177 పరుగలకే ఆలౌట్ చేసిన ఇండియన్ బౌలర్లు, రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ ఇన్నింగ్స్ ను 92 పరుగులకే చాప చుట్టేశారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 400 పరుగులు చేసిన సంగతి విదితమే. స్కిప్పర్ రోహిత్ శర్మ అద్భుత సెంచరీతో చెలరేగాడు. ఆ తరువాత జడేజా, అక్షర్ పటేల్ లు హాఫ్ సెంచరీలతో మెరవడంతో టీమ్ ఇండియాకు  222 పరుగుల ఆధిక్యత లభించింది. జడేజా 70 పరుగులు చేయగా, అక్షర్ పటేల్ 84 పరుగులు చేశాడు.  రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్ ను భారత బౌలర్లు కుప్ప కూల్చారు. తొలి ఇన్నింగ్స్ లో జడేజా 5 వికెట్ల పడగొట్టగా, అశ్విన్ 3 వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ ఐదు వికెట్లు పడగొట్టాడు. జడేజా 2 వికెట్లు తీసుకున్నాడు.ఇక షమి 2 వికెట్లు, అక్షర్ పటేల్ 1 వికెట్ తీసుకున్నారు.   

తెలుగుదేశం, జనసేన పొత్తు గ్యారంటీ.. బీజేపీ పరిస్థితేంటి?

ప్రస్తుతం బీజేపీ మిత్ర పక్షంగా ఉన్న జనసేన వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి సాగేందుకు ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చింది.   ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వమని పవన్‌ పదేపదే చెప్పడం వెనుక అంతరార్థం ఇదేనని ఇరు పార్టీలూ కూడా చెబుతున్నాయి. ఇక సీట్ల సర్దుబాటు కుదరడం, పొత్తుపై అధికారిక ప్రకటన వెలువడటం తరువాయి అన్న రీతిలో ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో  తెలుగుదేశం,  జనసేనల ఎన్నికల పొత్తుపై సందేహాలు అనవసరం అని పరిశీలకులు సైతం జరిగిన, జరుగుతున్న పరిణామాలపై విశ్లేషణల్లో స్పష్టం చేస్తున్నారు.  పవన్‌, చంద్రబాబు ఇటీవల విజయవాడలో ఒక సంయుక్త సమావేశంలో కూడా   ఉభయులు వచ్చే ఎన్నికలలో కలిసి పోటీ చేయబోతునట్లు, ఇందులో భాగంగా త్వరలో   రోడ్‌ మ్యాప్‌ రూపొందించబోతున్నట్లు తెలిపారు. ఇక్కడే జనసేన, బీజేపీ మైత్రి విషయం సంగతేమిటన్న చర్చ తెరమీదకు వస్తోంది. జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తే జనసేన, బీజేపీల మధ్య ఉన్న మైత్రీ బంధం దాదాపు తెగిపోయినట్లేనని చెబుతున్నారు. బీజేపీతో మైత్రి కొనసాగినా, కొనసాగకపోయినా.. పెద్దగా ఫరఖ్ పడదని జనసేనాని భావిస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు.  జనసేన తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగితే.. ఆ కూటమి విజయం నల్లేరు మీద బండినడకేనన్న అభిప్రాయం.. రాజకీయ వర్గాలలోనే కాదు.. సామాన్య ప్రజానీకంలో కూడా వ్యక్త మౌతోంది. ఇరు పార్టీలకూ కలిసి కనీసం 44శాతం ఓట్లు ఉంటాయన్నది ఆ పార్టీల అంచనా,  అదే సమయంలో రాష్ట్రంలో అధికార పార్టీపై రోజు రోజుకూ పెరుగుతున్న వ్యతిరేకత తెలుగుదేశం, జనసేన కూటమికి మరింత బలంగా మారుతుందన్న విశ్లేషణలు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్ణా జిల్లాలలో తెలుగుదేశం, జనసేన పొత్త ప్రభావం చాలా చాలా ఎక్కువగా ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంత వరకూ వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేస్తూ వచ్చిన సీఎం జగన్ స్వరంలో కూడా మార్పు కనిపించింది. ఎలాగోలా అధికారంలోకి వస్తే చాలన్నట్లుగా ఆయన  మాటలూ, చేతలూ మారిపోయాయి. వరుస సమావేశాలతో పార్టీ శ్రేణులకూ దిశా నిర్దేశం చేయడానికి సిద్ధమౌతున్నారు. అదే సమయంలో జగన్ ప్రజలలోకి వెళ్లడానికి కూడా కార్యాచరణ రూపొందించుకున్నారు. అయితే పరిశీలకులు మాత్రం ఇవన్నీ దింపుడు కళ్లెం ఆశలేనని అంటున్నారు.  ఎందుకంటే ప్రజా వ్యతిరేకతను ఓట్లుగా మార్కుకునేందుకు అవసరమైన పటిష్టమైన పార్టీ నిర్మాణం, యంత్రాగం, నెట్ వర్క్ తెలుగుదేశం పార్టీకి ఉంది. అదే సమయంలో క్రౌడ్ పుల్ చేయగలిగిన కరిష్మా జనసేనాని పవన్ కల్యాణ్ కు ఉంది. అందుకే తెలుగుదేశం, జనసేనల పొత్తు ప్రభంజనం సృష్టిస్తుందన్న గుబులు అధికార వైసీపీలో రోజు రోజుకూ పెరిగిపోతుంది.  ఈ పరిస్థితుల్లో వైసీపీ ఆశ మొత్తం బీజేపీపైనే పెట్టుకుంది. ఆ పార్టీకి ఏపీలో ఓటు బ్యాంకు లేకపోయినా.. కేంద్రంలో అధికారంలో ఉంది కనుక తెరవెనుక సాయం చేస్తే చేకూరే ప్రయోజనంపైనే ఇప్పుడు వైసీపీ తన ఆశలన్నీ పెట్టుకుంది.   పవన్‌తోనే మా మైత్రి అని బీజేపీ ఏపీ అధ్యక్షుడు ఇటీవల ప్రకటించినా అది నాలుక చివరి మాటే తప్ప మరొకటి కాదని ఎవరికైనా ఇట్టే అర్దమైపోతుంది. ఎందుకంటే.. టీడీపీ జనసేనల మధ్య పొత్తు దాదాపు ఖరారైనట్లుగా పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నా.. జనసేనతో తమ కున్న మైత్రిని పదిలం చేసుకోవడానికి, మరింత పటిష్టం చేసుకోవడానికి బీజేపీ నుంచి ఇంత వరకూ వీసమెత్తు ప్రయత్నం కూడా జరగలేదు.  మరో వైపు జనసేన, బీజేపీ మైత్రి కొనసాగాలనీ, ఆ రెండు పార్టీలతో కలిసి పొత్తు ఉంటే విజయం నల్లేరు మీద బండి నడకే అవుతుందని తెలుగుదేశం భావిస్తోంది. అందుకే తెలంగాణలో అడుగులు బలంగా వేస్తోంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అధికారం చేజిక్కించుకునేంత బలం లేకపోయినా.. కనీసం పాతిక, ముఫ్ఫై నియోజకవర్గాలలో గెలుపు ఓటములను ప్రభావితం చేయగలిగే సత్తా ఆ పార్టీకి ఉంది. అందుకే తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ.. తెలంగాణలో తెలుగుదేశం సహకారం ఉంటే మేలని భావించేందుకు వీలుగా.. ఆ రాష్ట్రంలో బలప్రదర్శనకు చంద్రబాబు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభతో తెలుగుదేశం తెలంగాణలో ఇప్పటికీ ఒక బలీయమైన శక్తి అన్నది చాటిన చంద్రబాబు. త్వరలో మరి కొన్ని బహిరంగ సభలతో బీజేపీ దృష్టిని ఆకర్షించాలన్న వ్యూహంతో ఉన్నారు. అంటే తెలంగాణలో బీజేపీకి తెలుగుదేశం సహాయం, ఏపీలో తెలుగుదేశం పార్టీకి బీజేపీ సహకారం అన్న ఒప్పందం దిశగా కమలం పార్టీపై ఒత్తిడి తీసుకురావడమే చంద్రబాబు ఎత్తుగడగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఆ ఎత్తుగడ ఫలిస్తే.. అటు తెంగాణలో బీజేపీకి అధికారం, ఇటు ఏపీలో తెలుగుదేశం విజయం తథ్యమని పరిశీలకులు అంటున్నారు. అందుకే బీజేపీ రాష్ట్ర నాయకుల విమర్శలు, వ్యాఖ్యలపై తెలుగుదేశం నేతలు స్పందించడం లేదనీ పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద తెలంగాణలో తెలుగుదేశం సహకారం కోసం.. బీజేపీ అనివార్యంగా ఏపీలో తెలుగుదేశం కూటమికి చేరకతప్పని పరిస్థితులు ముందు ముందు ఎదురౌతాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 

రాజస్థాన్ సీఎం గెహ్లాట్ తప్పులో కాలు! బడ్జెట్ ప్రసంగం అభాసు పాలు!

కుడి ఎడమైతే పోరపాటు లేక పోవచ్చు. కానీ  ఏకంగా రాష్ట్ర బడ్జెట్ తారుమారై  పోతే, కిందటేడాది బడ్జెట్ ను తీసుకొచ్చి ఈ ఏటి బడ్జెట్ ఇదే అని చదివి వినిపిస్తే ఏమవుతుంది? ఆ చదివింది ఏకంగా ఆ రాష్ట్ర ముఖ్య మంత్రే అయితే..ఇంకెలా ఉంటుంది? వినడానికి ఇది కొంచెం విచిత్రంగా అనిపించినా, రాజస్థాన్‌ శాసన సభలో అదే జరిగింది.  ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్ 2023-24 వార్షిక బడ్జెట్ ను శాసన సభలో ప్రవేశ పెట్టారు. అయితే, అది ఈ ఏడాది బడ్జెట్ కాదు. గత సంవత్సరం బడ్జెట్  నే, ఉత్సాహంగా చదువు కుంటూ పోయారు.  అలా ఓ ఎనిమిది నిముషాలో ఏమో ఆయన పాత పద్దులనే చదువుకుంటూ పోయారు. అలాగే వదిలేస్తే.. చివరి వరకు చదివేసి కూర్చునే వారో ఏమో కానీ, కొంచెం చాల ఆలస్యం గానే అయినా అధికారులు, సిఎం గారి స్పీచ్ రివర్స్ లో పోతోందని గుర్తించారు. ఆల్రెడీ అమలవుతున్న పట్టణ ప్రాంత  పేదలకు కోసం ఉద్దేశించిన  ఉపాధి హామీ పధకం ఇప్పుడే కొత్తగా ప్రవేశ పెడుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించడంతో అధికారులు కళ్ళు నులుముకున్నారు. ముఖ్యమంత్రి తప్పులో కాలేశారని గత సంవత్సరం బడ్జెట్ చదివేస్తున్నారని గుర్తించారు. అదే విషయాన్ని అధికారులు మంత్రి దృష్టికి తీసుకురావడంతో ముఖ్యమంత్రి నాలుక కరుచుకున్నారు. అదే సమయంలో ప్రతిపక్ష సభ్యులు వెల్ లోకి దూసుకొచ్చి నిరసన తెలిపారు. సభలో  గందరగోళం చోటు చేసుకుంది. ఆయన గతేడాది పద్దులోని విషయాలనే ఈ సారి కూడా చదవడంతో ఈ పరిస్థితి ఎదురైంది.  సీఎం అశోక్ గెహ్లాట్ వద్దే  ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ కూడా ఉంది. ఈ క్రమంలో  శుక్రవారం ( ఫిబ్రవరి 10) ఆయనే అసెంబ్లీలో బడ్జెట్‌  ప్రవేశపెట్టారు. ఈ ప్రతులను చదవడం ప్రారంభించిన ఆయన.. పాత పథకాలు, గత ఏడాది అమలు చేసిన పట్టణాభివృద్ధి ప్రణాళికలను ప్రస్తావించారు. కాంగ్రెస్ మంత్రి మహేశ్‌ జోషి ఈ విషయాన్ని గుర్తించి, సీఎంకు తెలియజేశారు. ఈ పరిణామంతో బీజేపీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కొత్త పద్దులోని విషయాలు లీక్ అయ్యాయా..? అని నిలదీశారు.  దీంతో సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. ఎనిమిది నిమిషాల పాటు సీఎం పాత బడ్జెట్‌ను చదివారు. ఇలా జరగడం చరిత్రలో ఇదే తొలిసారి కావొచ్చు. నేను సీఎంగా ఉన్నప్పుడు.. ఒకటికి రెండు సార్లు ప్రతులను పరిశీలించుకునేదాన్ని. ఇలా పాత బడ్జెట్‌ను చదివేవారి చేతిలో రాష్ట్రం ఎంత సురక్షితంగా ఉంటుందో మీరే ఊహించుకోగలరు  అని మాజీ సీఎం వసుంధరా రాజే విమర్శించారు.  ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే అవుతుందని,గెహ్లాట్ క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు.  దీనిపై ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు.  నేను చదువుతున్న ప్రతులకు, మీ చేతిలో ఉన్న ప్రతుల్లోని అంశాలకు తేడా ఉంటే మీరు లేవనెత్తాలి. ఆ పాత పత్రాలను చూసుకునేందుకు తెచ్చాను. ఇక్కడ ఎలాంటి లీక్‌ జరగలేదు. అంటూ తనను తాను సమర్ధించుకున్నారు. చివరకు, అంతా సజావుగా సాగిపోయింది ..  2023 -24 వార్షిక బడ్జెట్ ను ముఖ్యమంత్రి సభలో ప్రవేశ పెట్టారు. మొత్తానికి ఆల్ ఈజ్ వెల్ అన్నట్లుగా బడ్జెట్ ప్రసంగం ముగిసింది.

కేటీఆర్ టార్గెట్ కాంగ్రెస్ కాదు.. రేవంత్ రెడ్డి!

అవును. మంత్రి కేటీఆర్  బీజేపీనే కాదు కాంగ్రెస్ పార్టీని విమర్శించడంలోనూ ముందుంటారు. అయితే కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ, అంతే. అదే తేడా. అయితే, అదే సమయంలో కేటీఆర్ విమర్శలను కొంచెం లోతుగా పట్టి చూస్తే, ఆయన విమర్శల్లో కాంగ్రెస్ వ్యతిరేకతకంటే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యతిరేకతే ఎక్కువగా కనిపిస్తుంది. అందులోను ఒక వ్యూహం ఉందని విశ్లేషకులు అంటున్నారు.  రాష్ట్ర  అసెంబ్లీలో  ధరణి  బాగోతంపై చర్చ జరుగతున్న సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు, మాజీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర బాబు, మాట్లాడుతున్న సమయంలో మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకున్నారు. ధరణి పోర్టల్ ఉంచాలా, రద్దు చేయాలా అనే విషయంలో కాంగ్రెస్ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేదని ఆరోపించారు. అంతవరకు బాగుంది కానీ, పనిలో పనిగా శ్రీధర్ బాబుతో పాటుగా, సభలో మిగిలిన నలుగురు కాంగ్రెస్ సభ్యులకు మంత్రి కితాబు నిచ్చారు. కాంగ్రెస్ సభ్యులంతా మంచోళ్లే, బయటి నుంచి వచ్చిన వారితోనే పేచీ అంటూ పరోక్షంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. అంతేకాదు,  ప్రగతి భవన్ ను బాంబులతో పేల్చేయండి  అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ‘నక్సల్స్’ కు ఇచ్చిన పిలుపునూ ప్రస్తావించారు. ఒక విధంగా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ ఆయన ప్రత్యర్ధి వర్గం మధ్య సాగుతున్న అంతర్గత కుమ్ములాటలను  మరింతగా ఎగదోసేందుకే కేటీఆర్  సభలో లేని రేవంత్ రెడ్డిపై, నిబంధనలకు విరుద్ధంగా విమర్శలు చేశారు.  నిజానికి, కాంగ్రెస్ పార్టీలో ఒక్క రేవంత్ రెడ్డి మినహా ఇంచుమించుగా మిగిలిన అందరు ముఖ్య నాయకుల విషయంలో మంత్రి కేటీఆర్ కు మాత్రమే కాదు, ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా మంచి అభిప్రాయమే వుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్  సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క ఇలాగే సభలో, సభ వెలుపల కూడా ప్రశంసలతో ముంచెత్తారు. భారాస లోకి రావాలని బహిరంగంగానే ఆహ్వానించారు. సరే భట్టి ప్రలోభాలకు లొంగ లేదనుకోండి అది వేరే విషయం. అయితే, ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ ఇప్పటికీ బీఆర్ఎస్ నాయకత్వం అవతలి పార్టీల నుంచి ఎమ్మెల్యేలను ఆకర్షించే ప్రయత్నాలను కొనసాగిస్తోందని అంటున్నారు. ఇదలా ఉంటే సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి  ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. నియోజకవర్గ సమస్యలను సీఎం దృష్టికి తీసుకు వేల్లెందుకే ముఖ్యమంత్రిని కలిశానని, జగ్గారెడ్డి చెప్పినా, ఇంతకాలం లేనిది ఇప్పడు నియోజకవర్గం సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రిని కలవడం ఏమిటని కాంగ్రెస్ నాయకులే అనుమానిస్తున్నారు. మొత్తానికి ఎన్నికలు నెలల్లోకి వచ్చినా  బీఆర్ఎస్ నాయకత్వం ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు ఎరవేస్తోందని అంటున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డిని ఒంటిరిని చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్లను కేసీఆర్ కేటీఆర్ దువ్వుతున్నారని అంటున్నారు.